top of page

పలాస డిపోలో సమస్యల సంత

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 18 hours ago
  • 1 min read
  • ఉద్యోగులకు మంచినీరు కరువు

  • ఊగిపోతున్న బస్సులోని డ్రైవర్ల సీట్లు

  • మహిళా ఉద్యోగులకు ఒకటే మరుగుదొడ్డి

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

జిల్లాలో శ్రీకాకుళం తర్వాత ఆర్టీసీపరంగా అధిక సేవలు అందిస్తున్నది పలాస డిపో మాత్రమే. కానీ ఈ డిపో పరిధిలో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఆరు నెలలుగా మంచినీరు అందుబాటులో లేక డిపో పరిధిలోని సుమారు 400 మంది ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారు. బోరుబావి నీటిని ఫిల్టర్ చేయకుండానే ట్యాంకుల్లో నింపి కుళాయిల ద్వారా అందిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల వ్యాధులు సంక్రమిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి మూడేళ్ల క్రితం ఆర్టీసీ డిపో ఉద్యోగుల కోసం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశారు. రెండేళ్లు బాగానే పనిచేసిన ప్లాంట్ తర్వాత మరమ్మతులకు గురైంది. అందులో పాడైపోయిన ఒక ఫిల్టర్ స్థానంలో కొత్తది ఏర్పాటు చేయాలి. అయితే ఆరు నెలలైనా దాన్ని మార్చలేదు. మిగిలిన ఒక్క ఫిల్టర్ వల్ల పూర్తిస్థాయిలో నీటిశుద్ధి జరగడం లేదని, ఫలితంగా శుద్ధి కాని నీటినే తాగుతున్నామని ఉద్యోగులు చెబుతున్నారు. దాన్ని మరమ్మతు చేయకుండా డిపోలో హ్యాండ్‌వాష్ చేసిన చోటే తాగునీరు అని బోర్డు పెట్టి అధికారులు చేతులు దులిపేసుకున్నారని ఆరోపిస్తున్నారు.

కాగా డిపోలో 40 మంది మహిళా ఉద్యోగులు ఉండగా వారందరికీ ఒకే ఒక్క మరుగుదొడ్డి.. అది కూడా మహిళా ఉద్యోగుల రెస్ట్‌రూంలో ఉంది. దీని నిర్వహణ సైతం అధ్వానంగా ఉందని అధికారులకు ఫిర్యాదు చేసినా పరిస్థితి మారలేదు. డిపోలో ఉన్న 70 బస్సు కుగాను 15 బస్సుల్లో డ్రైవర్ సీటు కూర్చునేందుకు అనువుగా లేదని ఫిర్యాదులున్నాయి. ఈ విషయమై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడంలేదు. ఇప్పటికైనా డిపోలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సంస్థ అధికారులు స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించి తగిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు. గతంలో ఆర్టీసీ ప్రత్యేక కార్పొరేషన్‌గా ఉన్నప్పుడు ఉద్యోగ సంఘాలు బలంగా ఉండేవి. సమస్యలపై ఫిర్యాదు చేసిన వెంటనే అధికారుల కూడా స్పందించి పరిష్కరించేవారు. కానీ ప్రభుత్వంలో విలీనమై ప్రజారవాణా శాఖగా మారిన తర్వాత సమస్యలు పేరుకుపోతున్నాయన్న ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి.


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page