బీజేపీపై అన్నామలై బండ!
- DV RAMANA

- 1 day ago
- 2 min read

దేశం మొత్తం మీద ఆధిపత్యం సాధించిన భారతీయ జనతాపార్టీ పాపం.. దక్షిణాదిలో మాత్రం పాగా వేయలేకపోతున్నది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పరిస్థితి ఒకడుగు ముందుకేస్తే.. మÖడడుగులు వెనక్కి అన్నట్లు ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోతున్నది. కర్ణాటకలో గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిన కమలనాథులు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దాన్ని పువ్వుల్లో పెట్టి అప్పగించేశారు. తెలంగాణలో పుంజుకున్నట్లు కనిపించిన ప్రతిసారీ ఎన్నికల్లో మాత్రం చతికిలపడిపోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో పట్టు సాధించడం సంగతెలా ఉన్నా టీడీపీతో జట్టు కడితే తప్ప నాలుగైదు సీట్లయినా దక్కే పరిస్థితి ఉండటం లేదు. కేరళలో ఒంటరిగా ఈదుతున్నా తీరం అందనంత దూరంలో ఉండిపోతున్నది. పుదుచ్చేరిలో చిన్న పార్టీ అయిన రంగస్వామి కాంగ్రెస్(ఎనఆర్‌సీ)పై ఆధారపడి ఎలాగోలా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ఇక తమిళనాడులో ఉనికి కోసం దశాబ్దాలుగా నానాపాట్లు పడుతూ ఏఐఏడీఎంకే కూటమిలో చేరినా ఫలితం దక్కించుకోలేకపోతున్నది. పరిస్థితి మరింత దిగనాసిల్లిపోతున్నది. గత అసెంబ్లీలో ఇదే కూటమి తరఫున పోటీ చేసి నాలుగు సీట్లు గెలిచి పరిస్థితి మెరుగుపర్చుకున్న కమలం పార్టీ ఇటీవలి ఎన్నికల్లో సీట్ల స్కోరు పెంచుకోలేకపోగా ఉన్నవాటినే కోల్పోయి ఒక్క సీటుకే పరిమితమైంది. దాంతో తమిళనాడులో ఎలాగోలా ఎదగాలనుకుంటున్న ఆ పార్టీకి తలబొప్పి కట్టింది. ఇది చాలదన్నట్లు ఆరేళ్లుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న అన్నామలై రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీని వీడుతున్నట్లు ఆయన ప్రకటించడం పార్టీకి నష్టం వాటిల్లుతుందని భావిస్తుండగా, ఇది బీజేపీ అధినాయకత్వ స్వయంకృతమన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీకి రాష్ట్రంలో ఎంతోకొంత ఊపు తీసుకొచ్చిన అన్నామలైని నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధిష్టానం పక్కనపెట్టి సొంత నిర్ణయాలు తీసుకోవడం చేదు ఫలితాలనివ్వడమే కాకుండా ఆయన్ను పార్టీకి దూరం చేసింది. దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈ మాజీ ఐపీఎస్ అధికారి పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా దిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్.సంతోష్‌లను కలిసి అందజేసిన ఐదుపేజీల సుదీర్ఘ రాజీనామా లేఖలోని అంశాలు పార్టీశ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. 2021లో తమిళనాడు బీజేపీ పగ్గాలు అందుకున్న అన్నామలై పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చారు. పాదయాత్రలు, దూకుడు రాజకీయాలు, ఆవేశపూరిత ప్రసంగాలు, సోషల్ మీడియా వ్యూహాలతో యువతలో క్రేజ్ తెచ్చిపెట్టడం ద్వారా పార్టీకి రాష్ట్రంలో ‘స్టార’ ఇమేజ్ తీసుకొచ్చారు. ఫలితంగా ద్రవిడ పార్టీలను తప్ప ఇంకేపార్టీని పట్టించుకోని తమిళ ప్రజల్లో బీజేపీపై చర్చ మొదలైంది. ఐపీఎస్ ీVAదాను వదులకుని రావడంతోపాటు నిజాయితీపరుడన్న పేరు, బస్తీమే సవాల్ అన్నట్లు గత డీఎంకే ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీయడం వంటివి బీజేపీ శ్రేణుల్లో ముఖ్యంగా యువకార్యకర్తల్లో అన్నామలై పట్ల ఆకర్షణ పెంచాయి. కానీ పార్టీ జాతీయ నాయకత్వం మాత్రం కీలకమైన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నామలై సూచనలను, నిర్ణయాలను పట్టించుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం ఆయన్ను అసంతృప్తికి గురిచేసింది. పార్టీ చేసిన ఈ వ్యూహాత్మక తప్పిదాలను ఆయన తన ఐదు పేజీల లేఖలో స్పష్టంగా ఎత్తిచూపారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే తో పొత్తు కొనసాగించాలన్న దిల్లీ పెద్దల నిర్ణయంతో అన్నామలై తీవ్రంగా విభేదించినట్లు తెలుస్తున్నది. బీజేపీ రాష్ట్రంలో స్వతంత్రంగా ఎదగాలని తాను కోరుకుంటే అధిష్ఠానం మాత్రం ద్రవిడ పార్టీలపై ఆధారపడటానికే మొగ్గుచూపడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఇదే కాకుండా ఎన్నికల్లో సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక తదితర విషయాల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి అభిప్రాయాలను కేంద్ర నాయకత్వం పూర్తిగా పక్కన పెట్టింది. అలాగే ఎన్నికల ప్రచారంలో రాష్ట్రం మొత్తం కాకుండా కేవలం ఆరు స్థానాల బాధ్యతలు మాత్రమే అప్పగించడం ద్వారా రాష్ట్ర అధ్యక్షుడినైన తనను అవమానించారన్న అసంతృప్తి ఆయనలో పేరుకుపోయింది. ఫలితంగా ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్క స్థానానికే పరిమితం కావడం వంటి పరిణామాలు అన్నామలై వాదనలను నిజం చేశాయి. బీజేపీలో తనకు తగినంత స్వేచ్ఛ, భవిష్యత్తు లేవని భావించిన ఆయన, సుదీర్ఘ మథనం అనంతరం కమలం గూటి నుంచి బయటకు రావడమే ఉత్తమమని భావించారు. బీజేపీ నేతగా ద్రవిడ రాజకీయాలు చేస్తున్న డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలను కాదని తమిళ ఆస్తిత్వం ప్లస్ జాతీయ దృక్పథం అనే కొత్త పంథాలో తమిళ రాజకీయాలను మలుపు తిప్పడం ద్వారా రాష్ట్రంలో బీజేపీకి చోటు కల్పించాలన్న ఆయన ఆలోచనలు పార్టీ నాయకత్వ నిర్ణయాలతో అమలుకాని పరిస్థితుల్లో రాజకీయాల నుంచి తప్పుకోవడం కంటే బీజేపీని మాత్రమే వీడి స్వతంత్ర రాజకీయ అజెండాతో దూకుడు పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. రాబోయే ఉపఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా లేదా సరికొత్త వేదిక ద్వారా పోటీ చేసేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. రాబోయే ఆరు నుంచి ఎనిమిది నెలల కాలంలో ఒక కొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించే ఆలోచన కూడా చేస్తున్నారని సమాచారం. ఒక సెక్యులర్ ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేయడమే ఆయన తదుపరి కార్యాచరణగా కనిపిస్తున్నది. సినీ నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం చేసి ఘనవిజయం సాధించడంతో తమిళనాడు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ద్రవిడ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకే, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఉండే శక్తులవైపు యువత మొగ్గు చూపుతున్నట్లు అన్నామలై గమనించారు. బీజేపీ సిద్ధాంతాల ముద్రతో తమిళనాడులో ఎదగడం కష్టమని గ్రహించిన ఆయన ద్రావిడ సంస్కృతి, అవినీతిరహిత పాలన అజెండాతో యువతను ఆకట్టుకోవాలనుకుంటున్న ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో గానీ.. అన్నామలై రాజీనామా చేయడం బీజేపీకి మాత్రం కోలుకోలేని దెబ్బే.






Comments