పాత వివాదాలు రేపడమెందుకు?
- DV RAMANA

- 6 hours ago
- 2 min read

తెలంగాణ ఎవరబ్బ జాగీరు కాదు.. కచ్చితంగా ఆ రాష్ట్రంలో నిలబడతాం.. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సహా అన్ని ఎన్నికల్లో ఇక నుంచి పోటీ చేస్తాం.. అంటూ మొన్న హైదరాబాద్‌లోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఊగిపోయిన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్.. ఆ తర్వాత బీఆరఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టే క్రమంలో ఆంధ్రలో BRS ఎందుకు? అని ప్రశ్నించారు. అంటే తన జనసేన పార్టీ తెలంగాణలో ఎందుకు ఉండకూడదని నిగ్గదీసిన నోటితోనే.. దానికి పూర్తి విరుద్ధంగా ఆంధ్ర రాజకీయాల్లోకి BRS రాకూడదన్నట్లు మాట్లాడటం కచ్చితంగా రెండు నాల్కల ధోరణే. అదొక్కటే కాకుండా అనేక సందర్భాల్లో మాట తూలడం, తప్పడం పవన్‌కల్యాణ్‌కు అలవాటే. తెలంగాణ ఎవడబ్బ జాగీరు అన్న ఆయనే ఏపీకి తిరిగి వచ్చిన వెంటనే మాటమార్చేసి అవును.. తెలంగాణ అక్కడి భూమి పుత్రులదేనని మరో స్టేట్‌మెంట్ ఇవ్వడమే కాకుండా తమ పార్టీ తెలంగాణలో పోటీ చేసినప్పుడు పదహారణాల తెలంగాణ బిడ్డలకే టికెట్లు ఇస్తామని కూడా చెప్పేశారు. తన పరుష వ్యాఖ్యలకు కవరింగ్ ఇచ్చుకోవడంగానే దీన్ని తెలంగాణ ప్రజానీకం పరిగణిస్తున్నది. జర్నలిస్టు కలానికి రెండువైపులా పదను ఉంటుందన్నట్లు పవన్‌కల్యాణ్ కూడా ఒకే అంశంపై భిన్నవ్యాఖ్యలు చేయడం ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచీ కొనసాగుతోంది. 2024 ఎన్నికలకు ముందు అనేక సందర్భాల్లో సొంత కులమే తనకు సపోర్టు చేయడంలేదంటూ ఎత్తిపొడవడం, అసంతృప్తి వ్యక్తం చేయడం రాష్ట్ర ప్రజలకు గుర్తుండే ఉంటుంది. కానీ తిరిగి ఆయనే ఇటీవల తనను ఒక కులానికి ప్రతినిధిగా ముద్ర వేస్తున్నారని, అసలు తానెప్పుడూ కుల రాజకీయాలు చేయలేదని, కులాల ప్రస్తావన చేయలేదని నమ్మబలికారు. అదే విషయంలో అధికారం కోసం తాను రాజకీయం చేయడం లేదని మరో వ్యాఖ్య చేశారు. తెలంగాణలో తాను రాజకీయం చేయడానికి కారణం ముఖ్యమంత్రి కావాలన్న ఆశ కాదని అంటూ ఆంధ్రప్రదేశ్‌లోనే కొన్నేళ్లుగా రాజకీయాలు చేస్తున్నా సీఎం పదవికి దిక్కులేదు.. తెలంగాణలో ఏం వస్తుందని తేల్చేశారు. కానీ అదే నోటితో తనకు అధికారం కట్టబెట్టడంలేదంటూ ప్రజలను నిష్టూరమాడిన సందర్భాలెన్నో ఉన్నాయి. అవన్నీ పక్కనపెట్టి తెలంగాణ విషయంలో ప్రస్తుత వివాదానికి వస్తే.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజు పవన్‌కల్యాణ్ తలపెట్టిన హైదరాబాద్‌లో జనసేన తరఫున తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినివ్వకపోవడంతో పవన్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలోనే ప్రెస్‌మీట్ పెట్టి ఇప్పుడిప్పుడే కలిసికట్టు పనిచేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన గాయాన్ని రేపేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఉపముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తున్నా.. ఇప్పటికీ హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్న పవన్.. తమను రాకుండా ఎవరూ అడ్డుకోలేరని అనడం తెలంగాణవాదులను, ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడంగానే భావిస్తున్నారు. సభ నిర్వహణకు అనుమతి ఇవ్వనంతమాత్రాన తెలంగాణలో ప్రవేశించకుండా అడ్డుకుంటున్నట్లు కాదు కదా! తెలంగాణలోనూ జనసేన పార్టీ పెడతామని, ఎన్నికల్లో పోటీ చేసి తీరుతామని, పాలకులను ప్రశ్నించి తీరుతామని ఆయన చెప్పడంపై భిన్నవ్యాఖ్యలు వ్యక్తమవుతున్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ మాటల్లో చెప్పాలంటే పార్టీ పెట్టడం, రాజకీయాలు చేయడంపై దేశంలో ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఎందుకంటే ప్రతిపార్టీ భారత ఎన్నికల సంఘం వద్దే రిజిస్టర్ అవుతుంది. గుర్తింపు పొందుతుంది. దేశవ్యాప్తంగా లేదా ఏ రాష్ట్రంలోనైనా పోటీ చేసే అర్హత ఆయా పార్టీలకు ఉంటాయి. ఆ క్రమంలో పవన్ పార్టీ జనసేన తెలంగాణలో పోటీ చేయకుండా ఎవరూ అడ్డుకోలేరు.. చట్టం దానికి అంగీకరించదు. పవన్ తెలంగాణలో రాజకీయం చేయకూడదని, అలాగే ఆంధ్రలో తెలంగాణ పార్టీ రాజకీయం చేయకూడదని చెప్పడం కూడా చెల్లదు. అయితే తెలంగాణలో ప్రజావ్యతిరేక చర్యలను అడ్డుకుంటామని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని పవన్ హెచ్చరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యవస్థల్లో లోపాలను, పాలన వైఫల్యాలను ప్రశ్నిస్తామంటూ పవన్‌కల్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. 2019`24 మధ్య కాలంలో తప్ప గత పుష్కర కాలంలో ఏనాడూ ప్రభుత్వాలను ప్రశ్నించలేదు. పైగా గత ఎన్నికý తర్వాత అధికార కూటమిలో, ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా మారి పదవులు అనుభవిస్తూ ప్రశ్నించడమే మర్చిపోయిన పవన్‌కల్యాణ్ ఇప్పుడు తెలంగాణకు వచ్చి ఏం చేస్తారని తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీఆరఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ వాదనను ఏనాడు సమర్థించని నాయకుడు ఇప్పుడు తెలంగాణలో ఎలా రాజకీయాలు చేస్తారని నిలదీస్తున్నారు. 2018, 2023 ఎన్నికల్లో పోటీ చేసి బొక్కబోర్లాపడ్డారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏడు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే అన్నిచోట్లా నోటాతో పోటీ పడాల్సి వచ్చింది. ఇక ఏపీలో 2019 ఎన్నికల్లో మÖడు జాతీయ పార్టీల పొత్తుతో 132 చోట్ల పోటీ చేస్తే 120 నియోజకవర్గాలు డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2024లో మళ్లీ కూటమిని మార్చి 21 స్థానాలకే పరిమితమయ్యారు. వైకాపా వ్యతిరేక వేవ్‌లో కూటమి నెగ్గడంతో అధికారంలో భాగమై వ్యవస్థల్లోని లోపాలనే పట్టించుకోవడం మానేశారు. గతంలో తెలంగాణ నేతలను చూసి నేర్చుకోవాలని ఆంధ్ర నాయకులకు సుద్దులు చెప్పిన ఆయన ఇప్పుడు అదే తెలంగాణ నాయకులను విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే వారికి చిన్నచూపు అని అంటున్నారు. తెలంగాణలో ప్రాంతీయ సెంటిమెంట్ ఇప్పటికీ ఉన్నా విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రలో మాత్రం అలాంటి సెంటిమెంటు ఏదీ లేదని పేర్కొన్న పవన్‌కల్యాణ్ రాష్ట్రంలో జైఆంధ్ర అనే వారు కూడా కరువయ్యారని. ఆవేదన వ్యక్తం చేయడం మాత్రం ముమ్మాటికి వాస్తవం. అయితే ఇలాంది వ్యాఖ్యలు పాత గాయాలను రేపుతాయన్న అభిప్రాయాలు ఉన్నాయి.






Comments