top of page

బాధ్యుడికి అనుచిత విముక్తి.. బాధితులకు ఏదీ నిస్కృతి ?

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Mar 27
  • 3 min read
  • విద్యాశాఖ అధికారుల వితండ విధానం

  • గత ఏడాది కుప్పిలి ఘటనలో పక్షపాత వైఖరి

  • రచ్చకు కారణమైన తిరుమల చైతన్యకు క్లీన్‌చిట్

  • బాధిత విద్యార్థులు, టీచర్లకు దక్కని న్యాయం

  • సంబంధిత స్కూళ్లులో పడిపోయిన ఉత్తీర్ణతలే నిదర్శనం

  • ముందుకు సాగని క్రిమినల్ కేసుల విచారణ

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

ఏదైనా జరగరాని ఘటన లేదా తప్పు జరిగినప్పుడు.. అందులో బాధ్యులు ఉంటారు.. బాధితులూ ఉంటారు. అలాంటప్పుడు ఆయా ఘటనలపై సమగ్ర విచారణ జరిపి సంబంధిత అన్నివర్గాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. బాధ్యులను శిక్షించడంతోపాటు బాధితులను ఆదుకోవాల్సిన కర్తవ్యాన్ని కూడా విస్మరించకూడదు. కానీ విడ్డూరమేంటంటే.. గత ఏడాది టెన్త్ పరీక్షల సమయంలో కుప్పిలి, కొయ్యాం సెంటర్లలో జరిగిన రచ్చలో ఏ పాపం ఎరుగని విద్యార్థులు, ఎటువంటి తప్పూ చేయని కొందరు ఉపాధ్యాయులు బాధితులుగా మారి కష్టనష్టాలు అనుభవిస్తుంటే.. ఆ మొత్తం గందరగోళానికి సూత్రధారి, పాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న, సంచలనాలకు అర్రులు చాచే అప్పటి డీఈవో(ఎఫఏసీ) సదాశివుని తిరుమలచైతన్య మాత్రం ఉద్యోగ విరమణ కానిచ్చేసి దిలాదార్‌గా వ్యవహరించడమే కాకుండా.. తన సహజసిద్ధమైన పైరవీల ప్రావీణ్యంతో మేనేజ్ చేసుకుని కప్పిలి రాద్దాంతం నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలకు క్లీన్‌చిట్ తెప్పించుకుని మీసాలు తిప్పుతున్న పరిస్థితి చూసి ఉపాధ్యాయ వర్గాలు.. బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అసంతప్తితో రగిలిపోతున్నారు. ఆయనపై ప్రభుత్వ పరీక్షల విభాగం అప్పటి ఏడీ శ్రీనివాసులురెడ్డి జరిపిన విచారణ నివేదిక వెలుగు చూడలేదు. కనీసం అందులో ఏముందో ఎవరికీ తెలియదు. కానీ తిరుమలచైతన్యకు మాత్రం ప్రభుత్వం క్లీన్‌చిట్ ఇచ్చేసింది. ఆ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేయడం విమర్శలకు గురవుతున్నది. అంటే కుప్పిలి ఘటనలో బాధితులు ఇంకా బాధితులుగానే ఉన్నారు. వారికేం న్యాయం జరగలేదు. కనీసం ఆ దిశగా ఆలోచించని ఉన్నతాధికారులు బాధ్యుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి మాత్రం క్లీన్‌చిట్ ఇచ్చి అ‘న్యాయం’ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆనాడు ఎచ్చెర్ల మండలం కుప్పిలి మోడల్ స్కూల్‌లోని టెన్త్ పరీక్ష కేంద్రం వేదికగా తిరుమలచైతన్య ఆధ్వర్యంలో జరిగిన రగడ, వారు సష్టించిన భీతావహ పరిస్థితుల గురించి దానివల్ల తాము ఎదుర్కొన్న మానసిక ఆందోళన, తమకు కలిగిన నష్టం గురించి బయటపెడుతున్నారు. ప్రభుత్వం బాధితుడిని శిక్షించి తమకు న్యాయం చేస్తుందని తామంతా పెట్టుకున్న నమ్మకం వమ్ము అయ్యిందని వాపోతున్నారు. ఏదోవిధంగా సంచలనాలకు కేంద్రంగా ఉండాలన్న తిరుమలచైతన్య దుందుడుకుతనం వల్ల ఎవరు ఎలా నష్టపోయారో చూద్దాం.

మందీమార్బలంతో గందరగోళం

గత ఏడాది ఇదే మార్చి నెలలో ఓ రోజు.. టెన్త్‌క్లాస్ పరీక్షల్లో భాగంగా ఆరోజు ఇంగ్లిష్ పరీక్ష జరుగుతోంది. విద్యార్థులు శ్రద్ధగా, ఏకాగ్రతతో రాసుకుంటున్నారు. ఇంతలో అక్కడి ప్రశాంతతను, విద్యార్థుల ఏకాగ్రతను దెబ్బతీస్తూ సుమారు ఐదు కార్లలోంచి డీఈవో(ఎఫఏసీ) సహా అధికార బందం దిగారు. అప్పటి డీఈవో(ఎపఏసీ) తిరుమల చైతన్యతోపాటు పొందూరు ఎంఈవో`1 వాగ్దేవి, ఎచ్చెర్ల ఎంఈవో`2 రాజ్‌కిషోర్ తదితర పదిమందికిపైగా అధికారులు ఉన్నారు. వారి రాకతో పరీక్ష కేంద్రంలో కోలాహలం, ఆర్భాటం, హడావుడి మొదలైంది. పరీక్షలు రాస్తున్న విద్యార్థుల ఏకాగ్రతకు భంగల కలిగించకుండా తనిఖీలు, పర్యవేక్షణలు చేయాలన్న నిబంధనలు పట్టించుకోకుండా వారందరూ కేకలు వేస్తూ విద్యార్థులు, ఇన్విజిలేటర్లు భయపడేలా చేశారు. విద్యార్థులకు స్లిప్పులు ఇస్తున్నారంటూ ఇన్విజిలేషన్ డ్యూటీలో ఉన్న టీచర్లను గదమాయించారు. ఏకంగా 14 మంది టీచర్లు, ఒక జూనియర్ అసిస్టెంట్‌పై కాపీలకు ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలతో చర్యలు తీసుకున్నారు. డీఈవోగా తిరుమల చైతన్య ఒకే ఒక్క కలంపోటుతో 14మంది టీచర్లపై సస్పెన్షన్ వేటు వేసేశారు. జూనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేయాలని జిల్లాపరిషత్ అధికారులకు సిఫారసు చేశారు. అదే ఊపులో అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పిలి హైస్కూల్ టీచర్లను కూడా పరీక్ష సెంటర్‌కు విద్యార్థులను తీసుకొచ్చిన పాపానికి బుక్ చేసేశారు.

పడిపోయిన ఫలితాలు

కాగా పరీక్ష కేంద్రం వద్ద విచక్షణారహితంగా అధికార బందం హల్‌చల్ చేయడం పరీక్ష రాస్తున్న విద్యార్థుల ఏకాగ్రతను దెబ్బతీయడమే కాకుండా వారిని మానసిక ఆందోళనకు గురిచేసిందని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు. ఆ ప్రభావంతో ఆ తర్వాత జరిగిన పరీక్షలను కూడా తమ పిల్లలు సరిగ్గా రాయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది ఈ పాఠశాలలు సాధించిన ఫలితాలు కూడా విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదనలో వాస్తవముందని రుజువు చేస్తున్నాయి. కుప్పిలి మోడల్ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో ఆ స్కూల్‌తోపాటు కుప్పిలి, కొయ్యాం, ఎసఎసఆర్ పురం, తదితర ఆరు పాఠశాలలకు చెందిన వందలాది విద్యార్థులు పరీక్షలు రాశారు. డీఈవో ఆధ్వర్యంలో జరిగిన రాద్దాంతం కారణంగా మానసికంగా ఆందోళనకు గురై ఆ తర్వాత జరిగిన పరీక్షలను కూడా సరిగ్గా రాయలేకపోయారు. ఫలితంగా గత ఏడాది టెన్త్‌లో ఆ ఆరు పాఠశాలల ఉత్తీర్ణత 50 శాతంలోపునకు పడిపోయింది. ఒక్క కుప్పిలి హైస్కూల్ నుంచే ఈ కేంద్రంలో 56 మంది పరీక్షలు రాయగా కేవలం ఎనిమిది శాతం మందే ఉత్తీర్ణులయ్యారు. కానీ ఆ తర్వాత జరిగిన సప్లిమెంటరీ పరీక్షల్లో మళ్లీ వారంతా మంచి మార్కులతో ఉత్తీర్ణులవ్వడం గమనార్హం. అదేవిధంగా కొయ్యాం, కుప్పిలి మోడల్ హైస్కూళ్లు సుమారు 50 శాతం, డి.మత్స్యలేశం స్కూల్ 45 శాతం ఫలితాలు మాత్రమే సాధించాయి. దీన్నిబట్టి చూస్తే పరీక్షలు జరుగుతున్నప్పుడు తిరుమలచైతన్య బందం ఎంతగా రెచ్చిపోయిందో.. దాని ప్రభావం విద్యార్థులపై ఎంత తీవ్రంగా పడిందో.. వారెంత నష్టపోయారో అర్థం చేసుకోవచ్చు.

మరక పోలేదు

విద్యార్థుల పరిస్థితి ఇలా ఉంటే.. తిరుమల చైతన్య సస్పెన్షన్ వేటు వేసిన 14 మంది టీచర్లలో ఎనిమిది మందికి మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో సస్పెన్షన్ల నుంచి విముక్తి లభించింది. కానీ మిగిలిన ఆరుగురు టీచర్లు.. పి.నాగేశ్వరరావు(కొత్తపేట), కే.కామేశ్వరరావు (కుప్పిలి), జె.పద్మకుమారి (కుప్పిలి), ఎస్.కష్ణ (నక్కపల్లి), ఎం.కనకరాజు (మెట్టూరు), బి.కష్ణకిషోర్ (కుప్పిలి)లపై క్రిమినల్ కేసులు నమోదు కావడంతో అవి పెండింగులో ఉన్నాయి. సస్పెన్షన్లు ఎత్తివేసినా.. వారిపై పడిన మరక ఇంకా పోలేదు. ఈ ఘటన జరిగిన ఏడాది గడిచినా కేసుకు అతీగతీ లేదు. క్రిమినల్ కేసును ఎచ్చెర్ల పోలీసులు విచారించి, ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించడంతో పాటు చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఇంతవరకు విద్యార్థులను, టీచర్లను పిలిపించి విచారించనేలేదని బాధితవర్గాలు చెబుతున్నాయి. చేయని తప్పుకు బలైన తమకు ఎప్పుడు నిస్కృతి  లభిస్తోందనని టీచర్లు ఆందోళనతో ఎదురుచూస్తుంటే ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ మొత్తం రాద్దాంతానికి, తప్పుడు కేసులకు సూత్రధారి అయిన తిరుమల చైతన్యపై ఏడు నెలల క్రితమే విచారణ జరగ్గా.. ఆయనకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేసినా అవన్నీ ఆయనగారి పైరవీల ప్రతాపం ముందు వీగిపోయాయని ఆయనకు క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని చూస్తే అర్థమవుతుంది. తప్పు చేసిన తిరుమల చైతన్యను తప్పించిన అధికారులు.. తప్పుచేయని టీచర్లకు, బాధితులైన విద్యార్థులకు ఎందుకు న్యాయం చేయడంలేదని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page