బ్యాంకు కట్టల్లోనే నకిలీ పాములు?
- NVS PRASAD
- 5 days ago
- 3 min read
ఏటీఎంలలో పట్టే కరెన్సీపై షార్టేజ్, నకిలీ ఫిర్యాదులు
అడిగితే తీసుకున్నప్పుడే లెక్కపెట్టుకుని, పరిశీలించాలని దబాయింపులు
చాలామంది నష్టపోతున్నా.. ఫిర్యాదులు కొన్నే
బ్యాంకుల స్థాయిలోనే నకిలీ మకిలి అంటుతోందన్న ఆరోపణలు
వీటిపైనే దృష్టి సారించిన జిల్లా పోలీసులు

నగరంలోని ఓ లాడ్జిలో ఇటీవల నకిలీ నోట్లతో కొందరు పట్టుబడిన కేసు మూలలను జిల్లా పోలీసులు కదిలిస్తున్నారు. నగర నడిబొడ్డులో నకిలీ నోట్ల చెలామణీ ఎలా జరుగుతుందన్న దానిపై స్వయంగా ఎస్పీ మహేశ్వర్ రెడ్డే ఆరా తీశారు. జిల్లాలో పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నా చిక్కలేదంటే.. ఒక ప్రణాళిక ప్రకారమే దొంగనోట్ల చెలామణీ జరుగుతుందని భావించిన జిల్లా పోలీసులు దీని వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులను కనిపెట్టే పనిలో పడ్డారు. దొంగనోట్ల దందా వ్యవస్థీకృతమైపోయిందని.. కేవలం ఒకరిద్దరిని పట్టుకున్నంత మాత్రాన పని కాదన్న కోణంలో పోలీసు దర్యాప్తు జరుగుతోంది.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
కొద్ది నెలల క్రితం నగరంలోని పాలకొండ రోడ్డులో ఉన్న ఓ కార్పొరేట్ జ్యూయలరీ షాపునకు వెళ్లిన ఓ వ్యక్తి నగలు కొనుగోలు చేసిన తర్వాత రూ.500 నోట్ల కట్ట ఇచ్చాడు. అందులో నాలుగు నకిలీ నోట్లు ఉన్నట్లు షాపు సిబ్బంది గుర్తించారు. తాను బంగారం షాపునకు రావడానికి ముందే బ్యాంకులో నగదు విత్‌డ్రా చేసి తీసుకొచ్చానని, అందులో నకిలీ నోట్లు ఉండటమేమిటని షాపు సిబ్బందితో కొనుగోలుదారుడు వాదులాటకు దిగాడు. తమ వద్ద అధునాతన కౌంటింగ్ కమ్ స్కానర్ మిషన్ ఉందని, కావాలంటే మీరే పరిశీలించుకోండంటూ షాపువారు ఆధారాలు చూపించడంతో పాటు ఇలాంటి నోట్లు తమ వద్దకు రాగానే చించేయాలనే నిబంధన ఉండటం వల్ల నాలుగు ఐదువందల నోట్లను కస్టమర్ ముందే చించేశారు. దీంతో ఖాతాదారుడు సంబంధిత బ్యాంకు వద్దకు వెళ్లి వారిచ్చిన నోట్లలో నకిలీవి ఉన్నాయంటూ గొడవపడ్డాడు. అటువంటివి బయటపడినప్పుడు బ్యాంకు వద్దే చూసుకోవాలని, ఇప్పుడు నోట్లు చించేసి తమ తప్పిదమంటే ఊరుకునేది లేదని బ్యాంకు సిబ్బంది దబాయించడంతో చేసేదిలేక వెనుదిరిగాడు.
అలా వెళ్లింది ఫిర్యాదు
గత కొద్దికాలంగా అనేక బంగారం షాపులకు ఇటువంటి నకిలీ నోట్లే రావడంతో.. ఈ వ్యవహారం ఏదో ఒకరోజు కొంప ముంచుతుందని భావించిన వర్తకులు కార్పొరేట్ స్థాయిలోనే డీజీపీ కార్యాలయానికి ప్రాథమికంగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. శ్రీకాకుళం లాడ్జిలో నకిలీ నోట్లు చెలామణీ చేస్తూ కొందరు దొరకడం.. బంగారం షాపులకు బ్యాంకు సీల్‌తో వస్తున్న నోట్ల కట్టలో నకిలీవి ఉంటున్నాయని ఫిర్యాదు అందిన నేపథ్యంలో అసలు నకిలీ నోట్ల చెలామణీ బ్యాంకుల నుంచి జరుగుతున్నదని ప్రాథమికంగా నిర్ధారించుకున్న తర్వాత ఎస్పీ ఆధ్వర్యంలోని ఓ పోలీస్ బృందం మూడు రోజుల నుంచి నగరంలో ఒక బ్యాంకు ఏడు బ్రాంచీల నగదు నిల్వ ఉంచే చెస్ట్‌లను తనిఖీ చేసినట్టు సమాచారం. అయితే వేలాది నోట్ల కట్టలను బయటకు తీసి లెక్కించడం, వాటిలో నకిలీలను గుర్తించడం పోలీసుల వల్ల అయ్యే పనికాదు. కాకపోతే బ్యాంకుల మీద కూడా పోలీసుల నిఘా ఉందని చెప్పడానికే ఇటువంటి తనిఖీలు చేపట్టినట్లు అర్థమవుతుంది.
ఎప్పట్నుంచో ఆరోపణలు
ముఖ్యంగా ఏటీఎంలలో లోడ్ చేస్తున్న నగదులో కొంతమేరకు నకిలీ నోట్లను బ్యాంకులే పెడుతున్నాయన్న ఆరోపణలు ఎప్పట్నుంచో ఉన్నాయి. ఎందుకంటే ఏటీఎంల నుంచి తక్కువ మొత్తంలో విత్‌డ్రాలు జరుగుతుంటాయి. కాబట్టి ఆ తక్కువ నోట్లలో ఒక్క ఫేక్ నోట్ వచ్చినా ఇట్టే తెలిసిపోతుంది. చాలామంది కస్టమర్లు తాము ఏటీఎంలలో తీసిన డబ్బుల్లో ఫేక్ నోట్లు వస్తున్నాయని పేర్కొన్న సందర్భాలు కోకొల్లలు. అయితే అవన్నీ పోలీసుల ఫిర్యాదు వరకు వెళ్లవు. ఉదాహరణకు ఏదైనా ఒక బ్యాంకు నుంచి రూ.2 లక్షలు విత్‌డ్రా చేస్తే సంబంధిత క్యాషియర్ నాలుగు ఐదువందల నోట్ల కట్టలు ఇచ్చాడనుకుందాం. అప్పటికే బ్యాంకు రద్దీగా ఉండటం వల్ల కొందరు బ్యాంకు సీలు ఉంది కదా అన్న నమ్మకంతో లెక్కబెట్టకుండానే నాలుగు కట్టలు పట్టుకొని వెళ్లిపోతారు. మరికొందరైతే రెండు లక్షలకు సరిపోను నోట్లు ఉన్నాయా, లేవా అని చూసుకుంటారు. కానీ వాటిలో ఫేక్ గుర్తించడం కస్టమర్ తరం కాదు. వాస్తవానికి పెద్దమొత్తం విత్‌డ్రా చేసినప్పుడే సంబంధిత క్యాషియరే కౌంటింగ్ మిషన్‌లో నోట్లు పెట్టినప్పుడు కస్టమర్‌కు చూపించి అంతా ఓకే అనుకున్న తర్వాత దానికి సీల్ వేసి సంతకం చేసి ఇవ్వాలి. కానీ బ్యాంకులో కస్టమర్ల తాకిడి ఎక్కువగా ఉంటుండటం వల్ల తాము ఆ పని చేయలేమని ముందుగానే బండిల్ చేసిన నోట్లపై బ్యాంకు పేపరు చుట్టేసి, సంతకం ఎవరిదో తెలీని విధంగా కొక్కిరిగీత గీసేసి, చెకింగ్ అయిపోయిందంటూ నిర్ధారించామని సిబ్బంది చెబుతుంటారు. వాస్తవానికి ఇక్కడి నుంచే ఫేక్ నోట్లు, తక్కువ కౌంటింగ్ ఆరోపణలు వస్తున్నాయి. ఒకసారి టెల్లర్ కౌంటర్‌ను విడిచిపెట్టి బయటకు వెళ్లిపోయిన తర్వాత వేరే బ్యాంక్‌కు ఆ బండిల్‌ను ఇచ్చినప్పుడు అక్కడి బ్యాంకు సిబ్బంది తక్కువ నోట్లు ఉన్నాయనో, కొన్ని ఫేక్ కనిపిస్తున్నాయనో చెబితే అటువంటివన్నీ తమ బ్యాంకు ఆవరణలోనే చెక్ చేసుకోవాలని చెబుతుండటంతో ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు.
పలు ఎస్బీఐ శాఖల్లో పరిశీలన
ఏ బ్యాంకు లేదా వ్యాపార సంస్థ వద్దకు ఫేక్ నోట్లు వచ్చినా అక్కడికక్కడే కస్టమర్‌కు చూపించి చింపేస్తారు. కానీ ఎప్పుడైనా పోలీసు అధికారులకు అనుమానం వచ్చి ఈమధ్య కాలంలో ఏవైనా ఫేక్ నోట్లు బ్యాంక్ లావాదేవీల్లో వచ్చాయా? అని అడిగితే అనేక బ్యాంకులు, పెద్ద పెద్ద సంస్థలు వచ్చాయని, వాటిని చింపేశామని పోలీసులకు చెబుతాయి. కానీ జిల్లాలో ఒక్క ఎస్‌బీఐ మాత్రం తమ దృష్టికి ఇంతవరకు ఒక్క ఫేక్ నోట్ కూడా రాలేదని పోలీసులకు చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి ఎస్‌బీఐ ఏటీఎంలలోనే తమకు ఫేక్ కరెన్సీ వచ్చిందన్న కస్టమర్లు చాలామంది ఉన్నారు. అలాగే ఎస్‌బీఐ ఇచ్చిన నోట్ల కట్టలో తక్కువ నోట్లు ఉన్నాయని ఒక్కోసారి, ఫేక్ నోట్లు వచ్చాయని మరికొన్నిసార్లు కస్టమర్లు అనేక బ్రాంచిల్లో గొడవ పడిన సందర్భాలూ కోకొల్లలు. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలిస్తే ఇవన్నీ బయటపడతాయి. కానీ దీనికి భిన్నంగా తమ వద్ద ఫేక్ నోట్ల సౌండే లేదని ఎస్బీఐ చెప్పడంతో జిల్లా పోలీసులకు అక్కడే అనుమానం బలపడిరది. దాంతో అరసవల్లి జంక్షన్, ఆర్ట్స్ కాలేజీ రోడ్డు, విశాఖ`బి కాలనీ, రణస్థలం, గోవిందపురం, పలాస, కవిటి, సారవకోట బ్రాంచిలను వారు పరిశీలించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ఎంతవరకు వాస్తవమనేది పోలీసు అధికారులే చెప్పాలి.
ఇతర బ్యాంకులకూ చేదు అనుభవాలు
గతంలో ఏపీజీవీబీకి స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉండేది. తమకు అవసరమైన నగదును ప్రతిరోజూ ఎస్‌బీఐ నుంచే విత్‌డ్రా చేసి ఏపీజీవీబీ పట్టుకెళ్లేది. ఎస్‌బీఐ మీద నమ్మకంతో బండిల్ మీద ఉన్న ఎస్‌బీఐ సీల్‌ను చించేసి ఏపీజీవీబీ పేపరు అతికించి కస్టమర్‌కు ఇచ్చేవారు. ఈ కట్టల్లో నోట్లు తక్కువ రావడం, ఉన్నవాటిలో కొన్ని నకిలీవి ఉన్నట్లు గ్రామీణ వికాస్ బ్యాంకు కస్టమర్లు ఫిర్యాదులు చేయడంతో ఎస్‌బీఐ నుంచి డబ్బులు తీసుకురావడానికి ఏపీజీవీబీ పుల్‌స్టాప్ పెట్టేసింది. అలాగే మరికొన్ని బ్యాంకులు కూడా ఎస్‌బీఐ డబ్బు కట్టలు ఇవ్వగానే సొమ్ము ముట్టిందని గుడ్డిగా సంతకం పెట్టి వచ్చేయకుండా తమ బ్రాంచికి పట్టుకెళ్లి మిషన్‌లో పెట్టి నకిలీవి ఎన్నో, ఫేక్ ఎన్నో తేలాక రెమిటెన్స్ ఇచ్చేవారు. దీంతో మిగిలిన బ్యాంకులకు సొమ్ములిచ్చేటప్పుడు వచ్చే ఫిర్యాదులు ఈమధ్య కాలంలో తగ్గాయి. ఇటీవల ఒక వ్యక్తి నరసన్నపేట ఎస్‌బీఐ నుంచి విత్‌డ్రా చేసిన నోట్ల కట్టను గుజరాతీపేట ఎస్‌బీఐలో లోన్ రీపేమెంట్‌కు చెల్లిస్తే వాటిలో మూడు నోట్లు తక్కువ ఉన్నాయని బ్యాంకు సిబ్బంది తేల్చారు. దీనిపై కస్టమర్ గొడవ పెట్టినా ఫలితం దక్కలేదు. ప్రస్తుతానికి ఒకప్పటి మాదిరిగా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా నకిలీ నోట్ల చెలామణీ, ముద్రణ గణనీయంగా తగ్గింది. కాకపోతే గతంలో ముద్రించిన నోట్లను మార్కెట్లోకి వదలాడానికి కొన్ని బ్యాంకుల సిబ్బందే ఫేక్ సృష్టికర్తలతో చేతులు కలపడం వల్ల ఖాతాదారులు నష్టపోతున్నారు.
Comments