భూమి మాది.. పరిహారమూ మాకే!
- BAGADI NARAYANARAO

- 14 hours ago
- 3 min read
రోడ్డు విస్తరణలో పోతున్న బావాజీ మఠం భూములు
వాటిలో ఆక్రమార్కుల నిర్మాణాలు, వ్యాపారాలు
వారందరి పరిస్థితి కుడితిలో ఎలుక పడిన చందం
86 సెంట్లకు పరిహారం తనకే ఇవ్వాలని మఠాధిపతి డిమాండ్

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు తయారైంది ఆమదాలవలస-శ్రీకాకుళం రోడ్డు విస్తరణ పరిస్థితి. ఆమదాలవలస బ్రిడ్జి నుంచి కొత్తరోడ్డు వరకు దాదాపు పూర్తి అయినా ఈ విస్తరణ పనులు చాలా జాప్యం తర్వాత కొద్దిరోజుల క్రితమే కొత్తరోడ్డు, డే అండ్ నైట్ జంక్షన్ మధ్య ప్రారంభమయ్యాయి. ఇళ్లు, షాపుల కూల్చివేత, నష్టపరిహారం చెల్లింపులకు సంబంధించి తలెత్తిన వివాదాలన్నింటినీ పరిష్కరించి పనులు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ వారు ఊహించని కోణం నుంచి కొత్త సమస్య పుట్టుకొచ్చింది. బలగ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపుల, ఇళ్ల యజమానులను ఒప్పించి అనంతరం మార్కింగులు ఇచ్చి తొలగిం పు పనులు చేస్తున్నారు. కానీ ఆ ప్రాంతంలో ఆస్పత్రి జంక్షన్ నుంచి బుచ్చిపేట రామ మందిరం వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్నవన్నీ బావాజీ మఠం పరిధిలో ఉన్న భూములే. వాటిని అప్పుడెప్పుడో చాలామంది ఆక్రమించి నిర్మాణాలు జరిపి అనుభవిస్తున్నారు. రోడ్డు విస్తరణలో ఆ భూముల్లో కొంతమేరకు పోతుండటంతో అక్రమ అనుభవదారుల నోట్లో పచ్చివెలక్కాయ పడింది. మరోవైపు ఆ భూములకు నష్టపరిహారం తనకే ఇవ్వాలని బావాజీమఠం వూహరి ఫకీర్ సరవర్తి థకియా మఠం (బావాజీ మఠం) అధిపతి ఫలహారి మహంతి లక్ష్మీధరదాస్ బావాజీ (రఘువీర్‌దాస్) జిల్లా అధికారులను ఆశ్రయించారు. నష్టపరిహారం ఇవ్వకపోయినా.. తనకు కాకుండా వేరే వారికి పరిహారం ఇచ్చినా తాను కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని ఆయన పేర్కొనడంతో.. అధికారులు అయోమయంలో పడ్డారు.
సుప్రీంకోర్టు ద్వారా దఖలు
ఈ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా బావాజీనగర్ పేరుతో ఐదు వీధులు, బావాజీమఠం వీధి పేరుతో మరొకటి ఉన్నాయి. ఇవన్నీ 54, 436, 438, 440 సర్వే నెంబర్లలో ఉన్నాయి. ఈ ఆస్తులు బావాజీ మఠానికే చెందుతాయంటూ 1961లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని జగన్నాధస్వామి దేవాలయంలో ధూపదీప నైవేద్యాలకు, మఠం నిర్వాహణకు వెచ్చించాలి. ఆ మేరకు బావాజీమఠం వారసుడిగా కొనసాగుతున్న 12వ మఠాధిపతికి వారసత్వంగా దఖలు పడ్డాయి. ఈ తీర్పును ప్రకారం మఠం భూములను విక్రయించడానికి లేదు. లీజు రూపంలోనే లావాదేవీలు నిర్వహించాలి. ఆ మేరకు 1984 నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసి మఠం భూములకు లీజుకు ఇవ్వడం ప్రారంభించారు. పాలకొండ రోడ్డుకు పడమర వైపు 87 షాపులు, తూర్పు వైపు 31 షాపులు బావాజీ మఠం భూముల్లోనే ఉన్నాయి. అందువల్ల ప్రైవేట్ వ్యక్తులకు ఆ భూములపై ఎటువంటి హక్కులు లేవని బావాజీమఠం అధిపతి చెబుతున్నారు. వ్యాపారాల పేరుతో లీజుకు తీసుకున్నవారంతా వాటిని సొంతం చేసుకుని ఇళ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించేశారు. దీనిపై ఇప్పటికే మఠాధిపతి శ్రీకాకుళం రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల్లో కేసులు వేశారు. అవి ఇప్పటికీ పెండింగులో ఉన్నాయి.
రంగంలోకి బావాజీ మఠం
బావాజీ మఠం భూములు దేవదాయశాఖ పరిధిలోకి రావు. ఇప్పుడు విస్తరణలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న మఠానికి చెందిన సుమారు 86 సెంట్లు భూమి పోతుందని మఠాధిపతి అధికారుల దష్టికి తీసుకువెళ్లారు. ఈ పరిణామం లీజు పేరుతో మఠం భూములను తీసుకొని అమ్మేసుకున్న, షాపింగ్ కాప్లెంక్స్‌లు, ఇళ్లు, బహుళ అంతస్తు భవనాలు కట్టినవారిలో ఆందోళన రేపుతుంది. వీరి వద్ద సదరు భూమికి సంuంధించిన హక్కు, స్వాధీనపత్రాలు లేవు. రెవెన్యూ రికార్డుల్లో ఈ భూములన్నీ బావాజీమఠం, జగన్నాధ స్వామి దేవాలయం పేరుతోనే ఉన్నాయి. దీంతో వీరికి పరిహారం ఇచ్చే అవకాశం లేదు. మఠానికి చెందిన భూములైనందున తమకే పరిహారం ఇవ్వాలని బావాజీ మఠాధిపతి కోరుతున్నారు. కాదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు. కాగా బలగ ప్రాంతంలో కొందరు లీజుదారులపై ఇప్పటికే మఠాధిపతి కేసులు వేసి ఉన్నారు. వీటిపై తీర్పు వస్తే తప్ప పరిహారం ఇచ్చే అవకాశం లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
కొన్నిచోట్ల కుదింపుపై విమర్శలు
మరోవైపు రోడ్డు విస్తరణను రద్దీగా ఉన్న ప్రాంతంలో 80 నుంచి 70 అడుగులకు కుదించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాస్టర్‌ప్లాన్ ప్రకారం రోడ్లను విస్తరిస్తున్నామని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రకటిస్తున్నా క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. బలగ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న 60 అడుగుల రోడ్డును 80కి పెంచాల్సి ఉండగా 70 అడుగులకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. డే అండ్ నైట్ నుంచి కాంప్లెక్స్ (ఆర్టీసీ డిపో) ఆవల వరకు ప్రభుత్వ భూమి ఉన్నందున అక్కడి వరకు 80 అడుగులుగా, కోర్టు గోడ నుంచి సప్తగిరి కళ్యాణ మండపం వరకు సుమారు 2.2 కిలోమీటర్ల రోడ్డును 70 అడుగులకు విస్తరిస్తున్నారు. రోడ్డు విస్తరణ తర్వాత నాలుగు అడుగుల డివైడర్, రెండు వైపుల నాలుగు అడుగుల డ్రైన్, డివైడర్‌కు ఇరువైపులా 27 అడుగుల రోడ్డు మొత్తంగా 70 అడుగులుగా నిర్ణయించారు. దాని ప్రకారం ప్రస్తుతం 60 అడుగుల రోడ్డు ఉండగా దీనికి అదనంగా ఇరువైపుల చెరో 5 అడుగుల చొప్ప్పున మాత్రమే సేకరిస్తున్నారు. రోడ్డు విస్తరణలో జిరాయితీ భూములు పోతే వాటిలో ఉన్న భవనాలకు మాత్రమే టీడీఆర్ బాండ్లు ఇస్తామని అధికారులు ప్రకటించారు. ఆస్పత్రి కూడలి నుంచి సిద్ధిపేట రోడ్డు జంక్షన్ వరకు ఇరువైపులా అనేక నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఈ నిర్మాణాలు సర్వే నెంబర్లు 54, 436, 438, 440లలో ఉన్నాయి. దీనిపైనా రెవెన్యూ అధికారులు రికార్డులు పరిశీలించి ఆ ప్రాంతంలో ఐదు క్లాసిఫికేషన్స్‌లో భూములు ఉన్నట్టు గుర్తించారు. జిరాయితీ, బావాజీ మఠం, జగన్నాథస్వామి దేవాలయం, వక్ఫ్ భూములతో పాటు ప్రభుత్వ రోడ్డును ఆక్రమించి కొందరు నిర్మాణాలు చేసినట్టు గుర్తించారు. వీరికి ఆర్ Ê ఆర్ చట్టం ప్రకారం పరిహారంతో పాటు, టీడీఆర్‌లు ఇస్తామని చెబుతున్నారు. రోడ్డు విస్తరణలో సుమారు 15 కుటుంబాలు ఆశ్రయం కోల్పోతాయని గుర్తించి వారికి ప్రభుత్వం ద్వారా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నారు. అయితే బలగ ప్రాంతంలో బావాజీ మఠం, జగన్నాధ స్వామి దేవాలయ భూముల విషయంలో కొంత గందరగోళం నెలకొంది.










Comments