top of page

భైరవం.. మాస్‌కు కిక్కు

  • Guest Writer
  • 3 days ago
  • 4 min read

భైరవం.. మూవీ రివ్యూ

నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్‌-నారా రోహిత్‌-మంచు మనోజ్‌-అదితి శంకర్‌- ఆనంది-దివ్య పిళ్లై-సంపత్‌ రాజ్‌-శరత్‌ లోహితశ్వ-వెన్నెల కిషోర్‌-రాజా రవీంద్ర-అజయ్‌ తదితరులు

సంగీతం: శ్రీ చరణ్‌ పాకాల

ఛాయాగ్రహణం: హరి కె. వేదాంతం

మాటలు: సత్యర్షి-తూమ్‌ వెంకట్‌

నిర్మాత: కేకే రాధామోహన్‌

స్క్రీన్‌ ప్లే-దర్శకత్వం: విజయ్‌ కనకమేడల

బెల్లంకొండ శ్రీనివాస్‌..నారా రోహిత్‌..మంచు మనోజ్‌.. .. ఈ ఈ ముగ్గురు యువ కథానాయకుల ఆసక్తికర కలయికలో తెరకెక్కిన చిత్రం.. భైరవం. కెరీర్లో గ్యాప్‌ వచ్చింది.. పైగా సరైన సక్సెస్‌ అందుకునీ చాలా కాలమైంది. ఈ స్థితిలో ఈ ముగ్గురూ కలిసి చేసిన ‘భైరవం’ ఆసక్తికర ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ‘నాంది’ ఫేమ్‌ విజయ్‌ కనకమేడల రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే థియేటర్లలోకి దిగింది. దీని విశేషాలేంటో చూద్దాం.

కథ:

తూర్పు గోదావరి జిల్లాలో దేవీపురం అనే ఊర్లో వారాహి అమ్మవారి గుడికి సుదీర్ఘ చరిత్ర ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ఆ గుడి ధర్మకర్తగా ఉన్న పెద్దావిడ మనవడు గజపతి వర్మ (మంచు మనోజ్‌). అతడి అనుచరుడైన శీను ఒక అనాథ. గజపతి అంటే శీనుకు ప్రాణం. తనకోసం ఏమైనా చేస్తాడు. గజపతి, వరద (నారా రోహిత్‌) ప్రాణ స్నేహితులు. ఈ ముగ్గురు కలిసి మెలిసి సాగుతూ ఊరికి ఏ కష్టం రాకుండా చూసుకుంటూ ఉంటారు. ఐతే దేవాదాయ మంత్రి (శరత్‌ లోహితశ్వ) కన్ను ఆ గుడికి సంబంధించిన వెయ్యి కోట్ల విలువైన భూమి మీద పడుతుంది. ఒక సమస్యలో చిక్కుకున్న గజపతికి సాయం చేసే క్రమంలో అతడి ద్వారానే గుడి భూమిని సొంతం చేసుకోవాలని ప్లాన్‌ చేస్తాడు మంత్రి. దీని వల్ల గజపతి - వరద మధ్య గొడవ మొదలవుతుంది. ఆ గొడవ ఎక్కడిదాకా వెళ్ళింది... ఇందులో శీను పాత్ర ఏంటి.. చివరికి ఈ ముగ్గురి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

ఓటీటీల పుణ్యమా అని అన్ని భాషల సినిమాలనూ అందరూ చూసేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం రీమేక్స్‌ అన్నవి కత్తి మీద సాములా తయారయ్యాయి. ఒక సినిమా రీమేక్‌ అని తెలియగానే.. దాని విశేషాలన్నీ బయటికొచ్చేస్తున్నాయి. జనం ఒరిజినల్‌ చూసేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో చర్చలు పెట్టేస్తున్నారు. దీంతో కథ పరంగా ఎగ్జైట్మెంట్‌ ఉండట్లేదు. ఫలితాలు తేడా కొట్టేస్తున్నాయి. అయినా రీమేక్స్‌ ఏమీ ఆగిపోవట్లేదు. ఐతే మాతృకను ఉన్నదున్నట్లు తీయకుండా.. మార్పులు చేర్పులతో కొత్త లుక్‌ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు ఫిలిం మేకర్స్‌. ‘గబ్బర్‌ సింగ్‌’తో హరీష్‌ శంకర్‌ మొదలుపెట్టిన ఈ ట్రెండుని వేరే దర్శకులూ అందిపుచ్చుకుంటున్నారు. ‘నాంది’తో తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన విజయ్‌ కనకమేడల కూడా ‘గరుడన్‌’ రీమేక్‌ ‘భైరవం’తో అదే చేశాడు. మూల కథను అలాగే ఉంచి.. ట్రీట్మెంట్‌ అంతా మార్చేశాడు విజయ్‌. ఇమేజ్‌ ఉన్న హీరోలు తోడవడంతో వారికి తగ్గట్లు ఆయా పాత్రలకు హీరోయిజం జోడిరచడంతో పాటు యాక్షన్‌ ప్రధానంగా కథను నడిపించి దీన్నొక మాస్‌ మూవీలా మార్చాడు. మాతృకతో పోలిస్తే కథలో పట్టు కొంచెం తగ్గినట్లు అనిపించినా.. మాస్‌ ప్రేక్షకులకు నచ్చే అంశాలుండడంతో ఈ సినిమా ఆ వర్గం ప్రేక్షకులను బాగానే ఎంగేజ్‌ చేస్తుంది.

తమిళంలో కమెడియన్‌ సూరి నటించిన సీరియస్‌ మూవీ.. గరుడన్‌. తన ఇమేజ్‌ కు తగ్గట్లే తన పాత్ర హీరోలా కాకుండా ఒక సహాయ పాత్రలా కనిపిస్తుంది. అతనే కాక మిగతా ముఖ్య పాత్రల్లో కూడా ఇమేజ్‌ లేని నటులే చేయడంతో ఫోకస్‌ అంతా కథ మీదే నడిచింది. ఐతే తెలుగులోకి వచ్చేసరికి శ్రీనివాస్‌ లాంటి మాస్‌ ఇమేజ్‌ ఉన్న నటుడు హీరో పాత్ర చేయడం.. మంచు మనోజ్‌,నారా రోహిత్‌ లు మరొక సమ ప్రాధాన్యత ఉన్న కీలక పాత్రలలో నటించడంతో వారి ఇమేజ్‌ లకు తగ్గట్లు.. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు ఈ సినిమాకు ‘మాస్‌’ టచ్‌ ఇచ్చాడు దర్శకుడు. ముగ్గురు హీరోలు ఉండటం తో ఈ కథకు భారీతనం తోడైంది. యాక్షన్‌ బ్లాక్స్‌ ఒక లెవెల్లో తీశారు. ప్రస్తుతం ‘డివైన్‌’ ఎలిమెంట్స్‌ తీసుకుని వాటికి భారీతనం జోడిరచడం ట్రెండు. ‘భైరవం’లో కూడా అదే చేశారు. ‘కాంతార’ను గుర్తు చేసేలా హీరో పాత్రకు ఒక ప్రత్యేక లక్షణాన్ని జోడిరచి.. రెండు కీలకమైన ఎపిసోడ్లలో అతడితో తాండవం చేయించడం మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. డబ్బు మీద ఆశ ఎలాంటి బంధాన్నయినా దెబ్బ తీస్తుందనే కాన్సెప్ట్‌ తో తెరకెక్కిన కథ ఇది. ఆ పాయింటుని ముఖ్య పాత్రల ద్వారా బలంగానే చెప్పారు.

‘గరుడన్‌’కు ఇచ్చిన మాస్‌ టచ్‌ బాగున్నా.. భారీతనం ఆకట్టుకున్నా.. మాతృకతో పోలిస్తే కథ పలుచనైపోవడం కొంత ప్రతికూలంగా మారింది. సినిమా అంతా అయ్యేసరికి యాక్షన్‌ ఘట్టాలు గుర్తుంటాయి.. కథ-పాత్రలు అంత బలమైన ముద్ర వేయవు. ఇందులో అసలు హీరోకు హీరోయిన్‌.. ఆమెతో లవ్‌ ట్రాక్‌ పెట్టాల్సిన అవసరమే కనిపించదు. కానీ బలవంతంగా ఒక ట్రాక్‌ ఇరికించడమే కాక.. శ్రీనివాస్‌ పక్కన అస్సలు సూట్‌ కాని అదితి శంకర్‌ ను పెట్టి.. సినిమాలో అస్సలు సింక్‌ కాని మాస్‌ పాటలకు ఇద్దరితో స్టెప్పులేయించారు. వెన్నెల కిషోర్‌ తో చేయించిన ప్రాస కామెడీ ఓకే అనిపిస్తుంది. వీటిని పక్కన పెడితే.. శ్రీనివాస్‌-నారా రోహిత్‌-మనోజ్‌ చేసిన మూడు ముఖ్య పాత్రలు.. వాటిలో ఆయా నటుల పెర్ఫామెన్స్‌ సినిమాను డ్రైవ్‌ చేశాయి.

‘గరుడన్‌’లో సన్నివేశాలు సహజంగా సాగితే.. ‘భైరవం’లో కొంచెం డ్రమటిగ్గా అనిపిస్తాయి. మన ప్రేక్షకుల అభిరుచి.. ముఖ్య పాత్రధారుల ఇమేజ్‌ ను దృష్టిలో ఉంచుకుని ప్రతిదీ భారీగా ఉండాలని చేసిన ప్రయత్నం వల్లే ఈ మార్పు కనిపిస్తుంది. తొలి గంటలో ‘భైరవం’ మామూలుగానే అనిపించినా.. ప్రి ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌ నుంచి కథ మలుపు తిరుగుతుంది. మనోజ్‌ పాత్రలో కొత్త కోణం బయటికి రావడంతో కథ కూడా మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచి దర్శకుడు రేసీ స్క్రీన్‌ ప్లేతో సినిమాను నడిపించాడు. ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌ ఒక్కసారిగా ప్రేక్షకులను ఉలికిపాటుకు గురి చేస్తుంది. శ్రీనివాస్‌ పాత్రకు పూనకం వచ్చే సన్నివేశంతో మాస్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. ద్వితీయార్దంలో కథ మరింత రక్తి కడుతుంది. మలుపులు ఆకట్టుకుంటాయి. చివరి అరగంటలో ఎమోషన్‌ బాగా పండిరది. పతాక సన్నివేశాలను భారీగా తీర్చిదిద్దారు. ఇంటర్వెల్‌ ఎపిసోడ్లో ఉండే ఎమోషన్నే క్లైమాక్సులో కూడా వర్కవుట్‌ చేశాడు దర్శకుడు. కథనం కొంచెం ఎగుడు దిగుడుగా సాగినా.. ‘భైరవం’.. మాస్‌ ప్రేక్షకులను బాగానే ఎంగేజ్‌ చేస్తుంది.

నటీనటులు:

బెల్లంకొండ శ్రీనివాస్‌.. నారా రోహిత్‌..మంచు మనోజ్‌.. .. ఈ ముగ్గురికీ ‘భైరవం’లో సమాన ప్రాధాన్యం ఉన్న పాత్రలే దక్కాయి. శ్రీనివాస్‌ క్యారెక్టర్‌, తన నటన మాస్‌ కు నచ్చేలా సాగాయి. తన బలమైన మాస్‌-యాక్షన్‌ సీన్లలో శ్రీనివాస్‌ ఇంపాక్ట్‌ చూపించాడు. ఇంటర్వెల్‌ ఎపిసోడ్లో పూనకంతో ఊగిపోయే సీన్లో.. అలాగే పతాక సన్నివేశాలో శ్రీనివాస్‌ బాగా చేశాడు. ఈ ఎపిసోడ్లలో పెర్ఫామెన్స్‌ స్టాండౌట్‌ గా నిలిచింది. నారా రోహిత్‌ తన మార్కు సటిల్‌ యాక్టింగ్‌ తో ఆకట్టుకున్నాడు. మిడిలేజ్డ్‌ క్యారెక్టర్‌ కు తగ్గ ఆహార్యంతో అతను కనిపించాడు. కెరీర్లో చాలా గ్యాప్‌ వచ్చినా రోహిత్‌ కాన్ఫిడెన్స్‌ ఏమి తగ్గలేదు. ఇలాంటి పెర్ఫామర్‌ ఎందుకు సినిమాలకు దూరంగా ఉన్నాడనిపిస్తుంది. నిజాయితీ పెద్దరికం ఉన్న పాత్రా తో రోహిత్‌ చాల పాజిటివ్‌ గా కనిపించారు . ఇక డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో మంచు మనోజ్‌ కూడా అదరగొట్టాడు. బేస్‌ వాయిస్‌ తో అతను చెప్పిన డైలాగ్స్‌ బాగానే పేలాయి. కొన్ని చోట్ల క్యారెక్టర్‌.. యాక్టింగ్‌ మరీ లౌడ్‌ అనిపించినా.. ఈ సినిమా పరిధిలో ఓకే. బెల్లంకొండకు జోడిగా నటించిన డైరెక్టర్‌ శంకర్‌ కూతురు అదితి తన పక్కనే కాక సినిమాలో ఏమాత్రం కుదరలేదు. తన స్క్రీన్‌ ప్రెజెన్స్‌, మేకప్‌ తేడా కొట్టాయి. తన ట్రాక్‌ కూడా మిస్‌ ఫైర్‌ అయింది. దివ్య పిళ్ళై.. ఆనంది తమ పాత్రల్లో బాగానే ఒదిగిపోయారు. జయసుధ.. సంపత్‌ రాజ్‌.. సహాయ పాత్రల్లో ఓకే అనిపించారు. విలన్‌ పాత్రల్లో శరత్‌ లోహితశ్వ.. అజయ్‌ బాగానే చేశారు.

సాంకేతిక వర్గం:

‘భైరవం’లో సాంకేతిక విభాగాల పనితీరు ఓకే. శ్రీ చరణ్‌ పాకాల పాటలు సాధారణంగానే అనిపించినా.. నేపథ్య సంగీతంతో అదరగొట్టాడు. యాక్షన్‌, ఎమోషనల్‌ ఎపిసోడ్లలో మంచి ఊపుతో సాగింది ఆర్‌ఆర్‌. హరి వేదాంతం ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. విజువల్‌ గా సినిమా బాగుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. బాగా ఖర్చు పెట్టారు. తెరపై భారీతనం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్‌.. క్లైమాక్స్‌ ఎపిసోడ్లను భారీగా తీశారు. దర్శకుడు విజయ్‌ కనకమేడల.. తమిళంలో కథా ప్రాధాన్యంతో నడిచే ‘గరుడన్‌’కు తెలుగులో మాస్‌-యాక్షన్‌ టచ్‌ ఇవ్వడానికి ప్రయత్నించాడు. ప్రస్తుత ట్రెండుకు తగ్గట్లు కొన్ని అంశాలను ఈ కథకు బాగానే అడాప్ట్‌ చేశాడు. యాక్షన్‌ ఎపిసోడ్లను బాగా తీసిన విజయ్‌.. కథనం మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టాల్సింది.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

Comentarios


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page