మాటల ఎత్తు.. ఉత్తర్వులు చిత్తు!
- Prasad Satyam
- 16 hours ago
- 3 min read
గత ఏపీసీపై చర్యలకు హైకోర్టు ఆదేశాలు
ఆ మేరకు సమగ్రశిక్ష ఏపీసీ, ఉన్నత విద్యాశాఖ చర్యలు
కానీ వారి ఉత్తర్వులనే పక్కన పెట్టిన కింది అధికారులు
శశిభూషణ్‌కు రాజకీయ అండ ఉందన్న ప్రచారం
కోర్టుకు మాత్రం చర్యలు తీసుకున్నట్లు జీవో చూపుతున్న వైనం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
కోర్టులంటే ఆటలైపోయాయి.. చివరకు ఉన్నత న్యాయవ్యవస్థ ఇచ్చే ఆదేశాలు అమలు చేయాల్సిన అధికారులు కూడా కోర్టులను లైట్‌గా తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయి ఉద్యోగులకు కొమ్ముకాస్తూ వారి ప్రయోజనాలను రక్షించడానికి వ్యవస్థపై ఉన్న విశ్వాసాన్నే దెబ్బతీస్తున్నారు. తమ హÃదాలు కాపాడుకోవడానికి ఐఏఎస్‌లు ఇచ్చిన మౌఖిక ఆదేశాలను పాటిస్తున్నామన్న ఆలోచన తప్ప దానికి సంబంధించి కోర్టు ఏం చెప్పింది? దాన్ని అమలు చేయకపోతే పర్యవసానాలేమిటి? అన్న కోణంలో ఒక్కరూ ఆలోచించని అపసవ్య ధోరణులు ఇప్ప్పుడు కోర్టు తీర్పులు ఎందుకన్న ప్రశ్న లేవనెత్తుతున్నాయి. వైకాపా హయాం నుంచి కోర్టు ధిక్కార కేసులు పెరగడం, స్వయంగా ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులే న్యాయమూర్తులతో చీవాట్లు తినడం ఆనవాయితీగా మారింది. ఎన్డీయే కూటమి పాలనలోనూ ఇందులో మార్పు కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం కోర్టు ధిక్కార కేసులు ఏళ్ల తరబడి బెంచ్‌కు రాకపోవడం, ఈలోగా బాధితులు నీరుగారిపోవడమే. శ్రీకాకుళం సమగ్రశిక్ష ఏపీసీగా కొన్నాళ్ల క్రితం వరకు పని చేసిన ఎస్.శశిభూషణ్‌ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్త ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం శశిభూషణ్ శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఏపీసీగా ఉన్నప్ప్పుడు కోర్టు ఇచ్చిన ఆదేశాలను శశిభూషణ్ అమలు చేయలేదని సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. అతన్ని సస్పెండ్ చేస్తూ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ అవి అమలుకు నోచుకోలేదు.
పూర్వపరాలు పరిశీలిస్తే..

రాష్ట్రంలోని కేజీబీవీల్లో పీజీటీలుగా పని చేస్తూ ఇంటర్మీడియట్ విద్యార్థులకు సబ్జెక్ట్ టీచర్లుగా వ్యవహరిస్తున్న వారికి 2023 నుంచి 2024 విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ పీరియడ్‌ను కొనసాగించాల్సి ఉండగా వీరిలో తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్ట్ టీచర్లను మాత్రం రెన్యువల్ చేయలేదు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆ సబ్జెక్టుల టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కానీ కోర్టు తీర్పు వచ్చేలోగానే ఈ రెండు సబ్జెక్టులకు కొత్త అధ్యాపకులను అప్పటి సమగ్రశిక్ష ఏపీసీ నియమించేశారు. ఇప్ప్పుడు కోర్టు తీర్పు మేరకు పాతవారికి రెన్యూవల్ చేయాలి. కానీ వారి పాత స్థానాలు ఖాళీ లేకపోవడంతో వేరే చోట సర్దుబాటు చేశారు. కానీ తమకు పాత కేజీబీవీలే కేటాయించాలంటూ వారు మళ్లీ కోర్టుకెక్కారు. దీన్ని రాష్ట్రంలో అనేక జిల్లాలు ఇంప్లిమెంట్ చేసినా నాలుగు జిల్లాలు మాత్రం పట్టించుకోలేదు. ఆ జాబితాలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఉన్నాయి. కోర్టు ధిక్కార కేసును పరిశీలించిన న్యాయస్థానం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశించింది. ఆ చర్యల్లో భాగంగానే విజయనగరం ఏపీసీని మాతశాఖకు సరెండర్ చేయగా, శ్రీకాకుళం ఏపీసీగా పని చేసిన శశిభూషణ్‌ను సస్పెండ్ చేయాలని ఉన్నత విద్యాశాఖ కమిషనర్ గుప్త ఆదేశాలిచ్చారు. కానీ దానికి ముందే శశిభూషణ్ ఏపీసీ పోస్టు నుంచి తన పాత పోస్టులోకి.. అంటే ఆర్ట్స్ కాలేజీ ఇంగ్లీష్ లెక్చరర్‌గా వెళ్లిపోయారు. విజయనగరం ఏపీసీ మాదిరిగానే తాను కూడా మాతశాఖకు వెళ్లిపోయానని, అందువల్ల తనపై సస్పెన్షన్ విధించడం చెల్లదనేది ఆయన వాదనగా ఉంది. అయితే స్వయంగా సమగ్రశిక్ష ఎస్‌పీడీ (స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్) ఒక నివేదిక పంపించి చర్యలు తీసుకోవాలని కోరగా.. ఆ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్ సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చినా, అవి శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌కు మెయిల్ రూపంలో అందినా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయకుండా తొక్కిపెట్టేశారు.
మౌఖిక ఆదేశాలే మిన్న

ఇదే విషయంపై బాధితులు కోర్టు ధిక్కరణ కేసు వేయగా హైకోర్టు సమగ్రశిక్ష ఎస్‌పీడీని కోర్టుకు పిలిచి మరీ చర్యలు ఎందుకు తీసుకోరంటూ నిలదీసింది. విజయనగరం ఏపీసీని వెనక్కు పంపామని, శ్రీకాకుళం ఏపీసీగా పని చేసిన శశిభూషణ్‌ను సస్పెండ్ చేయమని ఉత్తర్వులు ఇచ్చామని సదరు ఎస్పీడీ వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. కానీ వాస్తవాలు పరిశీలిస్తే.. కోర్టు ఆదేశాలు ఎక్కడా అమలుకాలేదు. విజయనగరం ఏపీసీని మాతశాఖకు పంపినా ఆయన స్థానంలో రెగ్యులర్ ఏపీసీని ఇంకా నియమించలేదు. ఈ వ్యవహారం సద్దుమణిగిన తర్వాత మళ్లీ ఆయన్నే వెనక్కు తీసుకొస్తారని ప్రచారం జరుగుతున్నది. అలాగే ఇక్కడ శశిభూషణ్‌ను సస్పెండ్ చేయాలంటూ వచ్చిన ఉత్తర్వులను ఇంప్లిమెంట్ చేయకుండా నిలిపేయాలని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ పోలినాయుడుకు మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ విషయం స్వయంగా ఆయనే ఆమధ్య ఒక పత్రికకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ హÃదాలో ఉన్న వ్యక్తి రాతపూర్వక ఉత్తర్వులను కాదని ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలకు తలొగ్గి సస్పెన్షన్ నిలిపివేయడం గర్హనీయం. ఆ విషయంలో ముందుగా ప్రిన్సిపాల్ పోలినాయుడునే సస్పెండ్ చేయాలి. ఆర్డర్స్ వచ్చి వారం దాటినా, కనీసం దానిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిర్దేశించాలంటూ పై అధికారులతో సంప్రదింపులు జరిపిన దాఖలాలు కూడా లేవు. కోర్టును తప్ప్పుదోవ పట్టించడానికి కాగితాలపై సస్పెన్షన్, సరెండర్ ఉత్తర్వులు చూపించి సంతప్తిపర్చాలని చూస్తున్నారు. వాస్తవానికి ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లడానికి కారణమే సమగ్రశిక్ష రాష్ట్ర అధికారులు. అప్పట్లో ఇది జరిగినప్ప్పుడు ఏపీసీగా శశిభూషణ్ లేకపోవచ్చు. కానీ కోర్టు ఆర్డర్‌ను అమలుపర్చాల్సిన సమయంలో మాత్రం శశిభూషణే ఇక్కడ ఏపీసీ. కాబట్టి కోర్టు ఆదేశాల మేరకు సస్పెన్షన్‌కు గురయ్యే పరిస్థితి ఆయనకే ఉంది. అలా కాకుండా అప్పటికే ఆయన మాతశాఖకు వెళ్లిపోయినందున పనిష్మెంట్ ప్రక్రియ పూర్తి అయినట్లు భావించడానికి వీల్లేదు. ఎందుకంటే.. శశిభూషణ్‌ను సమగ్రశిక్ష ఏపీసీ పోస్టు నుంచి తీసేసి వెనక్కు పంపింది కోర్టు ఆదేశాల మేరకు కాదు.. దాని వెనుక వేరే కారణాలు ఉన్నాయి. ఆయన ఏపీసీగా వచ్చింది కూడా తక్కువ కాలపరిమితికే.
రాజకీయ అండతోనే విరగబాటు
ఇద్దరు ఐఏఎస్ అధికారులు (ఒకరు సమగ్రశిక్ష ఎస్పీడీ, మరొకరు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్) లిఖితపూర్వకంగా ఇచ్చిన ఆదేశాలను ప్రిన్సిపాల్ స్థాయి అధికారి ఇంప్లిమెంట్ చేయడం లేదంటే కచ్చితంగా దీని వెనుక రాజకీయ కోణం ఉండే ఉంటుంది. ఒక ఎమ్మెల్సీ ఇక్కడి నుంచి ఎన్నికవడానికి తానే కారణమని, తాను చెబితేనే ఓట్లు పడ్డాయని భావించే శశిభూషణ్ ఇప్ప్పుడు ఆయన్నే ముందు పెట్టి .. తమ ఆదేశాలు ఎందుకు అమలు కాలేదని ఆ ఇద్దరు ఐఏఎస్‌లు అడిగే సాహసం చేయకుండా అడ్డుకుంటున్నారని తెలిసింది. కూటమి ప్రభుత్వం విద్యాశాఖను ఈ ఎమ్మెల్సీకి గుదిగుత్తగా రాసిచ్చేసిందని, ఆయన తన మిత్రుడని డప్పు కొట్టుకుంటూ శశిభూషణ్ తన సస్పెన్షన్ అమలుకాకుండా చూసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. కోర్టుకు మాత్రం చర్యలు తీసుకున్నామని చెప్పడానికి ఉత్తర్వులు చూపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేకపోయామని చెప్పాల్సిన ప్రిన్సిపాల్ కూడా అదే పాట పాడుతున్నారు. ఆర్ట్స్ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పని చేయాలంటే శశిభూషణ్ అండ్ బ్యాచ్ అండదండలు ఉండాలి. లేదంటే ఇంతకు ముందు ఉన్నవారికి పట్టిన గతే పడుతుందన్న విషయం పోలినాయుడుకు తెలుసు. అసలే ఈ పోస్టుకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో తన స్థానాన్ని కాపాడుకోవడానికి ఆయన అలా చూసీచూడనట్లు పోతున్నారు.






Comments