top of page

మాటల్లేవ్‌.. మాట్లాడుకోడాల్లేవ్‌!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Oct 9
  • 2 min read
  • సమ్మెలో గ్రామీణ వైద్యులు

  • విఫలమైన చర్చలు

  • మెడికల్‌ కాలేజీల నుంచి వైద్యుల దిగుమతి

  • శుక్రవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలూ బంద్‌

  • రోగాల కాలంలో పంతాల సరాగాలు


ree

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

గ్రామీణ వైద్యవ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు సమ్మెకు దిగడంతో ప్రభుత్వం చర్చల కంటే ముందు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకే ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వ వైద్య కాలేజీ ఆసుపత్రులు, సీహెచ్‌సీలు, ఆయూష్‌ కేంద్రాల్లో పని చేస్తున్న జూనియర్‌, పీజీ వైద్యులను పీహెచ్‌సీల్లో నియమించింది. జిల్లాలో 71 పీహెచ్‌సీల్లో 121 మంది వైద్యులకు గాను 10 పీహెచ్‌సీల్లో 10 మంది పీజీ వైద్యులు మాత్రమే విధుల్లో ఉన్నారు. మిగతా 111 మంది సమ్మెబాట పట్టారు. వీరి స్థానంలో 111 మంది రిమ్స్‌, సీహెచ్‌సీ, ఆయూష్‌ వైద్యులకు విధులు అప్పగించారు. అయితే తాజాగా సీహెచ్‌సీల్లో కూడా జూనియర్‌ వైద్యులు బుధవారం నుంచి సమ్మెబాటలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1142 పీహెచ్‌సీల్లోని సుమారు 2750 మంది వైద్యులు సమ్మెలో ఉన్నారు. దీంతో ప్రజారోగ్యంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది.

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ హెల్త్‌ సెంటర్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు 26 జిల్లాల పీహెచ్‌సీ వైద్యులంతా విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద నిరాహార దీక్ష చేస్తున్నారు. దీర్ఘకాలిక సమస్యలు, డిమాండ్లు నెరవేర్చాలని పీహెచ్‌సీ వైద్యులు సెప్టెంబర్‌ 26 నుంచి ఔట్‌పేషెంట్‌ సేవలను బహిష్కరించారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల ఒకటి నుంచి అత్యవసర సేవలను కూడా నిలిపివేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్‌సీలో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడిరది.

ప్రస్తుతం వర్షాకాలం కావడం గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో విషజ్వరాలు ప్రబలుతుండడం, డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి వ్యాధులతో పాటు నీరు కలుషితమై కామెర్లు బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. ప్రభుత్వం పీహెచ్‌సీల వైద్యుల సమ్మెకు ప్రత్యామ్నాంగా వైద్యులను ఏర్పాటుచేసినా ప్రజారోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతుంది. పీహెచ్‌సీ వైద్యులకు పనిచేసే చోట ఎటువంటి సౌకర్యాలు కల్పించడం లేదని, ఏళ్ల కష్టానికి, సేవలకు తగిన గుర్తింపునకు నోచుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ హెల్త్‌ సెంటర్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పీజీలో సర్వీస్‌ కోటాను 20 శాతం అన్ని స్పెషాలిటీలకు వర్తింపజేయాలని కోరుతున్నారు. సుమారు 20 ఏళ్లుగా పదోన్నతులు లేక ఒకే హోదాలో పని చేస్తున్న వైద్యులు ప్రమోషన్లు కోరుతున్నారు. 2020`21 ఆర్ధిక సంవత్సరానికి నోషనల్‌ ఇంక్రిమెంట్‌ ఇవ్వాలని డిమాండ్‌ను వినిపిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో సేవలందించే వైద్యులకు ట్రైబల్‌ అలవెన్స్‌ను ఇవ్వాలని కోరుతున్నారు. సంచార చికిత్స ఇన్సెంటివ్‌ నెలకు రూ.5వేలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

జిల్లాలో అన్ని పీహెచ్‌సీల్లో వైద్యులు అందుబాటులో ఉన్నారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అనిత ‘సత్యం’కు తెలిపారు. సమ్మెకు ప్రత్యామ్నాంగా ప్రభుత్వ వైద్యులను పీహెచ్‌సీల్లో సర్దుబాట చేసినట్టు తెలిపారు. ప్రతి రోజు పీహెచ్‌సీల్లో విధుల్లో ఉన్న వైద్యులను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. సేవలకు ఎక్కడా ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.

ఎన్టీఆర్‌ వైద్య సేవలు బంద్‌

ఎన్టీఆర్‌ వైద్య సేవ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌ చేస్తున్నట్లు ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్‌ ప్రకటించింది. ఈమేరకు గురువారం ఒక నోట్‌ను విడుదల చేసింది. ఈ నెల 10 నుంచి ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఈ సేవలను నిలిపివేస్తున్నామని అందులో పేర్కొంది. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ నుంచి రావాల్సిన బకాయిలు సుమారు 2,700 కోట్లు పైమాటే. ఈ బకాయిలు ఏ నెలకానెల పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదని అసోసియేషన్‌ పేర్కొంది. సెప్టెంబరు 25న సమావేశమైన ఆషా రాష్ట్ర కార్యవర్గం భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించింది. దీని అనుగుణంగానే ఈ నెల 10 నుంచి ఎన్టీఆర్‌ వైద్య సేవలను నిలిపివేయాలని నెట్‌వర్క్‌ ఆసుపత్రులు నిర్ణయించాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page