మందు పార్టీలో దువ్వాడ, దివ్వెల
- Guest Writer
- Dec 12, 2025
- 2 min read
ఫామ్ హౌస్‌పై ఎస్‌వోటీ పోలీసుల దాడి
వారిని అరెస్టు చేశారని జోరుగా ప్రచారం
ఖండిరచిన వివాదాస్పద జంట

(సత్యంన్యూస్, హైదరాబాద్)
ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట మరో వివాదంలో చిక్కుకున్నారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మందు పార్టీలో వీరు ఉండటం, హైదరాబాద్‌కు చెందిన స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్‌వోటీ) పోలీసులు పార్టీ జరుగుతున్న ఫామ్‌హౌస్‌పై దాడి చేసి అక్కడ ఉన్న ఈ వివాదాస్పద జంటను కూడా ప్రశ్నించారు. మాధురి పుట్టినరోజు సందర్భంగా ఈ పార్టీని అనుమతి లేకుండా వీరే నిర్వహిస్తున్నట్లు, పెద్దసంఖ్యలో విదేశీ మద్యం బాటిళ్లు లభించినట్లు, మాధురిని పోలీసులు అరెస్టు చేసినట్లు శుక్రవారం ఉదయం నుంచే సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దాడి, సోదాలు వాస్తవమే గానీ.. మాధురి, శ్రీనివాస్‌లను పోలీసులు ప్రశ్నించి వదిలేసినట్లు తేలింది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఉన్న ‘ది పెండెంట్’ అనే ఫామ్‌హౌస్‌పై రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు గురువారం రాత్రి దాడి చేశారు. అనుమతి లేకుండా అక్కడ భారీ మద్యం పార్టీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రధాన అనుచరుడు, అమలాపురానికి చెందిన పార్థసారథి(పార్థు) పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ పార్టీలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి కూడా పాల్గొన్నారు. శుక్రవారం మాధురి పుట్టిన రోజు కూడా కావడంతో పార్థసారథి పేరుతో ఫామ్‌హౌస్‌ను బుక్ చేసినట్లు తెలిసింది. ఈ పార్టీలో సుమారు 30 మంది పాల్గొన్నట్లు సమాచారం. అనుమతి లేకుండానే ఈ మద్యం పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో స్థానిక పోలీసులతో కలిసి రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు ఫామ్ హౌస్‌కు వచ్చి సోదాలు చేశారు. 10 స్కాచ్ బాటిళ్లు, ఐదు హుక్కా బాటిళ్లు, ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. దువ్వాడ, దివ్వెల మాధురి జంటకు నోటీసులు ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.
పార్టీ మాది కాదు.. అరెస్టు కాలేదు
తాము పార్టీ నిర్వహించినట్లు, తమను పోలీసులు అరెస్టు చేసినట్లు వచ్చిన వార్తలను దువ్వాడ, దివ్వెల ద్వయం ఖండిరచారు. జరిగింది తెలుసుకోకుండా, కనీసం తమను సంప్రదించకుండా ఇలాంటి వార్తలు రాయడాన్ని వారు ఆక్షేపించారు. మాధురి పుట్టినరోజు డిసెంబర్ 12 అంటే శుక్రవారం అని.. అలాంటప్పుడు దానికి ముందే 11వ తేదీ(గురువారం) రాత్రి పార్టీ ఎలా చేస్తామని ప్రశ్నించారు. శుక్రవారం కేక్ కటింగ్‌తోపాటు చిన్న గెట్‌టుగెదర్ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నంతలోనే ఎక్కడో జరిగిన పార్టీని తమకు ఆపాదించడం భావ్యం కాదన్నారు. పోలీసులు తమను అరెస్టు చేశారనడం కూడా తప్పేనని, అరెస్టు చేస్తే.. తాము ఇంట్లో ఎలా ఉంటామని ప్రశ్నించారు. ఆ పార్టీని తమ ఫ్యామిలీ ఫ్రెండ్ పార్థసారధి ఏర్పాటు చేశారని, బిజినెస్ వ్యవహారాలు కూడా మాట్లాడుకోవచ్చు.. రమ్మని ఆహ్వానిస్తేనే వెళ్లామని చెప్పుకొచ్చారు. తాము వెళ్లిన పదిహేను ఇరవై నిమిషాలకే పోలీసులు వచ్చారని.. అక్కడ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ను చూసి ‘మీరు ఇక్కడ ఉన్నారా’ అని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారని, తమకు కేవలం రెండుమూడు ప్రశ్నలు అడిగి పంపేశారని వివరించారు. మొత్తానికి ఈ ఘటనతో దువ్వాడ, దివ్వెల ద్వయం మరోసారి చర్చనీయాంశమయ్యారు. వీరిద్దరూ తమ కుటుంబాలను వదిలిపెట్టి సహజీవనం చేస్తుండటం రెండు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారడం, మాధురీ ఇటీవల బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిరావడం తెలిసిందే.






Comments