మీరు కట్టుకోండి..మేం మూసుకుంటాం..!
- SATYAM DAILY
- 10 hours ago
- 1 min read

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఏ మున్సిపాలిటీలోనైనా ప్రభుత్వ కాలువకు, రోడ్డుకు నాలుగు అడుగులు వదిలి నిర్మాణాలు చేపట్టాలి. శ్రీకాకుళంలో మాత్రం ఓ ప్రత్యేకమైన వెసులుబాటు ఉంది. ఇల్లు నిర్మించుకుంటాం, ప్లాన్ ఇవ్వండి అని అడిగితే, సెంటున్నర స్థలానికి సెంటుముప్పావు వదిలేసి కట్టాలని బుర్ర లేని తీర్పు ఒకటిస్తారు. అలా కాకుండా మున్సిపాలిటీలో టౌన్‌ప్లానింగ్ అధికారులకు సొమ్ములిచ్చి మేం కట్టుకుంటాం.. మూసుకోండి అంటే మాత్రం కళ్లే కాదు.. అన్ని రంధ్రాల్లోనూ సీసం పోసుకుని మరీ ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తారు. కాలువ, రోడ్డుకు నాలుగు అడుగులు వెనక్కు వెళ్లాలన్న విషయం పక్కన పెట్టి ఏకంగా కాలువ, రోడ్డును ఆక్రమించి కట్టుకున్నా అడిగే నాధుడే ఉండడు. అక్కడి వరకు కాలువల్లో పూడికను తీస్తున్న శానిటేషన్ సిబ్బంది, దాన్ని పర్యవేక్షిస్తున్న ఎంహెచ్‌వో ఈ భవనం దగ్గరికి వచ్చేసరికి కాలువను పూర్తిగా ఎందుకు మూసేశావని అడగడానికి మాత్రం సాహసించడంలేదు. దీనివల్ల కాలువలో మురుగు ప్రవాహం ఆగిపోతుందని తెలిసినా ఆ పని తమది కాదని, టౌన్‌ప్లానింగ్ అధికారులదేనని సర్దిచెప్ప్పుకుంటున్నారు. కాలువ పారకు అడ్డంగా ఉన్న కట్టడమని తెలిసినా కూడా టౌన్‌ప్లానింగ్ వారికి ఎందుకు సమాచారమివ్వరో అర్థంకాదు. శానిటేషన్ పేరుతో వీరెలా శుభ్రం చేసుకుంటున్నారో, బహుశా టౌన్‌ప్లానింగ్ పేరుతో వారూ అలాగే తింటున్నారని వెసులుబాటు కల్పించినట్టున్నారు. ఈ కథంతా తుమ్మావీధిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెనుక వైపు ప్రధాన రోడ్డుపై కడుతున్న ఒక ఇంటిది (కమర్షియల్ కాంప్లెక్స్). గతంలో ఒక కాలువ ఎత్తుగా నిర్మించారన్న ఫిర్యాదు మేరకు ఇదే వీధిలో ఎంహెచ్‌వోయే దగ్గరుండి ఆ కాలువను తవ్వించేశారు. మరి ఈ ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఆ సమస్య తమ పరిధి కాదని, ప్లానింగ్ సెక్షన్ వారు చూసుకోవాలని శానిటేషన్ అధికారులు పేర్కొనడం దేనికి సంకేతం?
జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలో వార్డు సచివాలయాల్లో ప్లానింగ్ సెక్రటరీలను నియమించినప్ప్పుడు ఎక్కడికక్కడ ఇళ్లు కూల్చేశారు. కారణం.. ప్లాన్‌లో డీవియేషన్ ఉండటమే. కానీ ఇప్ప్పుడీ భవనం ఏకంగా మున్సిపల్ కాలువ, రోడ్లను కూడా ఆక్రమించేసింది. మరి ఇక్కడ ప్లానింగ్ సెక్రటరీ ఎక్కడున్నారో తెలియదు. బహుశా ఆ ఉద్యోగి ద్వారానే మున్సిపల్ కార్యాలయంలో ఉన్న టౌన్‌ప్లానింగ్ ఉద్యోగులకు ఆమ్యామ్యాలు అందివుంటాయి. అందుకే ఎవరూ నోరు మెదపడంలేదు. అసలు రెసిడెన్షియల్ ప్లాన్‌లో కమర్షియల్ బిల్డింగ్ నిర్మించి ఒక ఎత్తయితే, రోడ్డుకు రెండు వైపులా కాలువను ఆక్రమించేసి కార్ పార్కింగ్ కోసం మున్సిపల్ స్థలాన్ని సొంతం చేసుకోవడం కొసమెరుపు. కమిషనర్ కూర్మారావు ఈ ప్రాంతంలో ఒకసారి పర్యటించాలని, ఆక్రమణలు తొలగించాలని స్థానికులు కోరుకోవడంలో తప్ప్పు లేదేమో.






Comments