మూలపేట.. పరిశ్రమల పూదోట!
- DV RAMANA

- 15 hours ago
- 2 min read
తాజాగా గ్రీన్ అమ్మోనియా పరిశ్రమ మంజూరు
ప్రైవేట్‌రంగంలో ఏర్పాటు ఒప్పందంపై సంతకాలు
మార్చి 18న సీఎం చంద్రబాబు శంకుస్థాపన?
ఇప్పటికే అక్కడ తుదిదశలో ఉన్న సీ పోర్టు నిర్మాణం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
ప్రకతి వనరులు ఎన్ని ఉన్నా.. చిన్న చిన్న యూనిట్లు తప్ప ఒకేసారి వేలసంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే భారీ పరిశ్రమలు లేక వలసల జిల్లాగా పేరుపడిన శ్రీకాకుళం జిల్లా దశ మారుతున్నట్లు కనిపిస్తోంది. దశాబ్దాల గ్రహణం తర్వాత జిల్లా రూపురేఖలు మార్చేసేలా ఒక్కొక్క అవకాశం తలుపుతున్నాయి. ఒక భారీ పరిశ్రమ కూడా లేకపోగా ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీ వంటి ఉన్న ఫ్యాక్టరీలు కూడా మూతపడి వెనుకబాటుతనంలో మగ్గిపోతున్న జిల్లాలో గ్రీన్ అమ్మోనియా తయారీకి సంబంధించిన భారీ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జిల్లా అభివద్ధిలో ఒక పెద్ద మైలురాయిగా నిలిచిపోయే ఈ ప్రాజెక్టు ద్వారా క్లీన్, గ్రీన్ ఎనర్జీ రంగానికి ఆంధ్రప్రదేశ్‌ను హబ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కషి చేస్తోంది. ఇప్పటికే కాకినాడలో అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట వద్ద మరో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ నిర్మాణం ఖరారైంది. ఆ మేరకు మంగళవారం అమరావతిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల సమక్షంలో రాష్ట్రానికి చెందిన ఎసఆరఎం యూనివర్సిటీ, ఇండో పోలిష్ జాయింట్ వెంచర్ అయిన విజయవాడకు చెందిన జేకే శ్రీవాస్తవ హెన్‌ఫ్రా పీఎసఏ లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదిరింది. అవగాహన పత్రం(ఎంఓయూ)పై ఇరుపక్షాలు సంతకాలు కూడా చేశాయి. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాలకు అనుగుణంగా మూలపేటలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు ఎంఓయూలో పేర్కొన్నారు. ఈ గ్రీన్ అమ్మోనియా ఫ్యాక్టరీకి వచ్చే నెల 18న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేస్తారని ప్రాథమిక సమాచారం.
గత ఏడాదే ప్రతిపాదన
వాస్తవానికి ఏడాది క్రితమే మూలపేట వద్ద గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు బీజం పడింది. గత ఏడాది మేలో నెదర్లాండ్స్‌లో జరిగిన ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్`2025లో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి భారత్‌కు చెందిన జునో జౌలే గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, జర్మనీ ఎనర్జీ ట్రేడింగ్ కంపెనీ అనుబంధ సంస్థ అయిన సెలక్ట్ న్యూ ఎనర్జీస్ సంస్థలు అప్పట్లోనే ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఏటా మిలియన్ అంటే పది లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేసేలా ఫ్యాక్టరీ నిర్మించాలని నిర్ణయించారు. దాంతోపాటు ఎలక్ట్రోలసిస్ ద్వారా 180 వేల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ కూడా ఉత్పత్తి చేయాలని అనుకున్నారు. ఫ్యాక్టరీ అవసరెÁమైన నీటి వనరుల కోసం సముద్రపు నీటిని మంచినీరుగా మార్చే డీశాలినేషన్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ ఎంవోయూలో సంతకాలు చేసిన సంస్థలు కూడా ఇప్పుడు వేరే సంస్థలు తాజా ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. సంస్థలు మారినా ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదన మూలన పడకుండా రాష్ట్ర ప్రభుత్వం వేరే సంస్థలను రంగంలోకి దించడం, ఒప్పందం కుదుర్చుకోవడం ముదావహం. అన్ని అనుకున్నట్లు జరిగితే 2027`28 ఆర్థిక సంవత్సరంనాటికి ఈ ప్లాంట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
5 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం
మూలపేటలో ఏర్పాటు చేసే ఈ ప్లాంట్ ద్వారా ఏటా ఐదు లక్షల మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ ఉత్పత్తిని అంతర్జాతీయ మార్కెట్లకు ముఖ్యంగా యూరప్ దేశాలకు ఎగుమతి చేయనున్నారు. ఒప్పందం అనంతరం ఎసఆరఎం యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డి.నారాయణరావు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును స్వయంసమద్ధిగా, తక్కువ ఖర్చుతో ఎలక్ట్రోలైజర్స్, అడ్వాన్స్‌డ్ హైడ్రోజన్ స్టోరేజ్ వ్యవస్థల నిర్మాణం, హైడ్రోజన్ శక్తితో కూడిన విమాన ఇంధనాల రీఫ్యూయలింగ్ వ్యవస్థ అభివద్ధిలో తమ యూనివర్సిటీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే మూలపేట పరిసరాల్లో 282 ఎకరాల భూమి కేటాయించిందని వెల్లడించారు. ఈ ప్లాంట్ నిర్మాణానికి దశలవారీగా రూ.పదివేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ప్లాంట్ అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అనేక అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మూలపేటలో గత ప్రభుత్వం చేపట్టిన నౌకాశ్రయం(పోర్టు) నిర్మాణం జరుగుతోంది. దాని సమీప ప్రాంతాల్లోనే కార్గో ఎయిర్‌పోర్టు నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు భారీ గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ వీటికి తోడైతే అటు పలాస నుంచి ఇటు శ్రీకాకుళం వరకు బహుముఖ అభివద్ధికి మార్గం సుగమం అవుతుంది. ఫలితంగా ఇన్నాళ్లూ వెనుకబాటుతనంతో కునారిల్లుతున్న జిల్లా అభివద్ధి వెలుగులు సంతరించుకుంటుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.










Comments