top of page

మీ సంగతేంటి ఆఫీ‘సర్’!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • 2 days ago
  • 3 min read
  • ఏసీబీలో పెద్ద చేపలు లేవా..వారిపై ఫిర్యాదులు లేవా..?

  • హోమ్ గార్డు వద్దే కోట్లలో అక్రమ సంపాదన

  • ఇక అధికారుల స్థాయిలో ఎంత ఉంటుందోనని చర్చ

  • దీన్ని దష్టిలో ఉంచుకునే డిప్యూటేషన్లకు కాలపరిమితి

  • కానీ అది అమలు కాకుండా పైస్థాయిలో మేనేజ్

  • ఏళ్ల తరబడి ఒకేచోట పని చేస్తున్న వారిపై సహజంగానే అనుమానాలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

ఒక సాధారణ హోమ్ గార్డు.. అదీ అవినీతిని అరికట్టే ఏసీబీలో పని చేస్తూ కోట్ల సొమ్ము సంపాదించడం ఎవరికైనా విస్మయం కలిగిస్తుంది. అదే ఆలోచనతో ఏసీబీ అధికారులు తీగలాగితే డొంకంతా కదులుతోంది. అవినీతి నిరోధక శాఖలో 15 ఏళ్లపాటు హోమ్ గార్డుగా పని చేసిన తర్వాత మాతశాఖకు వెళ్లిపోయిన విజయనగరం జిల్లా గుర్లకు చెందిన శ్రీనివాసరావు ఇంటిపై కొద్ది రోజుల క్రితం ఏసీబీ నిర్వహించిన దాడుల్లో కుప్పలు తెప్పలుగా ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. మరింత కూలంకుషంగా సోదాలు చేస్తే ఒక డైరీ దొరికింది. అందులో అనేకమంది సబ్‌రిజిస్ట్రార్ల పేర్లు, వారి ఫోన్ నెంబర్లతోపాటు వారికి హోమ్ గార్డు శ్రీనివాసరావు ఎలా సహకరించాడన్న వివరాలు కూడా ఉన్నాయి. కట్ చేస్తే.. ఏసీబీలో హోమ్ గార్డుగా పని చేసిన వ్యక్తి కేవలం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖకు అంతో ఇంతో సాయం చేసినందుకే అన్ని ఆస్తులు సంపాదిస్తే, ఏళ్ల తరబడి ఏసీబీలో అధికారులుగా పని చేస్తున్నవారి పరిస్థితి ఏమిటి? అనేదే ఇప్ప్పుడు సామాన్య వర్గాల్లో చర్చ సాగుతోంది. నిబంధనల ప్రకారం చూసుకుంటే అది కూడా చీఫ్ ఆఫీస్ ప్రొసీడింగ్స్ (2021`22) ఉత్తర్వుల ప్రకారం పోలీస్ శాఖలో ఎస్సై, ఆ పైస్థాయి అధికారులు మూడేళ్లకు మించి డిప్యుటేషన్ మీద పని చేయడానికి అవకాశం లేదు. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ వంటి క్యాడర్‌లో ఐదేళ్ల వరకు డిప్యుటేషన్ మీద ఏసీబీ లాంటి శాఖల్లో పని చేయొచ్చు. కానీ ఆంధ్రా రీజియన్‌లో అంటే విశాఖపట్నం నుంచి ఏలూరు వరకు ఏసీబీలో అనేకమంది అధికారులు ఈ ప్రొసీడింగ్స్‌కు విరుద్ధంగా ఇప్పటికీ ఏసీబీలో కొనసాగుతున్నారు. అంటే వీరి మీద అవినీతి ఆరోపణలు లేవా? లేక ఏసీబీకి వీరిని మించిన సమర్ధులు దొరకడం లేదా? అన్న ప్రశ్న ఇప్ప్పుడు తలెత్తుతోంది.

అమలుకాని కాలపరిమితి

వాస్తవానికి వేరేవారిని ఆ స్థానంలోకి రానివ్వకుండా అప్పటికే అక్కడ పాతుకుపోయినవారు అడ్డుకుంటున్నారనే కారణంతోనే డిప్యుటేషన్లపై ప్రభుత్వం కాలపరిమితి విధించింది. కానీ ఈ నిబంధన అమలుకాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒక హోమ్ గార్డు స్థాయి ఉద్యోగే ఇంత సంపాదిస్తే.. ఏసీబీలో పని చేస్తున్న సీఐలు, డీఎస్పీలు, ఎస్సైలపై సామాన్యునికి అనుమానం రాకమానదు. అయితే ఆ విభాగంలో నిజాయితీగా పని చేసిన అధికారులూ లేకపోలేదు. ఏసీబీలో పని చేస్తున్న అనేకమంది అధికారులపై పుంఖానుపుంఖాలుగా ఆరోపణలు వస్తుంటాయి. ఇది శ్రీకాకుళమో, విజయనగరమో, విశాఖపట్నానికి మాత్రమో పరిమితమైన వ్యవహారం కాదు. కాకపోతే వీటన్నింటినీ స్టేట్ హెడ్‌క్వార్టర్ స్థాయిలో తొక్కేస్తున్నారన్న ఆరోపణలూ లేకపోలేదు. ఏసీబీలో పని చేసిన తర్వాత ఆరోపణలు లేకపోతే అనుమానించాలి. అలా అని వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టకపోవడం కూడా తప్పే. ఇప్పటికీ పోలీస్ శాఖలో అనేక విభాగాల్లో ఏడేళ్లు దాటి డిప్యుటేషన్‌పై పని చేస్తున్నవారు ఉన్నారు. విజయనగరం ఏసీబీ సీఐ 2017 నుంచి కొనసాగుతుండగా, శ్రీకాకుళం సీఐ 2018 సెప్టెంబరు నుంచి ఇదే పోస్టులో పని చేస్తున్నారు. శ్రీకాకుళం డీఎస్పీగా మొన్నటి వరకు ఇక్కడ పనిచేసి, ప్రస్తుతం విశాఖపట్నం ఏసీబీ డీఎస్పీగా వ్యవహరిస్తున్న అధికారి కూడా 2019 నుంచి ఏసీబీలోనే కొనసాగుతున్నారు. ఇదే కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగుల దగ్గరకొచ్చేసరికి విశాఖపట్నంలో ఏసీబీ తరఫున సొమ్ములు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో ఆంధ్రా రీజియన్‌లో ఉన్న ఏసీబీ కానిస్టేబుళ్లందర్నీ వెనక్కు పంపేశారు. ఇదే స్థాయిలో పై అధికారుల మీద కూడా ఫిర్యాదులు ఉన్నా దాని గురించి మాత్రం ఎవరూ మాట్లాడటంలేదు.

పెద్దచేపలను వదిలేస్తున్నారా?

ఇక ఏసీబీ అధికారులు జరుపుతున్న దాడుల్లో కూడా ఈమధ్య కాలంలో చిన్న చేపలే చిక్కుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు చెప్ప్పుకోదగ్గవి లేవు. బీసీ వెల్ఫేర్ శాఖలో స్కాలర్‌షిప్‌ల కుంభకోణం జరిగితే ఛార్జిషీట్‌లో ఒక ఉద్యోగిని పేరు లేకుండా చేయడానికి ఏసీబీకి పెద్దఎత్తున సొమ్ములు ముట్టజెప్పారన్న ఆరోపణలు వచ్చాయి. వాస్తవానికి స్కాలర్‌షిప్‌ల కుంభకోణం జరగడమే కరెక్టు అయితే ఈ అధికారిణి పాత్ర లేకుండా ఎలా జరిగిందో, దాన్ని ఏసీబీ అధికారులు ఎలా ఎస్టాబ్లిస్ చేశారో ఎవరికీ అర్థం కావడంలేదు. ఇక రవాణా శాఖ కార్యాలయంపై 2007 తర్వాత ఇంతవరకు ఏసీబీ అధికారులు రైడ్ చేయలేదు. 2017 జులైలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇచ్ఛాపురం బోర్డర్ వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టును ఎత్తేశారు. ఆ తర్వాత అక్కడ మిగిలింది ఒక్క రవాణా శాఖ చెక్‌పోస్టే. 2023లో రెండుసార్లు ఏసీబీ అధికారులు ఇక్కడ దాడులు చేసి, ప్రభుత్వానికి చలానా రూపంలో వచ్చిన సొమ్మును కూడా అనధికారికంగా వసూలు చేశారంటూ తీసుకొచ్చేశారు. అందుకు కారణం.. రవాణా శాఖ వద్ద అంకెల లెక్కల్లో తేడా రావడమేనని అప్పట్లో చర్చ సాగింది. రిజిస్ట్రార్ ఆఫీసులఫైన రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు జరిగినప్ప్పుడు ఆ సమాచారాన్ని లీక్ చేయడం ద్వారా విజయనగరానికి చెందిన హోమ్ గార్డు ఆదాయం కూడేసుకున్నారు. అటువంటిది రవాణా శాఖ, 2024 ఫిబ్రవరి 28 వరకు ఉన్న ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు, జిల్లా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు పిల్లల అంబలి సొమ్ముపై కూడా కప్పం వసూలుచేసే హాస్టళ్లు ఉన్నచోట ఏసీబీ అధికారులు సుదీర్ఘ కాలం ఒకేచోట ఉండటం సాధారణంగానే అనుమానాలకు తావిస్తుంది. డిప్యూటేషన్ నిబంధనల అమలులో కిందిస్థాయి ఉద్యోగులకు ఒకలా, అధికారులకు మరోలా వ్యవహరించడం చర్చకు దారితీసింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page