top of page

మన దారి కోసం రాళ్లెత్తిన కూలీలెందరో!

  • Writer: ADMIN
    ADMIN
  • May 23, 2024
  • 2 min read

మంచు కొండల్లో రహదారి నిర్మాణాలు

కేంద్రపాలిత ప్రాంతమైన లడాఖ్‌ లో లేప్‌ా నుంచి నూబ్రా వ్యాలీకి 120 కిలోమీటర్ల దూరం. అయిదు గంటల ప్రయాణం. వేసవిలో కూడా మంచు కప్పుకున్న ఎత్తయిన పర్వతాల మీద, లోయల్లో దారి. ప్రపంచంలోనే వాహనాలు ప్రయాణించే అతి ఎత్తయిన దారి కర్దుంగా పాస్‌ - సముద్ర మట్టానికి 18వేల అడుగుల ఎత్తులో ప్రయాణం దానికదిగా ఒక అద్భుతం. ఆశ్చర్యం. కనువిందు. దక్షిణ భారతం నుంచి వచ్చినవారికి కనుచూపు మేర పరచుకున్న ఈ మంచుబీ ఎముకలు కొరికే చలి ఒక వింత అనుభవం.

కర్దుంగా పాస్‌ దగ్గర కాపలా కాస్తున్న సైనికులతో హైదరాబాద్‌ నుంచి వచ్చాము అని నన్ను పరిచయం చేసుకుని మాట కలిపాను. చలికాలంలో కూడా ఇక్కడ మిలటరీ బేస్‌ ఉంటుందా? అని అడిగితే అప్పుడే కదా ఎక్కువ అవసరం అన్నారు. అప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది? అని అడిగాను. మైనస్‌ 35 డిగ్రీల చలిలో అంతా గడ్డకట్టి ఉంటుంది. పగలు కూడా కంటికి రంగు కళ్లద్దాలు పెట్టుకోకపోతే మంచు మీద ప్రతిఫలించే కిరణాల వెలుగుకు దేన్నీ చూడలేము. ఒక నిమిషంలో కనురెప్పల మీద కూడా మంచు పేరుకుపోతుంది అన్నారు. మా భద్రత కోసం మీరుపడే కష్టానికి ఒక పెద్ద సెల్యూట్‌ అని నమస్కరించాను. ఆ గుంపులో నుంచి ఒక సైనికుడు వచ్చి గట్టిగా కౌగలించుకుని.. ఇది మా విద్యుక్త ధర్మం. దాన్ని గుర్తించి గౌరవించినందుకు ధన్యవాదాలు అన్నాడు.

ఎప్పటి నుంచో సింగిల్‌ రోడ్డుగా ఉన్న దారిని ఇప్పుడు డబుల్‌ రోడ్డు చేస్తున్నారు. దారిపొడవునా ఆ పనులే జరుగుతున్నాయి. అక్టోబర్‌ నుంచి మార్చ్‌ వరకు ఆరు నెలలు విపరీతమైన చలిగాలులు. మంచు కురుస్తూ ఉంటుంది. మైనస్‌ డిగ్రీల వాతావరణం. పగలు కరిగే మంచుతో పాటు కొండల మీది నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు కింద పడుతూ ఉంటాయి. రోడ్డు విస్తరణకు, కనీసం మరమ్మతులకు కూడా అనువుగా ఉండదు. దాంతో ఏప్రిల్‌ నుంచి పనులు మొదలుపెట్టి చేయగలిగినంత సెప్టెంబర్‌ లోపు చేస్తుంటారు. ఒకవైపు లోయ. మరోవైపు రాతి కొండ. ఉన్న సింగిల్‌ రోడ్డు డబుల్‌ రోడ్డు కావాలంటే రాతి కొండను తొలచాలి. పెద్ద పెద్ద డ్రిల్లింగ్‌ వాహనాలు. జేసీబీలు, క్రేన్లు, రాతిని బ్లాస్ట్‌ చేసే ఆధునిక పద్ధతులు.. అలాగని ఉన్న అరకొర దారిని పూర్తిగా మూసివేసి పనులు చేయడానికి వీళ్లేదు. ఎక్కడ డ్రిల్లింగ్‌, బ్లాస్ట్‌ జరుగుతోందో అక్కడ మాత్రమే ఒకటి రెండు కిలోమీటర్లు వాహనాలను ఆపడం, పగిలిన రాళ్లను, మట్టి దిబ్బలను వెంటనే తొలగించి ఆ దారిలోనే వాహనాలను పంపడం. ఇదంతా పల్లపు ప్రాంతాల్లో మామూలు రోడ్డు కార్మికులు చేసే పనులు కావు. భారత రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సరిహద్దు రహదారి సంస్థ (బార్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌) బిఆర్‌వో చేస్తున్న పనులివి.

నలభై, యాభై కిలోమీటర్ల దూరంలో ఒక్క ఊరు ఉండదు. మనిషన్నవాడు కనిపించడు. రాత్రిళ్లు అక్కడే ఉండడానికి వీలుగా ఎక్కడికక్కడ తాత్కాలిక గుడారాలు. ఒడిశా, జార్ఖండ్‌, బీహార్‌, యూపీ, పంజాబ్‌, హర్యానాల నుంచి వచ్చిన వేల మంది కార్మికులు అహోరాత్రాలు పని చేస్తున్నారు. కొట్టిన రాళ్ల మీదే కూర్చుని చేతిలో రొట్టె ముక్క మీద కూరను పెట్టుకుని స్ప్రింగ్‌ రోల్లా చుట్టి తింటున్నారు. మధ్యాహ్నం కునుకు పడితే ఆ బండల మీదే పడుకుంటున్నారు. పగలు కూడా లెదర్‌ జాకెట్లు, మంకీ క్యాప్‌లు, చేతులకు గ్లౌజ్‌ తప్పనిసరి.

దారిపొడవునా రోడ్డు నిర్మాణ కూలీలను చూస్తుంటే కారులో కూర్చున్న నా చెవుల్లో ‘తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు?’ అన్న శ్రీశ్రీ ప్రశ్నే ప్రతిధ్వనిస్తోంది. ఇలాంటి చోట్ల నల్లేరు మీద బండి నడకలా మన హాయి ప్రయాణానికి ఎన్ని కొండలను పిండికొట్టడానికి ఎన్ని గుండెలు ఎంతగా అవిసిపోయాయో! పనుల్లో ఎన్నెన్ని ప్రమాదాల్లో ఎందరు ప్రాణాలు కోల్పోయారో! ఎందరి శ్రమ రక్తం చెమటగా చిందితే ఈ దారులు పరచుకుంటున్నాయో!

‘దారి ఆగిపోయిన దగ్గరే అసలు లడాఖ్‌ మొదలవుతుంది’ అని లడాఖ్‌ వాసులు గర్వంగా చెప్పుకుంటారట. నిజమే. ఇప్పుడంటే ఈ ఆటోమేటిక్‌ డ్రిల్లింగ్‌ వాహనాలు, జేసీబీలు. ఇవేమీ లేని రోజుల్లో చైనా నుంచి యూరోప్‌ వరకు 6,400 కిలోమీటర్ల దూరపు ‘గ్రేట్‌ సిల్క్‌ రూట్‌’ ఉంది కదా! రెండో శతాబ్దం నుంచి పద్నాలుగో శతాబ్దం దాకా వెయ్యేళ్లకు పైగా ఆ సిల్క్‌ దారిలోనే గుర్రాలు, ఒంటెలు, గాడిదల మీద అంతులేని వ్యాపారం జరిగింది కదా! తలచుకుంటేనే నిలువెల్లా పులకించిపోవాల్సిన ఆ శతాబ్దాల సిల్క్‌ దారి ఇప్పుడు ఈ లేప్‌ా - లడాఖ్‌ తారు రోడ్డు కింద మౌన గీతాలు పాడుకుంటూ ఉందేమో!

- పమిడికాల్వ మధుసూదన్

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page