మళ్లీ నిఫా భయాలు!
- DV RAMANA

- 6 days ago
- 3 min read

వాతావరణ మార్పులు మనదేశాన్ని, ప్రపంచాన్ని వ్యాధులమయం చేస్తున్నాయి. మనుషుల్లో రోగనిరోధక శక్తి రోజురోజుకు తరిగిపోతున్నది. ఫలితంగా సాధారణ జలుబు, జ్వరం వంటి రుగ్మతలు కూడా నెలల తరబడి తగ్గకుండా పీడిస్తున్నాయి. మరోవైపు రకరకాల వ్యాధులు ప్రబలుతూ మరణాలకు కారణమవుతున్నాయి. అదే క్రమంలో ఇప్పుడు దేశంలో నిఫా వైరస్ విజంభిస్తోంది. పశ్చిమ బెంగాల్ మరికొన్ని రాష్ట్రాల్లో నిఫా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. దాంతో వైరస్ సోకిన వారితో కలిసి లేదా సమీపంగా ఉంటున్న వారిని, కుటుంబ సభ్యులను కలిపి మొత్తం 100 మందిని క్వారెంటైన్లో ఉంచారు. ఆ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ, ఆందోళన కనిపిస్తోంది. ఆస్పత్రుల్లో ఎక్కడ చూసినా మొబైల్ స్క్రీన్లపై నిపా వైరస్ హెచ్చరికలే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మన దేశంలోని కేరళతోపాటు విదేశాలకే పరిమితం అనుకున్న ఈ మహమ్మారి ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో గత కొద్దిరోజుల్లోనే కనీసం ఐదు నిఫా కేసులు నమోదయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వాధి సోకిన వారిలో డాక్టర్లు, నర్సులు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తున్నది. కోల్‌కతా పరిసర ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ నిఘా పెంచింది. బాధితులతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. హెల్త్ వర్కర్లకే వైరస్ సోకడం వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతోంది. ఎందుకంటే దీనివల్ల వైరస్ మరింత వేగం గా వ్యాప్తి చెందుతుందంటున్నారు. ఆసియా దేశాల్లోని పలు విమానాశ్రయాలకు హెల్త్ అడ్వయిజరీలు జారీ చేశారు. ప్రయాణికులను కోవిడ్ మాదిరి పరీక్షలు చేస్తున్నారు. నిఫా వైరస్ సాధారణంగా కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో తరచూ కనిపిస్తుంటుంది. కేరళ రాష్ట్రంలో దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఆ రాష్ట్రంలో దాదాపు ప్రతి సంవత్సరం ఇదే సమయంలో నిఫా కేసులు నమోదవుతున్నాయి. కోజికోడ్, మలప్పురం వంటి జిల్లాల్లో క్వారంటైన్, లాక్‌డౌన్ తరహా పరిస్థితులు పునరావతమవుతున్నాయి. ఆ రాష్ట్రంలో 2018లో తొలిసారి కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ కేసు నమోదైంది. ఆ తర్వాత 2019, 2021, 2023, 2024, 2025 సంవత్సరాల్లోనూ ఈ కేసులు నమోదయ్యాయి. కోజికోడ్, మలప్పురం, పాలక్కాడ్, ఎర్నాకులం, కన్నూర్, త్రిస్సూర్ జిల్లాలో ఈ కేసులు నమోదవుతున్నాయి. నిఫా వైరస్ నివారణకు నిర్ధిష్టమైన మందులు లేవు. రోగి లక్షణాల ఆధారంగా వైద్యులు ట్రీట్‌మెంట్ ఇస్తారు. రోగికి తగినంత విశ్రాంతినివ్వడం, శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూడటం, శ్వాస ఇబ్బందులు తగ్గించడం వంటివే నివారణోపాయాలని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది. దీనివల్ల మరణాల రేటు సుమారు 40 శాతం నుంచి 75 శాతం వరకు ఉంటుంది. అంటే వైరస్ సోకిన 10 మందిలో నలుగురు నుంచి ఏడుగురు చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రమాదకరమైన వైరస్. ముఖ్యంగా ఫ్రూట్ బ్యాట్స్ (గబ్బిలాలు) ద్వారా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన గబ్బిలాలతోపాటు పందుల ద్వారా కూడా మనుషులకు సోకుతుంది. గబ్బిలాలు కొరికిన పండ్లు ముఖ్యంగా ఖర్జూరాలు, తాటి కల్లు వంటివి తీసుకోవడం వల్ల వైరస్ వ్యాప్తి చెందుతుంది. అలాగే వైరస్ సోకిన వ్యక్తి యొక్క శరీర ద్రవాల(లాలాజలం, రక్తం) ద్వారా కూడా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. వైరస్ సోకిన వ్యక్తికి సమీపంగా ఉండటం వల్ల కూడా వ్యాప్తి చెందుతుంది. వైరస్ సోకిన 4 నుంచి 14 రోజుల్లో లక్షణాలు బయటకు కనిపిస్తాయి. ఇది సాధారణ జ్వరంతో మొదలై ఎన్సిఫిలిటిస్‌కు దారితీస్తుంది. తీవ్రమైన జ్వరం, తలనొప్పి ఉంటుంది. దగ్గు, గొంతు నొప్పితో బాధపడటంతోపాటు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతుంటారు. కండరాల నొప్పులు, వాంతులు ఉంటాయి. వ్యాధి తీవ్రమైతే మెదడు వాపు, మగత కమ్మడం ద్వారా రోగి కోమాలోకి వెళ్లిపోతాడు. చివరికి ప్రాణాంతకంగా మారుతుంది. దీనికి ఇంతవరకు చికిత్స విధానం గానీ.. ముందస్తు నివారణ చర్యలుగా వేసే టీకా మందు గానీ కనుగొనలేదు. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే జునోటిక్ వైరస్‌గా దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్‌వో) ప్రకటించి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌ల జాబితాలో చేర్చింది. ఈ వైరస్ మొదట 1998, 1999 సంవత్సరాల్లో మలేషియా, సింగపూర్ దేశాల్లో పెంపుడు పందుల్లో కనిపించింది. అప్పటినుంచి క్రమంగా వ్యాప్తి చెందుతూ వస్తోంది. దాదాపు ఏడేళ్లుగా మనదేశంలోని కేరళ వంటి రాష్ట్రాల్లో ప్రబలుతున్న ఈ వైరస్ భయంతో చైనా కూడా వణికిపోతోంది. ఇప్పటివరకు ఆ దేశంలో నిఫా కేసులు నమోదు కాకపోయినా భారత్‌లోని పశ్చిమ బెంగాల్‌లో నిఫా కేసులు పెరుగుతుండటం చైనాను ఆందోళనకు గురి చేస్తోంది. ఆ రాష్ట్రంతో నేరుగా సరిహద్దులు పంచుకోకపోయినా నేపాల్ తదితర దేశాల ద్వారా వైరస్ తమ దేశంలోకి చొరబడే ప్రమాదముందని అంచనా వేస్తున్న చైనా ఆరోగ్యశాఖ ఆరోగ్య జాగ్రత్తలు ప్రకటించింది. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ ప్రక్రియ ప్రారంభించి ప్రయాణికులకు స్వాబ్ పరీక్షలు చేస్తున్నారు. అసియా దేశాలైన థాjáYTలాండ్, నేపాల్, మలేషియా, తైవాన్ దేశాల్లోనూ నిఫా స్క్రీనింగ్ టెస్టులు ప్రారంభమయ్యాయి. ఈ వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరిస్తోంది. దీనికి ప్రత్యేకమైన మందు గానీ టీకా గానీ లేని పరిస్థితుల్లో ముందుజాగ్రత్తలే శ్రీరామరక్షగా పేర్కొంటున్నారు. పక్షులు లేదా జంతువులు కొరికిన గుర్తులున్న పండ్లను అస్సలు తిననాదని సూచిస్తున్నారు. ఆ గుర్తులు లేని పండ్లను కూడా బాగా కడిగి, తొక్క తీసి తినాలి. చేతులను క్రమం తప్పకుండా సబ్బుతో కడుక్కోవాలి. ఆస్పత్రులకు వెళ్లేటప్పుడు, అనారోగ్యంతో ఉన్నవారిని పరామర్శించేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న జంతువులకు దూరంగా ఉండాలని హెచ్చరి స్తున్నారు.










Comments