top of page

రూ. 16 కోట్ల సినిమా.. రూ. 2,000 కోట్ల కలెక్షన్లు

  • Guest Writer
  • 14 hours ago
  • 2 min read
  • బాక్సాఫీస్ హిస్టరీని బద్దలు కొట్టిన ‘డియర్ యూ’

  • నో స్టార్స్.. నో ఫైట్స్.. నో విలన్ అయినా వసూళ్ల సునామీ

  • గుండెను పిండేసే ‘వలస’ కథ

  • థియేటర్లలో కన్నీళ్లు పెట్టిస్తున్న సెంటిమెంట్

  • సినిమా కోసం ప్రభుత్వంతోనే ఫైట్

  • సింగపూర్‌లో ప్రేక్షకుల తిరుగుబాటు

  • కలెక్షన్ల వెనుక ‘చైనా’ పొలిటికల్ స్కెచ్ ఉందా?

స్టార్ హీరోలు లేరు... భారీ యాక్షన్ సీన్లు లేవు... కళ్లు చెదిరే గ్రాఫిక్స్ లేవు... ఆఖరికి సినిమాలో విలనే లేడు! అయినా సరే, థియేటర్ల వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తూ, ప్రపంచ సినిమా ఇండస్ట్రీని సైతం నోరెళ్లబెట్టేలా చేస్తోంది ఓ చిన్న చిత్రం. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘డియర్ యూ’ అనే చైనీస్ సినిమా, ఏకంగా రూ.2వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ చరిత్రను తిరగరాస్తోంది.

సినిమా అంటే కేవలం భారీ బడ్జెట్, ఫైట్లు మాత్రమే కాదు... గుండెను హత్తుకునే ‘భావోద్వేగం’ ఉంటే చాలు ప్రపంచం మొత్తం బ్రహ్మరథం పడుతుందని ఈ చిత్రం నిరూపించింది. కేవలం వసూళ్లే కాదు, ఒక దేశంలో ఏకంగా ప్రభుత్వ భాషా విధానంపైనే ప్రేక్షకులు తిరుగుబాటు చేసేలా చేసిన ఈ ‘డియర్ యూ’ లో అసలేముంది? అసలు ఈ సినిమాలో అంతలా కనెక్ట్ అయిన అంశం ఏంటి? ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో మోస్ట్ డిస్కస్డ్ పాయింట్.

సరిహద్దులు దాటిన సెంటిమెంట్.. ‘డియర్ యూ’ బాక్సాఫీస్ జాతర!

ఇది ఒక భావోద్వేగభరితమైన కుటుంబ కథ. దశాబ్దాల క్రితం చైనాలోని తమ పూర్వీకుల గ్రామాన్ని వదిలి, డబ్బు సంపాదించడం కోసం కాంబోడియా, థాయిలాండ్ వంటి దేశాలకు వలస వెళ్లిన తన తాతయ్యను వెతుకుతూ ఒక యువకుడు ప్రయాణమవుతాడు. చైనాలో ఉన్న భార్యకు క్రమం తప్పకుండా ఆయన డబ్బు పంపడం మినహా, ఆ వలస వెళ్లిన వ్యక్తి గురించి ఎవరికీ ఏ సమాచారమూ తెలియదు.

తన తాతయ్య అక్కడ పెద్ద కోటీశ్వరుడై ఉంటాడని, ఆ ఆస్తితో తన ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని ఆశతో థాయిలాండ్ వెళ్లిన ఆ యువకుడికి అక్కడ ఒక చేదు నిజం తెలుస్తుంది. తన తాతయ్య ఎప్పుడో చనిపోయాడని, కానీ ఆయన చేసిన త్యాగం వృధా కాకూడదని ఆయన మహిళా స్నేహితురాలు ఇప్పటివరకు ఆ డబ్బును చైనాలోని భార్యకు పంపిస్తోందని తెలుసుకుంటాడు. చివరికి ఆ ఇద్దరు వృద్ధ మహిళలు కలుసుకునే సీన్ థియేటర్లలో ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టిస్తోంది.

వివాదంగా మారిన ‘భాష’..

ఈ సినిమా సాధించిన కలెక్షన్ల కంటే, ఇది సృష్టించిన భాషా పరమైన చర్చ పెద్ద సంచలనంగా మారింది. ఈ సినిమాను చైనా అధికారిక భాష ‘మాండరిన’లో కాకుండా, అక్కడి ప్రాంతీయ భాషైన ‘టియోచు’లో రూపొందించారు. సింగపూర్ ప్రభుత్వం అక్కడ ఈ సినిమాకు సంబంధించిన ‘మాండరిన’ డబ్బింగ్ వెర్షన్‌కు ఎక్కువ థియేటర్లు కేటాయించి, ఒరిజినల్ ‘టియోచు’ వెర్షన్‌ను తక్కువ షోలతో విడుదల చేసింది. దీనిపై అక్కడి ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఈ సినిమా ఆత్మ దాని మాతృభాషలోనే ఉంది, డబ్బింగ్ చేస్తే ఆ ఎమోషన్ పోతుంది” అంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ థియేటర్ల వద్దకు పోటెత్తారు. ప్రేక్షకుల ఒత్తిడి తట్టుకోలేక కేవలం 10 షోలతో ప్రారంభమైన ఒరిజినల్ వెర్షన్ ప్రదర్శనలను థియేటర్ల యాజమాన్యం ఏకంగా 300 షోలకు పెంచాల్సి వచ్చింది!

‘సాఫ్ట్ పవర్’ రాజకీయ వ్యూహమా?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 6 కోట్ల మంది చైనీస్ వలస ప్రజలను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. అయితే కొందరు రాజకీయ విశ్లేషకులు దీన్ని చైనా ప్రభుత్వం విదేశాల్లో ఉన్న చైనీయుల సానుభూతిని పొందడానికి ప్లే చేసిన ఒక ‘సాఫ్ట్ పవర’ వ్యూహంగా అభివర్ణించారు. కానీ సినిమా లవర్స్ మాత్రం, “ప్రతిదానికీ రాజకీయం పూయకండి, ఇది కేవలం మనసును కదిలించే ఒక అద్భుతమైన చిత్రం మాత్రమే” అని కొట్టిపారేస్తున్నారు.

దర్శకుడు తీసుకున్న బోల్డ్ డెసిషన్, నటీనటుల సహజమైన నటన, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కంటే ఎక్కువగా మాట్లాడే ‘నిశ్శబ్దం’ ఈ సినిమాను ఒక క్లాసిక్‌గా నిలబెట్టాయి. “కథలో నిజాయితీ ఉంటే భాషతో సంబంధం లేకుండా ప్రపంచం మొత్తం బ్రహ్మరథం పడుతుంది” అని ‘డియర్ యూ’ మరోసారి నిరూపించింది.

- సూర్యప్రకాశ్ జోశ్యుల

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page