రిమ్స్‌లో ఓపీ.. రోగం కంటే నరకం!
- BAGADI NARAYANARAO
- 3 days ago
- 2 min read
గంటల తరబడి క్యూలో ఉంటేనే టోకెన్
అభా యాప్‌లో నమోదైతేనే చీటీ
పరీక్షలు ఒకరోజు.. రిపోర్టులు మరో రోజు
పేషెంట్లు పెరుగుతున్నా పెరగని కౌంటర్లు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
రిమ్స్‌లో వైద్యం కోసం వచ్చే రోగులకు ఓపీ కష్టాలు వెంటాడుతున్నాయి. ఓపీ కోసం గంటల తరబడి క్యూలైన్‌లో వేచి ఉండాల్సిన పరిస్థితి రావడం వల్ల వైద్యుడిని కలవడానికి ఒక రోజు, వైద్య, రక్త పరీక్షలు చేయించి వాటి రిపోర్టులను చూపించడానికి మరుసటి రోజు రావాల్సి వస్తుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఓపీలో వైద్యులు అందుబాటులో ఉంటారు. ఆ తర్వాత రోగుల రద్దీని బట్టి కొన్ని విభాగాల్లో వైద్యులు ఉంటారు. వైద్యుడు భౌతికంగా పరీక్షించి, వైద్యపరీక్షలకు సూచిస్తే రెండోరోజు రిపోర్టులు పట్టుకొని రావాల్సి ఉంటుంది. రోగి ఓపీ తీసుకోవడానికి ఆధార్, సెల్‌ఫోన్ తప్పనిసరి చేశారు. రోగి ఓపీ తీసుకోవడానికి ముందు టోకెన్ తీసుకోవాలి. ఆ టోకెన్ ఆధారంగా క్యూలో నిల్చొని కౌంటర్‌లో ఓపీ తీసుకోవాలి. టోకెన్ కోసం ఓపీ వద్ద ఏర్పాటుచేసిన హెల్ప్‌డెస్క్‌లో రోగి వివరాలను నేషనల్ హెల్త్‌మిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న అభా యాప్‌లో నమోదు చేయాలి. నమోదు కోసం రోగి ఫోన్ నెంబర్‌తో పాటు, ఆధార్‌ను ఎంటర్ చేయాలి. రోగి ఫోన్ నెంబర్‌కు ఓటీపీ పంపించి దాన్ని అభా యాప్‌లో నమోదు చేస్తే టోకెన్ జనరేట్ అవుతుంది. ఓటీపీ వచ్చిన వరకు వేచి ఉండాలి. ఓటీపీ రాకుంటే టోకెన్ రాదు. ఒకవేళ సొంత ఫోన్ లేకపోతే హెల్ప్‌డెస్క్ వద్ద ఉన్న సిబ్బంది ఫోన్‌తో ఓటీపీ జనరేట్ చేస్తున్నారు. దీనికి రోగి ఆధార్ తప్పనిసరి. ఫోన్, ఆధార్ లేకపోతే రిమ్స్‌లో వైద్యం చేసుకోవడానికి అనుమతి లేదు. ఈ నిబంధనలను నేషనల్ మెడికల్ కౌన్సిల్ (కేంద్రం) తీసుకువచ్చింది.

రోగులకు ఎదురువుతున్న ఇబ్బందులపై రిమ్స్ అధికారులు జిల్లా ఉన్నతాధికారుల దృష్టకి తీసుకువెళ్లినా పరిష్కారం చూపించలేకపోతున్నారు. దీనికి కారణం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కావడంతో వైద్య కళాశాలలో పీజీ కోర్సుల మంజూరుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అభా యాప్‌లో రోగుల వివరాలు నమోదు తప్పనిసరి చేసింది. రోగులకు ఓపీ ఇబ్బందుల నుంచి బయటపడడానికి మార్గం ఉన్నా నిధులు లేమి కారణంగా రిమ్స్ అధికారులు మిన్నకుంటున్నారు. రిమ్స్ అభివృద్ధి కమిటీ అకౌంట్‌లో నిధుల లేమి కారణంగా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడానికి వీలుకావడం లేదని అధికారులు చెబుతున్నారు. రిమ్స్ ఓపీ కౌంటర్‌లో ప్రస్తుతం ఎనిమిది మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు మాత్రమే ఉన్నారు. రోజు రిమ్స్‌కు వచ్చే రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. సీజన్‌లో ఈ సంఖ్య రోజుకు 1200 దాటుతుంది. సాధారణ సమయంలో ఈ సంఖ్య 800కు తగ్గడం లేదు. వీరందరికీ కొన్ని నిమిషాల సమయంలో ఓపీ చీటి ఇవ్వడానికి డేటా ఎంట్రీ ఆపరేటర్ల సంఖ్య 20కు పెంచాలని ఒక సూచన ఉంది. అయితే కొత్తగా డేటా ఎంట్రీ ఆపరేటర్లను విధుల్లోకి తీసుకుంటే వారికి నెలకు కనీసం రూ.15 వేలు చెల్లించాలి. ఈ మొత్తం చెల్లించే ఆర్ధిక వనరులు రిమ్స్ వద్ద అందుబాటులో లేవు. ప్రభుత్వం దీన్ని మంజూరు చేయదు. దీంతో అదనపు సిబ్బంది నియామకంపై సందిగ్ధత నడుస్తుంది. సిబ్బందితో పాటు కంప్యూటర్లు, ప్రింటర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇంటర్నెట్ సౌకర్యం మెరుగుపర్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం రిమ్స్‌లో ఇంటర్నెట్ సేవలు అంతంత మాత్రమే. ఇంటర్నెట్ సేవలు మెరుగుపర్చాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
ఓపీలో రోగులకు ఎదురవుతున్న సమస్యను కలెక్టర్ రెండుసార్లు స్వయంగా పరిశీలించి ఉన్నతస్థాయి అధికారులతో మాట్లాడినా పరిష్కారం దొరకలేదు. అదనపు సిబ్బందిని నియమిస్తే వేతనాలు సకాలంలో ఇవ్వకపోతే కొత్త సమస్య ఎదురవుతుందని గ్రహించి ఆపరేటర్ల విషయంలో కలెక్టర్ వెనక్కితగ్గారు. ఓపీలో రోగుల గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడకుండా చేయడానికి ఆపరేటర్లు నియామకమే ప్రత్యామ్నాయం. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆదేశాలు తప్పనిసరిగా అమలుచేయాలి కాబట్టి రోగులకు ఇబ్బందులు ఎదురైనా క్యూలైన్‌లో ఉండి ఓపీ తీసుకోవాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. ఓపీ విభాగం వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ల వద్ద ఉన్న సిబ్బంది అందరూ వారి వద్ద ఉన్న సొంత ఫోన్‌లో అభా యాప్‌తో ఓటీపీలను జనరేట్ చేస్తున్నారు. ఓటీపీ జనరేట్ కానప్పుడు మాత్రం రోగులు అసహనం ప్రదర్శిస్తున్నారు. ఫోన్‌లో ఓటీపీ జనరేట్ చేసి టోకెన్ చేతిలో పెట్టిన తర్వాత ఓపీ చీటి కోసం గంటపాటు నిలబడాల్సి వస్తుంది. మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందిస్తే తప్పా ఓపీ విభాగంలో ఓపీ చీటీలు జనరేట్ చేయడం ఇబ్బందిగా ఉందని డేటా ఎంట్రీ ఆపరేటర్లు చెబుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలు తర్వాత వైద్యులు అందుబాటు ఉండరని, గంటలు తరబడి క్యూలో నిలబెడుతున్నారని రోగులు సిబ్బందితో గొడవకు దిగుతున్నారు. క్యూలైన్‌లో రోగులు తరుచూ ఘర్షణ పడుతున్నారు. దీన్ని స్ట్రీమ్‌లైన్ చేయడానికి ప్రత్యామ్నాయం ఆలోచించి అదనంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లను, కంప్యూటర్, ప్రింటర్లను, ఇంటర్నెట్ సేవలను మెరుగుపర్చాలని రోగులు, వారి సహాయకులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.
Comments