రిమ్స్‌లో నిర్లక్ష్యపు ఉక్కపోత
- BAGADI NARAYANARAO

- 1 day ago
- 1 min read
ఎమర్జన్సీ వార్డుల్లో పనిచేయని ఏసీలు
రోగుల సహాయకులతోనే పనులు చేయిస్తున్న దుస్థితి
సమస్యలు పట్టని అధికారుల బాధ్యతారాహిత్యం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్)లో రోగులకు అందుతున్న సేవలు నానాటికీ దిగజారుతున్నాయి. రోజుకు సగటున 300 మంది రోగులు ఇన్‌పేషెంట్స్‌గా చేరుతున్న ఆ ఆస్పత్రిలో సౌకర్యాల పరిస్థితి చూసి ఇక్కడ చేరిన గంటల వ్యవధిలోనే రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిపోతున్నారు. ఓపీ నుంచి టెస్టులు, చికిìత్స వరకు సిబ్బంది నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. పెరిగిన పడకలకు తగ్గట్టుగా మౌలిక సౌకర్యాలు అందుబాటులో లేవు.

ఎమర్జెన్సీ వార్డుల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఎమర్జెన్సీ, ICU వార్డుల్లో ఏసీలు అలంకార ప్రాయంగా మారిపోయాయి. వాటిని రిపేర్ చేయించకపోగా ‘NOT WORKING’ అంటూ వాటిపైనే బోర్డులు పెట్టి అధికారులు బాధ్యతారాహిత్యాన్ని చాటుకున్నారు. అత్యవసర రోగులకు చికిత్స అందించే జనరల్ మెడిసిన్ వార్డులో నాలుగు ఏసీలు ఉన్నాయి. అవి ఆన్ అవుతాయి.. కానీ చల్లదనం రాదు. వీటిలో ఒకదానిపై నాట్‌వర్కింగ్ బోర్డు పెట్టారు.

మిగతా ఏసీలు పనిచేయక నెలలు గడుస్తున్నా మరమ్మతుల ఊసు లేదు. గతంలో చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తే తప్ప వీటికి రిపేర్ చేయనని చెప్పి ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ నిర్మొహమాటంగా చెప్పేశారు. అయితే గతంలో మరమ్మతులు చేసినందుకు బిల్లులు చెల్లించిన 3 రోజుల్లోనే ఏసీలు మళ్లీ రిపేర్‌కు వచ్చాయంటున్నారు. మొత్తానికి ఎమర్జన్సీ వార్డుల్లో ఏసీలు పని చేయకపోవడంతో పలువురు రోగులు డిశ్చార్జ్ తీసుకుని వెల్లిపోతున్నారు.

వార్డుల్లో పడకలపై బెడ్‌షీట్స్‌ను రెండు రోజులకోసారి మారుస్తున్నారు. రోజూ మార్చాలని కోరినా స్పందించడం లేదు. ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యే రోగులను వారి సహాయకులే స్ట్రెచర్లు, వీల్‌ఛైర్లపై టెస్టుల కోసం ఆయా విభాగాలకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఎమర్జన్సీ వార్డుల్లో రోగుల సహాయకులు బెడ్‌షీట్లు వేసిన తర్వాతే సిబ్బంది తీరుబడిగా వచ్చి చికిత్స అందిస్తున్నా రు. డ్రెస్సింగ్ చేసిన తర్వాత బయోవేస్ట్‌ను రోగుల సహాయకులే చెత్తబట్టులో వేయాల్సిన దుస్థితి. సిబ్బంది చేయాల్సిన పనులు రోగుల సహాయకులు ఎందుకు చేయాలని ప్రశ్నిస్తే, సహాయ సిబ్బంది లేరని సమాధానం ఇస్తున్నారు.






Comments