రూ.వెయ్యికి గౌరవం లభిస్తుందా?
- DV RAMANA

- Oct 9, 2025
- 4 min read
ఈపీఎస్`95 పెన్షనర్ల దశాబ్దకాల ఆవేదన
11 ఏళ్ల నుంచి కనీస పెన్షన్‌గా వెయ్యి విదిలింపు
13 లక్షల మంది అందుకుంటున్నది అంతకంటే తక్కువే
దాంతో బతుకులీడ్చలేక ఉసూరుమంటున్న రిటైరీలు
పెంచాలని ఏళ్ల తరబడి మొత్తుకుంటున్నా స్పందన శూన్యం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
పోకిరి సినిమాలో బిచ్చగాడి పాత్రలో ఉన్న అలీకి బ్రహ్మానందం అర్ధ రూపాయి దానం చేసి ‘తీస్కో.. పండగ చేస్కో’.. అని చెబుతాడు. దానికి అలీ స్పందిస్తూ ‘నువ్విచ్చిన అర్థ రూపాయికి ఏం వస్తుందిరా.. కనీసం టీ నీళ్లు కూడా రావు.. మరి దీంతో పండుగ ఎలా చేసుకోమంటావు’.. అంటూ రివర్స్ పంచ్ ఇస్తాడు.
ఈపీఎస్`95 పెన్షనర్ల పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. ఈ స్కీం పరిధిలో ఉన్న లక్షలాది ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల రిటైర్డ్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కనీస పెన్షన్ ఎంతో తెలుసా.. అక్షరాలా వెయ్యి రూపాయలు మాత్రమే. ఉద్యోగ విరమణ అనంతరం ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా శేష జీవితం ప్రశాంతంగా గడిపేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న ప్రభుత్వం జీవితంలో సింహభాగం సేవ చేసిన ఉద్యోగులకు పెన్షన్ పేరుతో విదిలిస్తున్న వెయ్యి రూపాయలతో ప్రశాంతమైన, గౌరవప్రదమైన జీవనం ఎలా సాధ్యమన్నది మాత్రం ఆలోచించడం లేదు. వెయ్యి రూపాయలకు ఈ కాలంలో ఏం వస్తుందని పోకిరి సినిమాలో అలీ మాదిరిగా కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేకపోయినా మనకు మనం ప్రశ్నించుకుంటే.. ఏమీ రాదని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. కానీ ఆ మొత్తంతోనే నెలంతా హాయిగా గడిపేయమని కేంద్ర సర్కారు చెబుతోంది. పదకొండేళ్లుగా ఈ మొత్తాన్ని పెంచమని విశ్రాంత ఉద్యోగులు మొత్తుకుంటున్నా.. తమ సమస్యలు మొరపెట్టుకుంటున్నా ‘ఆర్థిక పరిస్థితి’ అన్ని సాకుతో దాటవేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 10, 11 తేదీల్లో బెంగళూరులో ఈపీఎఫ్‌వో ట్రస్ట్ బోర్డు సమావేశమవుతోంది. ఇందులో కనీస పింఛన్ పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తుండటంతో రిటైర్డ్ ఉద్యోగుల్లో మరోసారి ఆశలు మోసులేస్తున్నాయి.
లక్షలాదిమందికి వెయ్యిలోపే
పత్రికా సంస్థలో పని చేసి రిటైరైన ఒక ఉద్యోగికి ఈపీఎస్`95 కింద అందుతున్న నెలవారీ పెన్షన్ కేవలం రూ.1557. కానీ ప్రస్తుతం మన రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రతినెలా ఇస్తున్న వృద్ధాప్య పింఛనే రూ.4 వేలు. అంటే ఒక రిటైర్డ్ ఉద్యోగికి అందుతున్న పెన్షన్ కంటే దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ. ఇంత తక్కువ మొత్తం తన పెన్షన్ అని చెప్పుకోవడం నామోషీగా భావిస్తున్న ఆ ఉద్యోగి అసలు తనకు పెన్షనే రాదని ఎవరు అడిగినా చెప్పుకొస్తున్నారు. ఆ మొత్తంతో నెలంతా ఒకపూట టిఫిన్ చేయడానికి కూడా సరిపోదు. ఇది ఏ కొద్దిమందికో పరిమితమైన సమస్య కాదు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థల్లో పని చేసి రిటైరైన సుమారు 78 లక్షల మంది దుస్థితి ఇదే. వీరిలో పైన పేర్కొన్న ఉదాహరణలో పేర్కొన్న ఉద్యోగికి అందుతున్నంత మొత్తం కూడా కాకుండా రూ.వెయ్యి మాత్రమే అందుకుంటున్న అభాగ్య పెన్షనర్ల సంఖ్యే ఏకంగా 36 లక్షలు. ప్రభుత్వ, ప్రైవేటు సర్వీసుల్లో పని చేస్తున్న ఉద్యోగులు, శ్రామికులు ఉద్యోగానంతర జీవితం సాఫీగా సాగేందుకు వీలుగా కేంద్రం ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్)ను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని పర్యవేక్షించేందుకు భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో)ను 1950లో ఏర్పాటు చేసింది. నిర్ణీత పరిమితికి మించి ఉద్యోగులు ఉన్న సంస్థలు, పరిశ్రమలు, కార్యాలయాలు ఈపీఎఫ్‌వోలో సభ్యులుగా చేరాలి. తమ ఉద్యోగులనూ చేర్చాలి. ప్రతినెలా వారి జీతాల్లోంచి నిర్ణీత మొత్తాన్ని కట్ చేసి దాన్ని ఈపీఎఫ్‌వోలో సదరు ఉద్యోగి పేరిట జమ చేస్తూ.. దానికి సమానమైన మొత్తాన్ని సంస్థ కూడా ఆ ఉద్యోగి ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఉద్యోగ విరమణ చేసేవరకు ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో చేరిన మొత్తానికి వడ్డీ కలిపి ఇస్తారు. అయితే దీన్ని ఏక మొత్తంగా చెల్లించకుండా ప్రతినెలా ఉద్యోగి ఖాతాలో చేరిన మొత్తంలో మూడో వంతును పెన్షన్ నిధికి జమ చేస్తారు. దాన్నే రిటైర్ అయిన తర్వాత అతని సర్వీసు, చివరి జీతం ఆధారంగా పెన్షన్‌ను లెక్కగట్టి ప్రతినెలా చెల్లిస్తారు. గతంలో ఇదంతా ఏకరీతిలో జరిగేది. కానీ 1995లో అప్పటి ప్రభుత్వం ఈపీఎఫ్‌వో ద్వారా నేరుగా పెన్షన్లకు ఎక్కువ నిధులు వెచ్చించుకుండా తప్పించుకునేందుకు ప్రత్యేక స్కీంను ప్రవేశపెట్టింది. అదే ఈపీఎస్`95 స్కీం. అప్పటినుంచి ఉద్యోగాల్లో చేరిన వారిని దీని పరిధిలో చేర్చి బాధితులుగా మార్చేసింది.
సమస్యల్లో ముంచిన స్కీం
ఈమధ్య కాలంలో కేంద్రం తీసుకొచ్చిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్), గత జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతిపాదించిన గ్యారెంటీడ్ పెన్షన్ స్కీం(జీపీఎస్) లాంటిదే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం(ఈపీఎస్) ఈ స్కీం పరిధిలో ఉన్న ఉద్యోగులు రిటైర్ అయితే వారికి పెన్షన్ లెక్కగట్టే విధానం ఈ స్కీంలో చాలా దారుణంగా ఉంది. పెన్షన్ లెక్కకు ఒక ఫార్ముల ఉంది. ఉద్యోగి చివరి ఆరు నెలల సగటు వేతనం ఇంటూ పెన్షనబుల్ సర్వీస్ బై 70 అనే సూత్రం ఆధారంగా పెన్షన్ ఖరారు చేస్తారు. ఈ ఫార్ములాలో చివరి ఆరునెలల సగటు వేతనం అని పేర్కొన్నా.. దాంతో పని లేకుండా గరిష్టంగా రూ.15వేలనే సగటు వేతనంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. అలాగే ఈపీఎస్`95 స్కీంలో కనీస పెన్షన్ రూ.వెయ్యిగా నిర్ణయించారు. దీనివల్ల రెండు విధాలుగా విశ్రాంత ఉద్యోగులు నష్టపోతున్నారు. ఆరు నెలల సగటు వేతనం రూ.15 వేలకు మించి ఉన్నవారు కటాఫ్ కారణంగా అదనపు ప్రయోజనాలు కోల్పోతున్నారు. మరోవైపు కనీస పెన్షన్ మొత్తం రూ.వెయ్యిగా నిర్ణయించినా.. వాస్తవానికి అంతకంటే తక్కువ పెన్షన్ అందుకుంటున్నవారు పెద్దసంఖ్యలోనే ఉన్నారు. రూ.700 లోపు పెన్షన్ అందుకుంటున్నవారు 13 లక్షల మంది వరకు ఉండటం గమనార్హం.
నిధుల కొరత సాకు
ఈపీఎస్`95 సభ్యులకు పెన్షన్ పెంచడానికి నిధుల కొరతను కేంద్రం సాకుగా చూపిస్తూ వస్తోంది. కానీ ఆ వాదనలో వాస్తవం లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈపీఎఫ్ పింఛన్ పథకంలో 5.39 కోట్ల మంది ఉద్యోగులు సభ్యులుగా ఉండగా.. వారిలో పెన్షనర్ల సంఖ్య 81 లక్షలు మాత్రమే. ఈ ఏడాది మార్చి 31 నాటికి పెన్షన్ పథకంలో ఉన్న మొత్తం రూ.9,92,689 కోట్లని స్వయంగా కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఆ మధ్య పార్లమెంటులో తెలిపారు. ఇందులో పెన్షన్ల రూపంలో ప్రతి యేటా వెచ్చిస్తున్న మొత్తం రూ.23,027 కోట్లు(2.59 శాతం) మాత్రమే. పైగా పెన్షన్ నిధి ఏటా వడ్డీ రూపంలో సుమారు రూ. 58,668 కోట్లు వచ్చి చేరుతున్నాయి. పెన్షన్లుగా చెల్లిస్తున్న మొత్తం కంటే ఇది రెట్టింపు కంటే ఎక్కువే. గత ఆర్థిక సంవత్సరం లెక్కలే తీసుకుంటే.. పెన్షన్ నిధికి రూ. 71,780.41 కోట్లు జమ కాగా.. పెన్షన్లకు ఖర్చు చేసింది రూ.23,410 కోట్లు మాత్రమే. ఈ గణాంకాలను పరిశీలిస్తే కనీస పెన్షన్ పెంపునకు నిధులు లేవన్నది కేవలం సాకు మాత్రమేనని అర్థమవుతుంది.
ఏళ్ల తరబడి ఎదురుచూపులు
ఈపీఎస్`95 కనీస పెన్షన్ మొత్తాన్ని చివరిసారి 2014లో రూ.వెయ్యికి పెంచారు. అంతే అప్పటినుంచి ఆ ఊసు లేదు. ఈ పదకొండేళ్లలో జీవన వ్యయం ఎన్నో రెట్లు పెరిగిపోయింది. నిత్యావసరాల నుంచి వృద్ధులు అధికంగా వాడే మందుల వరకు అన్నింటి ధరలు లెక్కలేనంతగా పెరిగిపోయాయి. కనీస్ పెన్షన్‌గా ఇస్తున్న రూ.వెయ్యితో 2015 ప్రాంతంలోనే పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు. అలాంటిది ప్రస్తుత జీవన వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటే వెయ్యి రూపాయలు ఎందకూ కొరగాదు. ఈ పరిస్థితుల్లో కనీస పెన్షన్ మొత్తం పెంచమని దేశవ్యాప్తంగా పెన్షనర్ల సంఘాలు రాష్ట్రాల నుంచి ఢల్లీిస్థాయి వరకు ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించారు. కేంద్ర ఆర్థికమంత్రితో సహా కనిపించిన మంత్రులందరికీ వినతిపత్రాలు ఇచ్చి పెంచండి మహాప్రభో అని మొత్తుకున్నారు. అయితే ఈరోజు వరకు ఫలితం కనిపించలేదు. నరేంద్ర మోదీ ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి కనీస పెన్షన్ పెంచుతారని, రూ.7 వేలు.. కాదు కాదు రూ.9వేలు చేస్తారని భజనపరుల ప్రచారాలు హోరెత్తినా మోదీ మహాశయుడు స్పందించనేలేదు. ఈపీఎస్`95 కింద హయ్యర్ పెన్షన్ చెల్లించాలని 2022 నవంబర్ 4న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అది కూడా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. ఏదో ఒక వంకతో హయ్యర్ పెన్షన్‌ను దాట వేస్తున్న పాలకులు.. ఇక కనీస పెన్షన్ డిమాండ్‌ను పట్టించుకుంటారనుకోవడం అత్యాశే అవుతుంది. కేంద్ర కేబినెట్, ఈపీఎఫ్‌వో ట్రస్ట్ బోర్డు సమావేశాలు జరగడానికి ముందు ప్రతిసారీ కనీస పెన్షన్ పెంచుతారన్న కుక్‌డ్ కథనాలు రావడం.. అవి చూసి పెన్షనర్లు ఆశగా ఎదురుచూడటం.. చివరికి ఉసూరుమనడం షరామామూలైపోయింది. మరి ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం.










Comments