top of page

లిటిల్‌ హార్ట్స్‌.. జాలీ రైడ్‌

  • Guest Writer
  • Sep 5, 2025
  • 4 min read

సోషల్‌ మీడియాలో ఫన్నీ మీమ్‌ వీడియోలు చేస్తూ పాపులర్‌ అయిన కుర్రాడు.. మౌళి. అతను ఓ కీలక పాత్ర చేసిన ‘నైంటీస్‌ మిడిల్‌ క్లాస్‌’ తనకు మంచి పేరే తెచ్చిపెట్టింది. ఇప్పుడతను హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ చిత్రమే.. లిటిల్‌ హార్ట్స్‌. ‘నైంటీస్‌’ సిరీస్‌ దర్శకుడు ఆదిత్య హాసన్‌ ప్రొడ్యూస్‌ చేసిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు సాయి మార్తాండ్‌ రూపొందించాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

అఖిల్‌ (మౌళి) బొటాబొటి మార్కులతో ఇంటర్‌ పాసైన కుర్రాడు. అతణ్ని సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ గా చూడాలన్నది తన తండ్రి కల. కానీ అఖిల్‌ కు చదువు మీద పెద్దగా ఆసక్తి ఉండదు. ఎంసెట్లో ర్యాంకు సంగతి పక్కన పెడితే కనీసం క్వాలిఫై కూడా కాని అతను తండ్రి బలవంతం మీద లాంగ్‌ టెర్మ్‌ కోచింగ్‌ చేరతాడు. అక్కడ అయిష్టంగా చదువు సాగిస్తున్న సమయంలో కాత్యాయని (శివాని నగరం) ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతణ్ని ఇష్టపడుతుంది. కాత్యాయని తండ్రి బలవంతం మీద ఎంబీబీఎస్‌ సీటు కోసం దండయాత్రలు చేస్తుంటుంది కానీ.. ఆమెకూ ఆ చదువు మీద ఆసక్తి ఉండదు. అఖిల్‌ అంటే కాత్యాయనికి ఇష్టమున్నా.. తనను ప్రేమించడానికి ఓ పెద్ద అడ్డంకి ఉంటుంది. అదేంటి.. దాన్ని దాటి ఇద్దరూ ప్రేమించుకున్నారా.. అదే జరిగితే తల్లిదండ్రులేం చేశారు.. వీరి చదువులెలా సాగాయి.. వీరి జీవితాలు చివరికి ఏ మలుపు తిరిగాయి అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

గత కొన్నేళ్లలో తెలుగు సినిమాల్లో ‘బిందాస్‌’ కథల ఊపు పెరిగింది. వాటిలో కథ మీద బుర్రలు బద్దలు కొట్టేసుకోవడం ఏమీ ఉండదు. చాలా సింపుల్‌ లైన్‌ తీసుకుంటారు. ఫన్నీ సిచువేషన్లు క్రియేట్‌ చేస్తారు. ట్రెండీ డైలాగులుంటాయి. ఏ పాత్రా సీరియస్‌ గా అనిపించదు. అన్నీ ఒక సింక్‌ లో సాగిపోతుంటాయి. అల్లరల్లరి చేస్తుంటాయి. సెంటిమెంట్లు.. ఎమోషన్లకు ఎక్కడా ఛాన్సే ఉండదు. ఎంత సీరియస్‌ సిచువేషనైనా నవ్వించడమే ధ్యేయంగా సాగుతాయి సన్నివేశాలు. ఇందులో అసలేం స్టోరీ ఉంది?.. సినిమాలో సీరియస్నెస్‌ ఎక్కడ? పాత్రలు ఇంత ఇర్రెస్పాన్సిబుల్‌ గా ఉన్నాయేంటి? అని ప్రశ్నలు రేకెత్తిస్తూనే.. వినోదపు మాయలో అవన్నీ మరిచిపోయేలా చేస్తాయి ఆ చిత్రాలు. ఒక జాతిరత్నాలు.. ఒక మ్యాడ్‌.. ఒక ఆయ్‌.. ఒక సింగిల్‌.. ఈ కోవలో వచ్చిన కొత్త చిత్రమే.. లిటిల్‌ హార్ట్స్‌. కొంచెం లోతుగా ఆలోచిస్తే.. సొసైటీ కోణంలో చూస్తే ఇది యువత మీద ఇలాంటి సినిమాలు చూపించే ప్రభావం గురించి కొంచెం ఆందోళన కలుగుతుంది కానీ.. అవన్నీ పక్కన పెట్టి కేవలం ఎంటర్టైన్మెంట్‌ కోణంలో చూస్తే మాత్రం రెండు గంటల పాటు నాన్‌ స్టాప్‌ గా నవ్వుకోవడానికి ‘లిటిల్‌ హార్ట్స్‌’లో ఢోకా లేదు.

సోషల్‌ మీడియా భాషలో చెప్పాలంటే.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ ఇది ఒక ‘నిబ్బా-నిబ్బి’ సినిమా. ఎంసెట్‌ లాంగ్‌ టెర్మ్‌ కోచింగ్‌ తీసుకుంటూ.. తల్లిదండ్రులు-టీచర్లకు మస్కా కొట్టి చదువుకోవడం తప్ప అన్నీ చేసే అబ్బాయి- అమ్మాయి మధ్య నడిచే కథను ఇందులో చూపించారు. ఆ వయసులో లవ్వేంటి.. ఇందులో పరిణతి ఏముంటుంది.. ఇలాంటి కథలతో సినిమాలు తీసి ఏం సందేశం ఇస్తారు.. అంటే సమాధానం చెప్పడం కష్టం. కానీ వినడానికి చాలా సాధారణంగా అనిపించే.. అసలు కథే లేదనిపించే పాయింట్‌ మీద రెండు గంటలకు పైగా బోర్‌ కొట్టించకుండా కామెడీ పండిరచిన తీరుకు మాత్రం ఫిదా అవ్వాల్సిందే. సినిమా మొత్తంలో బోరింగ్‌ అనిపించే ఒక్క సన్నివేశం కూడా ఇందులో లేదు. పాటల్లో సైతం కడుపుబ్బ నవ్వించేలా వాటిని డిజైన్‌ చేసిన తీరుకు కొత్త దర్శకుడు సాయి మార్తాండ్‌ ను అభినందించాల్సిందే. ఈ దర్శకుడే కాదు.. హీరో మౌళి కూడా మీమ్స్‌ బ్యాగ్రౌండ్‌ నుంచి వచ్చిన వాళ్లే. ఇక ‘నైంటీస్‌’ సిరీస్‌ తో వినోదాన్ని పండిరచడంలో తనదైన ముద్ర వేసిన ఆదిత్య హాసన్‌ నిర్మాతగా వీళ్లిద్దరికీ అండగా నిలిచారు. ఈ ముగ్గురూ కలిసి ఈ సోషల్‌ మీడియా కాలంలో యూత్‌ అభిరుచులకు తగ్గట్లుగా ప్రతి సన్నివేశాన్నీ వినోదాత్మకంగా మలిచి గిలిగింతలు పెట్టేశారు.

‘లిటిల్‌ హార్ట్స్‌’లో హీరోయిన్‌ పుట్టిన రోజుకు ఏం గిఫ్ట్‌ ఇవ్వాలా అని ఆలోచించి.. ఆమె కోసం తనలోని టాలెంట్లన్నీ బయటపెడుతూ.. హీరో సొంతంగా ఒక వీడియో సాంగ్‌ రూపొందిస్తాడు. దానికి హీరో.. మ్యూజిక్‌ డైరెక్టర్‌.. కొరియోగ్రాఫర్‌.. అన్నీ అతడే. యువ ప్రేక్షకులకు ఆ ఒక్క పాట.. దానికి అనుబంధంగా వచ్చే సన్నివేశాలు చాలు.. టికెట్‌ డబ్బులు గిట్టుబాటు అయిపోవడానికి. ఇదొక్కటే కాక సింపుల్‌ గా.. సిల్లీగా అనిపిస్తూనే ప్రేక్షకుల ముఖాల్లో చిరునవ్వులు చెరగనీయకుండా చేసే బోలెడన్ని సీన్లున్నాయి ‘లిటిల్‌ హార్ట్స్‌’లో. మామూలుగా కాలేజీ లవ్‌ స్టోరీల్లో బాగా చదువుకునే అమ్మాయి.. చదువు రాని అబ్బాయి మధ్య కథలు అల్లుతుంటారు. కానీ ఇందులో అబ్బాయి.. అమ్మాయి ఇద్దరూ మొద్దులే కావడం వెరైటీ. ఇలాంటి ఇద్దరి మధ్య పరిచయం.. వారి మధ్య ఆకర్షణ.. అంతలో వారి ఓ అడ్డంకి.. దాన్ని దాటేలోపు తల్లిదండ్రుల వైపు నుంచి వచ్చే అడ్డంకులు.. ఇలా ఒక సగటు టీనేజీ ప్రేమకథలో ఏం చూస్తామో అవే ఇందులోనూ చూస్తాం. కథ పరంగా కొత్తగా ఏమీ ఉండదు. చెప్పుకోదగ్గ ట్విస్టులుండవు. తర్వాతేం జరుగుతుందో అనే క్యూరియాసిటీ ఉండదు.

కానీ ఎక్కడా కథ సీరియస్‌ టోన్లోకి మారకపోవడం.. సిచువేషన్‌ సీరియస్‌ అయినా కూడా అందులోనూ వినోదం పండిరచడానికి ప్రయత్నించడం ‘లిటిల్‌ హార్ట్స్‌’ను జాలీ రైడ్‌ గా మారుస్తుంది. ఇటు మౌళి.. అటు హీరో పక్కనుండే ఫ్రెండు.. పోటాపోటీగా ఎంటర్టైన్‌ చేస్తూ సాగిపోతారు. మిగతా పాత్రలు కూడా వినోదాన్ని పంచడంలో తమ వంతు పాత్ర పోషించాయి. ఎక్కువగా చనిపోయే పాత్రలు వేస్తాడని పేరున్న రాజీవ్‌ కనకాల సైతం ఇందులో ప్రేక్షకులను నవ్వించాడంటే ‘లిటిల్‌ హార్ట్ష్‌’ నడత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఐతే యువత మీద ఇలాంటి సినిమాలు ఎలాంటి ఇంపాక్ట్‌ చూపుతాయనే ఆందోళన మాత్రం కొంతమేర ‘లిటిల్‌ హార్ట్స్‌’ రేకెత్తిస్తుంది. వేరే సినిమాలైతే ఓకే కానీ.. ఈ కథ నడిచేదే చదువు చుట్టూ. నీ మనసుకు నచ్చిందే చదవమంటూచిన్న మెసేజ్‌ జోడిరచి మేకప్‌ చేయడానికి ప్రయత్నించినప్పటికీ.. చాలా వరకు సినిమా ఇర్రెస్పాన్సిబుల్‌ వేలోనే నడుస్తుంది. దీన్ని మనసుకు తీసుకోకుంటే మాత్రం ‘లిటిల్‌ హార్ట్స్‌’ ఒక జాలీ రైడే.

నటీనటులు- పెర్ఫార్మెన్స్‌:

మౌళి అంటే చాలామందికి ఇప్పటికీ మీమరే. చిన్న వయసులోనే ఎంతో క్రియేటివ్‌ గా చేసిన వీడియోలతో ఆకట్టుకున్న ఈ కుర్రాడు.. తాను నటించిన తొలి ఫీచర్‌ ఫిలింలో ఇచ్చిన పెర్ఫామెన్స్‌ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎక్కడా హీరో అనిపించడు కానీ.. ఈ సినిమాను భుజాల మీద మోసింది అతనే. అతను కనిపిస్తే చాలు.. ప్రేక్షకుల ముఖాల్లో నవ్వు పులుముకుంటుంది. అంతగా తన నటనతో.. హావభావాలతో అతను అలరించాడు. ఒక ఇర్రెస్పాన్సిబుల్‌ ఇంటర్‌ నిబ్బా అంటే ఇలాగే ఉంటాడు అనిపించేలా ఆ పాత్రలో అతను భలేగా ఒదిగిపోయాడు. హీరోయిన్‌ శివాని నగరం కూడా తన పాత్రకు బాగా సూటయింది. బాగా పెర్ఫామ్‌ చేసింది. ప్రోమోలు చూసి మౌళి పక్కన ఈ అమ్మాయి పెద్దగా ఉన్నట్లుందే అనుకుంటాం. కానీ కథ పరంగా అది బాగానే కుదిరింది. రాజీవ్‌ కనకాల.. ఎస్‌.ఎస్‌.కాంచి తండ్రుల పాత్రలో బాగా చేశారు. నవ్వించారు. సత్యకృష్ణ.. అనిత చౌదరి కూడా ఆకట్టుకున్నారు. హీరో ఫ్రెండుగా నటించిన కొత్త కుర్రాడు అదరగొట్టేశాడు. మౌళికి దీటుగా అతను నవ్వించాడు. వీళ్లిద్దరి పాత్రలు ‘ప్రేమలు’ చిత్రంలో హీరో.. తన ఫ్రెండును గుర్తు చేస్తాయి. ఒకప్పటి చైల్డ్‌ ఆర్టిస్టు నిఖిల్‌ అబ్బూరి పర్వాలేదు. అతడికి పెద్దగా స్కోప్‌ లేకపోయింది.

సాంకేతిక వర్గం - పనితీరు :

‘లిటిల్‌ హార్ట్స్‌’కు సింజిత్‌ ఎర్రమిల్లి మ్యూజిక్‌ పెద్ద అసెట్‌. పేలిపోయే పాటలు లేవు కానీ.. ట్రెండీ లిరిక్స్‌.. సరదాగా అనిపించే కంపోజిషన్‌ తో పాటలు సినిమాకు ప్లస్‌ అయ్యాయి. బీజీఎం కూడా హుషారుగా సాగింది. సూర్య బాలాజీ ఛాయాగ్రహణం కూడా ఓకే. నిర్మాణ విలువల్లో పరిమితులు తెరపై కనిపిస్తాయి. సినిమాలా కాక యూట్యూబ్‌ లో వచ్చే వెబ్‌ సిరీస్‌ ల లుక్‌ ఇందులో కనిపిస్తుంది. సినిమాను తక్కువ బడ్జెట్లో లాగించేశారు కానీ.. వినోదం వల్ల అది పెద్ద సమస్యగా అనిపించదు. సాయి మార్తాండ్‌ కు ఇది తొలి సినిమా అయినా.. ఎక్కడా తడబాటు కనిపించలేదు. ఈ తరం యువత ఎలాంటి వినోదం కోరుకుంటారో.. సోషల్‌ మీడియా ట్రెండ్స్‌ ఎలా ఉన్నాయో అతను ఔపాసన పట్టేసినట్లున్నాడు. మీమ్స్‌ బ్యాగ్రౌండ్‌ నుంచి వచ్చిన అనుభవాన్ని సినిమాలో చూపించాడు. పెద్దగా కథలేని.. కొత్తదనం కనిపించని సినిమాలో.. ఫన్నీ సిచువేషన్లు క్రియేట్‌ చేయడంతో పాటు ట్రెండీ డైలాగులు రాసి యువత కోరుకునే వినోదాన్ని అందించాడు.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో..

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page