top of page

వృక్ష బంధు.. హిమబిందు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 4 hours ago
  • 3 min read
  • మిద్దెతోటల పెంపకంలో విశేష కషి

  • ఇంటినే నందనవనంగా మార్చేసిన ఘనత

  • లాక్‌డౌన్ కాలంలో అధ్యయనంతో అవగాహన

  • కూరగాయల సాగుతో స్వయం సమద్ధి

  • రాష్ట్రస్థాయిలో గుర్తింపు సాధించిన సిక్కోలు వనిత

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

కొన్ని అనుభవాలు చాలా భయంకరంగా ఉంటాయి. కానీ వాటిలో కొన్ని కొత్త జీవిత పాఠాలు నేర్పుతుంటాయి. జీవన గమనాన్ని మార్చి మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తుంటాయి. కోవిడ్ సంక్షోభంనాటి పరిస్థితులే దీనికి ఉదాహరణ. నాడు ఎంతోమంది జీవితాలనే కాకుండా ఆప్తులను, ఆస్తులను కోల్పోయారు. కానీ అదే సమయంలో కోవిడ్ లాక్‌డౌన్ పరిస్థితులు ఎంతోమందికి కొత్త ఉపాధి మార్గాలు తెరిచాయి. విభిన్న వ్యాపకాలు సష్టించి ఆదాయమార్గాలు పెంచాయి. అలా కోవిడ్ కష్టకాలాన్ని ఒక అవకాశంగా, ఆరోగ్య వనరుగా మలచుకున్న వారిలో నేతాడ హిమబిందు ఒకరు. శ్రీకాకుళానికి చెందిన ఈమె పెరటి తోటలు(టెర్రస్ గార్డెనింగ్) లేదా పెరటి తోటల పెంపకంపై కోవిడ్ సమయంలో ఓనమాలు దిద్దడం మొదలుపెట్టి నేడు రాష్ట్రస్థాయిలో అవార్డులు అందుకునే స్థాయికి ఎదిగారు. తమ ఇంటిని పచ్చని నందనవనంగా మార్చేశారు. తాజాగా రాష్ట్రస్థాయిలో మిద్దెతోట పురస్కారం అందుకున్న హిమబిందు తోటి మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కలెక్టరేట్ సమీపంలోని సీబీ రోడ్డులో నివాసం ఉంటున్న హిమబిందు ప్రస్తుతం గహిణిగా ఉన్నప్పటికీ గతంలో హెచ్‌డీఎఫ్‌సీలో పని చేసేవారు. ఆమె భర్త నేతాడ ప్రభాకర్‌రావు ఎస్బీఐ లైఫ్‌లో సీనియర్ ఏజెన్సీ మేనేజర్‌గా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఇద్దరూ చిన్నవారే.

కోవిడ్ గుణపాఠం

ప్రశాంతంగా జీవిస్తున్న ఈ చిన్న కుటుంబంలో ఆరేళ్ల క్రితం దాడి చేసిన కోవిడ్ మహమ్మారి అలజడి రేపింది. హిమబిందు, ప్రభాకర్‌రావు దంపతులిద్దరూ దాని బారినపడి అతికష్టం మీద బయటపడ్డారు. అప్పుడే ఆరోగ్య సంరక్షణపై హిమబిందుకు ఆసక్తి కలిగింది. అదే సమయంలో లాక్‌డౌన్ కారణంగా ఖాళీ ఉంటూ కాలక్షేపం కోసం యూట్యూబ్ చూస్తూ టెర్రస్ గార్డెనింగ్, పెరటితోటల పెంపకానికి సంబంధించి సంబంధించిన వీడియోలు చూసి ఆ వ్యాపకంపై ఆసక్తి పెంచుకున్నారు. ఇంటి ఆవరణలోనే మొక్కలు పెంచడం వల్ల ఆరోగ్యకరమైన వాతావరణం కూడా ఉంటుందని భావించి అటువైపు దష్టి సారించారు. ఇందుకు భర్త ప్రోత్సాహం, ఇద్దరు పిల్లల సహకారం కూడా తోడైంది. పిల్లల అవసరాలకు తగినవిధంగా సమయాన్ని అడ్జస్ట్ చేసుకుంటూనే.. వారిని కూడా మొక్కల పెంపకం, సంరక్షణలో భాగస్వాములను చేశారు. వీరి ఇల్లు పాతకాలం నాటిది కావడం కూడా కొంత కలిసివచ్చింది. ఇంటి ముందు, వెనుక, పైన, చుట్టూ ఖాళీస్థలం ఉండటంతో వాటన్నింటినీ రకరకాల మొక్కలకు ఆవాసాలుగా మార్చేశారు.

సీటీజీ గ్రూప్ సహకారం

ఆ క్రమంలో హిమబిందు దష్టిని సీటీజీ(సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్) అనే సంస్థ ఆకర్షించింది. నగరాల్లో మిద్దెతోటలతో నింపడమే లక్ష్యంగా పని చేస్తున్న ఈ సంస్థలో శాకాహారం, ఆర్గానిక్ ఉత్పత్తులపై ఆసక్తి ఉన్నవారు సభ్యులుగా చేరుతుంటారు. శ్రీకాకుళం సీటీజీ గ్రూప్‌కు అడ్మిన్‌గా ఉన్న పేర్ల అనురాధ గ్రూపు సభ్యులను సమన్వయం చేస్తూ అభివద్ధిపథంలో నడుపుతున్నారు. మూడు నెలలకోసారి సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తూ మొక్కల పెంపకంపై సభ్యులకు అవగాహన కల్పిస్తుంటారు. అదే సమయంలో సభ్యులు తమ అనుభవాలతోపాటు తాము పండించే ఉత్పత్తులను, విత్తనాలను పంచుకోవడం ద్వారా పరస్పరం సహకరించుకుంటుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ గ్రూపు గురించి తెలుసుకున్న హిమబిందు అందులో చేరారు. ఇందులో చేరిన తర్వాత మిద్దెతోటల గురించి తాను చాలా నేర్చుకున్నానని ఆమె చెబుతుంటారు. అదేవిధంగా వృక్ష 360 అనే డిజిటల్ యాప్‌లో కూడా సభ్యురాలిగా చేరారు. శ్రీకాకుళం జిల్లాకే చెందిన సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ యాప్ ద్వారా చెట్ల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ అంశాలపై అవగాహన కల్పిస్తుంటారు. ఇవే అంశాల్లో సభ్యులకు పాయింట్లు ఇచ్చి ఎక్కువ పాయింట్లు సాధించినవారిని గుర్తింపు పత్రాలతో ప్రశంసిస్తుంటారు. ఇందులో కూడా హిమబిందు సభ్యురాలిగా చేరి అవగాహన పెంచుకున్నారు.

చుట్టుపక్కల ఇళ్లకు వారి కూరగాయలే

మొదట ఆకుకూరల పెంపకంతో మొదలైన హిమబిందు వ్యాపకం క్రమంగా రకరకాల కూరగాయల పెంపకం వరకు విస్తరించింది. చాలావరకు ఆర్గానిక్ పద్ధతుల్లోనే ఆమె మిద్దెతోటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం హిమబిందు ఇంటి ఆవరణలో 30 రకాల పంటలు సాగు చేస్తున్నారు. వీటిలో ఆకుకూరలతోపాటు వంకాయలు, బెండకాయలు, టమోటో, మిర్చీ వంటివి ఉన్నాయి. క్రమంగా ప్రతి కాయగూరలో ఉండే ప్రత్యేక రకాలను కూడా పండించడం ప్రారంభించారు. అనంతరం తీగజాతి అంటే బీర, బెండ వంటి వాటి సాగు చేపట్టారు. పొట్ల, బీర, గుత్తి బీర, ముల్లంగి, ఎర్ర ముల్లంగి, కాకర వంటివి కూడా ఆ ఇంట్లో పండుతున్నాయి. ఇక పుష్ప జాతులకు చెందిన కలువ, వాటర్‌లిల్లీస్ తదితర రకాల ప్లాంట్లు ఉన్నాయి. ఇంట్లో పండే కూరగాయలు తమ కుటుంబానికి వారంలో ఐదురోజులకు సరిపోగా.. ఇంకా చుట్టుపక్కల ఇళ్లవారికి ఉచితంగా ఇస్తుంటామని హిమబిందు చెప్పుకొచ్చారు. తమ ఇంట్లో పెంచే దొండ రకం గ్రూపులో తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిందని ఆమె చెప్పారు. ఈ ఒక్క పంటే వారానికి ఐదు కేజీల దిగుబడినిస్తుందని వివరించారు. ఆక్సిజన్ అందించే పలు రకాల మొక్కలు కూడా పెంచుత్నుట్లు వివరించారు. కాగా పంటల సాగుకు పూర్తి సేంద్రీయ పద్ధతులు అవలంభిస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజు వంటింట్లో వచ్చే వ్యర్థాలను వేపపిండితో కలిపి ఎరువుగా వాడుతున్నారు. బియ్యం కడిగిన నీళ్లను పులియబెట్టి మొక్కల మొదళ్లలో పోస్తుంటారు. ఆవుపేడ, అరటితొక్కలను కూడా ఎరువుగా వాటి మంచి ఫలితాలు సాధిస్తున్నారు.

కృషికి తగిన గుర్తింపు

మిద్దెతోటల పెంపకంలో చేస్తున్న కృషికి గర్తింపుగా హిమబిందు పలు అవార్డులు అందుకుంటున్నారు. 2025లో విశాఖలో నిర్వహించిన విశాఖ ఆర్గానిక్ మేళా, సిక్కోలు హరిత త్సవంలో ఉత్తమ మిద్దెతోటల పెంపకందారు అవార్డులు అందుకున్నారు. కాగా కొద్దిరోజుల క్రితం గుంటూరులో రైతునేస్తం ఫౌండేషన్ నుంచి ‘తుమ్మేటి రఘోత్తమరెడ్డి రైతునేస్తం మిద్దెతోట పురస్కారం’ అందుకున్నారు. ఆ సంస్థ దశమ వార్షికోత్సవం సందర్భంగా ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదుగా హిమబిందు ఈ అవార్డు అందుకున్నారు. 2025 సంవత్సరానికి గాను ఈ అవార్డుకు రాష్ట్రవ్యాప్తంగా 30 మందిని ఎంపిక చేయగా.. శ్రీకాకుళం జిల్లా నుంచి హిమబిందు ఒక్కరే ఆ పురస్కారం అందుకోవడం విశేషం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page