వాడకం మితిమీరితే ప్రాణభక్షణే!
- DV RAMANA

- Jan 1
- 2 min read

కాలం మారుతున్న క్రమంలో ఆ మార్పులకు అనుగుణంగా మన జీవితాలను కూడా మెరుగులు దిద్దుకోవాల్సి ఉంటుంది. దీనికి ఒక కాలప్రమాణంగా ఏడాదికాలం నిలుస్తుంది. అందుకే పాత సంవత్సరం ముగిసి కొత్త వత్సరాదిలోకి ప్రవేశించే సమయంలో ప్రతి ఒక్కరూ తమ జీవితాలకు సంబంధించి కొత్త లక్ష్యాలు నిర్దేశించుకునే తరుణంగా కొత్త ఏడాదిని పరిగణిస్తారు. ఈ ఏడాది నుంచి జీవితంలోకి కొత్తదనాన్ని ఆహ్వానించాలని, ఆరోగ్యంగా జీవించాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షించడం సహజం. ఈ కొత్త లక్ష్యాల్లో మరో ప్రత్యేక అంశాన్ని చేర్చుకోవాల్సిన అవసరాన్ని ఒక ప్రఖ్యాత శాస్త్రవేత్త గుర్తుచేస్తున్నారు. గుర్తు చేయడం కంటే హెచ్చరిస్తున్నారని చెప్పడం సబబుగా ఉంటుందేమో! ఎందుకంటే ఆయన ప్రస్తావించిన అంశంలోని సీరియస్‌నెస్ అటువంటిది మరి. ఆరోగ్యకరమైన సమాజం గురించి అందరూ మాట్లాడుతుంటారు. దాని గురించే ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయోగాలు చేస్తూ ఎన్నో ఆవిష్కరణలు చేస్తుంటారు. కానీ మానవ జీవనశైలి నిరంతరం మారుతున్న క్రమంలో కొత్త వైరస్‌లు, వ్యాధులు పుట్టుకొచ్చి.. ప్రపంచాన్ని సవాల్ చేస్తున్నాయి. ఇవన్నీ వచ్చీపోయేవే అనుకుంటే మానవాళిని వేధిస్తున్న ఒక సమస్య యాంటీబయోటిక్ మందుల అతి వినియోగం. అయినదానికీ కానిదానికీ యాంటీబయోటిక్స్‌ను విచక్షణారహితంగా వాడేస్తుండటం వల్ల మానవ శరీరం, దానికి సోకే వైరస్‌లు వాటికి అలవాటు పడిపోతున్నాయి. ఇది పరాకాష్టకు చేరి ఎన్ని యాంటీబయోటిక్ మందులు వాడినా జ్వరాలు, వ్యాధులు లొంగిరాని పరిస్థితి ఏర్పడుతోంది. యాంటీ బయోటిక్స్ ఎక్కువగా వాడకూడదని అందరికీ తెలుసూ, డాక్టర్లు కూడా సలహా ఇస్తుంటారు. కానీ దాన్ని ఆచరణలో పెట్టడంలోనే విఫలమవుతున్నాం. కొత్త ఏడాదిలోకి ప్రవేశించిన సందర్భంగా యాంటీ బయోటిక్స్ వినియోగాన్ని కనీస స్థాయికి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని సాక్షాత్తు తొట్టతొలి యాంటీ బయోటిక్ మందు అయిన పెన్సిలిన్‌ను కనుగొని కోట్లాది ప్రాణాలు కాపాడిన అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మనకు లేఖ రాస్తే.. అది కూడా హెచ్చరికతో కూడిన లేఖ అయితే మన స్పందన ఎలా ఉంటుందో ఆలోచించాలి. కొన్ని దశాబ్దాల క్రితమే ఈ లోకాన్ని వీడిన ఫ్లెమింగ్ ఇప్పుడు లేఖ రాశారనడం వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా.. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ‘యాంటీబయోటిక్ రెసిస్టెన్స్’ (ఏఎంఆర్) ముప్పును కళ్లకు కట్టేందుకు ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ రంగారెడ్డి బుర్రి వినూత్న ప్రయత్న ఫలితమే ఈ లేఖ. ఫ్లెమింగ్ పేరిట రంగారెడ్డి రాసిన ఊహాత్మక లేఖ ప్రస్తుతం వైద్య వర్గాల్లో, సామాన్యుల్లో ఆలోచన రేకెత్తిస్తోంది. యాంటీబయోటిక్స్‌ను విచ్చలవిడిగా వినియోగిస్తే మొదటికే మోసం వస్తుందని నాడే ఫ్లెమింగ్ హెచ్చరించారు. ఇప్పుడే అదే నిజమవుతుండటంతో ఆయన పేరుతో రంగారెడ్డి రాసిన లేఖ వైద్యశాస్త్ర రంగాన్ని ఆలోచింపజేస్తోంది. 1928లో పెన్సిలిన్ ఆవిష్కరణ వైద్యరంగంలో ఒక విప్లవం. దానికి కొన్నేళ్ల తర్వాత 1945లోనే ఫ్లెమింగ్ ఒక నిషుర సత్యాన్ని చెప్పారు. ‘అవగాహన లేకుండా పెన్సిలిన్‌తో ఆటలాడేవాడు భవిష్యత్తులో ఆ మందు పనిచేయక చనిపోయే మరో మనిషి ప్రాణానికి నైతికంగా బాధ్యుడవుతాడు’ అని హెచ్చరించారు. ఆనాటి ఆయన మాటలను గుర్తుచేస్తూ.. నేడు డాక్టర్లు, ప్రజలు చేస్తున్న తప్పుల వల్ల బ్యాక్టీరియా ఎలా బలపడుతుందో వివరించారు. మనం వాడే యాంటీబయోటిక్స్‌కు బ్యాక్టీరియా అలవాటుపడిపోయి ఇక ఆ మందులు పనిచేయని స్థితికి (ఏఎంఆర్) చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ఆయన నిత్య మహమ్మారిగా అభివర్ణించారు. దీనికి సంబంధించిన గణాంకాలు కూడా భయపెట్టేలానే ఉన్నాయి. గ్లోబల్ రీసెర్చ్ ఆన్ యాంటీ మైక్రోబియాల్ రెసిస్టెన్స్ (గ్రామ్) ప్రాజెక్ట్ విశ్లేషణ ప్రకారం.. ఒక్క 2021 సంవత్సరంలోనే యాంటీబయోటిక్స్ పనిచేయక ప్రపంచవ్యాప్తంగా 11.4 లక్షల మంది చనిపోయారు. ఇప్పటికైనా మేల్కొనకపోతే 2050 నాటికి మరో 3.9 కోట్ల మంది ఈ మహమ్మారికి బలయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా భారత్‌లో జలుబు, జ్వరం వంటి చిన్న రుగ్మతలకు కూడా ఓవర్ ది కౌంటర్ (డాక్టర్ చీటీ లేకుండా) మందులు కొని, వాడేయడం, వ్యవసాయంలో రసాయనాల వినియోగం ఈ ముప్పును అంతకంతకూ పెంచుతున్నదని లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో కొత్త ఏడాదిలో మనం తీసుకోవాల్సిన అసలైన నిర్ణయం ‘యాంటీబయోటిక్స్ దుర్వినియోగాన్ని అరికట్టడమేనని ఫ్లెమింగ్ లేఖలో పిలుపునిచ్చారు. డాక్టర్ సలహా లేనిదే ఏ మందులూ వాడవద్దని, వైరస్ వల్ల వచ్చే జలుబు, దగ్గులకు యాంటీబయోటిక్స్ పనిచేయవని, అనవసరంగా వాటిని వాడటం ఆపేయాలని డాక్టర్ రంగారెడ్డి చెప్పారు. ఇందుకోసం రెడ్‌లైన్ క్యాంపెయిన్ చేపట్టాలని, మందుల అట్టపై ఎరుపు రంగు గీత ఉంటే అది డాక్టర్ సలహా లేనిదే వాడకూడదని గుర్తించాలని సూచించారు. ఫార్మా కంపెనీల వ్యర్థాలు, వ్యవసాయంలో రసాయనాలు నదుల్లో కలవకుండా చూడాలి. తన ఆవిష్కరణను వృథా చేయవద్దంటూ.. మనం మారకపోతే రేపు సాధారణ ఇన్‌ఫెక్షన్లు కూడా మరణ శాసనాలుగా మారతాయని, శస్త్రచికిత్సలు చేయడం అసాధ్యమవుతుందని ఫ్లెమింగ్ పేరుతో రాసిన లేఖ ముగింపులో రంగారెడ్డి హెచ్చరించారు. మితిమీరిన యాంటీబయోటిక్స్ వాడకాన్ని ఆపాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు స్పందించిన డాక్టర్ రంగారెడ్డి బుర్రి ఈ వినూత్న ఆలోచన చేశారు. పెన్సిలిన్ సృష్టికర్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ బతికి ఉంటే ప్రస్తుత పరిస్థితిపై ఏ విధంగా సందేశం ఇచ్చేవారో ఊహిస్తూ ఈ లేఖను రాసి విడుదల చేయడం విశేషం. ఇందులోని సీరియస్‌నెస్‌ను, ముంచుకొస్తున్న ముప్పును గుర్తించి ప్రతి ఒక్కరూ యాంటీబయోటిక్స్ అతి వినియోగాన్ని తగ్గించి అప్రమత్తంగా వ్యవహరించాలి. అధికారులు సైతం యాంటీబయోటిక్స్ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడాల్సి ఉంది.






Comments