విద్వేష ప్రసంగాన్ని స్పష్టంగా నిర్వచించాలి!
- Guest Writer
- 4 hours ago
- 2 min read
హేట్ స్పీచ్‌ల నియంత్రణకు ఉన్న చట్టాలు చాలు
తాజా తీర్పులో స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
కానీ స్పష్టమైన నిర్వచనం లేక గందరగోళం
ఇదే చట్టం అమల్లో అసమానతలకు కారణం

దేశంలో హేట్ స్పీచ్ ధోరణి.. అంటే విద్వేషపూరిత, రెచ్చగొట్టే లేదా దూషించే ప్రసంగాలు, వ్యాఖ్యానాలు ఎంతగా పెరిగిపోతున్నాయో.. వాటని చట్టపరంగా నియంత్రించడం కూడా అంతే కష్టంగా మరిపోతున్నది. ఇటువంటి అసభ్య ప్రసంగాలను నిరోధించేందుకు, శిక్షలు విధించేందుకు భారత రాజ్యాంగ పరిధిలో ఉన్న అవకాశాలు, పరిమితులు, అవి ఉపయోగపడుతున్న తీరుపైనే ప్రస్తుతం దేశవ్యాప్త చర్చ జరుగుతున్నది.
శాసన వ్యవస్థ పరిధి
ప్రస్తుతానికి భారత శిక్షాస్మృతి (భారతీయ న్యాయ సంహిత - బీఎనఎస్)లోని 153ఎ, 295ఎ సెక్షన్లు విద్వేషపూరిత ప్రసంగాలను నియంత్రిస్తున్నాయి. అయితే ‘హేట్ స్పీచ’కు స్పష్టమైన నిర్వచనం ఇస్తూ ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన బాధ్యత శాసనసభపై ఉంది. ప్రజల ఆకాంక్షలు, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత శాసనవ్యవస్థదే.
న్యాయస్థానాల పాత్ర
శాసన వ్యవస్థలు చేసే చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయో లేవో చూడటం.. అవి అమలయ్యేలా పర్యవేక్షించడం, అమలులో లోపాలను సరిదిద్దడం న్యాయస్థానాల బాధ్యత. రాజ్యాంగంలోని అధికరణ 19(1)(ఎ) ప్రకారం పౌరులకు వాక్ స్వాతంత్య్రం ఉంది. అయితే అది దుర్వినియోగమయ్యే పరిస్థితుల్లో 19(2) అధికరణ కింద హేతుబద్ధమైన పరిమితులు విధించవచ్చు. ఈ పరిమితులు సరైనవో కావో కోర్టులు నిర్ణయిస్తాయి. ఇలాంటి వ్యవహారాలకు అమిత్ షా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా లేదా తెహసీన్ పూనావాలా వంటి కేసుల్లో సుప్రీంకోర్టు నిర్ణయాలు మార్గదర్శకంగా నిలుస్తాయి. అయితే అనేక సందర్భాల్లో హేట్ స్పీచ్ వంటి వివాదాస్పద అంశాలపై నిర్ణయాలు తీసుకోవడంలో శాసన, న్యాయవ్యవస్థల మధ్య సమన్వయం లోపించి ఘర్షణ పరిస్థితి తలెత్తుండటం తెలిసిందే. ఈ గందరగోళాన్ని, ఉద్రిక్తతలను, వ్యవస్థల మధ్య ఘర్షణాత్మక వైఖరిని నివారించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు, పరిమితులు విధించాల్సి ఉంటుంది.
-ప్రస్తుత చట్టాల్లో విద్వేషపూరిత ప్రసంగం (హేట్ స్పీచ్) అనే పదానికి న్యాయపరంగా కచ్చితమైన నిర్వచనం లేదు. దీనిపై స్పష్టమైన నిర్వచనం ఇస్తూ చట్టం చేస్తే.. ఏది విమర్శో, ఏది విద్వేషమో స్పష్టత వస్తుంది. చర్యలు తీసుకోవడం సులభం అవుతుంది.
-భారత న్యాయ(లా) కమిషన్ తన 267వ నివేదికలో విద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టడానికి ప్రత్యేకంగా చట్ట సవరణలు చేయాలని సూచించింది. చట్టసభలు ఈ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుంటే మరింత బలమైన చట్టం రూపొందుతుంది.
`నేరం జరిగిన తర్వాత, నిందితులను పట్టుకున్న తర్వాత కోర్టులు ¹ తీర్పులిస్తాయి లేదా మార్గదర్శకాలు ఇస్తాయి. కానీ ముందస్తు నియంత్రణ (ప్రివెన్షన్), శిక్షలను నిర్దేశించడం, వాటి అమలుకు పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించడం శాసనవ్యవస్థ చేస్తుంది. అయితే కొత్త చట్టాలు చేసేటప్పుడు పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లకుండా చూడటం పెద్ద సవాలుగా మారుతోంది. దానికి కారణాలు పరిశీలిస్తే..
-ప్రజాప్రతినిధులు చట్టసభల ద్వారా చట్టాలు చేసినా వాటిని అమలు చేయాల్సింది కార్యనిర్వాహక వ్యవస్తే. కానీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా విద్వేషపూరిత ప్రసంగాల విషయంలో చట్టాల అమల్లో నిష్పాక్షికత సాధ్యమా అన్నదే పెద్ద ప్రశ్న. అధికారంలో ఉన్నవారు తమ ప్రత్యర్థులపై కక్ష సాధింపునకు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసుకునే అవకాశం ఉంది.
`విద్వేష ప్రసంగానికి స్పష్టమైన హద్దులు గీయడం కష్టం. ఒకరికి అది ‘అభిప్రాయం’గా తోచవచ్చు.. అదే మరొకరికి విద్వేషంగా కనిపించవచ్చు. ఈ అభిప్రాయభేదం వాక్ స్వాతంత్య్రాన్ని హరించే ప్రమాదం ఉంది.
-సామాజిక మాధ్యమాల ద్వారానే ప్రస్తుతం ఎక్కువగా విద్వేషం వ్యాప్తి చెందుతున్నందున భౌతిక ప్రసంగాల నియంత్రణతోపాటు డిజిటల్ మాధ్యమాల్లో జరిగే విద్వేష ప్రచారాలను కట్టడి చేయడానికి కూడా చట్టాలు అవసరం. అయితే చట్టాలు ఎన్ని చేసినా పౌరుల్లో అవగాహన, సామాజిక చైతన్యం కొరవడితే మాత్రం వాటిని అమలు చేయడం కష్టసాధ్యం.
సుప్రీంకోర్టు నిరాకరణ
అయితే ఈ వాదనలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోకపోవడం విచారకరం. విద్వేషపూరిత ప్రసంగాల అడ్డుకట్టకు దేశంలో ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోతాయని అంటూ ఈ అంశంపై అదనపు ఆదేశాలు జారీ చేయడానికి బుధవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టంలోని లోపాలను, అమలుతీరును కోర్టులు సమీక్షించగలవే తప్ప శాసన నిర్మాణ వ్యవస్థల్లోకి చొరబడలేవని స్పష్టంగా పేర్కొంది. బీఎనఎసఎస్ కింద ఉన్న శాసనబద్ధ యంత్రాంగం క్రిమినల్ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడానికి ఒక సమగ్ర మార్గాన్ని అందిస్తుందని ధర్మాసనం తీర్పు చెప్పింది. కొత్త చట్టాలు చేయాలా వద్దా.. చేస్తే ఎలా రూపొందించాలి అనే నిర్ణయం చట్టసభల పరిధిలోనే ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లేదా భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (డీఎనఎసఎస్)`2023 ప్రకారం నేరం జరిగినప్పుడు ఎఫఐఆర్ నమోదు చేయడం పోలీసుల బాధ్యత అని ధర్మాసనం పేర్కొంది. అది నమోదు కాని సందర్భాల్లో బాధితుడు సీఆర్‌పీసీ సెక్షన్ 154(3) కింద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ను నేరుగా లేదా ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా సంప్రదించవచ్చు. కోర్టు వ్యాఖ్యలను చూస్తే చట్టం లేకపోవడం కాదని, దాన్ని సరిగ్గా అమలు చేయకపోవడమేనని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మారుతున్న సవాళ్లకు అనుగునంగా విధానపరమైన మార్పులు చేసే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని కోర్టు చెప్పింది. ప్రసార మాధ్యమాలు, సామాజిక వేదికల ద్వారా మతపరమైన కథనాలను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైన పలు పిటిషన్లను విచారించిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
- నౌపడ సత్యనారాయణ






Comments