top of page

వ్యాపార కేంద్రంలో చీకటి తెరలు

  • Writer: SATYAM DAILY
    SATYAM DAILY
  • 2 days ago
  • 1 min read
  • ప్రధాన రహదారి సహా వీధుల్లో అంధకారం

  • పడకేసిన మెజారిటీ వీధి దీపాలు

(సత్యంన్యూస్, నరసన్నపేట)

మధ్యలో రెండు రోజులు వదిలేస్తే.. మÖడోరోజు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నరసన్నపేట నియోజకవర్గ కేంద్రంలో అడుగు పెడుతున్నారు. ఇందుకోసం తెలుగుదేశం శ్రేణులు అప్ప్పుడే జనసమీకరణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. మరోవైపు జిల్లా కలెక్టర్ దినకర్ పుండ్కర్ ఏకంగా అక్కడే మకాం వేసి మొత్తం పారిశుధ్య పనులను, పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కట్ చేస్తే.. నరసన్నపేట మండల కేంద్రం చీకట్లో దేవులాడుతోంది. బహుశా ముఖ్యమంత్రి పగటిపూట పర్యటిస్తారు కనుక చీకటితో పని లేదని వదిలేశారేమో గానీ మెయిన్ రోడ్డుతో సహా పట్టణంలో ఎక్కడా వీధి దీపాలు వెలగడంలేదు. శ్రీకాకుళం డివిజన్‌లో నరసన్నపేట వ్యాపార రాజధాని. 25 కిలోమీటర్ల లోపే జిల్లా కేంద్రం ఉన్నా నరసన్నపేట మార్కెట్ టర్నోవర్ శ్రీకాకుళంలో కనపడదు. అలాంటి నియోజకవర్గ కేంద్రంలో వీధి దీపాలు 90 శాతం పైగా వెలగడంలేదంటే ఆశ్చర్యం. పల్లిపేట జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు సెంటర్ లైటింగ్ రూపంలో 110 విద్యుత్ స్తంభాలు ఉన్నాయి. వీటిలో 90 వీధి లైట్లు వెలగడంలేదు. మిగిలిన 20 లైట్లే ఈ రెండు కిలోమీటర్లకుపైగా దారికి దిక్కు. ఇక మారుతీనగర్, బర్మాకాలనీ, గాంధీనగర్, జగన్నాథపురంతో పాటు అనేక ప్రాంతాల్లో వీధి దీపాలు ఒక్కటి కూడా దారి చూపడంలేదు. కలెక్టర్ ఎలాగూ నియోజకవర్గ రూపురేఖలు మారేవరకు అక్కడి నుంచి కదలనని ప్రకటించారు కాబట్టి వీధి దీపాల సమస్యపై కూడా దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page