విశాఖ రాజకీయం.. వివేకా తిరుగుపయనం!
- NVS PRASAD

- 3 days ago
- 2 min read
వెలగపూడి కాదన్నందునే రద్దయిన జీవో
విశాఖలో చక్రం తిప్పిన మరో ఏసీపీ
సొంత సామాజికవర్గానికి చెందిన అధికారినే నియమించారన్న లీడర్ పత్రిక

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)శ్రీకాకుళం డీఎస్పీగా విశాఖ హార్బర్‌కు బదిలీపై వెళ్లిన గంటల వ్యవధిలోనే మళ్లీ వెనక్కు వచ్చిన సీహెచ్ వివేకానంద కథలో విశాఖ రాజకీయాలే ప్రధాన కారణమని తెలుస్తుంది. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, దక్షిణ ఎమ్మెల్యే వంశీకష్ణ శ్రీనివాస్ వివేకానంద రాకను స్వాగతించినా, మరో ఎమ్మెల్యే వెలగపూడి రామకష్ణబాబు కాదనడంతోనే వివేకానందను మళ్లీ వెనక్కు పంపారని తెలుస్తుంది. విశాఖపట్నం నుంచి వెలువడే లీడర్ సాయంకాల పత్రిక కూడా శుక్రవారం ఇదే విషయాన్ని పబ్లిష్ చేసింది. విశాఖపట్నం ఎంపీ భరత్, వెలగపూడి రామకష్ణబాబు ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడంతో పాటు ఒకే తాటి మీద నడుస్తున్నందున అదే సామాజికవర్గానికి చెందిన ఐ.చిట్టిబాబును హార్బర్ డీఎస్పీగా తెచ్చుకున్నారని, దీనిపై ప్రభుత్వం కూడా మారు మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందని లీడర్ పత్రిక పేర్కొంది. విశాUలో వెలగపూడి రామకష్ణ బాబే సీనియర్ ఎమ్మెల్యే. ఈయన స్థానికేతరుడైనా ప్రజల్లో బలమైన మాస్ ఫాలోయింగ్ ఉండటం వల్ల ప్రభుత్వ వ్యతిరేక గాలిలో కూడా గెలుస్తున్నారు. ఎంపీగా భరత్ మొదటిసారి గెలవడంతో పాటు స్థానికంగా పట్టు కోసం వెలగపూడితో కలిసి నడవాల్సిన పరిస్థితి. ఇదే వెలగపూడికి విశాఖలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న ఒక ఏసీపీ చేతిలోనే పోలీస్ పరిపాలన ఉందని, వివేకా విశాఖ రావడం ఆయనకు ఇష్టం లేకపోవడం వల్లే చిట్టిబాబును అక్కడకు తీసుకువచ్చి వివేకాను మళ్లీ వెనక్కు పంపారని లీడర్ కథనంలో ప్రధాన సారాంశం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నా, లేకపోయినా వెలగపూడి రామకష్ణబాబు అక్కడ గెలుస్తున్నారు. అయినా ఏరోజూ మంత్రి పదవి రేసులో ఉన్నారని గాని, మరో రాష్ట్రస్థాయి పదవి కావాలని గాని ఆయనెప్ప్పుడూ అడిగినట్లు ఏ పత్రికలోనూ కథనాలు రాలేదు. కానీ విశాUలో వెలగపూడి ఏం చెబితే, అది తెలుగుదేశం నాయకులు చేయడానికి సిద్ధంగా ఉంటారన్న మాట మాత్రం వాస్తవం. సీహెచ్ వివేకానంద మాజీ డీజీపీ సహకారం మేరకు విశాఖపట్నం హార్బర్‌కు బదిలీ చేయించుకున్నారు. ఇందుకోసం ఇటు జిల్లాలో మంత్రులను, అటు విశాఖలో ఎమ్మెల్యేలను ఆయన ఒప్పించగలిగారు. వాస్తవానికి పంచాయతీ ఎన్నికల వరకైనా వివేకానంద ఇక్కడ ఉంటారని రాజకీయ నాయకులు భావించారు. ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి కూడా అనేక విచారణలు డివిజన్‌కు సంబంధం లేకుండా వివేకానందకు అప్పగించారంటే, ఆయన పనితీరు మీద నమ్మకమే. ఆయన కూడా వివేకా బదిలీ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసినా ఇంత త్వరగా వెళ్లరనే భావించారు. కానీ చాలా రోజుల నుంచి ఖాళీగా ఉన్న హార్బర్ ఏసీపీ పోస్టుకు ఇప్ప్పుడు కాకపోతే మరెప్ప్పుడూ బదిలీ కాలేమని భావించిన వివేకానంద దాని కోసం తీవ్రంగా ప్రయత్నించి జీవో తెచ్చుకున్నారు. అంతవరకు హార్బర్ ఏసీపీ పోస్టు కోసం పట్టించుకోని వైజాగ్ నేతలు వివేకా వస్తున్నారనగానే తుళ్లిపడ్డారు. అలా అని వివేకా కనపడని నాలుగో సింహం నేనే అంటూ నిలబడిపోయే మనిషి కాదు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఎమికబుల్‌గా వ్యవహరిస్తారనే పేరుంది. కానీ అక్కడ కూటమి ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తున్న ఒక పోలీస్ అధికారికి, వివేకాకు మధ్య ఎక్కడో, ఎప్ప్పుడో తేడా కొట్టిందని, అందుకే ఈయన బదిలీ చేయించుకున్న ప్లేస్‌కే చిట్టిబాబును తీసుకువచ్చి వేశారని పోలీసు వర్గాలు చెప్ప్పుకుంటున్నాయి. వాస్తవానికి చిట్టిబాబుపై కూడా ఎక్కడా ఆరోపణలు లేవు, పైగా సౌమ్యుడనే పేరు కూడా ఉంది. బహుశా కులం కోణం, వివేకా కంటే మరింత ఎమికబుల్‌గా ఉంటారనే కారణంతో ఆయన్ను రాజకీయ నాయకులు హార్బర్ ఏసీపీగా తెచ్చుకొని ఉంటారు.










Comments