విశాఖ స్టేషన్‌కు అభివృద్ధి అమృతం
- DV RAMANA

- 2 days ago
- 2 min read
రూపురేఖలు మారిపోనున్న రైల్వేస్టేషన్
అమృత్‌భారత్ పథకం కింద రూ.466 కోట్లు
అదనంగా ఆరు ప్లాట్‌ఫారాల నిర్మాణం
ఎయిర్‌పోర్టుల స్థాయిలో ఆధునిక సౌకర్యాలు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ఏకైక పెద్ద నగరంగా ఉన్న విశాఖపట్నం రైల్వేస్టేషన్ రూపురేఖలు సమూలంగా మారిపోతున్నాయి. అమృత్ భారత్ పథకంలో భాగంగా పలు రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తున్న రైల్వే శాఖ ప్రస్తుతం తూర్పుకోస్తా రైల్వే జోన్ పరిధిలో ఉన్న వాల్తేర్(విశాఖ) రైల్వే స్టేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. అంతర్జాతీయ నగరంగా విశాఖ ఎదుగుతున్న క్రమంలో రైల్వే అవసరాలు కూడా బాగా పెరిగాయి. ప్రయాణికులతో పాటు సరుకు రవాణా ట్రాఫిక్ శరవేగంగా పెరుగుతోంది. దాంతో ఈ రైల్వేస్టేషన్‌ను పూర్తిగా ఆధునికీకరించాలని రైల్వేశాఖ నిర్ణయించి, అమృత్‌భారత్ పథకంలో చేర్చింది. ఈ పథకం కింద రూ.466 కోట్లు ఒక్క విశాఖ స్టేషన్ అభివృద్ధికే వెచ్చిస్తున్నారు. ఈ స్టేషన్‌లో ప్రస్తుతం ఎనిమిది ప్లాట్‌ఫారాలు ఉండగా.. మరో ఆరు కొత్త ప్లాట్‌ఫారాలు నిర్మిస్తున్నారు. దాంతో మొత్తం ప్లాట్‌ఫారాల సంఖ్య 14కు పెరుగుతుంది. వీటితోపాటు కనీస సౌకర్యాలు, లాంజ్‌లతో ఎయిర్‌పోర్టుల తరహాలో ఆధునిక సౌకర్యాలు కల్పించడం ఆధునికీకరణ ప్రణాళికలో భాగంగా చేర్చారు. రైల్లేశాఖ అమలు చేస్తున్న అమృత్‌భారత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 70 వరకు రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయాలని సంకల్పించారు. మిగతావాటి సంగతెలా ఉన్నా.. ప్రయాణికుల రద్దీ, రైళ్ల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని విశాఖ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని మూడు అతిపెద్ద రైల్వేస్టేషన్లలో విశాఖ రైల్వేస్టేషన్ ఒకటి. అయితే రాష్ట్రంలో మిగతా భాగం దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలో ఉండగా విశాఖ సహా ఉత్తరాంధ్ర మొత్తం భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పుకోస్తా రైల్వేజోన్ పరిధిలో ఉండటం వల్ల అభివృద్ధి విషయంలో వివక్షకు గురయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే రైల్వేస్టేషన్‌లో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలని ప్రయాణికుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో విశాఖ రైల్వేస్టేషన్‌ను వాణిజ్య, సాంస్క ృతిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. 2027 నాటికి ఈ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తొలుత రెండు అదనపు ప్లాట్‌ఫారాలే నిర్మించాలనుకున్నారు. కానీ ప్రయాణికుల రద్దీని గమనించి ఆ సంఖ్య నాలుగుకు చేరింది. చివరికి ఆరు ప్లాట్‌ఫారాలు నిర్మించాలని నిర్ణయానికి వచ్చారు. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్(దక్షిణ కోస్తా) రైల్వేజోన్ ఏర్పాటు కానుంది. అలాగే గోపాలపట్నం, విశాఖపట్నం స్టేషన్ల మధ్య ప్రస్తుతం రెండు ట్రాకులు అందుబాటులో ఉండగా, వీటికి అదనంగా మరో రెండు లైన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ప్రధాన ఎంట్రన్స్‌తోపాటు అటు జ్ఞానాపురం, మరోవైపు కాన్వెంట్ జంక్షన్ వద్ద ప్రత్యామ్నాయ స్టేషన్లు ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తున్నారు. ఇంకోవైపు ప్రధాన స్టేషన్‌ను పోస్టాఫీసు మీదుగా అల్లిపురం జంక్షన్ వరకు విస్తరిస్తున్నారు. విస్తరణ పనులు పూర్తి అయితే ఆధునిక లాంజ్‌లు, షాపింగ్ సౌకర్యం, కొత్త ఎస్కలేటర్లు, ఎయిర్ కాన్‌కోర్స్ వంటివన్నీ అందుబాటులోకి వస్తాయి.
కోర్టు కేసు క్లియర్
ఇటీవలి కాలంలో విశాఖపట్నం స్టేషన్ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లు, ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. సరుకు రవాణాలోనూ తూర్పుకోస్తా జోన్‌లోనే విశాఖ అగ్రస్థానంలో ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని స్టేషన్‌ను పునర్నిర్మించాలని చాలా కాలం నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే కోర్టులో కేసు పెండిరగ్‌లో ఉన్న కారణంగా ఇన్ని రోజులు విశాఖ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టు చేపట్టంలో జాప్యం జరిగింది. రెండు నెలల క్రితం కోర్టు కేసు క్లియర్ కావటంతో ఆధునికీకరణ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ను రైల్వే బోర్డుకు పంపారు. విశాఖ కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వేజోన్ ఏర్పాటు చేస్తుండటంతోపాటు ఈ నగరం ఏపీలోనే అతిపెద్దది. పారిశ్రామికంగా, ఆర్థికంగా, రక్షణరంగ పరంగా కూడా అతికీలకమైన నగరంగా ఉండటంతో ఇక్కడ రైల్వేస్టేషన్‌ను ఆ స్థాయిలో తీర్చిదిద్దాలని కేంద్రం భావిస్తోంది. అంతేకాకుండా దేశంలోనే ఎక్కువ మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే తొలి 20 రైల్వేస్టేషన్లలో విశాఖ కూడా ఉంది. సాధారణ రోజుల్లో నిత్యం 50 వేల నుంచి 60 వేల మంది వరకు ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. ఇక పండగలు, ఇతర ముఖ్యమైన రోజుల్లో అయితే ఈ సంఖ్య 75 వేల వరకూ ఉంటుంది.










Comments