విశాఖలో వందేభారత్ హబ్
- DV RAMANA

- 3 days ago
- 2 min read
రూ.300 కోట్లతో మర్రిపాలెంలో నిర్మాణం
సెమీ హైస్పీడ్ రైళ్ల నిర్వహణ, మరమ్మతులు ఇక్కడే
త్వరలో కొత్త స్లీపర్, సీటింగ్ రైళ్లు వచ్చే అవకాశం
రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచాలని డిమాండ్లు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
ప్రపంచంలోనే శరవేగంగా అభివద్ధి చెందుతున్న నగరంగా పేరొందిన విశాఖపట్నం మరో కీలక ప్రాజెక్టుకు కేంద్రం కానుంది. ప్రస్తుతం తూర్పుకోస్తా(ఈస్ట్‌కోస్ట్) రైల్వే జోన్‌లో వాల్తేర్ డివిజన్ పేరుతో అత్యధిక అదాయం సంపాదిస్తూ అగ్రస్థానంలో ఉన్న విశాఖ నగరం రైల్వేపరంగా మరో ముందడుగు పడుతోంది. సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అన్న పేరుతో నడుపుతున్న రైల్వే శాఖ క్రమంగా ఆ సర్వీసులను దేశంలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాలకు పొడిగిస్తూ వస్తోంది. అదే సమయంలో వందేభారత్ స్లీపర్ రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే వందేభారత్ రైళ్లను ఎప్పటికప్పుడు మెంటెయినెన్స్ చేస్తూ పరిశుభ్రంగా ఉంచడంతోపాటు ఎప్పటికప్పుడు రిపేర్లు చేయాల్సిన బాధ్యత కూడా రైల్వేశాఖపై ఉంది. అయితే ఈ పనులకు ప్రస్తుతం ఉన్న డీజిల్, ఎలక్ట్రిక్ లోకోషెడ్లు సరిపోవు. ప్రత్యేక టెక్నాలజీతో కూడిన వర్క్‌షెడ్లు అవసరం. దీన్ని దష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా కీలకమైన కేంద్రాల్లో వందేభారత్ లోకోడిపోలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటిలో ఒకటి తూర్పు, దక్షిణ భారతాలకు అనువుగా ఉండేలా విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రైల్వేబోర్డు, కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
నగరంలో రెండో డిపో
విశాఖ నగరంలో ఇప్పటికే రెండు లోకోషెడ్లు ఉన్నాయి. కంచరపాలెంలో డీజిల్ ఇంజిన్ల నిర్వహణ డిపో, మర్రిపాలెంలో ఎలక్ట్రిక్ ఇంజిన్ల మెంటెయినెన్స్ డిపో ఉన్నాయి. ఇవికాకుండా రైల్వేస్టేషన్ సమీపంలోనే కోచింగ్ మెయింటెనెన్స్ డిపో ఉంది. అయితే వందేభారత్ రైళ్ల నిర్వహణకు వీటిలో ఉన్న సౌకర్యాలు సరిపోవు. సాధారణ రైళ్ల నిర్వహణ పనులకు కనీసం ఎనిమిది గంటల సమయం పడుతుంది. అదే వందేభారత్ రైలుకైతే కనీసం పదిగంటలు అవసరం. దీనికి ప్రత్యేక పిట్‌లైన్ నిర్మించాల్సి ఉంటుంది. దానిపై రైలును నిలిపితే సిబ్బంది దాని కింద నుంచి పిట్‌లైనులోకి వెళ్లి అవసరమైన మరమ్మతులు, ఇతర నిర్వహణ పనులు చేపడతారు. దీనివల్ల చుట్టుపక్కల ప్రాంతాలకు నడుస్తున్న వందేభారత్ రైళ్లు నిర్వహణ, మరమ్మతు పనులకు విశాఖకే రావాల్సి వస్తుంది. వాస్తవానికి రాష్ట్ర విభజన సమయంలో విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా(సౌత్ కోస్టల్) రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆరిలోవ ప్రాంతంలో జోన్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే కొత్త జోన్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికీ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయలేదన్న అసంతప్తి ఉన్నప్పటికీ.. మరోవైపు విశాఖ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫారాల సంఖ్యను 14 వరకు పెంచడంతోపాటు పూర్తిస్థాయిలో ఆధునికీకరించే పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటికితోడు ఇప్పుడు వందేభారత్ నిర్వహణ డిపో కూడా మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. రూ.300 కోట్ల అంచనాతో నిర్మించే డిపోను ప్రస్తుతం ఎలక్ట్రిక్ లోకోషెడ్ ఉన్న మర్రిపాలెంలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వందేభారత్ సీటింగ్‌తోపాటు స్లీపర్ రైలు సర్వీసులను రైల్వేశాఖ శరవేగంగా విస్తరిస్తోంది. కొత్త కొత్త ప్రాంతాలకు సర్వీసులు వేస్తోంది. వీటికి ప్రయాణికుల నుంచి ఆదరణ కూడా చాలాబాగుతుంది. దీంతో కొత్త రైళ్లు వేయడానికి అవసరమైన కోచ్‌లను చెన్నైలోని కోచ్ ఫ్యాక్టరీలో నిర్మిస్తున్నారు. వాటి మెంటెయినెన్స్‌కు విశాఖ నగరాన్ని ఎంచుకున్నట్లు రైల్వేవర్గాలు పేర్కొంటున్నాయి.
పెరుగుతున్న రైళ్లు
మరోవైపు విశాఖ నుంచి పలు రాష్ట్రాలకు వందేభారత్ రైలు సర్వీసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం విశాఖ ` సికింద్రాబాద్ మధ్య రెండువైపులా కలిపి రెండు ఏకకాలంలో నడుస్తున్నాయి. విశాఖ`దుర్గ్, విశాఖ`భువనేశ్వర్ వందేభారత్ సర్వీసులు నడుస్తున్నాయి. ప్రస్తుతం విశాఖకు చేరుకునే ఈ రైళ్లకు ఇక్కడి కోచింగ్ మెయింటెనెన్స్ డిపోలోనే నిర్వహణ పనులు చేపడుతున్నారు. మిగిలిన మూడు రైళ్లకు ఆయా ప్రాంతాల్లో నిర్వహణ పనులు చేపడుతున్నారు. అవసరమైన స్పేర్‌పార్టుల(విడిభాగాలు)ను మాత్రం చెన్నై నుంచి తెప్పిస్తున్నారు. ఇప్పుడున్నవి కాకుండా ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ను దష్టిలో ఉంచుకుని కొత్త సర్వీసులు కావాలని విశాఖతోపాటు మన రాష్ట్రం నుంచి రైల్వేశాఖకు డిమాండ్లు వెళ్లాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పలు వందేభారత్ స్లీపర్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ రూట్లల్లో వందేభారత్ సర్వీసులు సేవలు అందిస్తున్నాయి. సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో రైల్వేశాఖ ఈ ట్రైన్‌కు కోచ్‌ల సంఖ్య పెంచింది. ఇప్పటివరకు ఈ రైలుకు 16 కోచ్‌లు ఉండగా అదనంగా మరో నాలుగు కోచ్‌లు పెంచింది. కాగా విశాఖ నుంచి తిరుపతి, చెన్సై, బెంగళూరు, కోల్‌కతా రూట్లలో కొత్త వందేభారత్ సర్వీసులు వేయాలన్న డిమాండ్లు ఉన్నాయి. ఇటీవల జరిగిన వాల్తేర్ డివిజన్ రైల్వే వినియోగదారులు సలహా కమిటీ సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, ఇతర సభ్యులు డీఆరఎం లలిత్ బోహ్రాకు వినతిపత్రాలు అందించారు. అలాగే భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో విశాఖ నుంచి ఏటా విమానాల ద్వారా రాకపోకలు సాగించే మూడు లక్షల మంది ప్రయాణికుల సౌకర్యార్థం రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచాలన్న డిమాండ్లు కూడా అందాయి.










Comments