వంశధారలో తగ్గిన.. నిధుల ధార
- DV RAMANA

- 14 hours ago
- 3 min read
బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు రూ.182 కోట్లు
నిధుల విడుదలపైనే అనుమానాలు
కేటాయింపులకు, ఖర్చులకు కుదరని పొంతన
ఒడిశాతో వివాదం వల్ల పెండింగులో నేరడి బ్యారేజ్
అది పూర్తి అయితేనే సంపూర్ణ ఫలాలు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
అన్ని రంగాల్లోనూ వెనుకబడిన జిల్లాగా పేరుపడిన శ్రీకాకుళం జిల్లాలో సాగునీటి వసతులు కూడా అంతంతమాత్రమే. ఇప్పటికీ జిల్లాలో పూర్తిస్థాయిలో రెండు పంటలు పండించే పరిస్థితి లేదు. జిల్లా తాగు, సాగునీటికి ప్రధాన ఆధారం వంశధార, నాగావళి నదులే. ఈ నదులపై ఇప్పటివరకు పరిమితంగానే ప్రాజెక్టులు నిర్మించారు. దశాబ్దాల క్రితం ప్రతిపాదించిన వంశధార ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి రూపం దాల్చలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం, నిధుల సమస్య, అంతర్ రాష్ట్ర వివాదాల సుడిలో చిక్కుకుని ప్రాజెక్టు వడివడిగా సాగడంలేదు. ముఖ్యంగా ఒడిశాతోపాటు ముంపు గ్రామాల వివాదం, నిధుల కొరత నేపథ్యంలో దశలవారీగా చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యం లభించడంలేదని అసంతప్తి జిల్లావాసుల్లో ఉంది. ప్రస్తుతం పనులు జరుగుతున్న వంశధార స్టేజ్ 2 ఫేజ్`2 పనులకు 2026`27 బడ్జెట్‌లో పూర్తిస్థాయిలో కేటాయింపులు లేవన్న ఆరోపణలు ఉన్నాయి. బడ్జెట్లో ప్రకటిస్తున్న నిధుýను కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో విడుదల చేయడంలేదని గత అనుభవాలు చెబుతున్నాయి. దీనివల్ల ఒకవైపు చేసిన పనులకు బిల్లు బకాయిలు పేరుకుపోతుంటే.. మరోవైపు పనులు కొనసాగించేందుకు నిధుల్లేని పరిస్థితి నెలకొంటున్నది. ఫలితంగా ఇప్పటికే 90 శాతానికిపైగా పనులు పూర్తి అయినట్లు చెబుతున్నా.. మిగిలిన కొద్దిపాటి పనులు పూర్తి చేసి ప్రాజెక్టును అందుబాటులోకి తేవడం సాధ్యమవుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
దశలవారీగా..
ఒడిశాలో పుట్టి మనరాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా మీదుగా సముద్రంలో కలుస్తున్న వంశధారపై నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణానికి 1962లో ఆంధ్ర, ఒడిశా ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే 106 ఎకరాల విషయంలో తలెత్తిని వివాదం ఎంతకూ కొలిక్కిరాని పరిస్థితుల్లో ఒకవైపు దానికి పరిష్కారం అన్వేషిస్తూనే.. మరోవైపు వంశధార ప్రాజెక్టును దశలవారీగా చేపట్టాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం 1971లో మొదటి దశ(స్టేజ్`1) పనులు చేపట్టింది. ఈ దశలో హిరమండలం సమీపంలోని గొట్టా వద్ద బ్యారేజ్, అక్కడి నుంచి పలాసల వరకు 104 కి.మీ. పొడవున సాగు నీరందించే ఎడమ కాలు పనులు చేపట్టి 1977లో పూర్తి చేశారు. ఫలితంగా 12 మండలాý పరిధిలోని 398 గ్రామాలకు చెందిన 1,48,230 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఒక రెండో దశ అయిన స్టేజ్`2ను మళ్లీ రెండుగా విడగొట్టారు. స్టేజ్`2 ఫేజ్`1 కింద రూ.123.24 కోట్లతో 53 కి.మీ. పొడవున కుడి ప్రధాన కాలువతోపాటు డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థల నిర్మాణానికి ప్రభుత్వం 2000 ఆగస్టులో అనుమతులు జారీ చేసింది. ఆ కేటాయింపులను సవరించి రూ.209 కోట్లకు పెంచుతూ 2011 చివరిలో మళ్లీ ఉత్తర్వులు జారీ చేసి పనులు పూర్తి చేశారు. ఫలితంగా కుడి కాలువ ద్వారా 165 గ్రామాల పరిధిలో 63,276 ఎకరాలకు నీరు అందుతోంది. ఆ తర్వాత చేపట్టిన స్టేజ్`2 ఫేజ్`2 పనులే రెండు దశాబ్దాలుగా ఎడతెగకుండా కొనసాగుతున్నాయి.
పనులు నత్తనడక
స్టేజ్`2 ఫేజ్`2 పనులను 2005లో అప్పటి వైఎస్ రాజశేఖరెడ్డి ప్రభుత్వం జలయజ్ఞంలో చేర్చింది. ఈ దశలో కాట్రగడ వద్ద సైడ్ వియర్, కెనాల్, రెండు మినీ రిజర్వాయర్లు, హిరమండలం వద్ద ప్రధాన జలాశయం నిర్మాణానికి రూ.933.90 కోట్ల అంచనాతో ఆమోదించింది. అయితే పనులు పూర్తి కాకపోవడంతో ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.2,407.79 కోట్లకు సవరిస్తూ 2022లో వైకాపా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఈ ప్రాజక్టు అంచనా వ్యయం రూ.2624.50 కోట్లకు పెరిగినా నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. ఇప్పటివరకు సుమారు 93 శాతం పనులే పూర్తి అయ్యాయని అధికారవర్గాల ద్వారా తెలిసింది. ప్రధాన పనులన్నీ దాదాపుగా పూర్తి అయ్యాయని తుది మెరుగులు మాత్రమే పెండింగ్ ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. సైడ్ వియర్, హెడ్ రెగ్యులేటర్, వరద ప్రవాహ కాలువ (ఫ్లడ్ ఫ్లో కెనాల్) కొంత భాగం, సింగిడి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనుల్లో 80 శాతం వరకు పూర్తి అయ్యాయి. ఇంతవరకు రూ.137.32 కోట్ల విలువైన పనులు జరగ్గా మరో రూ.40 కోట్ల విలువైన పనులు జరగాల్సి ఉంది. ఫ్లడ్‌ఫ్లో కెనాల్‌లో మిగతా భాగం, పారాపురం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణాల్లో రూ.190 కోట్ల వ్యయంతో 96 శాతం మేరకు పనులు పూర్తి కాగా మరో రూ.44 కోట్ల పనులు పెండింగులో ఉన్నాయి. కీలకమైన హిరమండలం ఎర్త్‌డ్యామ్‌తో పాటు లింక్ కెనాల్ కోసం లెఫ్ట్ హెడ్ స్లూయిస్, హైలెవల్ కెనాల్ (వంశధార-నాగావళి నదుల అనుసంధానం) కోసం రైట్ హెడ్ స్లూయిస్ తదితర పనుల్లో ఇప్పటివరకూ రూ.521.76 కోట్లతో 96 శాతం నిర్మాణాలు పూర్తి అయ్యాయి. మరో రూ.84 కోట్ల విలువైన పనులు ఉన్నాయి.
కాగితాల్లోనే కేటాయింపులు
ఈ మొత్తం కలిపితే పెండింగు పనులే రూ.168 కోట్ల మేరకు ఉన్నాయి. ఇక పాత బకాయిలతో కలిపి ఈ ఏడాది వంశధార ప్రాజెక్టు స్టేజ్`2 ఫేజ్`2 పనులన్నీ పూర్తి అయ్యి ప్రజలకు అందుబాటులోకి రావాలంటే సుమారు రూ.400 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. కానీ ఇటీవల ప్రవేశ పెట్టిన 2026`27 బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ. 182.14 కోట్లు మాత్రమే కేటాయించింది. మరోవైపు గత అనుభవాలను చూస్తే ప్రభుత్వం బడ్జెట్ చేసిన కేటాయింపుల మేరకు పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయడం, ఖర్చు చేయించడంలో విఫలమవుతున్నట్లు స్పష్టమవుతుంది. 2024`25 బడ్జెట్‌లో రూ.63.50 కోట్లు కేటాయించినా రూ.కోటి మాత్రమే విడుదల చేశారు. అలాగే 2025`26 బడ్జెట్‌లో రూ.182.52 కోట్లు కేటాయించిరూ.46.24 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఈ పరిస్థితుల్లో తాజా కేటాయింపుల మేరకు నిధులు అందుతాయా అన్నది అనుమానమే. మరోవైపు స్టేజ్`2 ఫేజ్`2 పనులు పూర్తి అయినా ఒడిశాతో వివాదం, సుప్రీంకోర్టులో కేసు కారణంగా పెండింగులో ఉండిపోయిన నేరడి బ్యారేజ్ నిర్మాణం జరిగితే తప్ప వంశధార రెండో దశ ఫలాలు పూర్తిస్థాయిలో జిల్లా ప్రజలకు అందే పరిస్థితి లేదు.










Comments