వచ్చే రథసప్తమికి చెప్పులు కూడా వేలం వేయొచ్చు
- Prasad Satyam
- Jan 28
- 1 min read
క్యూలైన్‌లో ఏం జరిగినా అంతే సంగతి
పార్కింగ్ స్థలాల మీదే క్యూలైన్ల మీదా అవగాహన అవసరం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ప్రతీ ఆలయంలో కొబ్బరిచిప్పలకు వేలం జరగడం సాధారణం. తిరుపతి లాంటి ఆలయాల్లో తలనీలాలకు టెండర్లు జరుగుతాయి. ఈసారి రథసప్తమికి పాదరక్షలకు కూడా వేలం వేయొచ్చేమో! ఎందుకంటే.. ఆదివారం జరిగిన రథసప్తమికి వచ్చిన భక్తులు చెప్పులు తో వెళ్లలేక కేవలం ఒక్కచోటే విడిచిపెట్టినవన్నిటినీ కలిపి ప్రొక్లైనర్ బక్కెట్‌తో ఎత్తాల్సి వచ్చింది. ఆ తర్వాత వాటిని కార్పొరేషన్ చెత్తబండిలో వేసి డంపింగ్ యార్డుకు తరలించారు. ఇందుకు కారణం.. ఏ మార్గంలో అయితే దర్శనానికి వెళ్తున్నామో, మళ్లీ అదే మార్గం నుంచి వెనక్కు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఒకచోట విడిచిపెట్టిన చెప్పులు మళ్లీ తొడుక్కోడానికి కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించలేక కొందరు, పోలీసులు విడిచిపెట్టక మరికొందరు, రద్దీలో వెళ్లలేక అనేకమంది విప్పినచోటే చెప్ప్పులు వదిలేశారు. దీంతో సోమవారం శానిటేషన్ సిబ్బందికి వేల జతల చెప్పులు దొరికాయి. వీటన్నింటినీ కంపోస్టు యార్డుకు తరలించారు. కళ్ల ముందే అనేకమంది ఇష్టారాజ్యంగా వెళ్తున్నా పట్టించుకోని కొందరు పోలీసులు చిన్న చిన్న విషయాల్లో మాత్రం అతిగా స్పందించారు. శ్రీకాకుళం ఇన్‌ఛార్జి మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న కమలాకర్ విధుల నిర్వహణలో భాగంగా డ్యూటీపాస్ చూపించినా పోలీసులు ఓవరాక్షన్ చేయడంతో ఆయన పాస్ అక్కడికక్కడే చింపేసి మున్సిపల్ కార్యాలయానికి వచ్చేసినట్లు తెలుస్తుంది. అలాగే జిల్లా హటల్స్ అసోసియేషన్ తరఫున 30వేల మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పెరుగు అయిపోవడంతో పెద్ద మొత్తంలో పెరుగును ఇందిరా విజ్ఞాన్ భవన్ వద్దకు తీసుకువస్తున్న ఆటోను పోలీసులు అడ్డుకున్నారు. వాహనం పాస్ ఉందని చూపించినా అనుమతించలేదు. దీంతో ఆ బరువును మోసుకువెళ్లి మరీ అన్నదానంలో పాల్గొన్నారు. కానీ అర్థంపర్థం లేనివారంతా వాహన పాస్‌లతో అరసవల్లి రోడ్ల మీద ఆదివారం హల్‌చల్ చేశారు. చివరకు కలెక్టర్‌కే మండి వాహనాలు తనిఖీ చేసి పాస్‌లు చించేశారు.
ఇక ఒకసారి క్యూలైన్‌లో దూరితే.. దర్శనం చేసుకొని వేరే మార్గం ద్వారా బయటపడటం తప్ప మధ్యలో నిష్క్రమించడానికి వీళ్లేకుండా ఐరన్ గ్రిల్స్‌ను వెల్డింగ్ చేసేశారు. మధ్యనుంచి షార్ట్‌కట్‌లో దర్శనానికి వెళ్లిపోతారని కిలోమీటర్ల కొద్దీ వెల్డింగ్ గ్రిల్స్ వేసేశారు. క్యూలైన్‌లో ఎవరికైనా జరగరానిది జరిగితే, ముందుకు వెళ్లడానికి, వెనక్కు రావడానికి అవకాశం లేదు. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు పెట్టకపోవడం వల్ల చాలామంది బీపీ పేషెంట్లు ఉక్కపోతకు, గుండెదడకు గురయ్యారు. క్యూలైన్ల మధ్యలో ఎగ్జిట్ గేట్లు పెట్టకపోవడం ప్రమాదమే. వచ్చే ఏడాదైనా ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు.










Comments