వచ్చేస్తోంది.. విశాఖ రైల్వే జోన్!
- DV RAMANA

- 13 hours ago
- 2 min read
చివరి దశకు చేరుకున్న విభజన కసరత్తు
సుమారు 3500 కి.మీ. లైన్లు ఉండేలా చర్యలు
త్వరలోనే అపాయింటెడ్ డేట్ ప్రకటించే అవకాశం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
కొంతకాలంగా స్తబ్దుగా ఉండిపోయిన విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు ప్రక్రియలో మళ్లీ కదలిక కనిపిస్తోంది. త్వరలోనే జోన్ కార్యకలాపాల ప్రారంభానికి అపాయింటెడ్ డేట్‌ను ప్రకటించే అవకాశం ఉందని రైల్వేశాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. విశాఖ నగరం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చిరకాలంగా ఉంది. విశాఖతోపాటు ఉత్తరాంధ్రవాసులు దానికోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచీ రాష్ట్రమంతా దక్షిణమధ్య రైల్వే జోన్(సౌత్‌సెంట్రల్) పరిధిలో ఉంటే.. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు ఉత్తరాంధ్ర జిల్లాల మాత్రం గతంలో కోల్‌కతా కేంద్రంగా ఉన్న ఆగ్నేయ(సౌత్ ఈస్ట్రన్) రైల్వే జోన్‌లో.. తర్వాత ఒడిశాలోని భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్‌కోస్ట్(తూర్పుకోస్తా) రైల్వే జోన్ పరిధిలో కొనసాగుతున్నాయి. దీనివల్ల కొత్త రైలు సర్వీసులు, ఇతర అభివద్ధి పనుల విషయంలో వివక్ష ఎదుర్కొన్నాయి. వాల్తేర్ డివిజన్ తూర్పుకోస్తా రూల్వేకు ఆదాయం సమకూర్చడంలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ.. దీని అభివద్ధి వివక్ష చూపడం వల్ల విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కొన్ని దశాద్దాల క్రితం మొదలైంది. ఎట్టకేలకు రాష్ట్ర విభజన సమయంలో ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టంలో విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటు చేయనున్నట్లు పుష్కర కాలం క్రితం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం 2019 బడ్జెట్‌లో దీనికి పచ్చజెండా ఊపి, ప్రత్యేకాధికారిని నియమించడంతోపాటు సరిహద్దుల వర్గీకరణ నివేదిక సిద్ధం చేయించింది. అలాగే విశాఖ నగరంలోని ఆరిలోవలో జోన్ ప్రధాన కార్యాలయ భవనం నిర్మాణం కూడా జరుగుతోంది. కానీ కొత్త రైల్వేజోన్ మనుగడలోకి రావాలంటే కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ఆ విషయంలో తాత్సారం జరుగుతుండటంతో మళ్లీ ఉత్తరాంధ్రవాసుల్లో అనుమానాలు, ఆందోళనలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లి రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ను కలిసి రైల్వేజోన్ అంశం ప్రస్తావించారు. దాని ప్రభావమో.. మరే కారణం వల్లో గానీ.. ఇప్పుడు మళ్లీ జోన్ అడుగులు వేగం పుంజుకున్నాయి.
కొలిక్కివస్తున్న లైన్ల వర్గీకరణ
విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణాకోస్తా జోన్‌లో దక్షిణమధ్య రైల్వే పరిధిలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను చేర్చడంతోపాటు విశాఖ డివిజన్ కూడా ఉంటుంది. అయితే ఈ జోన్లలోని మార్గాలు, స్టేషన్లను పున:వర్గీకరించాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. గుంతకల్లు డివిజన్ పరిధిలో ఉన్న రాయచూరు`వాడీ(108 కి.మీ.) రైలుమార్గం సౌత్‌సెంట్రల్ జోన్ పరిధిలోనే ఉండిపోతుంది. ప్రస్తుతం గుంటూరు డివిజన్ పరిధిలో ఉన్న విష్ణుపురం`పగిడిపల్లి, విష్ణుపురం`జాన్‌పహడ్ మార్గాలు.. మొత్తం 142 కిలోమీటర్ల లైను ఎస్సీ రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ డివిజన్‌కు బదిలీ అవుతాయి. అదే సమయంలో 46 కి.మీ. నిడివి కలిగిన మోటుమర్రి`కొండపల్లి మార్గం సికింద్రాబాద్ నుంచి విజయవాడ డివిజన్‌లోకి వెళుతుంది. ఇలా మొత్తం డివిజన్ల వారీగా విభజన, సరిహద్దుల మార్పుచేర్పులకు తుదిరూపమిచ్చి అధికారిక ప్రకటన చేస్తే కొత్త జోన్ పరిధి, సరిహద్దులోపై పూర్తి స్పష్టత వస్తుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. విజయవాడ డివిజన్‌లో 959 కి.మీ., గుంతకల్లు డివిజన్‌లో 1354 కి.మీ., గుంటూరు డివిజన్‌లో 628 కి.మీ., వాల్తేరు డివిజన్‌లో 1106 కి.మీ. ఉండగా అందులో సుమీరు 600 కి.మీ. రైల్వేమార్గాలను విశాఖ జోన్‌లో కలపనున్నారు. మొత్తంగా చూస్తే దక్షిణకోస్తా రైల్వేజోన్ పరిధి 3500 కి.మీ. వరకు ఉండవచ్చని రైల్వేవర్గాలు పేర్కొంటున్నాయి. కొత్త జోన్‌కు సంబంధించి కీలకమైన నియామకాలను రైల్వేబోర్డు దశలవారీగా జరుపుకొస్తున్నది. వీటన్నింటినీ ఒక కొలిక్కి తెచ్చి సాధ్యమైనంతవరకు ఈ నెలాఖరుకే విశాఖ రైల్వేజోన్‌కు సంబంధించి అపాయింటెడ్ డేట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.










Comments