వసూల్ రాజ్!
- DV RAMANA

- 3 days ago
- 2 min read
సంక్షేమ ప్రభుత్వంలో పన్నుల మోత
జీవితంలో ప్రతి అడుగులోనూ అదే వాత
తమకు తెలియకుండానే బాధితులవుతున్న ప్రజలు
ఆదాయంలో సింహభాగం వాటికే సరి
సామాన్యుడే ‘శర’మెత్తితే! -1

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
ప్రజల అవసరాలు చూడటం.. వాటిని నెరవేర్చడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం. తమను కళ్లలో పెట్టుకుని పాలించే పార్టీలనే ప్రజలు మళ్లీ మళ్లీ ఎన్నుకోవడానికి సుముఖత చూపుతుంటారు. ఒకవైపు అభివద్ధి.. మరోవైపు సంక్షేమం రెండింటికీ సమాన ప్రాధాన్యతనిస్తూ.. సమాంతరం నిర్వర్తించగల ప్రభుత్వలే ప్రజల మన్ననలకు పాత్రమవుతాయి. అయితే అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి తగిన ఆదాయ వనరులు అవసరం. ఖనిజ, అటవీ వనరులు, పలు వ్యవస్థలు, పరిశ్రమల ద్వారా ఆదాయం సమకూర్చుకోవడంతో పాటు, మౌలిక వసతులు అందిస్తున్నందుకు గాను ప్రజల నుంచి నామమాత్రంగా పన్నులు వసూలు చేసే వెసులుబాటు ప్రభుత్వాలకు ఉంది. కానీ ప్రభుత్వాలు ఆ వెసులుబాటునే తమకు దఖలుపడిన హక్కుభుక్తంగా భావిస్తున్నాయి. దేశపౌరులపై ఎడాపెడా పన్నులు వేస్తూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. చివరికి ప్రజలు తమకు తెలియకుండానే అడుగు తీసి అడుగు వేసిన ప్రతిసారీ.. తల నుంచి పాదాల వరకు.. ఇంటికీ, ఒంటికీ అవసరమైన ప్రతి చిన్న కొనుగోలుకూ పన్ను చెల్లించాల్సి వస్తున్నది. తమకు తెలియకుండానే ఆదాయంలో సింహభాగం పన్నుల రూపంలో సర్కారు బొక్కసానికి సమర్పించుకోవలసిన దుస్థితి. సంక్షేమ రాజ్యం, ఘనమైన ప్రజాస్వామ్యం అని చెప్పుకొంటున్న మన దేశంలో విచ్చలవిడిగా సాగుతున్న ఈ వసూల్‌రాజ్‌ను రాజ్యసభలో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ప్రముఖంగా ప్రస్తావించారు. గత కొన్నాళ్లుగా సామాన్యుడి గళం వినిపిస్తున్న ఆయన ఎన్ని రూపాల్లో పన్నుల దోపిడీ జరుగుతున్నదో సోదాహరణంగా ప్రస్తావించారు.
పన్నుల మోత ఇలా..
మనిషి పుట్టినప్పటి నుంచే పన్ను పోటుకు గురువుతున్న పరిస్థితిని చద్దా వివరించారు. పుట్టుక నుంచి మరణం వరకు మనిషి జీవిత చక్రంగా భావిస్తారు. ఆ జీవిత చక్రమే పన్నుల వ్యవస్థలో చిక్కుకుని సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నది. జన్మం నుంచి మరణం వరకు ప్రతి దశలోనూ పన్ను బాధ తప్పడం లేదంటూ రాఘవ్ చద్దా మానవ జీవిత చక్రాన్ని ఎనిమిది దశలుగా విభజించి ఏ దశలో.. ఏ రూపంలో.. ఎంత పన్నులు చెల్లిస్తున్నారో రాజ్యసభ సాక్షిగా ప్రస్తావించారు.
పిల్లలు పుట్టగానే వేసే టీకాకు ఐదు శాతం జీఎస్టీ పన్ను కట్టాల్సి వస్తున్నది.
పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వారికి వేసే డైపర్లు, ఆహారంగా తినిపించే పాలపొడి, బట్టలు తదితరాలకు 12 నుంచి 18 శాతం జీఎస్టీ చెల్లిస్తున్నాం.
వారు కాస్త ఎదిగేసరికి స్కూలు ఫీజులు, యూనిఫారాలు, షూస్, బ్యాగులు, పుస్తకాలు, తదితరాలపై 5 నుంచి 18 శాతం జీఎస్టీ చెల్లిస్తున్నాం.
యుక్తవయసుకొచ్చేసరికి ఫోన్లు, చదువుకు అవసరమైన ల్యాప్‌టాప్‌లు, వాటికి నెట్ కనెక్షన్లు, ద్విచక్ర వాహనాల వంటివి అవసరం. వాటికి కూడా 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే ఉన్నత విద్య, హాస్టల్ ఫీజులు, చదువులకు స్టూడెంట్ లోన్లు, పుస్తకాలు వంటి వాటికి సైతం అదే స్థాయిలో జీఎస్టీ వసూలు చేస్తున్నారు.
ఇవన్నీ దాటి ఉద్యోగంలో స్థిరపడ్డామనుకుంటే.. వచ్చే జీతం పరిమితి దాటితే టీడీఎస్, ఆదాయ పన్ను(ఐటీ) వత్తి పన్ను(ప్రొఫెషనల్ ట్యాక్స్).. అలాగే వర్క్ ఫ్రం ీVAమ్ చేయాల్సి వస్తే దానికి అవసరమైన ల్యాప్‌టాప్, నెట్ కనెక్షన్లకు మళ్లీ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
మధ్య వయసు వచ్చేసరికి ఉద్యోగంలో అనుభవం వస్తుంది. దాంతోపాటే ప్రమోషన్ వచ్చి ీVAదా పెరుగుతుంది. వీటితపాటు ఆదాయ పన్ను శ్లాబ్ కూడి పెరిగి సంతోషాన్ని సగం హరిస్తుంది. అదే వయసలో ఇల్లు, పెద్ద వాహనం కొనుగోలుకు ప్రయత్నిస్తాం. వీటిపై కూడా 5 నుంచి 28 శాతం వరకు జీఎస్టీ చెల్లించక తప్పదు.
పిల్లలకు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు చేయాల్సి వచ్చినప్పుడు కల్యాణ మండపాలు, క్యాటరింగ్, ఈవెంట్ నిర్వహణ, బ్రైడల్ మేకప్ వంటి వాటితోపాటు బట్టలు, ఇతరత్రా పెళ్లి సామాగ్రి భారీగా కొనుగోలు చేస్తుంటాం. వీటన్నింటికీ దేనికది వేర్వేరుగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ దశలన్నీ దాటుకుని రిటైర్‌మెంట్ జీవితం ప్రశాంతంగా గడపుదామనుకుంటే ఇక్కడా జీఎస్టీ మోత తప్పడం లేదు. పెన్షన్, ఇతరత్రా ఆదాయాలపైనా, పరిమితికి మించిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీలపైనా పన్నులు చెల్లించాల్సిందే. ఇవికాకుండా ఆరోగ్యపరంగా కూడా చెల్లింపులు తప్పడంలేదు. అదష్టవశాత్తు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీని ప్రభుత్వం ఇటీవలే తీసివేసింది. అయితే ఆరోగ్య పరీక్షలు, ఔషధాల కొనుగోళ్లపై నిర్ణీత శాతం జీఎస్టీ మోత తప్పదు.
జీవితం ముగిసిన తర్వాత.. అంతిమ సంస్కారాలకు సైతం ప్రభుత్వానికి మన తరఫున పన్నులు చెల్లించాల్సిందే. అంత్యక్రియలకు అవసరమైన సామగ్రి కొనుగోళ్లపై జీఎస్టీ ఉంటుంది. శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇచ్చే పత్రికా ప్రకటనలపై 5 శాతం జీఎస్టీ అమల్లో ఉంది. చివరికి మరణానంతరం ఆస్తులను వారసుల పేరిట మార్చాలన్నా నిర్ణీత మొత్తాల్లో సెస్ వంటి పన్నులు చెల్లించకతప్పదు.
ఈ జాబితా చూస్తే.. ఆమ్మో ఇన్ని రకాలుగా ప్రభుత్వం మన నుంచి పన్నులు వసూలు చేస్తున్నదా? అని ఆశ్చర్యం కలగకమానదు. వీటన్నింటిని కలిపి లెక్కకడితే మన ఆదాయంలో అనుభవించిన దానికంటే ప్రభుత్వానికి సమర్పించుకున్నదే అధికంగా ఉంటుందనడం అతిశయోక్తి కాబోదు. ఇలా అడుగడుగునా పన్నులతో బాదుతున్న ప్రభుత్వం అందుకు తగిన వసతులు మాత్రం కల్పించడంలేదన్నదే జనాభిప్రాయం.






Comments