‘శంకర’ మహత్యం.. కూర్మస్వామికి స్వర్ణాభరణ యోగం
- Prasad Satyam
- Oct 11, 2025
- 2 min read
సుమారు వందేళ్లుగా అలంకారాలకు నోచుకోని కూర్మనాధుడు
భద్రత కారణాలతో సింహాచలానికి ఆభరణాల తరలింపు
దాంతో ఇన్నాళ్లూ కళ తప్పిన స్వామి
రికార్డులు తవ్వి అసలు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే
పట్టుబట్టి వాటిని వెనక్కి తెప్పించడంలో సఫలీకృతం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
శ్రీమహావిష్ణువు దశావతారాలు ఎంత ప్రశస్తమైనవో.. అలంకార ప్రియుడిగా ఆ దేవదేవుడు అంతే ప్రసిద్ధుడు. ఏ అవతారంలో ఉన్నా పట్టుపీతాంబరాలు, స్వర్ణ వజ్రాభరణాలతో కూడిన అలంకరణలతో స్వామి ధగధగా మెరిసిపోతుంటాడు. కానీ ఆ స్వామి కూర్మావతారంలో వెలసిన అత్యంత అరుదైన క్షేత్రమైన శ్రీకూర్మంలో పూజలందుకుంటున్న స్వామి విగ్రహం మాత్రం నగలు, అలంకరణల ధగధగలకు నోచుకోక భక్తులను నిరాశపరుస్తోంది. ఆభరణాలు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమా అంటే.. కానే కాదు. కేజీలకొద్దీ స్వర్ణాభరణాలు ఉండేవి. కానీ అవి ఎప్పుడో దాదాపు వందేళ్ల క్రితం సింహాచల క్షేత్రానికి తరలించేశారు. ఆ తర్వాత ఎవరూ వాటి గురించి పట్టించుకోలేదు. అవి తిరిగి స్వామి చెంతకు చేరలేదు. ఎట్టకేలకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కృషి, చొరవ కారణంగా ఆ ఆభరణాలు తిరిగి స్వామి చెంతకు చేరాయి. కూర్మ రూపంలో ఉండే స్వామికి అసలే కరచరణాలు, వక్షస్థలం, పూర్తిస్థాయి ముఖం ఉండవు. అయినా అలంకార ప్రియుడైన స్వామిన సంతుష్టపరిచేందుకు మూలవిరాట్‌కు కొద్దిపాటి అలంకరణలతో సరిపెట్టినా.. ఉత్సవ విగ్రహాలను మాత్రం ప్రత్యేక పూజలు, ఉత్సవాల సందర్భాల్లో పూర్తిస్థాయిలో అలంకరించి అటు స్వామిని సంతృప్తి పరచడంతోపాటు ఇటు భక్తులకు కనువిందు చేసేవారు. ఈ అలంకరణల కోసం మూడు కిలోల బంగారు ఆభరణాలను వినియోగించేవారు. అయితే ఇదంతా గత కాలపు ముచ్చట. కొన్ని దశాబ్దాలుగా అటువంటి విశేష అలంకరణలో కూర్మనాథ స్వామి కనిపించడమే దుర్లభంగా మారింది.
వందేళ్లుగా సింహాచలం చెస్ట్‌లో..
దీనికి కారణమేమిటంటే భద్రత పేరుతో కూర్మనాథస్వామి ఆభరణాలను మొత్తంగా తీసుకెళ్లి సింహాచల క్షేత్రానికి చెందిన ఆభరణాల చెస్ట్‌లో పెట్టారు. సుమారు వందేళ్ల క్రితం ఇది జరిగింది. అప్పట్లో ఇంత అభివృద్ధి లేదు. సౌకర్యాలు ఉండేవి కావు. దొంగల భయం కూడా ఎక్కువగా ఉండేది. భక్తుల తాకిడి కూడా పెద్దగా ఉండేది కాదు. నగరంలో ఉన్న అరసవల్లి క్షేత్రంలోనే గతంలో చోరీ జరిగింది. అలాంటిది మారుమూలన ఉన్న శ్రీకూర్మం క్షేత్రం గురించి వేరేగా చెప్పనక్కర్లేదు. ఆ క్షేత్రంలో ఇప్పటికీ రాత్రి ఏడు గంటల తర్వాత దర్శనాలు ఉండవు. అలాంటిది వందేళ్ల క్రితం పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. అందుకే స్వామి ఆభరణాలు ఇక్కడుంటే రక్షణ ఉండదని అధికారులు, పూజారులు భావించారు. అప్పట్లో సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణ అధికారే శ్రీకూర్మం దేవస్థానం అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహించేవారు. అదేవిధంగా సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తలైన విజయనగరం పూసపాటి గజపతి వంశీయులే శ్రీకూర్మ క్షేత్రానికీ ధర్మకర్తలు కావడం, శ్రీకూర్మ ఆలయాన్ని సింహాచలం దేవస్థానం అప్పట్లో దత్తత తీసుకోవడంతో కూర్మనాథుని ఆభరణాలను సింహాచలం క్షేత్రానికి తరలించి అక్కడి ఆభరణాల చెస్ట్‌లో భద్రపరిచారు. కానీ తర్వాత కాలంలో ఎవరూ వాటి గురించి పట్టించుకోలేదు. ఫలితంగా అలంకార ప్రియుడైన కూర్మనాథుడు అమావాస్య చంద్రుడిలా ఉండిపోవాల్సి వచ్చింది.
ఫలించిన కృషి
ఇటీవలి కాలంలో కూర్మనాథాలయానికి భక్తుల తాకిడి పెరిగింది. క్షేత్రంలో నిత్యాన్నదానం కూడా చేస్తున్నారు. సినీనటుడు శ్రీహరి బతికున్నప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చి ధ్వజస్తంభ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించారంటే.. కూర్మనాథుని ప్రాశస్త్యం దశదిశలా వ్యాప్తి చెందుతున్నట్టు అర్థమవుతుంది. శ్రీకూర్మం క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి అనేకమంది దాతలు ముందుకొస్తున్నారు. వత్సవలసలో ట్రైమెక్స్ కంపెనీ నడుస్తున్నప్పుడు సీఎస్‌ఆర్ యాక్టివిటీ కింద ఆలయంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఆ తర్వాత స్వామి పుష్కరిణిని కూడా పునరుద్ధరించారు. ఇంత అభివృద్ధి జరుగుతున్నా అలంకారాలు లేక స్వామి కళ తప్పిన స్థితిలో ఉండిపోవాల్సి వచ్చింది. భక్తుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అసలు స్వామి ఆభరణాలు ఎక్కడున్నాయని ఆరా తీస్తే ఎవరూ సరైన సమాచారం చెప్పలేదు. దాంతో ఆలయ రికార్డులన్నీ బయటకు తీసి పరిశీలిస్తే సింహాచలం చెస్ట్‌లో ఉన్నట్లు వెల్లడైంది. దాంతో వాటిని తెప్పించేందుకు నిర్విరామ కృషి చేశారు. ఆలయానికి ట్రస్ట్ బోర్డు ఏర్పడిరదని, సౌకర్యాలు, భద్రత మెరగయ్యాయని.. అందువల్ల స్వామి ఆభరణాలు శ్రీకూర్మంలోనే ఉండాలని పట్టుబట్టి అధికారులను ఒప్పించి వాటిని తిరిగి తెప్పించారు. దాంతో వందేళ్ల తర్వాత 103 ఆభరణాలు స్వామి పాదాల చెంతకు చేరాయి. వీటిలో కిరీటాలు, కంఠాభరణాలు, దండవంకీలు, హస్త ముద్రికలు వంటివి ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన ట్రస్ట్‌బోర్డు ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. స్వామి ఆభరణాలను వెనక్కు తెప్పించేందుకు శంకర్ చేసిన కృషిని వివరించారు. కొన్ని తరాలకు అసలు స్వామివారికి బంగారు ఆభరణాలు ఉన్నట్టే తెలియదు. కానీ శంకర్ మాత్రం ఈ దిశగా ప్రయత్నించి విజయం సాధించారు.










Comments