శిలగాం ఎస్‌బీఐలో డ్వాక్రా రుణాల కుంభకోణం
- NVS PRASAD

- May 5, 2025
- 3 min read
కవిటి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
పాత డీజీఎం, ఆర్‌ఎంలకు నోటీసులు
బజారు బ్రాంచిలో తిన్న సొమ్ము కట్టాలని ఆదేశాలు
గార కేసులో సూత్రధారులకూ శిక్ష తప్పదు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఖాతాదారుల తృప్తే మా ధ్యేయమంటూ పుట్టుకొచ్చిన బ్యాంకులు తమ ఉద్యోగుల సంతృప్తే బ్యాంకు బిజినెస్ రహస్యం అనే స్థాయికి దిగజారిపోయాయి. ఖాతాదారులకు సేవలందించాల్సిన బ్యాంకులు నకిలీ ఖాతాలను సృష్టించి కోట్లాది రూపాయలు దిగమింగేస్తున్నా చర్యలు తీసుకోవాల్సిన మేనేజర్ స్థాయి అధికారులు ఇందులో వాటాలు పంచుకోవడం వల్ల కుంభకోణాలు వెలుగుచూడకుండా మిగిలిపోతున్నాయి. కవిటి మండలం శిలగాం ఎస్‌బీఐ బ్రాంచిలో రూ.3కోట్లు పైబడిన డ్వాక్రా రుణాల కుంభకోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. గార బ్రాంచిలో బంగారం నగలు మాయం, నరసన్నపేట బజారు బ్రాంచిలో నకిలీ ఎంఎస్‌ఎంఈ రుణాలు వెలుగుచూసిన తర్వాత ఎప్పుడో కరోనా కాలంలో జరిగిన డ్వాక్రా రుణాల బాగోతం ఇప్పుడు బయటపడిరది. వివరాల్లోకి వెళితే..
కవిటి మండలం శిలగాం బ్రాంచిలో డ్వాక్రా సంఘాల పేరిట బ్యాంకు అధికారులే రుణాలు చూపించి, ఆ సొమ్మును దిగమింగేశారు. దీని విలువ రూ. 3 కోట్లు పైబడి ఉంటుందని భోగట్టా. డ్వాక్రా సంఘాలకు పావలా వడ్డీకే రుణాలు ప్రభుత్వం ఇస్తున్నందున ఈ సంఘాల పేరుతో పెద్ద మొత్తంలో ఈ బ్రాంచిలో పని చేసిన ఉద్యోగులు రుణాలు నొక్కేశారు. పావలాకే రుణం దొరుకుతుండటం ఒక కారణమైతే, ఈ సొమ్మును బయట వడ్డీలకు తిప్పి పెద్ద మొత్తంలో సంపాదించవచ్చనే దురాలోచన రెండో కారణం. సాధారణంగా ఒక డ్వాక్రా సంఘానికి రూ.20 లక్షల వరకు రుణం మంజూరుచేసే అవకాశం ఉందనుకుందాం. కానీ, బ్రాంచి మేనేజర్ ముందుగా రూ.5 లక్షలు విడుదల చేస్తారు. ఈ సంఘం రీ పేమెంట్ పరిస్థితి మెరుగ్గా ఉందనుకుంటే.. మిగిలిన రూ.15 లక్షలు త్వరగా మళ్లీ మంజూరు చేస్తారు. ఇక్కడ డ్వాక్రా సంఘాల పేరిట ఒకేసారి రూ.20 లక్షలు మంజూరుచేసి, వారికి మాత్రం రూ.5 లక్షలే ఇచ్చి, మిగిలిన రూ.15 లక్షలు తమ సొంత అవసరాలకు మళ్లించుకున్నారు. ఇది కాకుండా శిలగాం బ్రాంచి పరిధిలో ఉన్న డ్వాక్రా సంఘాల పేరుకు కొంచెం అటు ఇటుగా పేర్లు పెట్టి, కొత్త ఖాతాలు తెరిచి అందులో వారిని డ్వాక్రా సంఘాలుగా చూపించి రుణాలు మంజూరుచేసి సొంతానికి వాడుకున్నారు. ఇదంతా కలిపి దాదాపు రూ.3.50 కోట్లు ఉంటుందని అంచనా. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్వాక్రా రుణాలు మాఫీ చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. లెక్కాపత్రం లేకుండా డీఆర్‌డీఏ వద్ద ఉన్న డ్వాక్రా సంఘాల లెడ్జర్‌లో ఒక లెక్క, శిలగాం బ్రాంచిలో మరో లెక్క ఉండటంతో ప్రభుత్వం మాఫీ చేసిన ఖాతాలో బ్యాంకు అధికారులు సొంతానికి వాడుకున్న రుణాలు కూడా మాఫీ అయిపోయాయి. డీఆర్‌డీఏ లెక్కల మేరకు శిలగాంలో ఉన్న డ్వాక్రా సంఘాలకు పెద్ద మొత్తంలో మాఫీ అయినట్లు తేలింది. వాస్తవానికి వారికి ఆ మేరకు సొమ్ములు రాలేదు. దీంతో ఆరా తీస్తే మొత్తం డొంకంతా కదిలింది. ఈలోగా అక్కడ బ్రాంచి మేనేజర్‌తో పాటు రీజనల్ మేనేజర్‌కు బదిలీ అయిపోయింది. కొత్తగా వచ్చిన రీజనల్ మేనేజర్ టీఆర్‌ఎం రాజు దృష్టికి కూడా ఈ కుంభకోణం వెళ్లింది. కానీ ఇప్పటి వరకు దానిపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. తాజాగా స్టేట్‌బ్యాంక్ శ్రీకాకుళం రీజియన్ పరిధిలో అనేక కుంభకోణాలు బయటపడుతుండటంతో ఇది తమ మెడకు చుట్టుకుంటుందేమోనన్న భయంతో ఇప్పుడు కొత్తగా వచ్చిన సిబ్బంది కవిటి పోలీస్‌స్టేషన్‌లో దీనికి సంబంధించి ఫిర్యాదు చేశారు. స్వయంగా బ్యాంకు అధికారులే ఆధారాలన్నీ సమర్పించడంతో కాశీబుగ్గ డీఎస్పీ దీని మీద కేసు నమోదు చేయాలని కవిటి ఎస్‌ఐకి సూచించారు. డ్వాక్రా సంఘాల రుణాల కుంభకోణంలో అప్పటి బ్యాంకు అధికారులు వీరి నుంచి ఇన్సూరెన్స్ కూడా చేయించారు. సంబంధిత ఇన్సూరెన్స్ సంస్థలకు సొమ్ము మొత్తం ముట్టిందో లేదో తెలీదు కానీ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ఇంతకు క్రితమే చేసింది. కానీ విచిత్రంగా కమీషన్ల కోసం మళ్లీ డ్వాక్రా మహిళల పేరిట ఇన్సూరెన్స్ చేసి వారి సొమ్మును అనవసరంగా ఖర్చు చేయించారు. అసలు ఇన్సూరెన్స్ కచ్చితంగా చేసితీరాలన్న నిబంధన ఏమీ లేదు. అందుకే చాలా గ్రూపులు ఎస్‌బీఐ బాధ పడలేక వేరే బ్యాంకులకు వలస వెళ్లిపోయాయి.
నరసన్నపేట బజారు బ్రాంచిలో నకిలీ ఎంఎస్‌ఎంఈ రుణాలు మంజూరూచేసి, ఆ సొమ్ములు దిగమింగేసిన కేసులో అప్పటి డీజీఎం పంకజ్, ఆర్‌ఎం టీఆర్‌ఎం రాజు, బ్రాంచి మేనేజర్ శ్రీకర్, ఫీల్డ్ ఆఫీసర్ చింతాడ శ్రీనులను బాధ్యులను చేస్తూ బ్యాంకు ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు. అసలు ఈ బ్రాంచిలో నకిలీ రుణాల ప్రస్తావనే లేదని టీఆర్‌ఎం రాజు తన పై అధికారులకు చెప్పుకొచ్చారు. ‘సత్యం’లో వచ్చినవి కట్టుకథలని నమ్మించే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ఈ కేసు సీఐడీ టేకప్ చేయాలని బ్యాంకు అధికారులు లేఖ రాశారో, ఆ తర్వాత కథ మొత్తం వీరి చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. ‘సత్యం’లో కథనం వచ్చిన తర్వాత బ్యాంకు మేనేజర్‌గా పని చేసిన శ్రీకర్ రూ.70 లక్షల పైచిలుకు తన వాటాగా కట్టేశారు. మిగిలిన సొమ్ములో స్థాయిని బట్టి వీరు నలుగుర్నీ బాధ్యుల్ని చేసినట్టు తెలుస్తుంది.
గార బ్రాంచి విషయంలో కూడా అటు పోలీసులను, ఇటు బ్యాంకు మేనేజ్‌మెంట్‌ను టీఆర్‌ఎం రాజు తప్పుదోవ పట్టించారని ఎట్టకేలకు ఉన్నతాధికార వర్గాలు ఒక అంచనాకు వచ్చాయి. ఆర్‌ఎంగా టీఆర్‌ఎం రాజు పని చేసిన కాలంలో డీజీఎంగా ఉన్న పంకజ్‌కు అన్నీ తెలుసని, ఆయన సూచనల మేరకే ఇక్కడ ఏకపక్షంగా బ్యాంకు వ్యవహరించిందని తేలినట్టు భోగట్టా. అందుకే రాజు, పంకజ్‌లపై లోడీ నోటీసులు జారీ చేశారు. లోడీ అంటే లిస్ట్ ఆఫ్ డౌట్‌ఫుల్ ఇంటిగ్రిటీ. ఎస్‌బీఐ సమగ్రతను దెబ్బతీసే విధంగా వ్యవహరించారన్నది ఈ నోటీసు సారాంశం. నరసన్నపేట బజారు బ్రాంచి వ్యవహారంలో డీఎం శ్రీకర్‌ను ఇప్పటికే ఉద్యోగం నుంచి బ్యాంకు తొలగించింది. టీఆర్‌ఎం రాజు అండ్ బ్యాచ్‌కు మిగిలిన రూ.2.69 కోట్లు కట్టాలని నోటీసులిచ్చింది. దీంతో శిలగాం బ్రాంచిలో జరిగిన డ్వాక్రా రుణాల కుంభకోణం కూడా తమ మెడకు చుట్టుకుంటుందని తాజాగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఇప్పుడు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.










Comments