శశి గ్యారేజ్..! ఇక్కడ ఫేక్ ఫిర్యాదులు తయారుచేయబడును
- Prasad Satyam
- 2 days ago
- 3 min read
సమగ్రశిక్ష ఏపీసీని పంపించే ప్రయత్నాలు మొదలు
ఫిర్యాదులు తాము చేయలేదంటూ ఎచ్చెర్ల స్టేషన్‌లో ఫిర్యాదు
ఎమ్మెల్సీ పేరు వాడుకొని జిల్లాలో విద్యావ్యవస్థను ముంచేస్తున్న లెక్చరర్
ఆర్ట్స్ కాలేజీ గత ప్రిన్సిపాల్ కూడా గ్యారేజ్ బాధితురాలే

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
తాను చక్రం తిప్పాలనుకున్నచోట వేలు, కాలు తనదే ఉండాలని కోరుకుంటాడాయన. అలా కాకుండా ఎవరైనా స్వతంత్రంగా వ్యవహరిస్తే.. వారిని అక్కడి నుంచి బదనాం చేసి పంపించే వరకు నిద్రపోడు. అలా అని మనోడేమైనా తీసుకునే జీతానికి న్యాయం చేస్తున్నాడా? అంటే.. అదీ లేదు. పాఠాలు చెప్పడు. తాను అన్ని గైడ్‌లలో కాపీ చేసి స్వయంగా పుట్టించిన పుస్తకం కొనుక్కొని పరీక్షలు రాయమని చేతులెత్తేసే రకం. ఏ ముహూర్తాన ఈయన మిత్రుడొకరు ఎమ్మెల్సీ అయ్యారో.. అప్పట్నుంచి రాజకీయాల మీద మోజు పెరిగి ఎమ్మెల్సీనే ముందు పెట్టి, ఆయన స్థానానికే ఎసరు పెట్టాలని చూస్తున్న ఘనుడాయన. లెక్చరర్‌గా జీతం తీసుకుంటున్నందుకు కనీసం నెలకు రెండు పాఠాలైనా చెప్పండని ఎవరైనా సూచిస్తే.. వారిని అన్‌పాపులర్ చేసి, అక్కడి నుంచి పంపించే వరకు విశ్రమించని కర్షకుడాయన. అయితే జనతా గ్యారేజ్ సినిమా ఈయన స్ఫూర్తితోనే తీసినట్టు అనిపిస్తుంది. కాకపోతే అక్కడ జూనియర్ ఎన్టీఆర్, మోహన్‌లాల్ సమాజంలో రుగ్మతలను నయం చేయడానికి కంకణం కట్టుకుంటే, ఈయన ఫేక్ ఫిర్యాదులు వండి వార్చడానికి, దాని మీద ఎమ్మెల్సీ పరపతిని వాడుకొని వారిని శంకరగిరిమాన్యాలు పట్టించడానికి ఒక గ్యారేజ్‌ను నడుపుతున్నారు. పాఠాలు చెప్పాల్సిన బాధ లేదు. ప్రిన్సిపాల్ స్థాయి అధికారి పాఠాలు చెప్పమని కోరే సాహసం చేయరు. ఎందుకంటే.. ఈయన ప్రాపకంతోనే ప్రిన్సిపాల్ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు. కాదు, కూడదని పాత మహిళా ప్రిన్సిపాల్ లాగ పట్టుపడితే శ్రీకాకుళానికి దూరంగా ఎక్కడో పని చేసుకోవాల్సిన గత్యంతరం వస్తుందన్న విషయం ఇక్కడున్నవారికి తెలుసు. అందుకే శశి గ్యారేజ్ శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీని అడ్డాగా చేసుకొని ఫేక్ ఫిర్యాదులను తయారుచేస్తుంది. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా సురేఖ పని చేసినప్ప్పుడు ఆమె మీద కనీసం 50 ఫిర్యాదులు ఈ గ్యారేజ్‌లోనే తయారుచేశారు. ఇందులో అనేక ఫిర్యాదుల మీద విచారణ చేపట్టడానికి అప్పటి ఉన్నతాధికారులు ముందుకొచ్చినా ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరో తెలిసేదికాదు. దానికి సంబంధించిన ఆధారాలు ఇచ్చే నాధుడు కూడా కనిపించేవాడు కాదు. దీంతో ఎమ్మెల్సీతో ఉన్న ఫ్రెండ్షిప్‌ను అడ్డు పెట్టుకొని సురేఖను భీమిలీ పంపించారు. సురేఖ మీద పెట్టిన ఫిర్యాదులెన్ని? ఎవరు పెట్టారు? వారు ఎవరు? అన్న వివరాలు మరోసారి చర్చించుకునే ముందు అసలు ఫేక్ ఫిర్యాదుల గ్యారేజ్ వ్యవహారం ఇప్ప్పుడు మళ్లీ రచ్చకెక్కింది. ఆర్ట్స్ కళాశాలలో తనమీద చర్యలు తీసుకొనే దమ్ములేని ప్రిన్సిపాల్ ఉండటం వల్ల తనకొచ్చిన నష్టమేమీ లేదని భావించడంతో ఈసారి శశిగ్యారేజ్ సమగ్రశిక్ష మీద దష్టి సారించింది. ఈ గ్యారేజ్‌కు ఓనర్ శశి కాగా, మేనేజర్ శ్రీను. శశి డైరెక్షన్ మేరకు శ్రీను ఫేక్ ఫిర్యాదులు ఫేక్ పేర్లతో తయారు చేస్తుంటాడు. తాజాగా సమగ్రశిక్షలో ఏపీసీగా పనిచేస్తున్న పప్పల వేణుగోపాల్ సరుబుజ్జిలి మండలం మతలబుపేటకు చెందిన వీరఘట్టపు భాస్కరరావు పేరుతో ఉన్న శివగంగ ట్రేడర్ పేరిట టెండర్లు వేసి కోట్లాది రూపాయలు వ్యాపారం చేస్తున్నారంటూ ఆమధ్య జిల్లాలో అందరికీ వి.వెంకటరమణ అనే పేరుతో నాలుగు పేజీల ఫిర్యాదును అందరికీ పంపారు. కేజీబీవీల్లో పేద పిల్లలకు పెట్టే భోజనాలకు పంపిణీ చేసే సరుకులు అరకొర నాణ్యతతో ఉన్నాయని, ఇందులో భారీ దోపిడీకి పాల్పడుతున్నారంటూ శశి గ్యారేజ్‌లో ఓ ఫిర్యాదును వండి వార్చారు. దీన్ని శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు అందరికీ పంపారు. అయితే ఫిర్యాదు చేసిన వెంకటరమణ కచ్చితమైన ఆధారాలతోనే ఫిర్యాదు చేశాడనిపించుకోవడం కోసం ఆయన పోస్టల్ అడ్రస్, ఫోన్‌నెంబర్ కూడా అందులో పేర్కొన్నారు. దీనిమీద అధికారులు విచారణ చేపట్టడం మొదలుపెడితే పత్రికలకు లీకులిచ్చి సమగ్రశిక్షను వేణుగోపాల్ దోచుకుపోతున్నారని ప్రచారం చేయించి, ఆయన్ను బదనాం చేయాలని చూశారు. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఎవరైతే వి.వెంకటరమణ ఫోన్ నెంబరు ఇచ్చి మరీ ఫిర్యాదులు పంపించారో, ఆయన్ను సంప్రదిస్తే.. తాను ఎటువంటి ఫిర్యాదూ చేయలేదని, ఇలాగే గతంలోనూ తన పేరిట ఆర్ట్స్ కాలేజీలో ఉద్యోగుల మీద ఫిర్యాదులు వెళ్లాయని చెప్పారు. అయితే ఇదే ప్రతీసారి రిపీట్ అవుతుండటంతో ఈసారి ఆయన నేరుగా ఆయన గత నెల 21న ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌లో ఓ ఫిర్యాదు ఇచ్చారు. దీంతో తమ గ్యారేజ్ పావుగా వాడుకుంటున్న ఒక ఆధార్ పనికిరాదని తేలిపోవడంతో తాజాగా ఇదే కంప్లైంట్‌ను కేవీఎన్ మూర్తి, మెయిన్‌రోడ్, ఎచ్చెర్లతో పాటు ఆయన మొబైల్ నెంబరు వేసి మరోసారి అందరికీ రిజిస్టర్ పోస్టులు చేశారు. మళ్లీ అదే కథ. ఈ కేవీఎన్ మూర్తి అనే వ్యక్తిని సంప్రదిస్తే.. తాను గతంలో కేజీబీవీలకు సరుకులు సరఫరా చేసిన మాట వాస్తవమని, అయితే ఇప్ప్పుడా పని చేయడం లేదని, ఫిర్యాదు తాను చేయలేదంటూ తేల్చేశారు. అంటే.. ఇది కూడా ఫేక్ కంప్లైంటే. అయితే సమగ్రశిక్షకు ఏపీసీగా పప్పల వేణుగోపాల్ వచ్చి ఇంకా ఐదు నెలలు కాలేదు. అయినా ఆయన్ను ఇక్కడి నుంచి లేపేయాలి. ఆర్ట్స్ కాలేజీలో కులం కార్డును బయటకు తీసి, అందర్నీ వాడేస్తున్న శశి గ్యారేజ్ బందం.. అదే సామాజికవర్గానికి చెందిన పప్పల వేణుగోపాల్‌ను ఎందుకు టార్గెట్ చేసింది? అంటే.. తనకు దక్కనిది మరొకరికి దక్కడానికి వీళ్లేదన్న శాడిజం. పోనీ వీరఘట్టపు భాస్కరరావు పప్పల వేణుగోపాలరావు వచ్చినప్ప్పుడే కేజీబీవీ కాంట్రాక్టర్‌గా వచ్చారా? అంటే.. అదీ కాదు. ఎప్పట్నుంచో భాస్కరరావు కేజీబీవీలకు సరుకులు సప్లై చేస్తున్నారు. కేజీబీవీల్లో నాణ్యమైన సరుకులు అందడంలేదన్న ఆరోపణలు ఎప్ప్పుడూ ఉన్నాయి. విచిత్రంగా శశి పని చేస్తున్న సమయంలోనూ ఈయనే కాంట్రాక్టరు. అప్ప్పుడు కనిపించని భాస్కరరావు దోపిడీ ఇప్ప్పుడు ఏపీసీ మారగానే కనిపించడం విడ్డూరం. ఇప్ప్పుడు ఈ ఫిర్యాదు కూడా ఫేక్ అని తేలిపోయిందని శశి గ్యారేజ్ వదిలేయదు. మళ్లీ ఇంకో ఆధార్‌ను వెతుక్కుంటుంది. దాని మేరకు ఫుల్ అడ్రస్, ఫోన్ నెంబరు ఇచ్చి మరీ ఇదే ఫిర్యాదును పంపుతుంది. పదే పదే ఫిర్యాదులు వెళ్లినా, అధికారులు స్పందించడంలేదని కొద్ది రోజుల తర్వాత బురద చల్లే కార్యక్రమం మొదలవుతుంది. ఏపీసీ తీసుకున్న కమీషన్‌లో పై అధికారులకు కొంత ముట్టజెప్పడం వల్లే ఎవరూ చర్యలు తీసుకోడానికి ముందుకు రావడంలేదని ప్రచారం చేస్తారు. ఇదంతా గ్యారేజ్‌లో వ్యూహాత్మకంగా జరుగుతున్న ఎత్తుగడలు. సురేఖ ప్రిన్సిపాల్‌గా ఉన్నప్ప్పుడు పదుల సంఖ్యలో ఆర్‌టీఐ కింద దరఖాస్తులు చేసేవారు. అక్కడ కూడా ఫేక్ అడ్రస్ ఇవ్వడం వల్ల ఆర్‌టీఐ ద్వారా పంపిన సమాచారం మళ్లీ వెనక్కు వచ్చేసేది. కొద్ది రోజులు కొద్దిమంది పేర్ల మీద ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగినా ఇవ్వడంలేదని ప్రచారం చేసి, మళ్లీ దాని మీద ఓ ప్రత్యేకమైన ఫిర్యాదును ఈ గ్యారేజ్ తయారు చేస్తుంది. పదేపదే ఒకే వ్యక్తిని టార్గెట్ చేయడం వల్ల ఈ తలనొప్ప్పులు పడలేక ముందుగా ఉన్నతాధికారులు ట్రాన్స్‌ఫర్ చేసేస్తున్నారు. అయితే ఈసారి శశి గ్యారేజ్ వేణుగోపాల్ మీద పడింది. ఆయన వచ్చిన ఐదు నెలల్లో అప్ప్పుడే ఐదు ఫిర్యాదులు వెళ్లాయి. అన్ని పత్రికా కార్యాలయాలకు రిజిస్టర్ పోస్టులు కూడా వచ్చాయి. ఇవన్నీ ఫేక్ అని జిల్లా అధికారులు నిర్ధారించుకున్న తర్వాత సంబంధిత ఏపీసీ అందర్నీ మేనేజ్ చేసేస్తున్నారని, ఈయనపై చర్యలు తీసుకోపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందంటూ ఎమ్మెల్సీ ముందు బైఠాయిస్తారు. ఆయనకు మరో పని తోచనీయకుండా దీని మీద యాక్షన్ తీసుకునేవరకు విజయవాడకు అప్ అండ్ డౌన్ చేస్తునే ఉంటారు. ఇక్కడేం జరుగుతుందో తెలుసుకోలేని ఎమ్మెల్సీ చివరకు తన ఎన్నికల కోసం పని చేశారన్న సాఫ్ట్‌కార్నర్‌లో అమాయకులను బలి చేసేస్తున్నారు. అయితే ఈసారి ఏపీసీ పప్పల వేణుగోపాల్‌ను టార్గెట్ చేయడంతో ఈ వ్యవహారాలు బయటపడ్డాయి. ఎందుకంటే.. ఆయన కూడా రెవెన్యూ అసోసియేషన్‌లో డక్కాముక్కీలు తిని ఇక్కడకు వచ్చారు. ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. ఆమదాలవలస కాలేజ్ ప్రిన్సిపాల్ సీనియారిటీ లెక్కల మేరకు శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీకి వస్తారనే ప్రచారం ఉండటంతో ఆయన్ను ఎప్ప్పుడో భ్రష్టు పట్టించే ప్రయత్నాలు శశి గ్యారేజ్ మొదలుపెట్టేసింది.






Comments