సిక్కోలుపై విషం కక్కుతున్నాయ్!
- NVS PRASAD

- Aug 3, 2024
- 3 min read
నగర ప్రజల్లో పెరుగుతున్న శ్వాసకోస సమస్యలు
అనారోగ్యం పంచుతున్న కోనోకార్పస్ వృక్షాలు
పాలకొండ రోడ్డు పొడవునా వాటినే నాటిన అధికారులు
కేంద్రం నిషేధించినా పట్టించుకోని మున్సిపల్ అధికారులు

చెట్లు ఉన్నచోట వాతావరణ స్వచ్ఛంగా, ఆరోగ్యకరంగా ఉంటుందంటారు. అందుకే మొక్కల పెంపకాన్ని ప్రభుత్వాలు విరివిగా చేపడుతున్నాయి. ప్రోత్సహిస్తున్నాయి. కానీ అన్ని చెట్లూ ఆరోగ్యకరమైనవి కావన్న విషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం చెప్పిందంటే.. చేసేయాలంతే.. అన్న యావలో జీవమనుగడ ప్రమాదకారులైన కొన్ని రకాల మొక్కలను ఇబ్బడిముబ్బడిగా నాటించేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ఆ కోవలోకి వచ్చే చెట్లలో ఒక రకమై కోనోకార్పస్. ఈ పేరు చెబితే మీకు అర్థం కాకపోవచ్చు. ఒక్కసారి శ్రీకాకుళం నగరంలోని పాలకొండ రోడ్లులోకి వెళ్లండి.. ఆ రోడ్డులో డివైడర్ మధ్యలో ఏపుగా పెరిగి నిలువెత్తుగా చెట్ల బారులు కనిపిస్తాయి. అవే కోనోకార్పస్ చెట్లు. నాటిన స్వల్పకాలంలోనే ఏపుగా పెరిగే ఈ చెట్ల వల్ల నీడ, పరిశుద్ధమైన గాలి లభిస్తాయని భావించడం సహజం. కానీ ప్రజలకు ఇవి పంచేవి అవి కావని.. తీవ్ర అనారోగ్య సమస్యలు పెంచుతాయని తెలిస్తే మనమే కత్తి తీసుకెళ్లి ఆ చెట్లను ఉన్న పళంగా నరికేయాలనిపిస్తుందనడం అతిశయోక్తి కాదు. అటువంటి ప్రమాదకర చెట్లను మున్సిపల్ అధికారులు మన మధ్య నాటించి ప్రజారోగ్యానికి మరింత చేటు చేసినవారవుతున్నారు.
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
ఈమధ్య కాలంలో ఎవరిని కదిలించినా జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు చెబుతుంటారు. ఇవే సమస్యలు నగరంలో వైద్యులకు గిరాకీ పెంచి ప్రజల ఆరోగ్యానికి, జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఈ దుస్థితికి కారణం కరోనా ప్రభావమేనని అందరూ అనుకోవడం సహజం. కానీ అది వాస్తవం కాదు. మన మధ్యనే నిటారుగా నిలబడి.. విలాసంగా ఊగుతూ.. పరిశుభ్రమైన గాలి అందిస్తున్నామన్నట్లు ఫోజులు కొట్టే కోనాకార్పస్ చెట్లే మన ఆరోగ్యం పాలిట విలన్లుగా మారుతున్నాయంటే నమ్మశక్యం కాకపోయినా చేదు వాస్తవం. పర్యావరణ పరిరక్షణ, పట్టణాల్లో సుందరీకరణ పేరుతో దేశవ్యాప్తంగా మొక్కలు నాటే సంప్రదాయం బాగా వేళ్లూనుకుంది. ప్రభుత్వాల ప్రోత్సాహంతో స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కూడా మొక్కలు నాటడం, పెంపకం కార్యక్రమాల్లో విద్యార్థుల నుంచి అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తున్నాయి. అందులో భాగంగానే శ్రీకాకుళం నగరపాలక సంస్థ అధికారులు నగరంలోని ప్రధాన మార్గాల్లో రోడ్లకు ఇరువైపులా, మధ్యలో ప్రజలకు నీడనివ్వడంతోపాటు సుందరీకరణకు తోడ్పడేలా మొక్కలు నాటించారు. నగరంలోని ఇతర మార్గాల మాటెలా ఉన్నా కీలకమైన పాలకొండ రోడ్డులో నాటిన కోనోకార్పస్ మొక్కలు ఇప్పుడు తాటిచెట్లకు మించిన ఎత్తుకు పెరిగి సుందరత్వాన్ని ఇనుమడిరపజేసినా అవి పంచిపెడుతున్న అనారోగ్యమే ఇప్పుడు ఆందోళన పెంచుతోంది. ఏడురోడ్ల జంక్షన్ నుంచి డే అండ్ నైట్ జంక్షన్ వరకు రోడ్డు మధ్యలోని డివైడర్లలో వందకుపైగా చెట్లు ఉన్నాయి.
వీటి వల్ల నష్టం ఏమిటంటే?
సాధారణంగా వనాలు, అడవులు ఉన్న ప్రాంతాల్లో వాతావరణం స్వచ్ఛంగా ఉండటానికి చెట్లు దోహదపడతాయి. గాలిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తాయి. అందుకే వృక్షాలను మానవాళికి మిత్రులుగా భావిస్తారు. కానీ కోనోకార్పస్ చెట్ల వల్ల ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా ఇంకా అనేక అనర్థాలు సంభవిస్తాయని పర్యావరణ నిపుణులు, వృక్షశాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ చెట్ల వల్ల పచ్చదనం పెరుగడం, పరిసరాలు కొత్త శోభ సంతరించుకోవడం వాస్తవమే అయినా దాని మాటున ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ఈ చెట్లు రాల్చే పుప్పడి అత్యంత ప్రమాదకరమైనది. దీనివల్ల గాలి కలుషితమవుతుంది. దాన్ని పీల్చేవారు దగ్గు, కఫం, జలుబు వంటి ఆస్తమా లక్షణాలతో బాధపడతారు. కరోనా బాధితుల మాదిరిగానే ఊపరితిత్తుల సమస్యలు పెరుగుతాయి. ఎంత ఖర్చుపెట్టినా ఎన్ని మందులు వాడినా ఒకపట్టాన ఇవి తగ్గవు. పైగా ఈ మొక్కలు పెరుగుతున్నకొద్దీ వాటి వేళ్లు సమీపంలోని భవనాలు, ఇతర నిర్మాణాల్లోకి చొచ్చుకుపోయి పగులు వారేలా చేస్తాయి. దాంతో నిర్మాణాలు బలహీనపడి కూలిపోయే ప్రమాదం ఉంటుంది.
పలు దేశాల్లో ఇప్పటికే నిషేధం
కోన్ ఆకారంలో పెరుగుతాయి కనుక ఈ చెట్లను కోనోకార్పస్ అన్న పేరు వచ్చింది. ఇది ఉత్తర అమెరికా ప్రాంతానికి చెందిన మాంగ్రోవ్ జాతికి చెందింది. ఎత్తుగా, వేగంగా పెరుగుతూ కాలాలతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది కనుక ఈ మొక్కలను అనేక దేశాలు పర్యావరణ పరిరక్షణ పేరుతో నాటడం ప్రారంభించాయి. మరోవైపు ఎడారి ప్రాంతాలైన అరబ్, మధ్యప్రాచ్య దేశాల్లో ఇసుక గాలుల తాకిడిని తట్టుకునేందుకు కోనోకార్పస్ చెట్ల పెంపకాన్ని విరివిగా చేపట్టారు. ఆ క్రమంలోనే ఈ మొక్కలు మనదేశంలోకి, మన శ్రీకాకుళంలోకి కూడా ప్రవేశించాయి. అయితే కొంతకాలానికే వీటి వల్ల కలిగే అనర్థాలను గుర్తించిన పర్యావరణవేత్తలు ఈ చెట్ల పెంపకాన్ని నిషేధించాలని హెచ్చరిస్తున్నారు. ఆ మేరకు పలు దేశాలు కోనోకార్పస్ చెట్ల పెంపకాన్ని ఇప్పటికే నిషేధించాయి.
కేంద్రం నిషేధించినా..
కోనోకార్పస్ వల్ల జరిగే అనర్థాలు, వృక్షశాస్త్రవేత్తల హెచ్చరికల నేపథ్యంలో మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలతోపాటు వ్యక్తిగతంగా కూడా ఈ మొక్కలు పెంచవద్దని హెచ్చరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కానీ అవి అమలవుతున్న దాఖలాలు లేవు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ చెట్ల పెంపకాన్ని నిషేధించింది. ఆ రాష్ట్రంలో హరితహారం పేరుతో కోట్లాది రూపాయలతో చేపట్టిన కార్యక్రమాల్లో రాష్ట్రవ్యాప్తంగా వేలు, లక్షల సంఖ్యలో కోనోకార్పస్ మొక్కలు నాటేశారు. దీనివల్ల ముప్పును గుర్తించిన అక్కడి ప్రభుత్వం ఇప్పుడు ఏపుగా పెరిగిన ఆ చెట్లను సమూలంగా నరికివేయించేందుకు మళ్లీ పెద్దమొత్తం నిధుల ఖర్చుతో టెండర్లు పిలిచింది. ఇక మన రాష్ట్రంలోనూ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చొరవతో కాకినాడలో ఇప్పటికే సుమారు ఐదువేల కోనోకార్పస్ చెట్లను సమూలంగా తొలగించారు. అయితే శ్రీకాకుళం నగరపాలక సంస్థ అధికారులు మాత్రం ఆ దిశగా ఇంకా చొరవ చూపించడంలేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకుని శ్రీకాకుళంతోపాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న కోనోకార్పస్ చెట్లను తొలగించడంతోపాటు ఇకనుంచి ఈ రకం మొక్కల ఉనికే లేకుండా చేయాలని ప్రజలు కోరుతున్నారు.










Comments