top of page

సంక్షోభ సమయం.. ఆర్థిక సంయమనం!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 3 days ago
  • 2 min read

పండంటి కాపురానికి పది సూత్రాలు అన్నట్లు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక ప్రగతికి పది సూత్రాలను ప్రవచించారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన సభలో ఆయన హఠాత్తుగా పొదుపు సూత్రాలు పాటించాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చి అనేక రకాల చర్చలకు.. కొన్ని రకాల ఆందోళనలకు తావిచ్చారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యల నేపథ్యంలో మొత్తం పశ్చిమాసియాలో ఫిబ్రవరి 28 నుంచి యుద్ధవాతావరణం అలుముకుంది. ప్రపంచానికి ముడిచమురు, సహజ వాయువు సరఫరా చేసే గల్ఫ్‌లోని ఉత్పత్తి క్షేత్రాలు ధ్వంసమై ఉత్పత్తి నిలిచిపోగా.. అందుబాటులో ఉన్న కొద్దిపాటి ఉత్పత్తులను కూడా విదేశాలకు రవాణా చేసి అమ్ముకునే అవకాశం లేకుండా కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇటు అమెరికా, అటు ఇరాన్ దిగ్బంధించేశాయి. వీటి ప్రభావం భారత్‌తో సహా ప్రపంచ దేశాలన్నింటిపైనా పడింది. సప్లై చెయిన్ తెగిపోయింది. అన్ని రంగాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా 80 శాతం వరకు చమురు దిగుమతులపై ఆధారపడిన భారత్‌లాంటి దేశాలకు దిగుమతుల బిల్లు గుదిబండలా తయారైంది. ఫలితంగా విదేశీ మారకద్రవ్య నిల్వలు రూ.728.50 బిలియన్ డాలర్ల ఆల్‌టైమ్ రికార్డు స్థాయి నుంచి 690.69 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. మరోవైపు భారత కరెంటు అకౌంట్ లోటు అంతకంతకూ పెరుగుతూ 84.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆర్థిక పరిస్థితి అంతకంతకూ దిగజారుతున్న పరిస్థితుల్లో ఇన్నాళ్లూ ఏం ఫర్వాలేదు.. అని భరోసా ఇస్తూ వచ్చిన ప్రధాన మోదీ.. పొదుపు మంత్రం పఠించక తప్పలేదు. ఏడాదిపాటు బంగారం కొనుగోలు జోలికి పోవద్దని, పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని, ఎలక్ట్రికల్ వాహనాలను వినియోగించాలని, ఉద్యోగులు వర్క్ ఫ్రం ీVAమ్ చేయడంతోపాటు సమావేశాలను భౌతికంగా కాకుండా ఆన్‌లైన్‌లో నిర్వహించుకోవాలని, విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, సోలార్ మోటార్లు వాడాలని, స్వదేశీ వస్తువులే కొనగోలు చేయాలని, ఆడంబరాలు తగ్గించుకోవాలని దేశపౌరులకు మోదీ సూచించారు. ఈ పది సూత్రాలను జాగ్రత్తగా పరిశీలిస్తే.. వీటి వెనకు ఒకటే కామన్ అజెండా కనిపిస్తుంది. అదే విదేశీ మారకద్రవ్యాన్ని(ఫారెక్స్) ఆదా చేసుకోవడం. అంతర్జాతీయ వాణిజ్యంలో ముఖ్యంగా దిగుమతులకు సంబంధించి ఈ ఫారెక్స్ నిల్వలే కీలకపాత్ర పోషిస్తాయి. మనదేశం ప్రధానంగా నాలుగు రంగాల్లో పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతున్నది. అవే ముడిఇంధనం, బంగారం, ఎరువులు, వంట నూనెలు. వీటితోపాటు వ్యక్తిగతమైన, ప్రభుత్వపరమైన విదేశీ పర్యటనల్లోనూ విదేశీమారక ద్రవ్యం బాగా వెచ్చించాల్సి ఉంటుంది. వీటన్నింటినీ పౌరుల స్థాయిలోనే తగ్గించగలిగే దిగుమతుల బిల్లు భారం తగ్గి.. ఆ మేరకు విదేశీమారక ద్రవ్యం ఆదా అవుతుందన్నది మోదీ పొదుపు సూత్రాల వెనుక ఉన్న ఆలోచన. అంతర్జాతీయంగా చమురు ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొన్ని వారాల క్రితం 70 డాలర్లుగా ఉన్న బ్యారెల్ ముడిచమురు ధర ఇప్పుడు 126 డాలర్లకు ఎగబాకింది. మనదేశ చమురు అవసరాల్లో 80 శాతానికిపైగా దిగుమతులే ఆధారం. దాంతో అంతర్జాతీయంగా చమురు ధర పెరిగినప్పుడల్లా భారత్ తన ఫారెక్స్ నిల్వల నుంచి భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే ఎక్కడికక్కడ పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాడకాన్ని తగ్గిస్తే కొంత విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చు. బంగారానిదీ అదే పరిస్థతి. ముడిచమురు మాదిరిగానే భారత్ బంగారం దిగుమతులపైనే ఆధారపడుతోంది. భారతీయులు బంగారాన్ని పెట్టుబడిగా, పొదుపు సాధనంగా కంటే సెంటిమెంట్‌గానే భావిస్తారు. ఆ దృష్టితోనే పెళ్లిళ్లు వంటి శుభకార్యాలయాలకు తలతాకట్టు పెట్టయినా బంగారం కొనడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ మన అవసరాలకు, డిమాండ్‌కు తగినంత బంగారం ఉత్పత్తి దేశంలో లేదు. దాంతో ఫారన్ ఎక్స్ఛేంజ్ నిధులను అమెరికన్ డాలర్ల రూపంలో వెచ్చించి భారీగా బంగారం దిగుమతి చేసుకోక తప్పడంలేదు. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ రోజురోజుకూ పెరిగి.. రూపాయి విలువ దారుణంగా పడిపోతున్నది. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రజలు భారీగా బంగారం కొంటున్నకొద్దీ మనదేశం నుంచి డాలర్లు బయటకు వెళ్లిపోతుంటాయి. వీటితోపాటు ఎరువులు, వంటనూనెలకు సైతం మనదేశం విదేశాలపైనే ఆధారపడుతూ భారీగా దిగుమతి చేసుకుంటున్నది. వీటన్నింటి వల్ల ‘కరెంట్ అకౌంట్ లోటు అంటే దిగుమతులు-ఎగుమతుల మధ్య వ్యత్యాసం పెరుగుతుంది. ఆ లోటు పెరిగితే మన రూపాయి అంతర్జాతీయంగా బలహీనపడుతుంది. అది బలహీనపడితే మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే చమురుతో సహా ప్రతి వస్తువు, ప్రతి సేవపైనా దాని ప్రభావం పడి ధరలు ఆకాశాన్నంటుతాయి. ఇది ద్రవ్యోల్బణానికి దారితీసి సామాన్యుల నడ్డి విరుస్తుంది. ఇలాంటి పరిస్థితి రాకూడదనే ఏడాది పాటు బంగారం జోలికి పోవద్దని, పొదుపు సూత్రాలు పాటించాలని మోదీ పిలుపునిచ్చారు. గతంలో ఇటువంటి సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు భారత ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచడం, పరిమితిపై ఆంక్షలు విధించడం, భౌతిక బంగారం కొనుగోళ్లకు బదులు కేంద్ర ప్రభుత్వం జారీ చేసే సావరిన్ గోల్డ్ బాండ్లను ప్రోత్సహించడం వంటి చర్యలు చేపట్టేది. అయితే ఒక మనిషి లేదా ఒక కుటుంబం బంగారం కొనుగోలు చేయనంత మాత్రాన.. పెట్రోల్, డీజిల్ పొదుపు చేసినంత మాత్రాన ఈ సమస్య సమసిపోతుందా? అంటూ చాలామంది ప్రధాని సలహాలను ఎగతాళి చేస్తుండటం సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నది. అలాగే కోవిడ్ లాక్‌డౌన్ నాటి దుర్భర పరిస్థితులు మళ్లీ దాపురిస్తున్నాయన్న వాదనలూ వినిపిస్తున్నాయి. కానీ పొదుపు చేసినంత మాత్రాన లాక్‌డౌన్ చేసినట్లు కాదు. అలాగే బిందువు బిందువు కలిస్తే సింధువు(సముద్రం) అవుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ వంతు పొదుపు పాటిస్తే 145 కోట్ల జనాభా ఉన్న భారత్‌కు అదే కొండంత అండ అన్న విషయం గుర్తెరగాలి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page