top of page

సూక్ష్మంలో మోక్షం

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • Nov 4
  • 1 min read
  • రూ.1.5 కోట్లతో కార్గిల్‌ పార్క్‌కు కొత్త హంగులు

  • రెండు నెలల్లో అందుబాటులోకి తేవాలని కలెక్టర్‌ ఆదేశం

  • నిన్నటి వరకు జరిగిన రూ.40లక్షల పనులు వృథా

  • కార్పొరేషన్‌కు ముందుచూపు, వెనుకచూపే కాదు.. కళ్లే లేవు

ree

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

స్థానిక హౌసింగ్‌బోర్డు కాలనీలో కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకొని అప్పట్లో నిర్మించిన పార్క్‌కు ఇప్పుడు కొత్త సొబగులు చేరుస్తున్నారు. తమ ప్రాంతంలో ఉన్న పార్కు కనీసం అడుగు పెట్టేందుకు కూడా వీలులేకుండా మారిపోయిందని ఆ ప్రాంతవాసులు ఒకటికి పదిసార్లు మొరపెట్టుకోవడంతో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడులు పార్క్‌ను పరిశీలించి ఆధునీకరిస్తామని మాటిచ్చారు. అయితే నిధులు ఎక్కడ్నుంచి తేవాలో వీరికి అర్థం కాలేదు. కానీ కేంద్రమంత్రి చెప్పిన తర్వాత పనులు జరగలేదంటే ప్రభుత్వం చులకనైపోతుందని భావించిన కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ సోమవారం రాత్రి ఆ ప్రాంతంలో విద్యుత్‌ లేకపోయినా పార్క్‌ను పరశీలించి రూ.1.50 కోట్లు మంజూరు చేస్తానని, రెండు నెలల్లో పనులు పూర్తికావాలని కార్పొరేషన్‌ అధికారులను ఆదేశించారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌లో నిధులుంటే ఖర్చు చేస్తామని, లేదంటే కలెక్టర్‌ ఖాతా నుంచి నిధులు విడుదల చేస్తారని మాటిచ్చారు. అయితే కార్గిల్‌పార్క్‌ మీద అనేక కథనాలు రావడం, స్థానికులు గగ్గోలు పెట్టడంతో కార్పొరేషన్‌, సుడా నిధులతో మున్సిపల్‌ ఇంజినీర్ల పర్యవేక్షణలో రూ.40 లక్షలకు పైగా పనులు జరిగాయి. అయితే ఇవన్నీ పర్యవేక్షించే నాధుడు లేక వెనుకది ముందు, ముందుది వెనుక జరిగాయి. ఎక్కడైనా మట్టి ఫిల్‌ చేసిన తర్వాత రంగులు వేస్తారు. కానీ ఇక్కడ విచిత్రంగా రంగులు వేశాక మట్టిని నింపారు. అది కూడా సరిపడినంత కాకుండా ఏదో చేయాలన్నట్టు పూర్తిచేశారు. ఇప్పుడు వీటన్నింటినీ తవ్వి తీయడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు కార్గిల్‌పార్క్‌లో కార్గిల్‌ విజయానికి గుర్తుగా థీమ్‌తో కూడిన ఏరియాను ఉంచగా, మిగిలిన ప్రాంతంలో గేమింగ్‌ జోన్‌, యోగా రిక్రియేషన్‌, ఓపెన్‌ ఎయిర్‌ ఆడిటోరియం, రీడిరగ్‌ రూమ్‌, ఓపెన్‌ జిమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం సుడా ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ సుగుణాకర్‌ నేతృత్వంలో డీపీఆర్‌ కూడా తయారైంది. ప్రముఖ ఆర్కిటెక్‌ సంస్థకు ఈ పనిని అప్పగించడంతో కార్గిల్‌ పార్క్‌ను ఎలా తీర్చిదిద్దాలో డిజైన్‌ చేశారు. దీనినే సుగుణాకర్‌ కలెక్టర్‌ ముందు ఉంచడంతో రూ.1.50 కోట్లు మంజూరు చేస్తానని మాటిచ్చి సోమవారం రాత్రి పరిశీలనకు వచ్చారు. డీపీఆర్‌ రూపొందించిన విధానం చూస్తే రూ.1.50 కోట్లు ఈ పార్క్‌కు సరిపోవు. కానీ సూక్ష్మంలో మోక్షం మాదిరిగా కేంద్రమంత్రి మాట పోకుండా, స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకత రాకుండా ఈ పనులు త్వరలోనే ప్రారంభించనున్నారు. అయితే ఈమేరకు మున్సిపల్‌ కార్పొరేషన్‌ వద్ద నిధులు అందుబాటులో లేనట్టు తెలుస్తుంది. ఇక మిగిలింది కలెక్టర్‌ ఖాతా నుంచి విత్‌డ్రా చేయడమే.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page