top of page

సైన్స్‌, చరిత్ర, తత్వం.. ఓపెన్‌ హైమర్‌

  • Guest Writer
  • Jul 31
  • 3 min read
ree

ఆగస్టు 6, ఆగస్టు 9, 1945- జపాన్‌ నగరాలైన హిరోషిమా, నాగసాకిపై అమెరికా అణు బాంబులు ప్రయోగించిన రోజులు! ఈ దాడులు కబళించిన జీవితాల సంఖ్య రెండున్నర లక్షలుబీ ఛిద్రం చేసిన బతుకుల సంఖ్య లెక్కలేనంత! ఈ విధ్వంసానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైనవాడు రాబర్ట్‌ జె. ఓపెన్‌ హైమర్‌! అణుబాంబు పితామహుడు అని లోకం కితాబునిచ్చిన అమెరికన్‌ ఫిజిసిస్ట్‌. కానీ ఓపెన్‌ హైమర్‌ తెలిసే ఇన్ని లక్షల మంది ప్రాణాలు తీశాడా, బాంబు తయారీకి ముందు, తర్వాత ఆయన మనోగతమేంటి? ఆయన మానసిక స్థితి ఏంటి? 13 ఆస్కార్‌ కేటగిరీలకు నామినేట్‌ అయ్యి ఏడు అవార్డులు గెలుచుకున్న ఓపెన్‌ హైమర్‌ బేసిక్‌ కాన్సప్టు ఇదే! కై బర్డ్‌, మార్టిన్‌ జె.షెర్విన్‌ 2005లో రాసిన అమెరికన్‌ ప్రోమెథ్యూస్‌ అనే బయోగ్రఫీ ఆధారంగా లెజెండరీ ఫిలిం మేకర్‌ క్రిస్టోఫర్‌ నోలన్‌ సైన్సు, చరిత్ర, తత్వం.. ఈ మూడిరటినీ మేళవిస్తూ తెరకెక్కించిన మాస్టర్‌ పీస్‌ ఇది.

జూలై 30, ఆ విఖ్యాత దర్శకుడి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఓపెన్‌ హైమర్‌ గురించి కాసిన్ని కబుర్లు!

క్రిస్టోఫర్‌ నోలన్‌ సినిమాలనగానే మనసు కన్నా మెదడునే సిద్ధం చేసి ఉంచుతాను. ఆయన సినిమాల్లోని కాంప్లెక్స్‌ కాన్సెప్టులు, లేయర్డ్‌ స్క్రీన్‌ ప్లేలు డీకోడ్‌ చేయడమంటే నాకు మహా సరదా. ఆ సై`ఫై ఎక్స్‌లెన్స్‌, సినిమాటిక్‌ బ్రిలియన్స్‌కి అబ్బురపడిపోతుంటాను. కానీ ఈ దృగ్విషయాలన్నింటినీ కలిపితే కంటే ఓపెన్‌హీమర్‌ అందించడానికి చాలా ఎక్కువ ఉంది.

నోలన్‌ సినిమాలంటే పిచ్చి ఇష్టంతో చూసినా అప్పుడప్పుడు ఏదో అసంతృప్తి, కొన్ని సినిమాల్లో సోల్‌ మిస్‌ అవుతున్న ఫీలింగ్‌. ఓపెన్‌హైమర్‌ ఆ కొరత తీర్చేసింది. నా అభిప్రాయం ప్రకారం, ఇది అంతిమ సినిమాటిక్‌ అనుభవాన్ని అందించే ఆత్మను కదిలించే చిత్రం. ఒకప్పుడు క్రిస్టోఫర్‌ నోలన్‌ సినిమాల్లో ప్రెస్టీజ్‌, డన్‌కిర్క్‌ నా అభిమాన సినిమాలు అని చెప్పుకునేదాన్ని. కానీ ఓపెన్‌హైమర్‌ చూశాక అవి పక్కకెళ్ళిపోయాయి. ఒక బయోగ్రఫీని ఇంత క్లాసిక్‌గా ప్రెజెంట్‌ చేయగలగడం నోలన్‌ కే చెల్లింది. సినిమా చూసిన చాన్నాళ్ళ వరకు ఆ యుఫోరియా నుంచి బయటికి రాలేకపోయాను.

ఈమధ్య కాలంలో వచ్చిన నోలన్‌ సినిమాలన్నీ సై`ఫై సినిమాలే. కానీ ఓపెన్‌హైమర్‌ ఒక సైంటిస్టు సినిమా, ఒక పీరియాడిక్‌ మూవీ. ఇందులోనూ సైన్సు ఉంది. కానీ అంతకుమించిన అంతర్మథనం ఉంది. మంచికి, చెడుకి మధ్య ఊగిసలాడే ఓ మనిషి సంఘర్షణ ఉంది. నోలన్‌ మెజారిటీ సినిమాల్లో సైన్సు ఫిక్షన్‌ దే పైచేయి. కానీ ఇందులో ఎమోషన్‌ మెండుగా కనిపిస్తుంది. రక్తపాతం చూపకపోయినా గుండె మెలిపడిపోతుంది. తెలియని బాధేదో కమ్మేస్తుంది. నాకు తెలిసి నోలన్‌ సినిమాలు ఇలాంటి లోతైన అనుభూతిని కలిగించడం అరుదే.

అసలు ఓపెన్‌హైమర్‌ ఎందుకంత ప్రత్యేకం?

ఓపెన్‌ హైమర్‌ అణుబాంబు పితామహుడు. ఒక మామూలు స్టూడెంట్‌ ఆ స్థాయికి ఎదగడం, అక్కడి నుంచి పతనమైపోవడం- ఇదే ఈ సినిమాకి కథా వస్తువు. ఈ దారి పొడవునా ఓపెన్‌ హైమర్‌ మానసిక స్థితిని నోలన్‌ అద్భుతంగా విశ్లేషించాడు. ఆయన మిగతా సినిమాల కంటే ఈ సినిమా క్రియేటివ్‌ గాను ఈస్థటిక్‌ గాను అనిపిస్తుంది.

అణుబాంబు పితామహుడిగా పేరు తెచ్చుకున్నాక జరిగిన పరిణామాలను లోకం ఓపెన్‌ హైమర్‌ పతనానికి గుర్తుగా భావించింది. కానీ ఆయన దృష్టిలో అదో పశ్చాత్తాప దశ. చేసిన పాపాలకు పరిహారం చెల్లించుకునే దశ. ఈ రెండు దృష్టికోణాలను నోలన్‌ గొప్పగా ఆవిష్కరించాడు. లోకానికి తెలిసిన విషయాలను, లోకపు దృష్టికోణాన్ని బ్లాక్‌ అండ్‌ వైట్‌ లో చూపించాడు. ఓపెన్‌ హైమర్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూను కలర్‌లో చూపించాడు. జనరల్‌గా ఫ్లాష్‌బ్యాక్‌ సీన్స్‌కు బ్లాక్‌ అండ్‌ వైట్‌ వాడడం మనకి తెలుసు. ఆ రకంగా చూస్తే ఇది కొత్త ప్రయోగం, గొప్ప ప్రయోగం కూడా!

ఎంత ఎమోషనల్‌ కనెక్ట్‌ చూపించినా నేరేటివ్‌ లో నోలన్‌ తన నాన్‌ లీనియర్‌ స్టైల్‌ ని మాత్రం వదిలిపెట్టలేదు. సినిమా అంతా ఓపెన్‌ హైమర్‌ విద్యార్థి దశ, సైంటిస్టు దశ, చివరలో విచారణ ఎదుర్కొంటున్న దశ, లూయిస్‌ స్ట్రాస్‌ విచారణ ఎపిసోడ్‌- వీటి మధ్య వెనక్కీ ముందుకీ తిరుగుతుంటుంది. ఆ మధ్యలో బ్లాక్‌ అండ్‌ వైట్‌, కలర్‌ సీన్స్‌ కొంత కన్ఫ్యూజ్‌ చేస్తాయి. కానీ ఎక్కడా ఎమోషనల్‌ టచ్‌ మాత్రం మిస్‌ కాదు.

ఓపెన్‌ హైమర్‌ అంతర్మథనాన్ని నోలన్‌ చక్కగా ఆవిష్కరించాడు. అతనేమీ పవిత్రాత్మ కాదు. అలాగని పరమ దుర్మార్గుడూ కాడు. ఒక మామూలు మనిషికున్న డ్రా బ్యాక్స్‌ అతనికీ ఉన్నాయి. ప్రియురాలు టాట్‌ లాక్‌ అంటే ఇష్టమే. కానీ తనతో కలిసి బతకలేని నిస్సహాయత. చివరికి టాట్‌ లాక్‌ చనిపోతే తన వల్లే చనిపోయిందన్న గిల్టీ ఫీలింగ్‌. హిరోషిమా, నాగసాకి బాంబింగ్‌ తర్వాత అంతా సెలబ్రేట్‌ చేసుకుంటుంటే కాలి బూడిదవుతున్న మనుషులు కనిపించే సీన్‌ ఎపిక్‌ లెవల్లో ఉంటుంది. నోలన్‌ దీన్ని చాలా తెలివిగానే కాక మనసును మెలిపెట్టే విధంగా ప్లాన్‌ చేశాడు. అసలు రక్తపాతం, విధ్వంసం చూపించకుండానే ఓపెన్‌ హైమర్‌ ఎక్స్‌ ప్రెషన్స్‌ రూపంలో గుండెను వణికించేశాడు.

ఇక ట్రినిటీ టెస్టు నాకు బాగా నచ్చిన ఎపిసోడ్‌. టెస్టు కోసం ప్రిపరేషన్‌, ఆ టెన్షన్‌ మొత్తాన్నీ డైరెక్టర్‌ చాలా చక్కగా ఎలివేట్‌ చేశాడు. టెస్టు జరిగాక ముందు మంట కనిపించడం, ఆ తర్వాతే సౌండ్‌ వినిపించడం సైంటిఫిక్‌ గా చాలా అక్యురేట్‌ గా అనిపించింది. నోలన్‌ ప్రతి డీటెయిల్‌ కీ ఎంత ప్రాధాన్యత ఇస్తాడో ఇలాంటప్పుడే అర్థమవుతుంది. ఎక్స్‌పెక్ట్‌ చేసినప్పుడు రాని సౌండ్‌ అన్‌ ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చినప్పుడు గుండె గుభిల్లుమంటుంది. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఇంకో అద్భుతం. టెన్షన్‌ బిల్డ్‌ అయ్యే కొద్దీ బీట్‌ పెరుగుతూ పోయి ఒక్కసారిగా పీక్స్‌ చేరుకుని ఆ సీన్లోని ఇంటెన్సిటీని తెలియజేస్తుంది. ఏమీ చెప్పకుండానే లుడ్విగ్‌ గోరాన్సన్‌ కంపోజ్‌ చేసిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ద్వారా నోలన్‌ చాలా చోట్ల భయపెట్టించేశాడు. ఏదో తెలియని భయాన్ని, టెన్షన్‌ ని క్రియేట్‌ చేశాడు. ఈ సినిమా గెలుచుకున్న ఏడు అకాడెమీ అవార్డుల్లో ఒకటి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోరుకే దక్కింది.

సినిమాలో అక్కడక్కడా గ్రాఫిక్స్‌ రూపంలో కనిపించే సబ్‌ అటామిక్‌ స్ట్రక్చర్స్‌, అలలు, కణాలు, నిప్పు కణాలు, కాంతి పుంజాలు ఓపెన్‌ హైమర్‌ అంతరంగాన్ని విశ్లేషిస్తుంటాయి. వీటిని నోలన్‌ ప్రత్యేక శ్రద్ధతో చేయించాడట.

సిలాన్‌ మర్ఫీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అయితే మైండ్‌బ్లోయింగ్‌గా అనిపించింది. నోలన్‌ సినిమాల్లో చిన్న చితకా క్యారెక్టర్స్‌ చేసిన మర్ఫీ ఈ లెవల్‌కి ఎదగడం నిజంగా గొప్ప విషయం. మార్వెల్‌ సిరీస్‌లో ఐరన్‌ మ్యాన్‌గా అలరించిన రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ లూయిస్‌ స్ట్రాస్‌గా, ఎమిలీ బ్లంట్‌ కిట్టీగా తమ కెరీర్‌ బెస్ట్‌ ఇచ్చారు. అందుకే ముగ్గురూ ఆస్కార్‌ కి నామినేట్‌ కాగా, మర్ఫీ, రాబర్ట్‌ డౌనీ అవార్డు సాధించుకున్నారు. బెస్ట్‌ పిక్చర్‌, బెస్ట్‌ డైరెక్టర్‌, బెస్ట్‌ సినిమాటోగ్రఫీ, బెస్ట్‌ ఎడిటింగ్‌ కేటగిరీల్లో మిగతా నాలుగు ఆస్కార్లు వరించాయి.

చివరలో ఐన్‌ స్టీన్‌, ఓపెన్‌ హైమర్‌ మాట్లాడుకున్న ఫ్లాష్‌ బ్యాక్‌ సీన్‌ ఒకటి కనిపిస్తుంది. ఓపెన్‌ హైమర్‌ ఒక చెయిన్‌ రియాక్షన్‌ ని మొదలుపెట్టాడని, అది ప్రపంచాన్నే నాశనం చేస్తుందని ఐన్‌ స్టీన్‌ హెచ్చరిస్తాడు. నిజంగానే ఆనాడు మొదలైన చెయిన్‌ రియాక్షన్‌ ఇప్పటికీ రకరకాల రూపాల్లో మానవ జాతిని నాశనం చేస్తూనే ఉంది. సైన్స్‌ని సక్రమంగా ఉపయోగించుకుంటే అభివృద్ధి లేదంటే విధ్వంసమే!


-శాంతి ఇషాన్‌

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page