top of page

సబ్సిడీ దైవాధీనం.. అవస్థలే ఉచితం..!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 23 hours ago
  • 3 min read
  • తొలి రెండు విడతల్లో సాంకేతిక ఇబ్బందులు

  • మూడోదశ 40 రోజులైనా ఒక్కరికీ అందని సబ్సిడీ

  • ఏజెన్సీలతో మాట్లాడుకోండంటున్న టోల్‌ఫ్రీ నెంబర్‌

  • గ్యాస్‌ కంపెనీల్లో అందుబాటులో లేని సమాచారం

  • అబ్బే.. సమస్యేమీ లేదంటున్న అధికారులు

    ree
(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీ హామీలైన సూపర్‌ సిక్స్‌ పథకాలను బ్రహ్మాండంగా అమలు చేస్తున్న ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెబుతోంది. దాని విజయోత్సవ సభను కూడా ఆర్భాటంగా నిర్వహించాలని నిర్ణయించింది. కానీ సూపర్‌ సిక్స్‌లో ఇప్పటికీ రెండు పథకాలు ఇంకా అమలుకు నోచుకోకపోగా.. అమలైన వాటిలో ఒకటైన ఏడాదికి మూడు ఉచిత సిలెండర్లు(దీపం`2) పథకం లబ్ధిదారులను ఆపసోపాలు పడేలా చేస్తోంది. డబ్బులు అందక వారు గ్యాస్‌ ఏజెన్సీలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రజలు గ్యాస్‌ సిలెండర్‌ను బుక్‌ చేసి, డబ్బులు కట్టి విడిపించుకున్న తర్వాత ఆ డబ్బు వారి బ్యాంకు ఖాతాలోకి జమయ్యేలా ఈ పథకాన్ని డిజైన్‌ చేశారు. 2024 నవంబరు ఒకటో తేదీన ఇచ్ఛాపురం నియోజకవర్గం ఈదుపురంలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆ రోజు(నవంవరు 1) నుంచి మార్చి 31 వరకు మొదటి విడత గ్యాస్‌ డబ్బులు జమ చేయడం ప్రారంభించారు. ఆ విడతలో ఎవరికీ పెద్ద ఇబ్బంది లేకపోవడంతో లబ్ధిదారులు ఈ పథకం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అయిత ఏప్రిల్‌ 1 నుంచి జూలై 31 వరకు ఇవ్వాల్సిన రెండో విడత సిలెండర్‌ సొమ్ము విషయంలో తీవ్ర జాప్యం జరిగింది. నగదు జమకాక లబ్ధిదారులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ జాప్యానికి సాంకేతిక సమస్యలే కారణమని అధికారులు ప్రకటించారు. ప్రజల ఆందోళన నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు సాంకేతిక సమస్యలను పరిష్కరించడంతో సబ్సిడీ నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమైంది. అనంతరం ఆగస్టు ఒకటో తేదీ నుంచి మూడో విడత సబ్సిడీ సమయం మొదలైంది. అయితే 40 రోజులు కావస్తున్నా.. ఈ కాలంలో గ్యాస్‌ సిలిండర్లు బుక్‌ చేసిన వారిలో ఒక్కరికి కూడా సబ్సిడీ సొమ్ము అందలేదు. రాయితీ సిలెండర్‌ నగదు జమ, సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1967 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే గ్యాస్‌ ఏజెన్సీలకు రిఫర్‌ చేసి చేతులు దులుపుకొంటున్నారని వినియోగదారులు విమర్శిస్తున్నారు.

అందని మూడో విడత సబ్సిడీ

జిల్లాలో పౌరసరఫరాల శాఖ లెక్క ప్రకారం జనరల్‌ కేటగిరీలో సింగిల్‌ సిలెండర్లు 2,00,264, డబుల్‌ సిలెండర్లు 1,40,054 ఉన్నాయి. దీపం పథకంలో సింగల్‌ సిలెండర్లు 2,10,780, డబుల్‌ సిలెండర్లు 30,588 ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉజ్వల పథకంలో 93,194, సీఎస్‌ఆర్‌ పథకంలో 17,945.. మొత్తం 6,92,825 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో ఉచిత గ్యాస్‌ పథకానికి 4.96 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. అయితే వీరిలో 70 శాతం మందికే మొదటి విడత ఉచిత గ్యాస్‌ సిలెండర్‌ నగదు జమైంది. రెండో విడతలో 50 శాతం మందికి మాత్రమే వారి ఖాతాలో నగదు జమ చేశారు. మూడో విడతలో గ్యాస్‌ సిలెండర్‌ విడిపించిన వారెవరికీ ఇప్పటి వరకు నగదు జమ కాలేదు. అధికారులు మాత్రం గ్యాస్‌ ఏజెన్సీల ద్వారా మూడో విడత ఉచిత గ్యాస్‌ పంపణీ ఆగస్టు ఒకటి నుంచి ప్రారంభమైందని ప్రచారం చేశారు. దాంతో గ్యాస్‌ విడిపించినవారు నగదు జమ కాలేదని ఏజెన్సీల వద్దకు వచ్చి సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.

కేంద్ర, రాష్ట్రాల లెక్కల్లో తేడా

అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో తెల్లకార్డు కలిగిన బీపీఎల్‌ కుటుంబాలు 6.72 లక్షలు ఉన్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వీరంతా ఉచిత గ్యాస్‌కు అర్హత కలిగి ఉన్నవారే. గ్యాస్‌ విడిపించిన తర్వాత కేంద్రం రూ.10.67 పైసలు సబ్సిడీని వారి ఖాతాల్లో జమ చేస్తుంది. ఇలా సబ్సిడీని అందుకుంటున్నవారంతా ఉచిత గ్యాస్‌ పథకానికి అర్హులే. కొందరు స్వచ్ఛందంగా కేంద్రం పిలుపుతో గివ్‌ అప్‌ పథకంలో చేరి కేంద్రం ఇచ్చే సబ్సిడీని వదులుకున్నారు. ఆ సబ్సిడిని వదులుకున్నవారంతా ఉచిత గ్యాస్‌ పథకానికి అర్హులని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. అయితే జిల్లాలో సుమారు ఆరు లక్షల మందికి కేంద్రం రూ.10.67 పైసలు జమ చేస్తుండగా సుమారు 5 లక్షలు మందికే రాష్ట్ర ప్రభుత్వ ఉచిత సిలెండర్‌ పథకం వర్తిస్తోంది. అర్హత ఉండి సబ్సిడీ అందని వినియోగదారులు ఏజెన్సీలకు వచ్చి వివరణ కోరుతున్నారు. అయితే ఈ లెక్కలేవీ గ్యాస్‌ ఏజెన్సీల వద్ద లేవు. ఏ అకౌంట్‌లో సబ్సిడీ జమైందన్నది చెప్పడానికి మాత్రమే ఏజెన్సీలకు అవకాశం ఉంది. ఇతర సమాచారం కోసం గ్యాస్‌ ఏజెన్సీ కాకుండా ఇంకెవరిని సంప్రదించాలో వినియోగదారులకు తెలియడం లేదు. ప్రభుత్వం సూచించిన 1967 టోల్‌ ఫ్రీకి డయల్‌ చేస్తే ఏజెన్సీలనే సంప్రదించాలని చెబుతున్నారు.

అక్షరం తేడా ఉన్నా రిజెక్ట్‌

ఎన్‌పీసీఐ చేసుకున్న బ్యాంకు అకౌంట్‌తో ఆధార్‌, గ్యాస్‌ కనెక్షన్‌ తో జత చేసిన ఖాతాల్లో మాత్రమే డీబీటీ ద్వారా ఉచిత గ్యాస్‌ సబ్సిడీ జమవుతోంది. ఆధార్‌, బ్యాంక్‌ అకౌంట్‌, గ్యాస్‌ ఏజెన్సీలో ఉన్న వినియోగదారుడి వివరాల్లో ఏ ఒక్క అక్షరం మారినా సబ్సిడీ జమ కావడం లేదు. ఆధార్‌లో ఉన్న మాదిరిగా వినియోగదారుడి పేరు మార్చే ప్రక్రియను గ్యాస్‌ ఏజెన్సీలు చేస్తున్నాయి. బ్యాంకులు మాత్రం ఆధార్‌ మాదిరిగా అకౌంట్‌లో పేరు మార్చడానికి రోజులు తరబడి తిప్పుతున్నాయి. ఇలాంటివారు ప్రతి ఏజెన్సీ పరిధిలో వందల్లో మాత్రమే ఉన్నారు. అలాంటి వారికి సబ్సిడీ సొమ్ము జమ కావడం లేదు. మొదటి, రెండు విడతల్లో కొంత మేనేజ్‌ చేసినా మూడో విడత సబ్సిడీ ఇప్పటికీ జమ కాలేదు. సబ్సిడీ జమవుతుందని, దీనిపై ఎటువంటి అపోహాలు అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. వినియోగదారులు మాత్రం ప్రభుత్వం చెప్పిన గడువులోగా సబ్సిడీ మొత్తం జమ కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page