top of page

సమన్వయ లోపం.. సర్వేయర్ల బదిలీల్లో సందిగ్ధం!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Jul 3, 2025
  • 3 min read
  • సెలవుపై వెళ్లిపోయిన సర్వే శాఖ ఏడీ

  • కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌తో కలెక్టర్‌కు నోట్‌ఫైల్‌ పంపిన ఇన్‌ఛార్జి

  • తనకు చెప్పకుండా ఎలా పంపారని జేసీ ఆగ్రహం

  • బదిలీల ప్రక్రియ నిలిపివేయాలని ఆదేశాలు

  • ఇతర సచివాలయ ఉద్యోగుల్లో పారదర్శకతకు పాతర

జిల్లాలోని సచివాలయాల్లో పని చేస్తున్న సర్వేయర్లు విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సచివాలయాల్లోని మిగతా ఉద్యోగుల బదిలీలు పూర్తయినా, రాష్ట్ర వ్యాప్తంగా సర్వే ఉద్యోగుల బదిలీలు కూడా పూర్తయినా జిల్లాలో మాత్రం ప్రారంభమే కాలేదు. గత నెల 30 నాటికి ఐదేళ్లు పూర్తి చేసిన సచివాలయ ఉద్యోగులందరినీ బదిలీ చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వాటికి అనుగుణంగా ఇతర ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తి చేసినా సర్వేయర్లు, డిప్యూటీ సర్వేయర్ల బదిలీలు జరగకపోవడానికి ఉన్నతాధికారుల మధ్య సమన్వయం లోపమే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

జిల్లా సర్వే శాఖ ఏడీ విజయ్‌కుమార్‌ అనకాపల్లికి బదిలీ చేయించుకున్నారు. ఆయన స్థానంలో విధుల్లో చేరాల్సిన అనకాపల్లి ఏడీ గోపాల్‌రాజ అక్కడ ఇంకా రిలీవ్‌ కాలేదు. అందువల్ల అక్కడికి బదిలీ అయిన విజయకుమార్‌ను జాయింట్‌ కలెక్టర్‌ రిలీవ్‌ చేయలేదు. దాంతో ఇప్పటికే నెల రోజుల సెలవులో ఉన్న ఏడీ విజయ్‌కుమార్‌ దాన్ని మరో నెల పొడిగించి వెళ్లిపోవడంతో సర్వేశాఖ రమేష్‌కు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. గత ఏడాది నిర్వహించిన గ్రామ సర్వేయర్ల బదిలీల్లో విజయకుమార్‌ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. బదిలీలను కావాలనే జాప్యం చేసి భాను అనే సర్వేయర్‌ ద్వారా అందినకాడికి దండుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫలితంగా గత సెప్టెంబర్‌లో జరగాల్సిన బదిలీలను ఈ ఏడాది జనవరి వరకు సర్దుబాటు పేరుతో కొనసాగిస్తూ వచ్చారు. మొదటి నుంచి ఏడీ విజయకుమార్‌ పనితీరుపై జిల్లా ఉన్నతాధికారులు అసంతృప్తితో ఉన్నారు. దీన్ని గ్రహించిన విజయకుమార్‌ అనకాపల్లికి చెందిన అధికార కూటమి ప్రజాప్రతినిధి సిపార్సుతో ఆ జిల్లాకు బదిలీ చేయించుకున్నారు. అయితే అక్కడి అధికారి రిలీవ్‌ కాకపోవడాన్ని కారణంగా చూపి ఇక్కడ ఈయన్ను రిలీవ్‌ చేయకపోయినా సెలవు పెట్టి వెళ్లిపోయారు.

ఇన్‌ఛార్జి ఏడీపై జేసీ ఫైర్‌

వాస్తవానికి జూన్‌ 30 నాటికి సచివాలయ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈ నెల ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ ఉండటంతో అది పూర్తి చేశాకే బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు పింఛన్ల పంపిణీ పూర్తి అయిన తర్వాత ఆ రోజు రాత్రి 10 గంటల నుంచి సర్వేయర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కలెక్టర్‌ ఆదేశాలతో బుధవారం సాయంత్రం నాటికి ప్రక్రియ పూర్తిచేసి పాత తేదీలతో బదిలీ ఉత్తర్వులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇంతలో ఇన్‌ఛార్జి ఏడీ రమేష్‌ను జేసీ తన ఛాంబర్‌కు పిలిపించి రెండో తేదీ బుధవారం శాఖాపరంగా చేయాల్సిన పనులపై చర్చించారు. అయితే అదేరోజు బదిలీల కౌన్సెలింగ్‌ ఉన్నందున సర్వేయర్లు విధులకు రారని ఇన్‌ఛార్జి ఏడీ వివరించారు. దానికి జేసీ స్పందిస్తూ బదిలీ ప్రక్రియ జూన్‌ 30 నాటికే పూర్తి కావాలి కదా..! ఎందుకు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. కలెక్టర్‌కు నోట్‌ఫైల్‌ పెట్టి ఆమోదం కోసం ఎదురుచూశామని ఏడీ రమేష్‌ సమాధానం ఇవ్వగా తన పరిధిలో ఉన్న సర్వే శాఖలో బదిలీలపై కలెక్టర్‌కు నోట్‌ఫైల్‌ ఎందుకు పెట్టారని జేసీ నిలదీసినట్లు తెలిసింది. తనకు చెప్పకుండా, తన ఆమోదం లేకుండా కలెక్టర్‌కు నోట్‌ఫైల్‌ ఎలా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసి కౌన్సెలింగ్‌ నిలిపేయాలని జేసీ ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దాంతో సర్వేశాఖ పరిధిలోని గ్రామ సర్వేయర్లు, డిప్యూటీ సర్వేయర్ల బదిలీలు నిలిపేస్తున్నట్టు మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో సచివాలయాలకు సమాచారం ఇచ్చారు. అయితే గత నెల 30 నుంచి బదిలీలపై బ్యాన్‌ విధించారు కాబట్టి ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా బదిలీలు చేయరాదని జేసీ సర్వేశాఖ అధికారులకు సూచించారు. జేసీ ఆదేశాల గురించి సర్వేశాఖ అధికారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లిన ఇంతవరకు నిర్ణయం వెలువడలేదని సర్వే శాఖ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజాప్రతినిధుల ఒత్తిడి

కలెక్టర్‌, జేసీ పరస్పరం మాట్లాడుకుని గురువారం ఉదయం నుంచైనా బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారేమోనని ఎదురు చూసిన సర్వేయర్లకు నిరాశే మిగిలింది. జిల్లాలో 585 మంది సర్వేయర్లు ఉండగా 377 మంది బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 217 మంది ఐదేళ్లు పూర్తి చేసుకున్నవారు ఉన్నారు. కాగా 270 మంది గ్రామ సర్వేయర్లు ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు తెచ్చుకున్నారు. ఈ లేఖలతోపాటు ఎక్సెల్‌ షీట్‌లో దరఖాస్తుదారుల జాబితా తెప్పించుకుని తాము సిఫార్సు చేసిన వారిని వారు కోరిన చోటుకే బదిలీ చేయాలని.. ఒక్కరు మిస్‌ అయినా బాగుండదని పలువురు ప్రజాప్రతినిధులు ఏడీని హెచ్చరించినట్టు విశ్వసనీయ సమాచారం.

ఉత్తర, దక్షిణలు ఉన్నవారికే ప్రాధాన్యం

మొదట రేషనలైజేషన్‌ చేసిన తర్వాత బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించాలి. అలా చేయకుండా ఆయా శాఖల అధికారులు తమకు నచ్చినట్టు చేసి చేతులు దులుపుకున్నారు. పోలీసు శాఖ పరిధిలో ఉన్న సచివాలయాల్లోని మహిళా పోలీసుల బదిలీలు మినహా మిగతా అన్ని బదిలీల్లో పారదర్శకతకు పాతర వేశారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఒక మండలంలో ఐదేళ్లు పూర్తి చేసుకున్నవారిని బదిలీ చేయాల్సి ఉండగా అధికారులు మాత్రం ఒక సచివాలయం పరిధిలో ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారినే బదిలీ చేశారు. గత ఏడాది నిర్వహించిన బదిలీల్లో నాలుగేళ్లు పూర్తి చేసుకున్నవారు అదే మండలంలోని వేరే సచివాలయానికి బదిలీ అయ్యారు. వీరందరినీ బదిలీల నుంచి మినహాయించారు. కౌన్సెలింగ్‌ నిర్వహించినా కొన్ని ఖాళీలను ఉద్దేశపూర్వకంగా చూపించడం లేదు. దీనిపై కౌన్సెలింగ్‌ సమయంలో ఇంజినీరింగ్‌ సహాయకులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సు ఉన్న వారిని, డబ్బులు ఇచ్చిన వారినే కోరిన చోటకు బదిలీలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పలువురు మహిళా ఉద్యోగులు దూరప్రాంతానికి బదిలీ కాకుండా డబ్బు ముట్టజెప్పి మేనేజ్‌ చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. సిఫార్సు లెటర్లు తీసుకొచ్చినవారిని ముందు వరుసలో ఉంచి, లేనివారిని మూడు మండలాలను ఆప్షన్‌గా ఇచ్చి వెళ్లిపోవాలని అధికారులు సూచించిన పరిస్థితి కొన్ని శాఖల్లో ఎదురైందని విమర్శలు ఉన్నాయి. దీనివల్ల అధిక రోస్టర్‌ పాయింట్లు ఉన్న ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారంటున్నారు. ఖాళీ పోస్టుల వివరాలను బహిర్గతం చేయకుండానే బదిలీలు చేపట్టడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page