సర్టిఫికెట్ కావాలా.. ఆస్తి తాకట్టు పెట్టాల!
- BAGADI NARAYANARAO

- Aug 30, 2025
- 3 min read
ఫీజ్ రీయింబర్స్‌మెంట్ నిధులు అందలేదని సాకు
ఆ బకాయిలు అందేవరకు ఇచ్చేదిలేదని స్పష్టీకరణ
అత్యవసరమైతే సొంతంగా ఫీజులు చెల్లించాలని షరతు
ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు కోల్పోతున్న విద్యార్థులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
అవసరానికి డబ్బులు లేకపోతే.. ఆస్తులు తాకట్టు పెట్టి బ్యాంకుల్లోనో, ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్దో రుణాలు తీసుకోవడం సహజంగా జరిగే ప్రక్రియ. అలాంటి వడ్డీ వ్యాపారం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేకంగా నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ విద్యాభివృద్ధికి కృషి చేయాల్సిన ఇంజినీరింగ్ కళాశాలలే వడ్డీ వ్యాపారుల మాదిరిగా వ్యవహరిస్తున్నాయి. ఆస్తులు తాకట్టు పెడితే తప్ప విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దీనికి కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నా కారణం.. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడమేనట!. ప్రభుత్వం చేస్తున్న జాప్యానికి, నిర్లక్ష్యానికి విద్యార్థులను బలి చేయడమేమిటన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
వారితో పాటు వీరూ బాధితులే
సాధారణంగా పరీక్షల ఫలితాలు వెలువెడిన కొద్దిరోజుల్లోనే ఉత్తీర్ణులైన విద్యార్థులకు అన్ని విద్యాసంస్థలు సర్టిఫికెట్లు అందజేస్తాయి. కానీ ఇంజినీరింగ్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఐదు నెలలు గడుస్తున్నా సర్టిఫికెట్లు ఇవ్వడానికి కళాశాలల యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. సర్టిఫికెట్లు కావాలంటే ఏవైనా ఆస్తులు తాకట్టు పెట్టాలని లేదా ఖాళీ చెక్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితి ఏ ఒక్క కళాశాలకో లేదా ఒక్క జిల్లాకో పరిమితం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లోనూ ఇదే తంతు నడుస్తోంది. ప్రభుత్వం తమకు ఇవ్వాల్సిన ఫీజ్ రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయలేదని, అవి అందేవరకు సర్టిఫికెట్లు ఇచ్చేదిలేదని తెగేసి చెబుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తప్పనిసరిగా సర్టిఫికెట్లు కావాలనుకున్నవారు భూములో ఇతర ఆస్తులో తమ వద్ద తాకట్టు పెడితే ఇస్తామని స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది. ఇంకా విడ్డూరమేమిటంటే.. కన్వీనర్ (ప్రభుత్వ) కోటాలో చేరిన విద్యార్థులతో పాటు అన్ని రకాల ఫీజులు సొంతంగా కట్టి మేనేజ్‌మెంట్ కోటాలో కోర్సు పూర్తిచేసిన వారికి కూడా సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. అదేమిటని అడిగితే వీరికి ఇచ్చేస్తే.. కన్వీనర్ కోటా విద్యార్థులు కూడా డిమాండ్ చేసే ప్రమాదముందని అంటున్నారు.
అందని రీయింబర్స్‌మెంట్ నిధులు
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలవుతోంది. అర్హులైన విద్యార్థుల తరఫున రాష్ట్ర ప్రభుత్వమే కళాశాలల యాజమాన్యాలకు ఫీజులు చెల్లిస్తోంది. అయితే ఏడాదిన్నర క్రితం ఏర్పాటైన ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఫీజ్ రీయింబర్స్‌మెంట్ నిధులు పూర్తిస్థాయిలో చెల్లించలేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఆ నిధులు అందిన తర్వాతే గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తామని తల్లిదండ్రులకు చెబుతున్నాయి. 2023`24 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో రీయింబర్స్‌మెంట్ నిధులు చెల్లించలేదని అంటున్నారు. దాంతో ఆ విద్యాసంవత్సరంలో కోర్సులు పూర్తిచేసిన వారంతా సొంతంగా ఫీజు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకున్నారు. అదే రీతిలో 2024`25 విద్యా సంవత్సరంలో కోర్సు పూర్తి చేసిన విద్యార్ధులపై ఒత్తిడి తెచ్చి ఫీజు బకాయిలు కట్టించుకున్నారు. బకాయిలు కట్టకపోతే నాలుగో ఏడాది రెండో సెమిస్టర్‌కు అనుమతించబోమని హెచ్చరించడంతో 98 శాతం మంది విద్యార్ధుల తల్లిదండ్రులు అప్పోసప్పో చేసి ఫీజులు కట్టేశారు. అలా చెల్లించని వారికి డిటెన్షన్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. కాగా బకాయి నిధులు తల్లుల ఖాతాలో జమవుతాయిని అప్పట్లో చెప్పారు. కానీ 2024`25 విద్యా సంవత్సరం ముగిసి చాలా నెలలైనా ఆ నిధులు జమ కాలేదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు రెండు విడతల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసినట్లు ప్రకటించారు. అయితే పూర్తిస్థాయిలో అందలేదని చెబుతూ ఈ ఏడాది ఏప్రిల్‌లో కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే అడ్మిషన్స్ కారణంగా ఆలస్యమవుతుందని చెబుతున్నారు. అత్యవసరమైతే భూమి, ఇళ్ల పత్రాలు లేదా ఖాళీ చెక్కులు సబ్మిట్ చేసి సర్టిఫికెట్లు తీసుకోవచ్చని ఉచిత సలహా ఇస్తున్నారు. వాస్తవంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదివే వారంతా పేద విద్యార్ధులే. వారికి ఆస్తులు, చెక్కులు ఎక్కడినుంచి వస్తాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అడ్మిషన్ సమయంలో విద్యార్థుల నుంచి తీసుకున్న టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లను కూడా ఫీజు కన్వీనర్ కోటాలో చదువుకున్నా ఫీజు బకాయిలు చెల్లించిన వారికి వాపసు చేసి, చెల్లించని వారిని పక్కన పెట్టారు.
గందరగోళంలో తల్లిదండ్రులు
సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరించే కళాశాలలపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించినా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. కోర్సు పూర్తి చేసి ఉన్నత చదువుల కోసమో.. ఉద్యోగాల్లో చేరేందుకో సర్టిఫికెట్లు అవసరమయ్యేవారు రీయింబర్స్‌మెంట్‌తో సంబంధం లేకుండా ఫీజు చెల్లించాలి.. లేదంటే భూమి డాక్యుమెంట్లు కుదువ పెట్టాలి. ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేస్తుందన్న నమ్మకం ఉంటే యాజమాన్యం పేరుతో డేట్ వేయకుండా ఖాళీ చెక్కు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఫలితంగా ఇంజినీరింగ్ పూర్తిచేసి ఎంటెక్‌లో చేరాలనుకునే విద్యార్థులు సర్టిఫికెట్లు అందక నిరాశకు గురవుతున్నారు. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సౌకర్యాన్ని కొనసాగిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు చెల్లించాల్సిన రూ.62 వేల ఫీజును రెండు విడతల్లో జమ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే యాజమాన్యాలు మాత్రం దీన్ని నిర్ధారించడం లేదు. వైకాపా హయాంలో తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసి వాటిని కాలేజీలకు చెల్లించేలా చూశారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు విడతల్లో చెల్లించిన నిధులను నేరుగా కళాశాల యాజమాన్యాల ఖాతాల్లో జమ చేయడం వల్ల ప్రభుత్వం ఎంత చెల్లించిందన్నది తల్లిదండ్రులకు తెలియదు. దాంతో కళాశాలలు చెబుతున్నది నిజమో.. ప్రభుత్వం చెబుతున్నది నిజమో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. కళాశాలల ఒత్తిడి తట్టుకోలేక, తమ పిల్లల అవసరాలకు డబ్బులు చెల్లించి లేదా ఆస్తులు తాకట్టు పెట్టి సర్టిఫికెట్లు విడిపించుకుంటున్నారు. అలా చేసే స్తోమత లేనివారు ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తున్నారు.










Comments