top of page

హుద్‌హుద్‌ ఇళ్లు హుష్‌ కాకి!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Jul 16
  • 2 min read
  • కుందువానిపేట ఇళ్ల కేటాయింపులో భారీ అక్రమాలు

  • ఏకంగా 65 ఇళ్లు ఎత్తుకుపోయిన ఒకే కుటుంబీకులు

  • మాజీ సర్పంచ్‌ చేతివాటంతో అర్హులకు అన్యాయం

  • ఆశ్రిత పక్షపాతానికి ఆమోదముద్ర వేసిన రెవెన్యూ, హౌసింగ్‌

  • అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితులు

ree

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

రెవెన్యూ శాఖ కళ్లు చేరేసింది.. హౌసింగ్‌ శాఖ ఆశ్రిత పక్షపాతానికి తెర లేపింది. ఇంకేముంది.. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక నాయకుడి కుటుంబానికి ఆ కాలనీలో ఏకంగా రెండొంతుల ఇళ్లు దఖలుపడ్డాయి. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ అధికారంలో లేనిది ఐదేళ్లు మాత్రమే. కానీ చాలా ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చామని, ఇటువంటి సమయంలోనే ఇల్లు సర్దుకోవాలన్న కోణంలో కార్యకర్తలు వ్యవహరిస్తుండటం వల్ల ప్రస్తుత ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. ఉదయం లేచినప్పటి నుంచి అర్థరాత్రి ఇంటికి చేరే వరకు ప్రారంభోత్సవాలు, ప్రజా గ్రీవెన్స్‌లు, సుపరిపాలనలో తొలి అడుగు, సమీక్షలతో బిజీగా గడిపేస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌ ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారు. శ్రీకాకుళం రూరల్‌ మండలం కుందువానిపేటలో టీడీపీ నేత కుటుంబానికే 65 ఇళ్లు కేటాయించినా అసలు అర్హులెవరు? లబ్ధిదారులెవరు? అనేది తన కార్యాలయ సిబ్బంది అయినా దృష్టికి తీసుకొచ్చే పరిస్థితి లేకుండానే ఎమ్మెల్యే ప్రారంభోత్సవానికి వెళ్లారు. అప్పటి వరకు అట.. కదా అనే బోగట్టా కాస్త ఎమ్మెల్యే ప్రారంభించడంతో పక్కా అని తేలిపోయింది.

ఇళ్లలో ఉన్నవారందరికీ..!

2014లో సంభవించిన హుద్‌హుద్‌ తుపాను ధాటికి మత్స్యకార గ్రామమైన కుందువానిపేటలో కొన్ని ఇళ్లు అలల తాకిడికి కొట్టుకుపోయాయి. వాటి స్థానంలో మత్స్యకారులకు పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆ మేరకు గ్రామంలో 288 ఇళ్లు నిర్మించారు. 2021లో వీటిలో 145 ఇళ్లు, 2022లో 72 ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించారు. ఇళ్ల కేటాయింపునకు అర్హులను గుర్తించడానికి అప్పట్లో రెవెన్యూ, హౌసింగ్‌ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి ఒక ఇంటిలో ఎంతమంది ఉండేవారు? ఇప్పుడు ఎంతమందికి ఇళ్లు ఇవ్వాలి? అని గుర్తించి జాబితా తయారు చేశారు. ఆ మేరకు ఇళ్లు కేటాయించారు. ఈ తరుణంలోనే తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ 18 మంది ఇళ్లు తీసుకోలేదు. కాగా తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన 96 ఇళ్లకు లబ్ధిదారులను గుర్తించారని చెబుతున్నారు. వాస్తవానికి ఇందుకోసం రెవెన్యూ, హౌసింగ్‌ యంత్రాంగం ఎటువంటి క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టలేదు. ఇదే అవకాశంగా ఆ ప్రాంతంలో ఉన్న మాజీ సర్పంచ్‌, తెలుగుదేశం నేత.. తన కుటుంబ సభ్యులు, దగ్గర బంధువులకే 65 ఇళ్లు రాయించేశారు. గతంలో ఓ కుటుంబంలో నలుగురుంటే.. ఇద్దరికి హుద్‌హుద్‌ ఇళ్లు మంజూరు చేశారు. కానీ ఈ మాజీ సర్పంచ్‌ మాత్రం తన ఇంటిలోనూ, బంధువుల ఇళ్లలోనూ ఎంతమంది ఉంటే అందరి పేరునా ఇళ్లు ఇప్పించేశారు. మాజీ సర్పంచ్‌ సూరాడ అప్పన్నకు ముగ్గురు కొడుకులుండగా ముగ్గురికీ మూడిళ్లు కట్టబెట్టారని, ఇద్దరు మేనల్లుళ్లకు మరో రెండు ఇళ్లు, ఆయన తాతగారి ఇంటిలో ఐదుగురుంటే ఐదుళ్లు, మామగారింటిలో ముగ్గురుంటే మూడిళ్లు, వియ్యంకుడి ఇంటిలో ముగ్గురుంటే మరో మూడిళ్లు.. ఇలా తన బంధువర్గానికి మొత్తం 65 ఇళ్లు ఇప్పించుకున్నారు. ఇప్పుడు దీనిపైనే గ్రామంలో పెద్దఎత్తున అలజడి మొదలైంది. నిరుపేదలు, ఇప్పటికీ పక్కా నివాసం లేనివారికి అన్యాయం చేసి ఒకే కుటుంబానికి చెందినవారికి 65 ఇళ్లు కేటాయించడమేమిటని ప్రశ్నించడానికి బుధవారం గ్రామానికి చెందిన కొందరు యువకులతో పాటు బాధితులు స్థానిక 80 అడుగుల రోడ్డులో ఉన్న హౌసింగ్‌ శాఖాధికారులను కలవడానికి వెళ్లారు. నిబంధనల ప్రకారం రేషన్‌కార్డులో ఎంతమంది పేర్లు నమోదై ఉన్నాయి? అందులో ఎంతమంది ఒకే ఇంటిలో ఉంటున్నారన్న లెక్కల మేరకు ఇళ్లు కేటాయించాలి. అలా కాకుండా స్థానిక తెలుగుదేశం నాయకులకే ఈ పెద్దరికాన్ని కట్టబెట్టడం వల్ల ఒకే కుటుంబానికి 65 ఇళ్లు వెళ్లిపోయాయని వీరు ఫిర్యాదులో పేర్కొన్నారు.

హౌసింగ్‌ పీడీని కలిసిన బాధితులు అనర్హుల జాబితాను అందజేస్తే, తమ కార్యాలయంలో వైకాపా నేతల ఇళ్ల జాబితా రద్దు ఫిర్యాదులు ఉన్నాయని, అయినా తాము పట్టాలు వెనక్కు తీసుకోడానికి సిద్ధంగా లేమంటూ వీరికి చెప్పినట్టు భోగట్టా. మరోవైపు హుద్‌హుద్‌ ఇళ్ల మంజూరు కోసం 400 మంది రూ.12వేలు చొప్పున తనకు ఇచ్చారంటూ మాజీ సర్పంచ్‌ బహిరంగంగానే ప్రకటించిన నేపథ్యంలో ఆయన చేతుల మీదుగా అర్హుల జాబితా తయారుచేయించి, ఎమ్మెల్యే పంపిణీ చేపట్టడం మీద గ్రామంలో అసంతృప్తి రేగుతుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page