top of page

హై.. హై.. రైల్వే శాఖ!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 7 hours ago
  • 3 min read

సుమారుగా రెండు శతాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన భారతీయ రైల్వేల్లో మరో కొత్త శకం ప్రారంభ మైంది. దేశంలోని తొట్టతొలి హైడ్రోజన్ రైలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపడంతో పట్టాలపై పరుగులు తీయడం మన రైల్వేలు సాధించిన మరో అద్భుత విజయంగా చెప్పవచ్చు. జీరో కాలుష్యంతో పూర్తిస్థాయి గ్రీన్ రైలు కావడం మరో విశేషం. దాదాపు నీటితోనే నడిచే ఈ రైలు విని యోగం తర్వాత అదే నీటిని బయటకు విడిచిపెట్టడం దీని ప్రత్యేకత. హర్యానాలోని జింద్`సోనేపట్ మధ్య తొలి గ్రీన్ రైలు సర్వీస్ ప్రారంభం కావడంతో ప్రపంచంలో ఈ తరహా రైళ్లు కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత్ చేరింది. ప్రపంచంలో తొలి హైడ్రోజన్ ప్రయాణికుల రైలు 2018లో జర్మనీలో పట్టాలపైకి ఎక్కింది. ఆ తర్వాత జపాన్, చైనా, అమెరికా, స్వీడన్ దేశాల్లో హైడ్రోజన్ రైళ్లు అందుబాటు లోకి వచ్చాయి. అయితే చాలా దేశాల్లో చిన్న రూట్లకే ఈ రైళ్లు పరిమితం కాగా.. మనదేశంలో ఇప్పుడు మొదలైన రైలు బ్రాడ్‌గేజ్‌పై అతిపొడవైన, 2400 కేడబ్ల్యూ సామర్థ్యం కలిగిన హైడ్రోజన్ రైలుగా రికా ర్డులకు ఎక్కింది. ఈ రైలు హైడ్రోజన్, ఆక్సిజన్‌ల రసాయనిక చర్య ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను చోదక శక్తిగా ఉపయోగించుకుని నడుస్తుంది. అంటే ఒకవిధంగా నీటితోనే నడుస్తుందన్నమాట. అదే విధంగా దీనివల్ల ఎటువంటి కర్బన ఉద్గారాలు, కాలుష్య వ్యర్థాలు విడుదల కావు. కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదల అవుతుంది. జింద్‌లో ఉన్న ఒక మెగావాట్ సామర్థ్యం కలిగిన పీఈఎం ఎలక్ట్రోలైజర్ ప్లాంట్‌లో రోజుకు 420 నుంచి 430 కేజీల హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుండగా, దాన్నుంచి ఈ రైలు కోసం అవసరమైన మేరకు ఉపయోగించుకునే ఏర్పాటు చేశారు. ఈ రైలు గరిష్ట నిల్వ సామర్థ్యంలో రోజుకు 300 కేజీలు వినియోగించుకుంటుంది. ఒకసారి లోడ్ చేస్తే 250 కి.మీ. నడుస్తుంది. మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోనే చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ లో ఈ రైలును తయారు చేశారు. భారత్‌లో ప్రస్తుతం విద్యుత్, డీజిల్‌తో నడిచే రైళ్లు ఉండగా.. వాటిని నడిపేందుకు అవసరమైన విద్యుత్, డీజిల్ సమకూర్చేందుకు భారీగా వ్యయం చేయాల్సి వస్తున్నది. వీటి వల్ల కాలుష్య సమస్య కూడా ఉత్పన్నమై పర్యావరణం దెబ్బతింటున్నది. ఈ పరిస్థితుల్లో హైడ్రోజన్ రైళ్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే పర్యావరణానికి మేలు కలగడంతో పాటు రైల్వేలకు ఖర్చు బాగా ఆదా అవుతుంది. రైలు పట్టాల వెంబడి దారి పొడవున హైటెన్షన్ కరెంటు వైర్లు ఉండవు.. వాటి వల్ల ప్రమాద బెడద కూడా తప్పుతుంది. ఈ రైలు లోపలే దానికి అవసరమైన పవర్ జనరేట్ చేసుకుం టుంది. దీనికోసం రైలులో రెండు ఫ్యూయల్ సెల్స్ ఏర్పాటుచేశారు. వీటి లోపల ఉండే హైడ్రోజన్, వాతావరణంలో ఉన్న ఆక్సిజన్‌ను కలిసి రసాయనిక చర్యకు గురవుతాయి. దానివల్ల విద్యుత్ పుట్టి రైలుకు చోదకశక్తిగా ఉపయోగపడుతుంది. ఇది ఒకరకంగా తొలితరం ఆవిరి ఇంజన్లను తలపిస్తుంది. అయితే నాడు ఆవిరి ఇంజన్లలో నీరు మరిగి ఆవిరిగా మారడానికి బొగ్గుతో ఇంజిన్‌లోనే మంటలు పెట్టేవారు. ఇప్పుడు ఆ అవసరం లేకుండానే రసాయనిక చర్య ద్వారానే అంతా జరిగిపోతుంది. అయితే ఈ విధానంలో హైడ్రోజన్ లీకేజీ, మంటలు రేగడం, పొగ వ్యాపించడం వంటి అనర్థాలను వెంటనే పసి గట్టి హెచ్చరించేలా మల్టీలేయర్ సేఫ్టీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. భారతీయ రైల్వేలకు సుమారు రెండు శతాబ్దాల చరిత్ర ఉంది. బ్రిటిష్ హయాంలో లార్డ్ డల్హౌసీ గవర్నర్ జనరల్‌గా ఉన్నప్పుడు మనదేశంలో రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేశారు. 1854లో తొలి రైలు పట్టాలపై పరుగులు తీసింది. అయితే తొలినాళ్ల లో బ్రిటీష్ పాలకుల వ్యాపారం, ఇతరత్రా అవసరాల కోసమే ఎక్కువగా రైళ్లు నడిపేవారు. తర్వాత క్రమంగా ప్రయాణికులను తీసుకెళ్లే పాసింజర్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. మొదట ఆవిరి ఇంజిన్లతో రైళ్లను నడిపారు. తర్వాత కాలంలో బొగ్గు ఇంజిన్లు.. అనంతరం డీజిల్ ఇంజిన్లు అందు బాటులోకి రాగా.. కాలక్రమంలో వాటి స్థానాన్ని విద్యుత్ రైళ్లు ఆక్రమించాయి. స్వాతంత్య్రానంతరం భారతీయ రైల్వేలు బహుముఖంగా అభివృద్ధి చెందాయి. అదే క్రమంలో నిర్వహణ ఖర్చులు తగ్గించుకో వడం, కాలుష్య నివారణ వంటి లక్ష్యాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు రైల్వేలు ఆధునికత సంతరిం చుకుంటున్నాయి. అదే సమయంలో ప్రయాణికులను మరింత వేగంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అందులో భాగంగా రైల్వే శాఖ సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టింది. ప్రధాన మంత్రి ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా మన దేశంలోనే, పూర్తి స్వదేశీ పరి జ్ఞానంతోనే రూపొందించిన ఈ రైళ్లను వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పేరుతో దేశంలోని అన్ని ప్రధాన రూట్ల లో ప్రవేశపెట్టారు. కేవలం సీటింగ్ సౌకర్యం మాత్రమే ఉన్న ఈ రైళ్లను ప్రధానంగా పగటిపూట ప్రధాన నగరాల మధ్య నడిపిన రైల్వేశాఖ.. ఆ ప్రయత్నం సఫలం కావడం, వందేభారత్‌కు ప్రయాణికుల నుంచి అపూర్వ ఆదరణ లభించడంతో మరో అడుగు ముందుకేసి దూరప్రాంత ప్రయాణికుల సౌక ర్యార్థం రాత్రిపూట ప్రయాణించేలా నిద్రపోయే సౌకర్యాలతో వందేభారత్ స్లీపర్ రైళ్లను ఈ మధ్యే ప్రవేశపెట్టి ఆ సర్వీసులను క్రమంగా విస్తరించుకుంటూ వస్తున్నది. మరోవైపు జపాన్‌తో కలిసి హైస్పీడ్ రైలు ప్రాజెక్టును అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. అతి త్వరలోనే జపాన్, చైనా తరహాలో బుల్లెట్ రైళ్లు భారతీయ రైల్వే వ్యవస్థలో చేరేందుకు సిద్ధమవుతున్నాయి. ఇదే సమయంలో హైడ్రోజన్ రైలు పట్టాలెక్కడం రైల్వే చరిత్రలో అతిపెద్ద మైలురాయిగా నిలుస్తుంది. ప్రస్తుతానికి ఈ రైలు గరిష్ట వేగం 120 కిలోమీటర్లుగా ఉన్నా సగటు వేగం 50 కి.మీ. మించకుండా నడపాలని నిర్ణయించారు. ఇంకా ప్రారంభ దశలో ఉన్నందున ఎలాంటి ప్రమాదాలకు తావు ఇవ్వకుండా ఈ ముందుజాగ్రత్త తీసు కున్నట్లు రైల్వేవర్గాలు పేర్కొన్నారు. ఈ రైలు పనితీరు, ప్రయాణికుల నుంచి లభించే ఆదరణను అనుస రించి క్రమంగా వీటి వేగం పెంచడం, సర్వీసులు పెంచడంపై దృష్టి సారించనున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page