హలో.. మీ కలెక్టర్ ఎలా ఉన్నారు?
- BAGADI NARAYANARAO
- Aug 14
- 2 min read
అధికారుల పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా
ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ
ఇంతవరకు ఎమ్మెల్యేలు, పథకాల వరకే పరిమితం
తాజా చర్యలతో పాలనలో జవాబుదారీతనం పెరిగే ఛాన్స్

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
‘మంగళగిరి టీడీపీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది?.. బాగుంటే 1 నొక్కండి, బాగులేకపోతే 2 నొక్కండి, చెప్పలేకపోతే 3 నొక్కండి’..
ఈ మధ్యకాలంలో ఇటువంటి వాయిస్ కాల్స్‌ను రాష్ట్ర ప్రజలు తరచూ అందుకుంటున్నారు. ఇవి చంద్రబాబునాయుడు హైటెక్ విధానాలను ప్రతిబింబిస్తుంటాయి. పార్టీని, ప్రభుత్వాన్ని నడపడంలో ప్రజాభిప్రాయానికే ప్రాముఖ్యత ఇవ్వాలన్నది ఆయన ఉద్దేశం.. అందుకే తాను చేపట్టే ప్రతి కార్యక్రమంపై వివిధ మార్గాల్లో ప్రజాభిప్రాయం సేకరిస్తుంటారు. అందులో భాగమే ప్రస్తుతం ప్రజలకు అందుతున్న ఐవీఆర్‌ఎస్ కాల్స్. ఇంతవరకు అభ్యర్థుల ఎంపిక, ఎమ్మెల్యేల పనితీరు, పథకాల ప్రయోజనాలపై ప్రజల ఫీడ్‌బ్యాక్ తీసుకోవడానికే ఈ పద్ధతిని అనుసరించిన చంద్రబాబు సర్కారు తాజా అధికారుల పనితీరుపైనా ఇదే విధానంలో ప్రజాభిప్రాయం సేకరిస్తోంది.
ఫీడ్‌బ్యాక్ ఆధారంగా చర్యలు
అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలు, ప్రజాప్రతినిధుల పనితీరుపైన.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలకు తమ పార్టీ అభ్యర్ధుల ఎంపికపైన ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం చంద్రబాబుకు తొలినుంచీ అలవాటు. దీనికోసం ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం (ఐవీఆర్‌ఎస్)ను వినియోగిస్తుంటారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఉన్నతాధికారుల పనితీరుపైనా ప్రజాభిప్రాయం సేకరిస్తున్నారు. జిల్లా కలెక్టర్, జేసీలతోపాటు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల కమిషనర్ల పనితీరుపై ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారు. ముందుగా కలెక్టర్, జిల్లా సంయుక్త కలెక్టర్ పనితీరుపై ప్రస్తుతం ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరిస్తున్నారు. తర్వాత దశలో ప్రభుత్వ శాఖల జిల్లా అధికారుల పనితీరు, అవినీతిపై ఫీడ్‌బ్యాక్ తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా ప్రజలు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల గ్రీవెన్స్‌కు వచ్చే ఫిర్యాదులు, అర్జీలకు పరిష్కారం చూపించారా లేదా.. పరిష్కారంపై సంతృప్తిగా ఉన్నారా అంటూ దరఖాస్తుదారుల నుంచి ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రభుత్వం ఫీడ్‌బ్యాక్ తీసుకుంటోంది. దాంతో గ్రీవెన్స్‌లో అందే అర్జీలకు తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక పరిష్కారం చూపించాల్సిన అగత్యం అధికారులకు ఏర్పడిరది. అయితే అర్జీలకు గడువులోగా పరిష్కారం చూపించినట్టు దరఖాస్తుదారుల నుంచి సంతకాలు తీసుకొని రియల్‌టైం గవర్నెన్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్ కాల్ ద్వారా అర్జీదారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటోంది. వారి అభిప్రాయం మేరకు తదుపరి చర్యలకు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు, వారి అవినీతిపైనా ఐవీఆర్‌ఎస్ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. దాని ఆధారంగా గ్రేడ్‌లు ఇవ్వడంతోపాటు అసంతృప్తి ఎదుర్కొంటున్న వారిని పిలిపించి పనితీరు మార్చుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు.
పెరగనున్న జవాబుదారీతనం
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే పథకాలు, చేపట్టే కార్యక్రమాలు, తీసుకునే నిర్ణయాలపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్నారు. దానికి కొనసాగింపుగా అధికారుల పనితీరుపైనా ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం ప్రారంభించారు. 2014`19 మధ్య ఐవీఆర్‌ఎస్ విధానాన్ని విస్తృతంగా వినియోగించిన చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ విధానాన్ని పున:ప్రారంభించారు. పథకాల ప్రయోజనాలు, వాటి అమలు తీరు, ప్రభుత్వ సేవల్లో నాణ్యత వంటి అంశాలపై ప్రజలు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా రేటింగ్ ఇవ్వడంతోపాటు అవసరమైన మార్పులు చేర్పులు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పటికే అన్న క్యాంటీన్లు, ఇంటింటికీ పింఛన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాలకు సంబంధించి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. అన్న క్యాంటీన్లలో ఆహార నాణ్యత, క్వాంటిటీ, పరిశుభ్రత, సమయపాలనపై ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. పింఛను ఇంటి వద్దే అందుతుందా? లేదా?.. ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? వంటి ప్రశ్నలకు లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈ విధానం వల్ల ప్రభుత్వ పథకాల అమల్లోనూ, అధికారుల పనితీరులోనూ జవాబుదారీతనం పెరిగి కచ్చితత్వం వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలుఉన్న ఉచిత ఇసుక విధానం, నూతన మద్యం పాలసీ అమలుతీరుపైనా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తే వాటిలోనూ పారదర్శకత పెరుగుతుందని పలువురు సూచిస్తున్నారు. మరోవైపు అభిప్రాయాలు సేకరించడమే తప్ప వాటిని ఆచరణలో పెట్టడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఖరీఫ్ ధాన్యం సేకరణ సమయంలో ధాన్యం కొనుగోలుపై ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా రౖౖెతుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. ఆ మేరకు ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని విమర్శలు ఉన్నాయి.
Comments