20 మంది సజీవదహనం
- Guest Writer
- Oct 24
- 3 min read
కధనం కామెంట్ సెక్షన్‌లో..
20 మంది సజీవదహనం
కర్నూలులో ఘోర ప్రమాదం
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం
ప్రమాద సమయంలో బస్సులో 41 మంది

(సత్యం ఇంటర్నెట్ డెస్క్)
కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బస్సు బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ఢీకొన్న తర్వాత ద్విచక్రవాహనదారుడు కిందపడిపోయాడు. బైక్ మాత్రం బస్సు కిందకు చొచ్చుకుపోయింది. ఆ సమయంలో బైక్‌లోని పెట్రోల్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదానికి బస్సులోనే పలువురు సజీవ దహనం అయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది వరకు ఉన్నట్లు సమాచారం. 12 మంది వరకు స్వల్ప గాయాలతో బయటపడినట్లు, 20 మందికి పైగా మృతిచెందినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఈ బస్సు కర్నూలు నగర శివారులో ఉలిందకొండ సమీపంలోకి రాగానే వెనక నుంచి వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఆ బైకు బస్సు కిందికి వెళ్లి ఇంధన ట్యాంకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సు అంతా మంటలు వ్యాప్తిచెందాయి. గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని హాహాకారాలు చేస్తూ కొందరు బయటపడగా, పలువురు మంటల్లోనే చిక్కుకున్నారు.. పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నట్లు తెలుస్తుంది. ఘటన జరిగిన వెంటనే ఇద్దరు డ్రైవర్లు పరారీ అయ్యారు.
ప్రాణాలతో బయటపడినవారు వీరే..
ప్రమాదం నుంచి రామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్‌కుమార్, అఖిల్, జష్మిత, అకీర, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం బయటపడ్డారు. హిందూపూర్‌కు చెందిన నవీన్ బస్సు ప్రమాదంలో గాయాలైన వారిని ఆరుగురిని తన కారులో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పుట్టపర్తి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న హైమ రెడ్డి బస్సులో మంటలు చెలరేగడాన్ని చూసి ఆగారు. పోలీసులకు ఆమె సమాచారం అందించడంతో వెంటనే వారు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మొత్తం 4 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. బైకును ఢీకొట్టగానే బస్సు కిందకు దూరి ఇంధన ట్యాంక్‌కు తగలడంతో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో చాలా మంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండడంతో తప్పించుకునే అవకాశం లేకుండాపోయింది.
ఆ బస్సుపై 16 చలాన్లు
ఈ ప్రమాదానికి గురైన బస్సుపై తెలంగాణలో 16 చలాన్లు ఉన్నాయి. రూ.23,120 ఫైన్లు పెండిరగ్‌లో ఉన్నాయి. 2024 జనవరి 27 నుంచి 2025 అక్టోబరు 9 వరకు ఈ బస్సు 16 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలిసింది. 9 సార్లు నో ఎంట్రీ జోన్‌లోకి ప్రవేశించడంతో జరిమానాలు పడ్డాయి. హైస్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘనలపైనా చలాన్లు పడినట్లు తెలిసింది.
బస్సు ఫిట్‌గానే ఉంది: రవాణాశాఖ
ప్రమాదానికి గురైన బస్సు జీజీ 01 ఎన్ 9490 నంబరుతో రిజిస్టర్ అయినట్లు ఏపీ రవాణా శాఖ వెల్లడిరచింది. ఈ బస్సు ఫిట్‌గానే ఉందని, బైక్‌ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వచ్చాయని తెలిపింది. ‘కావేరి ట్రావెల్స్ పేరిట రిజిస్ట్రేషన్ చేసి బస్సు నడుపుతున్నారు. 2018 మే 2న బస్సును డామన్ డయ్యూలో రిజిస్ట్రేషన్ చేశారు. ఈ బస్సుకు 2030 ఏప్రిల్ 30 వరకు టూరిస్ట్ పర్మిట్ జారీ అయింది. ప్రమాదానికి గురైన బస్సు ఫిట్‌గా ఉంది. 2027 మార్చి 31 వరకు ఫిట్‌నెస్ ఉంది. 2026 ఏప్రిల్ 20 వరకు బస్సుకు ఇన్సూరెన్స్ ఉంది. బైక్‌ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వచ్చాయి. అన్ని కోణాల్లో పూర్థిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు నివేదిక మేరకు భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాం’ అని రవాణా శాఖ పేర్కొంది.
బస్సు ప్రమాదానికి కారణం ఇదే.. డీఐజీ క్లారిటీ
అమరావతి: కర్నూలు జిల్లా చిన్నటేకూరులో జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంపై డీఐజీ కోయ ప్రవీణ్ స్పందించారు. ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడిరచారు. బస్సులో 38 మంది పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే 11 మృతదేహాలను వెలికితీశామన్నారు. ప్రస్తుతం బస్సు ప్రధాన డ్రైవర్ పరారీలో ఉన్నాడని, మరొక డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని డీఐజీ తెలిపారు. బైక్‌ను ఢీకొని మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించిందని స్పష్టం చేశారు. క్షతగాత్రులకు తక్షణమే వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రమాద పరిణామాలను అంచనా వేసి, స్థానిక అధికారులు, వైద్యులు క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు.
నిర్లక్ష్యమే కారణమని తేలితే కఠిన చర్యలు
కర్నూలు బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, అధికారులతో సమగ్ర విచారణకు ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మృతుల వివరాలు గుర్తించి కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. ప్రైవేటు బస్సుల ఫిట్‌నెస్, సేఫ్టీ, పర్మిట్ తనిఖీలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల్లో బస్సుల సాంకేతిక తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రమాదానికి గురైన ప్రైవేటు బస్సు రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్, పర్మిట్ వివరాలపై పూర్తి నివేదికను కోరారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి
ఘోర బస్సు ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లిలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. గొల్ల రమేశ్ సహా నలుగురు కుటుంబ సభ్యులు మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఈ ప్రమాదంలో గొల్ల రమేశ్ (35), అనూష (30), మన్విత (10), మనీశ్ (12) మృతి చెందారు. బంధువులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
ద్విచక్ర వాహనదారుడి మృతి
బస్సు బైక్‌ను ఢీకొట్టిన తర్వాత బస్సు దాన్ని 300 మీటర్లు లాక్కెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు కూడా చనిపోయాడు. మృతుడిని కర్నూలు మండలం ప్రజానగర్‌కు చెందిన శివశంకర్‌గా నిర్ధారించారు. పెళ్లిచూపులు చూస్తున్న సమయంలో శివశంకర్ మృతిచెందడంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదం జరిగిన సమయంలో ఎందుకు బయటకు వెళ్లాడో తమకు తెలియదని కుటుంబసభ్యులు తెలిపారు.










Comments