5 రాష్ట్రాల్లో ఎన్నికలు మాత్రమే కాదు.. అంతకు మించి!
- NVS PRASAD

- 5 days ago
- 2 min read

(సత్యంన్యూస్, అమరావతి)
దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. ప్రతీ సార్వత్రిక ఎన్నిక మాదిరిగానే ఈ ఎన్నికలు కేవలం గెలుపు ఓటమిలకు సంబంధించినది మాత్రమే కాదు.. దేశాన్ని ఎటువైపు తీసుకువెళ్తున్నామనేది తెలియజెప్పే ఎన్నిక కావడం గమనార్హం. కేవలం వ్యూహాత్మక దృక్పథంతో చూస్తే, ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో బీజేపీ గెలిచినా ఓడినా ఆ పార్టీకి వచ్చే నష్టం పెద్దగా ఏమీ ఉండదు. ఈశాన్య భారతంలో తన కీలకమైన స్థావరమైన అస్సాంను కోల్పోవడానికి మాత్రం ఆ పార్టీ ఇష్టపడదు. కానీ తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరిలలో ఓడిపోయినా.. కేవలం ఓట్ల శాతం పెరిగితే చాలు అని ఆ పార్టీ సంతృప్తి చెందవచ్చు.
పశ్చిమ బెంగాýలో ఓటర్ల జాబితా సవరణ (ఎసఐఆర్), ముఖ్యంగా సాధారణం కంటే ఎక్కువగా ఓట్లు తొలగించబడిన నియోజకవర్గాల్లో ఫలితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలియజెప్పే ఎన్నిక ఇదే. తమిళనాడులో విజయ్ రాక వల్ల డిఎంకె కూటమికి నష్టం జరుగుతుందా లేక ఎడిఎంకె కూటమికా అనేది తేల్చే ఎన్నిక కూడా ఇదే. కేరళలో బీజేపీ ఎదుగుదల, రెండు పర్యాయాల పాలన తర్వాత ఎల్‌డిఎఫ్‌పై ఉన్న వ్యతిరేకత కేరళ ఫలితాలను ఎలా మారుస్తాయోనని విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్నికలివి. ఎందుకంటే.. ఆమధ్య ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించింది. కమ్యూనిస్టుల కంచుకోటలో హిందూ అజెండా రెపరెపలాడటం ఇదే మొదటిసారి. ఇక అస్సాంలో ‘మియా’ ముస్లింలకు వ్యతిరేకంగా హిమంత బిశ్వశర్మ చేస్తున్న దూకుడు వ్యాఖ్యలు, చర్యలు, ఆయన ప్రధాన ఓటు బ్యాంక్ అయిన అస్సామీ, బెంగాలీ హిందువుల నుంచి ఓట్లను రప్పిస్తాయా, లేదా అనేది తేల్చే ఎన్నిక.
ఓటర్ల జాబితా సవరణ -రాజకీయ పరిణామాలు
ప్రస్తుత వివాదంలో ప్రధానాంశం ఓటర్ల జాబితా సవరణ. ప్రజాస్వామ్యంలో ఓటర్ల జాబితాను కాలానుగుణంగా ప్రక్షాళన చేయడం అనవసరమని ఎవరూ చెప్పలేరు. పైగా, ఈ సవరణల వల్ల బీహార్, తమిళనాడు, కేరళలలో ఎటువంటి పెద్ద సమస్యలు తలెత్తలేదు. దీనిని బట్టి చూస్తే, ఈ సమస్య ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్‌కు సంబంధించినదిగా కనిపిస్తోంది. సరిహద్దులు సరిగ్గా లేని ఈ రాష్ట్రంలో, భారతీయులు కాని వారు ఓటర్ల జాబితాలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉండటమే దీనికి కారణం కావచ్చు.
రాజకీయ పార్టీలతో వివరణాత్మక చర్చలు జరపనందుకు ఎన్నికల సంఘాన్ని (ఈసీ) తప్పుబట్టవచ్చు, కానీ ఆ కారణంతో మమతా బెనర్జీ పదేపదే వీధి పోరాటాలకు దిగడం, ఎన్నికల సంఘం అధికారులను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదు. ఎన్నికల సంఘానికి సొంతంగా శాశ్వత సిబ్బంది ఉండరు. అది తన పనుల కోసం రాష్ట్ర అధికారులపైనే ఆధారపడాలి. ఇక్కడ జరుగుతున్న అభ్యంతరాలకు మమతా బెనర్జీయే బాధ్యత వహించాలి. బెంగాల్ ఓటర్ల జాబితా నుంచి తొలగింపులపై వచ్చే అప్పీళ్లను విచారించడానికి సుప్రీంకోర్టు ఇప్పుడు జ్యుడీషియల్ అధికారులను ఉపయోగిస్తోంది. ఇది కేవలం తృణమూల్ కాంగ్రెస్‌కే కాదు, రాజకీయ పార్టీలకు ఎసఐఆర్ ప్రాముఖ్యతను వివరించడంలో విఫలమైన ఎన్నికల సంఘానికి కూడా వ్యతిరేకంగా వచ్చిన తీర్పుగా భావించవచ్చు.
రాబోయే సవాళ్లు
ఈ ఎన్నికల అసలు ప్రాముఖ్యత ఫలితాల్లో లేదు, కానీ 2027, ఆ తర్వాత దేశం ఎదుర్కోబోయే అత్యంత వివాదాస్పద అంశాలకు ఇవి రాజకీయ వేదికను సిద్ధం చేస్తాయి. 2027 మొదటి సగంలో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ, మహారాష్ట్రలో ఓడిపోవడం వల్లే 2024లో బీజేపీ తన పార్లమెంటరీ మెజారిటీని కోల్పోయింది. అలాగే ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాలకు కూడా మొదటి సగంలోనే ఎన్నికలు జరగనుండగా, ఏడాది చివరలో హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్‌లలో ఎన్నికలు జరగనున్నాయి.






Comments