top of page

65 ఏళ్ల విద్యా సుగంధం..వావిలపల్లి శ్రమ సౌధం

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 4 hours ago
  • 2 min read
  • వేణుగోపాలనాయుడు కృషితో మందరాడకు పాఠశాల

  • ఆస్తులు, శ్రమ ధారబోసి దాన్ని నిలబెట్టిన మహనీయుడు

  • చుట్టుపక్కల 20 గ్రామాలకు అక్షరాలయంగా అభివృద్ధి

  • పాఠశాల కీర్తిపతాకను విశ్వ వీధిలో ఎగరేస్తున్న పూర్వ విద్యార్థులు

ఒక ప్రాంతం.. అదీ మారుమూల గ్రామం అభివృద్ధి చెందాలంటే .. అక్కడి ప్రజలకు అక్షర జ్ఞానం అబ్బాలి. అందుకు తగిన సౌకర్యాలు సమకూరాలి. అప్పుడు ప్రజలు విద్యావంతులవుతారు. వివేచనతో మంచీచెడు ఆలోచిస్తారు. వ్యక్తిగతంగా, సామాజికంగా, రాజకీయంగా తాము ఎదగడంతోపాటు గ్రామాన్నీ ఉన్నతస్థాయికి తీసుకెళ్లగలుగుతారు. కానీ దానికి ఎక్కడో ఒకచోట బీజం పడాలి. అందుకు ఎవరో ఒకరు పూనుకోవాలి. ముందడుగు వేయాలి. అలా ముందడుగు వేసి తన స్వగ్రామమైన మందరాడలో అక్షరాలయాన్ని నిర్మించి.. వేలమందికి విద్యావెలుగులు పంచిన మహానుభావుడు వావిలపల్లి వేణుగోపాలనాయుడు (వేణునాయుడు). ఆయన నాటిన విద్యా విత్తనమే కాలక్రమంలో మొక్కగా.. చెట్టుగా.. మహావృక్షంగా ఎదిగి.. 65 ఏళ్లు గడిచినా కూడా ఇప్పటికీ తన నీడన ఇప్పటికీ వందలాదిమందికి అక్షరజ్ఞానం కల్పిస్తూ.. వారి వికాసానికి బాటలు వేస్తోంది.

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండల పరిధిలోని మందరాడ ఒకప్పుడు ఎటువంటి సౌకర్యాలు లేని కుగ్రామం. ముఖ్యంగా విద్యా వసతులు లేకపోవడం, పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించాలన్న అవగాహన లేని నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల కారణంగా చిన్నపిల్లలు అక్షర జ్ఞానానికి నోచుకోలేకపోయేవారు. ఈ దుస్థితిని చూసి ఆవేదనకు గురైన గ్రామానికి చెందిన వావిలపల్లి వేణుగోపాల నాయుడు తన జన్మభూమిని దశ దిశను మార్చాలని కంకణం కట్టుకున్నారు. విద్యా సౌకర్యం అందుబాటులోకి తెస్తే సమస్యలన్నీ క్రమంగా పరిష్కారమవుతాయని భావించిన ఆయన అందుకు కృషి ప్రారంభించారు. మందరాడ గ్రామ సర్పంచ్‌గా 1959లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన తన అధికారాన్ని గ్రామాభివృద్ధికి, ప్రజాశ్రేయస్సుకు అంకితం చేశారు. ఉన్నతస్థాయి నాయకులు, అధికారులను కలిసి తమ గ్రామానికి పాఠశాల మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేయడం ప్రారంభించారు. అప్పట్లో జిల్లాపరిషత్‌ అధ్యక్షులుగా ఉన్న బెండి కూర్మన్న, గొర్లె శ్రీరాములునాయుడుల సహకారంతో మందరాడకు 1960లో పాఠశాల మంజూరు చేయించారు. పాఠశాల అభివృద్ధికి తన ఆస్తిని, పదవిని, పలుకుబడిని, శ్రమను వెచ్చించారు. పాఠశాలకు తమ కుటుంబ భూములను విరాళంగా ఇవ్వడంతోపాటు భవన నిర్మాణాలకు స్థానిక ప్రజల సహకారం తీసుకున్నారు. ఆ రోజుల్లో గడ్డితో షెడ్లు నిర్మించి పాఠశాలకు వసతి కల్పించారు.

ఊరూరా తిరిగి విద్యార్థుల సమీకరణ

అప్పట్లో తమ పిల్లలను చదివించడానికి పెద్దవారు ఆసక్తి చూపేవారు కాదు. పశువుల కాపర్లుగా మార్చడం, చిన్న చిన్న పనులకు పంపడం చేసేవారు. దానివల్ల కుటుంబానికి ఆదాయం లభిస్తుందని భావించేవారు. మందరాడలో పాఠశాల ఏర్పాటైనా ఇవే కారణాలతో విద్యార్థులు వచ్చే పరిస్థితి కనిపించలేదు. దాంతో మళ్లీ వేణుగోపాలనాయుడే నడుం కట్టి ఊరూరా తిరుగుతూ పెద్దలను ఒప్పించి వారి పిల్లలను పాఠశాలలో చేర్చేలా ఒప్పించేందుకు తీవ్రంగా శ్రమించి విజయం సాధించారు. అలాగే విద్యా సంపన్నులు, బోధననే జీవన విధానంగా చేసుకున్న ఆదర్శ ఉపాధాయులు వివరాలు సేకరించి వారిని తమ గ్రామ పాఠశాలకు నియమించుకోవడానికి కృషి చేశారు. ఆయన కృషి ఫలించి క్రమంగా విద్యార్థులు రావడం పెరిగింది. మందరాడతోపాటు చుట్టుపక్కల 20 గ్రామాల నుంచి విద్యార్థులు ఈ పాఠశాలకు వచ్చి చదువుకోవడం మొదలైంది.

ఎందరో మహానుభావులు

గ్రామానికి పాఠశాలను తీసుకురావడంలో, దాన్ని తీర్చిదిద్దడంలో వావిలపల్లి వేణుగోపాలనాయుడు కృషి ఒక ఎత్తు అయితే.. పాఠశాలను అభివృద్ధి పథంలో నడిపించడానికి తర్వాత కాలంలో పలువురు మహానుభావులు చేసిన కృషి మరో ఎత్తు. నాటి మందరాడ మనసబు వావిలపల్లి చిరంజీవినాయుడు, కాకరాపల్లి సర్పంచ్‌ బండారు రామి నాయుడు, చిన్నయ్యపేట సర్పంచ్‌ రూపిటి జగన్నాథనాయుడు, చింతలపేట గ్రామ పెద్ద పొట్నూరు వెంకునాయుడు, చిత్తారపురం సర్పంచ్‌ మొయ్యి సత్యనారాయణ నాయుడితోపాటు అక్కరాపల్లి గ్రామ పెద్దలు చేదోడుగా నిలిచి పాఠశాల ఉన్నతికి సహకరించారు. తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేసిన గెడ్డాపు సత్యం మాస్టారు ఈ పాఠశాల అభివృద్ధికి సర్వశక్తులు ఒడ్డి కృషి చేశారు. 2009లో వావిలపల్లి వేణుగోపాలనాయుడు మృతి చెందగా.. అప్పటి జిల్లాపరిషత్‌ ఛైర్మన్‌ పాలవలస రాజశేఖరం అనుమతి ఇవ్వగా.. ఉన్నత పాఠశాల ఆవరణలో వావిలపల్లి విగ్రహాన్ని ఆయన కుటుంబ సభ్యులు ప్రతిష్టించారు.

ఉన్నత స్థానాల్లో విద్యార్థులు

మందరాడలో ఉన్నత పాఠశాల ప్రారంభించిన ముహూర్త బలమో లేక దాన్ని ప్రారంభించినవారి హస్తవాసో తెలియదు గానీ.. ఈ పాఠశాలలో విద్యార్థులు వివిధ రంగాల్లో రాణిస్తూ పాఠశాలకు పేరుప్రఖ్యాతులు తీసుకొస్తున్నారు. మందరాడ పాఠశాలలో చదువుకుంటే జీవితంలో మంచి స్థితికి ఎదుగుతారన్న భావన ప్రజల్లో నాటకుపోయిందనడం అతిశయోక్తి కాదు. అందుకే ఈ పాఠశాలలో అడ్మిషన్లకు తీవ్ర పోటీ ఉంటుంది. పదో తరగతిలో ప్రతి ఏటా 95 శాతానికిపైగా ఉత్తీర్ణత సాధిస్తోంది. ప్రైవేటు పాఠశాలల పోటీని తట్టుకొని ప్రస్తుతం 372 మంది విద్యార్థులతో నడుస్తోంది. క్రీడారంగంలోనూ ఈ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారు. ఈ పాఠశాలలో చదువుకున్న జి.గీతాంజలి అంతర్జాతీయ బోట్‌ రోయింగ్‌ క్రీడాకారిణిగా రాణిస్తుండగా ముగడ శిరీష జాతీయస్థాయి స్విమ్మింగ్‌ క్రీడాకారిణిగా ఉంది. మరోవైపు చాలామంది పూర్వ విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నతస్థాయి అధికారులుగా, శాస్త్రవేత్తలుగా పేరుప్రఖ్యాతులు సాధిస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page