top of page

UAE నిర్ణయం భారత్‌కు వరం

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 4 hours ago
  • 2 min read

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఇంధన దిగుమతులపై ఆధారపడిన భారత్‌ను కాస్త ఉపశమింపజేసేదిగా.. అదే సమయంలో పాకిస్తాన్‌ను ఆర్థికంగా ఇబ్బందిపెట్టేదిగా అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి అయిన ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్(ఒపెక్) నుంచి వైదొలగుతున్నట్లు UAE ప్రకటించింది. మే ఒకటో తేదీ అంటే రేపటినుంచే ఇది అమల్లోకి రానుంది. ఇక నుంచి చమురు, గ్యాస్ ఉత్పత్తి విషయంలో స్వతంత్రంగా, మరింత బాధ్యాతాయుతంగా వ్యవహరిస్తామని ఆ దేశం ప్రకటించింది. 1967లో యూఏఈ ఒపెక్ కూటమిలో చేరింది. ఆ కూటమి సభ్యులైన సౌదీ అరేబియా, ఇరాక్ తర్వాత ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఒపెక్ నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చింది. కానీ సుమారు ఆరు దశాబ్దాల అనుబంధాన్ని అనూహ్యంగా తెంచుకోవడం ప్రపంచ దేశాలను షాక్‌కు గురి చేసింది. దీనివల్ల భవిష్యత్తులో ఒపెక్ బలహీనపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే హర్మూజ్ మూసివేతతో చమురు, గ్యాస్ ఎగుమతుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒపెక్ దేశాలకు యూఏఈ నిర్ణయం షాక్‌లా పరిణమించింది. ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి సౌదీ అరేబియా, పాకిస్తాన్‌లే కారణమని యÖఈఏ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ దేశంపై ఇరాన్ దాడులు కూడా మరో కారణంగా చెబుతున్నారు. అమెరికాతో యుద్ధం పేరుతో ఇరాన్ తమ భూభాగంపై దాడులకు పాల్పడటంపై అమెరికాకు సన్నిహితంగా ఉండే సౌదీ అరేబియా వంటి తన ప్రాంతీయ మిత్రదేశాలు సరైన రీతిలో స్పందించకపోవడం పట్ల యూఏఈ అసంతృప్తితో ఉంది. యూఏఈపై ఇరాన్ ఇటీవల 537 బాలిస్టిక్ క్షిపణులు, 26 క్రూయిజ్ మిసైళ్లు, 2,256 డ్రోన్లతో జరిపిన దాడుల్లో యూఏఈ మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒపెక్ కూటమికి నాయకత్వం వహిస్తున్న సౌదీ సభ్య దేశాలకు అమెరికా ద్వారా రక్షణ కల్పించడంలో విఫలమైంది. మరోవైపు ఇరాన్`అమెరికా చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ కూడా గల్ఫ్ దేశాలపై దాడుల విషయంలో తటస్థంగా ఉండిపోవడం యూఏఈని తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ఆ అసంతృప్తితోనే తాను ఇచ్చిన 3.5 బిలియన్ డాలర్ల రుణాన్ని తక్షణమే తిరిగి చెల్లించాలని పాక్ మెడపై యÖఏఈ కత్తిపెట్టింది. దాంతో ఆ రుణాన్ని సౌదీ సహకారంతో పాక్ చెల్లించేసినా ఈ పరిణామం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగా మారింది. యూఏఈలో 1.6 మిలియన్లకు పైగా పాకిస్తానీలు నివసిస్తున్నారు. వీరు పెద్దమొత్తాల్లో పంపే డబ్బులే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకం. తాజా పరిణామాల నేపథ్యంలో పాక్‌కు నగదు ప్రవాహం తగ్గిపోవచ్చు. 2025లో సౌదీ-పాకిస్తాన్ మధ్య రక్షణ ఒప్పందం కుదరడం, ఇప్పుడు భారీ ఆర్థిక సహకారం అందించి ఆదుకోవడం ద్వారా తనను పక్కనపెట్టి సౌదీ, పాక్‌లు సాన్నిహిత్యం పెంచుకుంటున్నట్లు UAE భావిస్తున్నది. దీనికితోడు ఆర్థిక ఎదుగుదలకు వీలుగా చమురు ఉత్పత్తిని పెంచాలన్న తన నిర్ణయాలను సౌదీ అడ్డుకోవడం యÖఏఈని అసంతృప్తికి గురిచేసింది. ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరలను స్థిరంగా ఉంచాలన్న సాకుతో గల్ఫ్ దేశాల క్రూడ్ ఉత్పత్తులపై ఒపెక్ కూటమి అధ్యక్షురాలి హదాలో సౌదీ పరిమితులు విధించింది. ఒపెక్ నుంచి వైదొలగడం ద్వారా ఉత్పత్తి ఆంక్షల నుంచి విముక్తి పొందిన యÖఏఈ తన రోజువారి చమురు ఉత్పత్తిని 4.8 మిలియన్ బ్యారెళ్ల వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఇది గ్లోబల్ మార్కెట్లో సరఫరా పెంచి ధరల తగ్గుదలకు దోహదం చేస్తుంది. మరోవైపు భారత్‌కు రెండు రకాల ప్రయోజనాలు కలుగనున్నాయి. భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 9 నుంచి 10 శాతం యూఏఈ నుంచే దిగుమతి చేసుకుంటున్నది. అలాగే ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో హర్మూజ్ జలసంధి గుండా చమురు రవాణా అత్యంత ప్రమాదకరంగా మారింది. అయితే యూఏఈకి హన్షన్-ఫుజైరా ఆయిల్ పైపులైన్ ఉంది. ఇది అబుదాబి నుంచి నేరుగా ఒమన్ గల్ఫ్‌లోని ఫుజైరా ఓడరేవు వరకు చమురును తీసుకెళ్తుంది. దీంతో హార్ముజ్ జలసంధితో సంబంధం లేకుండానే యూఏఈ చమురును అరేబియా సముద్రం ద్వారా నేరుగా భారత్‌కు పంపే అవకాశం ఉంటుంది. దీనివల్ల రవాణా దూరం తగ్గి చమురు దిగుమతుల బిల్లు కూడా తగ్గుతుంది. ఇది వినియోగదారులకు నేరుగా లాభం చేకూరుస్తుంది. 2022లో యూఏఈ నుంచి 11 బిలియన్ డాలర్ల విలువైన క్రూడ్ దిగుమతి చేసుకోగా 2026లో ఇది 14 బిలియన్ డాలర్లకు పెరిగింది. యూఏఈ వాటా భారత్ క్రూడ్ దిగుమతుల్లో 10.3 నుంచి 11.4 శాతానికి పెరిగింది. ముందు ముందు యÖఏఈ చమురు ఉత్పత్తి పెంచడంతోపాటు భారత్‌కు అక్కడి నుంచి ఎగుమతులు పెంచేలా దీర్ఘకాల సరఫరా ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఎలఎన్‌జీ, ఎల్‌పీజీ రంగాల్లో కూడా కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. భారత్‌తో యÖఏఈకి గతం నుంచీ బలమైన సంబంధాలు ఉన్నందున కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం పెద్ద కష్టం కాబోదు. పశ్చిమాసియాలో యూఏఈ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తోంది. 2015లో ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా పోరాడటానికి యూఏఈ, సౌదీ అరేబియా కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. అయితే యూఏఈ మద్దతున్న యెమెన్ వేర్పాటువాదులకు ఆయుధాల రవాణా జరుగుతోందని ఆరోపిస్తూ సౌదీ అరేబియా బాంబు దాడి చేయడంతో కూటమిలో విభేదాలు తలెత్తాయి. మరోవైపు అమెరికా కొన్నేళ్లుగా తన చమురు ఉత్పత్తిని పెంచుకోవడంతో ఒపెక్ మార్కెట్ పవర్ తగ్గుముఖం పడుతున్న క్రమంలో ఆ కూటమి నుంచి తప్పుకోవాలని UAE నిర్ణయించుకుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page