స్లీపర్ బస్సులకు సెలవేనా?!
- DV RAMANA

- 9 hours ago
- 3 min read

స్టేజ్ క్యారియర్లుగా తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల రిజిస్ట్రేషన్ నెంబర్లను చూస్తే దాదాపు ఏ ఒక్కటీ ఈ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవి కావని అంతో ఇంతో చదువుకున్న వారందరికీ ఇట్టే అర్థమైపోతుంది. మెజారిటీ ట్రావెల్స్ బస్సులు నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్ లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్టర్ అయినవే. తక్కువ ఫీజులతో, కండీషన్ లేని రీమోడలింగ్ బస్సులకు ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుని రోడ్డెక్కేస్తున్న ఈ బస్సులు పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తూ.. మృతుల కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఈ తరహా బస్సుల ప్రమాదాలు పెరిగి పెద్దసంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. జాతీయ రహదారుల్లో తరచూ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. దీన్ని చెక్ పెట్టేందుకు ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. ఇందులో మొదటి మెట్టుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు ఆల్ ఇండియా పర్మిట్ వెసులుబాటును ఉపసంహరిస్తున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మధ్యకాలంలో ప్రమాదాలకు గురవుతున్న బస్సులన్నీ ఎక్కడో రిజిస్టర్ చేయించుకుని.. ఆల్ ఇండియా పర్మిట్‌తో ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నవేనని గుర్తించిన కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ దీనికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇక నుంచి ప్రైవేటు ట్రావెల్స్ ఆపరేటర్లు తమ బస్సులను ఏ రాష్ట్రంలో నడపాలనుకుంటే.. ఆ రాష్ట్రంలోనే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే బస్సు సర్వీసు నిర్వహించే రాష్ట్ర పరిధిలోని ఏదో ఒక జిల్లా ఆర్టీవో కార్యాలయంలోనే రిజిస్టర్ చేయించుకోవాలి. బస్సు భద్రతను ధ్రువీకరించే ఫిట్‌నెస్ పరీక్షలు స్థానిక అధికారుల పర్యవేక్షణలోనే జరుగుతాయి. దీనివల్ల పాతబడిన, కండిషన్ లేని బస్సులకు రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించవచ్చు. ఇతర రాష్ట్రాల్లో తక్కువ పన్నుతో రిజిస్ట్రేషన్ చేయించుకుని స్థానికంగా తిప్పే పద్ధతికి ఇది చెక్ పెడుతుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకు పన్ను ఆదాయం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఈమధ్య కాలంలో ప్రైవేటు బస్సు ప్రమాదాలు గణనీయంగా పెరగడం, దానికి దారితీస్తున్న పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి నివేదికలు సమర్పించాయి. పర్మిట్లు ఒకచోట, బస్సుల నిర్వహణ మరోచోట ఉండటం వల్ల అధికారులు భద్రతా తనిఖీలను కఠినంగా నిర్వహించలేకపోతున్నారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రతి బస్సుపై స్థానిక రవాణా శాఖకు పూర్తి నియంత్రణ ఉంటుంది. ఇదొక్కటే కాదు.. మృత్యు శకటాలుగా మారుతున్న స్లీపర్ బస్సులకు స్పీడుకు అడ్డుకట్ట వేసే దిశగా మరిన్ని కఠిన నిర్ణయాలకు సైతం ప్రభుత్వాలు ఆలోచనలు చేస్తున్నాయి. ఒకప్పుడు బస్సులో దూర ప్రయాణాలు చేయాలంటే ప్రజలు ఇబ్బందిగా ఫీలయ్యేవారు. దూరతీరాలకు వెళ్లాలంటే రైళ్ల వైపే మొగ్గుచూపేవారు. కానీ బస్సులను కూడా రైళ్లకు ధీటుగా ఏసీ వంటి సర్వహంగులతో పడుకునే సౌలభ్యం కూడా కల్పిస్తూ.. అక్కడితో ఆగకుండా డబుల్ డెక్కర్ స్లీపర్లను కూడా ట్రావల్స్ నిర్వాహకులు అందుబాటులోకి తెచ్చారు. దానికితోడు గాలితో పోటీపడేలా నేలపై విమానాల్లా దూసుకుపోతూ తెల్లవారేసరికి గమ్యస్థానాలను చేర్చేలా రూపాంతరం చెందిన స్టీపర్ బస్సులకు క్రమంగా ఆదరణ పెరిగింది. కానీ అదే సమయంలో ప్రమాదాలు కూడా పెరిగాయి. స్లీపర్ బస్సుల్లో ప్రయాణం గాలిలో దీపం అన్నట్లు పరిస్థితి తయారైంది. మచ్చుకైనా కనిపించని భద్రతా ప్రమాణాలు, లెక్కలేనన్ని డిజైన్ లోపాలు, పట్టింపులేని నిబంధనలు.. అన్నీ కలిసి స్లీపర్ బస్సులను మృత్యు శకటాలుగా మార్చేశాయి. నాలుగు నెలల గ్యాప్‌లో ఆరేడు యాక్సిడెంట్లు జరిగి 150 మందికిపైగా చనిపోయారంటే స్లీపర్ బస్సులు ఎంత ప్రమాదకరమో మీకు అర్థమవుతుంది. ప్యాసింజర్ బస్సులకు సంబంధించి కొన్ని ప్రమాణాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. కానీ మన దేశంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఆ ప్రమాణాలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. పర్యవేక్షించాల్సిన రవాణా శాఖ అధికారులు అసలు పట్టించుకోవడంలేదు. అత్యంత తక్కువ ఎత్తులో, పూర్తిగా వెనక్కు వాలే ఛాన్స్ లేక.. కనీసం ఆర్మ్ రెస్ట్ ఫెసిలిటీ కూడా లేకుండా ఏర్పాటు చేసిన బెర్తులు సౌకర్యాన్నే కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా తినేస్తున్నాయి. స్లీపర్ బస్సుల్లో ఉండే డబుల్ బెర్త్ వ్యవస్థ మరింత అసౌకర్యంగా, ప్రమాదకరంగా ఉంది. ఒకరికొకరు తగలకుండా పడుకోవడం అసాధ్యం. స్లీపర్ బస్సుల్లో హాయిగా పడుకుని ప్రయాణం చేయవచ్చంటారు గానీ.. కలత నిద్రే తప్ప ప్రశాంతమైన నిద్ర అనేది కల్లే. స్లీపర్ బస్సు డిజైనింగ్ లోపాలే ప్రయాణికులకు శాపాలుగా మారుతున్నాయి. దాని ప్రధాన సమస్య బస్సు ఎత్తు. ఈ బస్సుల ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల మలుపులు, కుదుపుల వద్ద స్టీరింగ్ అదుపు తప్పి ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది. సీటర్ బస్సులో గరిష్టంగా 52 సీట్లుంటాయి. దాన్నే 48 బెర్తులతో స్లీపర్ బస్సుగా మార్చేస్తున్నారు. దీనివల్ల బస్సు లోపల ఎంత ఇరుగ్గా ఉంటుందో అర్థమవుతుంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, ఫైర్ డిటెక్షన్ సిస్టమ్స్ ఉన్నాయా లేవా.. ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్‌తో తయారయ్యే బెడ్డింగ్ వంటివన్నీ ఆర్టీవో తనిఖీల్లో రెగ్యులర్‌గా చెక్ చేసే పరిస్థితే లేదు. మరోవైపు బస్సు ప్రమాదాలు, ప్రాణనష్టాలు పెరిగిపోయి.. అన్ని వైపుల నుంచీ ఒత్తిడి పెరగడంతో స్లీపర్ బస్సుల నిషేధం దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. అయితే వేలకొద్దీ ఉన్న స్లీపర్ బస్సులను ఉన్న ఫళంగా రద్దు చేయడం సాధ్యమేనా? అనే సందేహాలు ఉన్నప్పటికీ.. వాటికి పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయని రవాణారంగానికి చెందినవారు చెబుతున్నారు. ఒకేసారి అన్ని స్లీపర్ బస్సులను తొలగించకుండా దశలవారీగా ఆ ప్రక్రియ చేపట్టాలి. మొదటి మూడునెలల్లో ఈ తరహా బస్సుల తయారీ, దిగుమతి నిలిపి వేయాలి, తర్వాత దశలో రూట్ సామర్థ్యం ఆధారంగా ప్రత్యామ్నాయ బస్సులతో స్లీపర్లను రీప్లేస్ చేయడం వంటి మార్గాలను పరిశీలించాలని కేంద్రం రాష్ట్రాలకు లేఖలు రాసింది.






Comments