top of page

ఇది సామాన్యుడి అజెండానా.. చద్దాజీ!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 5 days ago
  • 3 min read

సామాన్యుడి పార్టీ.. రాజకీయాల్లో, సమాజంలో అవినీతిని ఊడ్చేస్తామంటూ ప్రస్థానం ప్రారంభించిన చీపురు పార్టీని సొంత సభ్యులే కట్టగట్టుకుని పార్లమెంటులో దాని ఉనికిని ప్రశ్నార్థకం చేస్తూ ఊడ్చేశారు. రాజ్యసభలో ఆ పార్టీకి ఉన్న పదిమంది సభ్యుల్లో ఏడుగురు సొంత పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు రామ్ రామ్ చెప్పి.. కమలం పార్టీకి జైకొట్టారు. వారు పార్టీ ఫిరాయించడమే కాకుండా ఏకంగా ఆప్ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించేశారు. దానికి అనుగుణంగానే వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఆప్‌కు రాజ్యసభలో పదిమంది ఎంపీలు ఉన్నారు. ఒకరిద్దరు సభ్యులు పార్టీ మారితే ఫిరాయింపుల చట్టం ఉచ్చులో చిక్కుకుని వారి ఎంపీ పదవులపై వేటు పడే ప్రమాదముంటుంది. కానీ అదే చట్టం ప్రకారం ఒక పార్టీ పార్లమెంటరీ విభాగంలోని మÖడింట రెండొంతుల సభ్యులు(టూథర్డ్ మెజారిటీ) పార్టీని వీడిపోతే ఫిరాయింపుల చట్టం వర్తించకపోగా అలా పార్టీ మారిన వారిని వేరే గ్రూప్‌గా కూడా చట్టసభ ప్రిసైడింగ్ ఆఫీసర్ గుర్తింపు ఇవ్వవచ్చు లేదా వేరే పార్టీలో చేరినా దానికి అధికారికంగా గుర్తించవచ్చు. ఆప్ ఎంపీలు దీన్నే అవకాశంగా తీసుకుని సామాన్యుడి పార్టీని అడ్డంగా చీల్చేశారు. మొత్తం పదిమంది సభ్యుల్లో ఏడుగురు గోడ దూకేసి కాషాయ గూటిలో వాలిపోయారు. ఇటీవలి కాలంలో సోషల్‌మీడియా ద్వారా జనసామాన్యంలో విపరీతమైన ప్రాచుర్యం పొందిన యువ ఎంపీ రాఘవ్ చద్దా కేంద్రంగా జరగడం విశేషమైతే.. సదరు చద్దాను తప్పించి రాజ్యసభలో ఆప్ ఉపాధ్యక్షుడి హోదాలో నాయకత్వం కూర్చోబెట్టిన అశోక్ మిట్టల్ కూడా పార్టీని వెన్నుపోటు పొడిచే వ్యూహంలో కీలక పాత్రధారి, సూత్రధారిగా వ్యవహరించడం ఆధునిక రాజకీయాల అవాంఛిత ధోరణులను ప్రతిఫలింపజేసింది. బీజేపీలో చేరిన సందర్భంగా రాఘవ్ చద్దా చేసిన వ్యాఖ్యలు ఆయన నిబద్ధతను, రాజకీయ నీతిని ప్రశ్నిస్తున్నాయి. ఇంతవరకు ఉన్న పార్టీని ఆయన ప్రశ్నించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘నా రక్తాన్ని, చెమటను చిందించి పదిహేనేళ్ల యవ్వనాన్ని ఆప్ కోసం ధారపోశాను. కానీ ఆ పార్టీ సిద్ధాంతాలను, విలువలను వదిలేసింది. దేశ ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తోంది. నేను సరైన వ్యక్తినే.. కానీ కొన్నేళ్లుగా తప్పుడు పార్టీలో ఉన్నానని ఫీలయ్యాను. అందుకే ఇప్పుడు ఆప్‌కు దూరం జరిగి ప్రజలకు దగ్గరవుతున్నాను’ అన్న వ్యాఖ్యలతో రాఘవ్ చద్దా తన పార్టీ మార్పిడి తతంగాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఆయన చర్యలను తప్పుపట్టేలా ఉన్నాయి. పార్టీ కోసం యవ్వనాన్ని ధారబోశానని, కానీ పార్టీ తనను రాజ్యసభలో ఉప నాయకుడి పదవి నుంచి తప్పించి, తన నోరు నొక్కడానికి ప్రయత్నించడం ద్వారా అన్యాయం చేసిందని ఆక్రోశించారు. కానీ అదే పార్టీ తనను ఎమ్మెల్యేను, ఎంపీని చేసిందని, ఒక నాయకుడి స్టేచర్ కల్పించిందన్న విషయాన్ని విస్మరించి, కేవలం పదవి నుంచి తొలగించిందన్న కక్షతో పార్టీకి ఉనికి లేకుండా చేసే కుతంత్రాన్ని నడిపించారు. రాజ్యసభలో ఉప నాయకుడిగా పార్టీ వాణిని వినిపించడంలో విఫలమయ్యారు. సొంత అజెండాతో పని చేశారు. అంతెందుకూ.. సామాన్యుడి తరఫున మాట్లాడుతున్నానంటూ ప్రభుత్వాన్ని నిగ్గదీసి.. ఇప్పుడు అదే పార్టీ పంచన చేరడాన్ని రాఘవ్ చద్దా ఏవిధంగా సమర్థించుకుంటారు? పార్టీ తన నోరు నొక్కడానికి ప్రయత్నించిందని ఆరోపించిన చద్దా ఇంతకాలం అదే పార్టీ సభ్యుడిగా రాజ్యసభలో సామాన్యుడి అజెండాను, ఆ సామాన్యుడు ఎదుర్కొంటున్న పన్నులు, ఇతర వ్యవస్థల దోపిడీని ప్రస్తావించారు. ఆప్ తనను రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వకుంటే అసలు చట్టసభలో ప్రవేశించగలిగేవారా.. ఆలోచించాలి. సరే ఆ సంగతి పక్కనపెడితే.. జీఎస్టీ, ఆదాయ పన్ను, బ్యాంకుల ఛార్జీల దోపిడీ, టెలికాం నెట్‌వర్క్ సంస్థల ఛార్జీల బాదుడు, ఎన్నికల్లో అక్రమాలు, పనిచేయని ప్రజాప్రతినిధులను వెనక్కి పిలిపించడం.. వంటి అనేక అంశాలపై రాజ్యసభలో సామాన్యుడి గళం వినిపించి సర్కారును రాఘవ్‌చద్దా నిగ్గదీశారు. తద్వారా ప్రజల ఆదరణ చురగొన్నారు. సోషల్‌మీడియాలో ట్రెండ్ అయ్యారు. జన నాయకుడిగా ప్రాచుర్యం పొందారు. మంచి భవిష్యత్తు ఉన్న యువ నాయకుడిగా ప్రశంసలందుకున్నారు. కానీ ఇంతలోనే పిలిమొగ్గ వేసేసి తుస్సుమనిపించారు. ఇంతకాలం నిలదీసి మొలేసిన పార్టీలోకే జంప్ చేసి జనాన్ని ముక్కున వేలేసుకునేలా చేశారు. విమర్శించిన పార్టీలోనే చేరారంటే.. ఆ పార్టీ ప్రభుత్వం ఏమైనా తప్పులు సరిదిద్దుకుని ప్రాయశ్చిత్తం చేసుకుందా? అంటే.. అసలు అలా ఊహించడమే అత్యాశ అవుతుంది. రాఘవ్ చద్దా రాజ్యసభ సాక్షిగా లేవనెత్తిన ఏ ఒక్క సమస్యకూ ప్రభుత్వం నుంచి ఇంతవరకు సమాధానం లేదు.. పరిష్కారమÖ లేదు. మరి ఏం చూసి చద్దా తాను విమర్శించిన పార్టీలోనే చేరిపోయారు? ఇది ఆయన ప్రవచిస్తున్న విలువల వలువలు ఊడ్చడం కాదా?? సామాన్యుడి పేరుతో ఇన్నాళ్లూ రాజకీయం చేసి.. ఇప్పుడు ఆ సామాన్యుడినే వెన్నుపోటు పొడవడం కాదా? అనేదానికి రాఘవ్ చద్దా తన మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. యువకుడు, తెలివైనవాడని.. అవకాశం ఇస్తే పార్టీ అజెండాను చట్టసభల్లో వినిపిస్తారన్న నమ్మకంతో ఆప్ నాయకత్వం అతి చిన్నవయసులోనే చద్దాను పెద్దల సభ(రాజ్యసభ)కు ఏరికోరి పంపింది. కానీ ఆ నమ్మకాన్ని ఆయన వమ్ము చేశారు. సామాన్యుడి సమస్యలను ప్రస్తావించడం వరకు ఓకే. కానీ వాటికి పరిష్కారం చూపించని పార్టీలోకి జంప్ చేయడం ద్వారా పాలపొంగులా జనంలో అమాంతం పెరిగిన తన క్రేజ్‌పై తనకు తానే నీళ్లు చల్లుకున్నట్లుంది చద్దా రాజకీయ నిర్ణయం. ఇప్పుడు అధికార పార్టీ సభ్యుడన్నహోదా.. ప్రభుత్వంలో పనులు చేయించుకునే వెసులుబాటు ఆయనకు లభిస్తాయేమో గానీ.. సామాన్యుడి ప్రతినిధి అన్న గౌరవాన్ని మాత్రం ఆయన కోల్పోయారు. ఆప్ సంక్షోభం రాజకీయాల పతనాన్ని మరో మెట్టు కిందికి దిగజార్చిందనడంలో సందేహం లేదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page